ఇక భారతీయ అస్మిత!  | Sakshi Editorial On BJP Win Seven Times In Gujarat Elections | Sakshi
Sakshi News home page

ఇక భారతీయ అస్మిత! 

Published Sun, Dec 11 2022 12:04 AM | Last Updated on Sun, Dec 18 2022 12:55 AM

Sakshi Editorial On BJP Win Seven Times In Gujarat Elections

గుజరాతీ ‘అస్మిత’ (ఆత్మగౌరవం) పులకించిపోయింది. ఆ పులకింత వెల్లువలో ఏడో వరస విజయం బీజేపీ ఒడిలోకి వచ్చి పడింది. గుజరాత్‌లో కనిపించే ఎత్తయిన విగ్రహం సర్దార్‌ పటేల్‌దే కావచ్చు. కనిపించని ఎత్తయిన విగ్రహం ఇప్పుడు గుజరాతీ అస్మిత. అది పులకించకుండా ఎలా ఉంటుంది? గుజరాతీ బిడ్డ నరేంద్ర మోదీ దేశంలో తిరుగులేని నాయకుడిగా కొనసాగుతున్నారు. నెంబర్‌ టూగా మరో గుజరాతీ సేఠ్‌ అమిత్‌షా చక్రం తిప్పుతున్నారు. వారిద్దరి ప్రభావం ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థను గుజరాతీ వ్యాపారులు నడిపిస్తున్నారు. ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులు అనేకం దేశంలోని ఇతర ప్రాంతా లకు జెల్లకొట్టి గుజరాత్‌ బాట పడుతున్నాయి. దేశవ్యాప్తంగా మేనేజ్‌మెంట్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ‘కెమ్‌ చో’ (ఎలా ఉన్నావ్‌) వంటి కొన్ని గుజరాతీ మాటలు నేర్చు కుంటున్నారు. మాట్లాడుతున్నారు.

గుజరాతీ అస్మితకు ఇంతకంటే ఏంకావాలి? మధ్యతరగతి మందహాసం చేస్తున్నది. ఉన్నత వర్గాలు మీసం మెలేస్తున్నాయి. దరిద్రనారాయణుల ‘న్యూసెన్స్‌’ గురించి ఆలోచించే ఓపిక ఇప్పుడు అస్మితకు లేదు. మోర్బీ వంతెన కూలిపోయింది. అయితే ఏమిటి? వందమందికి పైగా చనిపోయారు. రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనం, అధికారుల అవినీతి ఈ విషాదానికి కారణం. అఫ్‌కోర్స్‌! ప్రపంచ రాజ్య కూటముల్లో ఎలైట్‌ క్లబ్‌గా పరిగణించే జీ–20కి ఇప్పుడు గుజరాతీ బిడ్డ నరేంద్రభాయ్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఏది ముఖ్యం? ఇంతకంటే ఎక్కువ దేశాలు సభ్యులుగా ఉన్న అలీనోద్యమానికి పండిత నెహ్రూ, ఇందిరాగాంధీ నాయకులుగా ఉన్నారు. ఇది రొటేషన్‌ పదవే కనుక వారు పెద్దగా పటాటోపాన్ని ప్రదర్శించలేదు. కానీ గుజరాతీలు వ్యాపార ప్రవీణులు. దీన్ని కూడా బ్రాండింగ్‌ చేసుకున్నారు. ఈ బిల్డప్‌ను ‘అస్మిత’ ఆమోదించింది.

గుజరాతీ అస్మిత వేసిన తెరలకు ఆవల కూడా కొంత గుజరాతీ సమాజం ఉన్నది. అక్కడా ఓట్లుంటాయి. వాటికి ఏకైక హక్కుదారుగా ఉండవలసిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు దీనస్థితికి దిగజారింది. అహ్మద్‌ పటేల్‌ మరణం తర్వాత అది అనాధగా మారిపోయింది. కాంగ్రెస్‌ నిస్తేజమవడంతో దాని ఓట్లను కొల్ల గొట్టడానికి చీపురుకట్ట తీసుకుని ఆమ్‌ ఆద్మీ పార్టీ రంగంలోకి దిగింది. పదమూడు శాతం కాంగ్రెస్‌ ఓట్లను చీల్చగలిగింది. ‘ఆప్‌’ చీల్చిన ఓట్ల కారణంగా సౌరాష్ట్ర ప్రాంతంలో 18 మంది కాంగ్రెస్‌ అభ్యర్థులు ఓడిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో గుజరాత్‌ చరిత్రలో ఎన్నడూ ఎరగనంత ఘనవిజయం బీజేపీకి సాధ్యమైంది.

వరసగా ఏడు ఎన్నికల్లో విజయం సాధించడం అసాధారణమైన విషయమే. సీపీఎం నాయకత్వంలో లెఫ్ట్‌ కూటమి ఒక్కటే ఇప్పటివరకూ బెంగాల్‌లో ఆ ఘనతను సాధించింది. ఇప్పుడు బీజేపీ ఆ రికార్డును సమం చేసింది. ఏడవసారి గెలవడం, 52.5 శాతం ఓట్లను కొల్లగొట్టడం, 156 (182లో) సీట్లు సాధించడం స్వప్నతుల్యమైన విజయమే. బెంగాల్‌లో సీపీఎం కూటమి ఏడోసారి గెలిచినప్పుడు కూడా 50.5 శాతం ఓట్లు సాధించింది. ఇప్పుడు గుజరాత్‌లో 10 పార్టీలు రంగంలో ఉంటే, అప్పుడు బెంగాల్‌లో 30 పార్టీలు పోటీలో ఉన్నాయి. ఈ అంశాన్ని గమనంలోకి తీసుకుంటే రెండు విజయాలూ సమాన మైనవే. కానీ, నేటి గుజరాత్‌ విజయాన్ని కనీవినీ ఎరుగని సునామీగా మేళతాళాలు మోగిస్తూ మీడియా ప్రకటించింది. ఇందులో పావలా వంతు ప్రాధాన్యం కూడా నాటి లెఫ్ట్‌ విజయానికి దక్కలేదు. దటీజ్‌ బీజేపీ!

జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీతో పోల్చదగిన మరో నాయకుడు ప్రచారంలో లేడన్నమాట నిజం. ఆయన రాజకీయ కెరీర్‌లోనే ఇప్పుడు ఉచ్చదశలో ఉన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఆయన మేజిక్‌ ఎంతోకొంత పనిచేసే అవకాశం కూడా ఉన్నది. అయితే రాష్ట్రాల శాసనసభలకు జరిగే ఎన్నికల్లో అది పనిచేయాలన్న నియమం లేదు. హిమాచల్‌ప్రదేశ్‌ ఫలి తాలు ఈ అంశాన్ని నిర్ధారించాయి. ఈ రాష్ట్రం బీజేపీకి అనుకూల మైనదే. అసెంబ్లీ ఎన్నికల్లో చెరో అవకాశం ఇస్తున్నప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి అనుకూలంగానే ఉంటున్నది.

2019 ఎన్నికల్లో కమలం పార్టీకి రికార్డు స్థాయిలో ఓట్లను కురిపించింది. సైనిక దళాల్లో ఈ రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున పనిచేస్తుంటారు. కేంద్రం ప్రకటించిన ‘అగ్నిపథ్‌’ కార్యక్రమాన్ని వీరు వ్యతిరేకిస్తున్నారు. దానివల్ల తమ ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని వారు భావిస్తున్నారు. యాపిల్స్‌ పండించే రైతాంగం సంక్షోభంలో కూరుకొని పోయింది. రైతాంగ సమస్యను బీజేపీ పట్టించుకోకపోవడం మైనస్‌గా మారింది. జై జవాన్‌ – జై కిసాన్‌లిద్దరూ బీజేపీ ఓటమికి కారకులయ్యారు. మోదీ నాయకత్వం, హిందుత్వ, జాతీయవాదం వంటి అంశా లపై మెజారిటీ హిమాచలీయులకు ఎటువంటి పేచీ లేదు. కానీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి స్థానిక అంశాల ఆధారంగానే వారు స్పందించారు.

ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ను ఏకధాటిగా పదిహేనేళ్ల పాటు కమలం పార్టీ ఏలింది. మొన్న జరిగిన ఎన్నికల్లో ‘ఆప్‌’కి తలవంచక తప్పలేదు. ‘ఆప్‌’ ప్రస్తావించిన స్థానిక అంశాలపైనే ఓటర్లు స్పందించారు తప్ప మోదీ బొమ్మను పట్టించుకోలేదు. మునిసిపల్‌ అధికార యంత్రాంగంలో పేరుకొనిపోయిన అవినీతిని పెకిలిస్తామని ‘ఆప్‌’ ప్రచారం చేసుకున్నది. వీధి కుక్కల బెడద మీద చర్యలు తీసుకుంటామని చెప్పింది. వీధి వ్యాపారులను లంచాల నుంచి కాపాడతామని చెప్పింది. రోడ్లకు మరమ్మతులు చేయిస్తామని చెప్పింది. మునిసిపల్‌ స్కూళ్లను అభివృద్ధి చేస్తామని చెప్పింది. ఈ సాదాసీదా హామీల వైపే ఓటర్లు మొగ్గుచూపారు. ఈ ఎన్నికలతోపాటు ఆరు అసెంబ్లీ స్థానాలకు, ఒక లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీకి చేదు ఫలితాలే వచ్చాయి. ఒక్క గుజరాత్‌లో అఖండ విజయం సిద్ధించినా, హిమాచల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో, ఢిల్లీ కార్పొరేషన్‌ ఎన్నికల్లో, వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో భంగపాటే ఎదురైంది.

ఈ నేపథ్యంలో వచ్చే సంవత్సరంలోగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ఎదుర్కోవలసి ఉన్నది. డబుల్‌ ఇంజిన్‌ వ్యూహం హిమాచల్‌లో పనికిరాలేదు. గుజరాతీలు తమ ముఖ్యమంత్రిగా కూడా మోదీయే ఉన్నట్టు భావిస్తున్నారు. కనుక వారి దృష్టిలో అక్కడున్నది సింగిల్‌ ఇంజనే! విఫలమైన ఈ వ్యూహాన్ని వచ్చే ఐదు రాష్ట్రాల్లో మళ్లీ అనుసరిస్తారా? పైగా సాధారణ ఎన్నికలకు ఏడాది వ్యవధి లోపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్ని డ్రెస్‌ రిహార్సల్‌గా పరిగణిస్తారు. సాధారణ ఎన్నికల ఆహార్యాన్ని ఎంతోకొంత ఈ ఎన్నికల్లో ప్రదర్శించవలసి ఉంటుంది. ఆయా రాష్ట్రాల స్థానిక అంశాలపై విస్తృత చర్చ జరగ కుండా ఒక జాతీయ ఎజెండా, వీలైతే భావోద్వేగపూరితమైన అంశం చుట్టూ ప్రచారం కేంద్రీకృతమయ్యేలా బీజేపీ ప్రయత్నిస్తుంది.

రాష్ట్రాల స్థానిక అంశాలపై చర్చలో బీజేపీ ఇరుక్కోవడమంటే మొసళ్ల మడుగులో గజేంద్రుడు పాదం మోపినట్టే! అప్పుడు ‘సిరికింజెప్పి, శంఖ చక్రములు’ సంధిస్తూ మోదీ వచ్చి వాలినా చేయగలిగిందేమీ ఉండదు. కనుక ఈ వేసంగిలో జరిగే కర్ణాటక ఎన్నికల నాటికే బీజేపీ సరికొత్త ఎజెండా శాంపుల్‌ బయటకు రావాల్సి ఉంటుంది. ఇక్కడ బీజేపీకి ఊరట కలిగించే విషయం ఒకటున్నది. వచ్చేయేడు ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీ జాతీయ పార్టీలతోనే తలపడనున్నది. నాలుగు రాష్ట్రాల్లో వృద్ధ కాంగ్రెస్‌ ప్రధాన ప్రత్యర్థి. తెలంగాణలో నిన్ననే జాతీయ పార్టీగా ప్రకటించుకున్న బీఆర్‌ఎస్‌ ప్రధాన ప్రత్యర్థి. కనుక తన కొత్త ఎజెండాపై డ్రెస్‌ రిహార్సల్‌ చేయడం సులభం.

ఈసారి బీజేపీ ఏ నినాదంతో ముందుకు రావచ్చు? హిందూత్వ? జాతీయవాదం? ఆర్థికాభివృద్ధి? అన్నీ గుదిగుచ్చిన భారతీయ అస్మిత హారం? భారతీయ ఆత్మగౌరవ విజయాన్ని ఎలుగెత్తి చాటేందుకు సాధించిన విజయాలేమున్నాయి? హిందూత్వ అంశం తప్పకుండా ఉంటుంది. దండలో దారం మాదిరిగా ఇప్పుడూ ఉన్నది. ఇకముందు కూడా ఉంటుంది. బీజేపీ భౌతిక రూపాన్ని నడిపించే నాడీ మండలం ఆర్‌ఎస్‌ఎస్‌ అనే విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాల్లేవు. భారత రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ సభలో డాక్టర్‌ అంబేడ్కర్‌ ప్రవేశపెట్టిన మరుసటిరోజే ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ‘ఆర్గనైజర్‌’ దానిపై స్పందించింది. ఈ రాజ్యాంగంలో భారతీయతే లేదని అభిశంసించింది. మనుధర్మ శాస్త్రంలోని అంశాలను రాజ్యాం గంలో జొప్పించకపోవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసింది.

స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం భారత రాజ్యాంగానికీ, ప్రజాస్వామ్యానికీ మూల సూత్రాలని డాక్టర్‌ అంబేడ్కర్‌ నొక్కి చెప్పారు. సమానత్వం అనేది భారతీయ భావన కాదంటారు ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త గురు గోల్వాల్కర్‌. భిన్నవర్గాల మధ్య సామరస్యతే భారతీయత అనేది ఆయన వాదన. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల ప్రవేశం ఫలితంగా అంబేడ్కర్‌ ప్రవచిం చిన రాజ్యాంగ మౌలిక ఆశయానికి దెబ్బతగిలిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఇదే అభిప్రాయాన్ని ప్రకటించారు. అంటే ఆట మొదలైనట్టే కదా!

భారతదేశం ఫెడరల్‌ వ్యవస్థగా ఉండటాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకిస్తున్నది. గురు గోల్వాల్కర్‌ తన రచనల్లో ఫెడరల్‌ వ్యవస్థను గట్టిగా వ్యతిరేకించారు. దేశమంతా ఏకచ్ఛత్ర పాలన కింద, ఏకభాష (హిందీ), ఏకైక మతం (హిందూ)తో వర్ధిల్లాలనేది వారి ఆశయం. కొత్త పన్నుల విధానం (జీఎస్‌టీ), కొత్త విద్యావిధానాలను (ఎన్‌ఇపి) కూడా రాష్ట్రాల అధికారా లను కత్తిరించడానికి, వాటిని బలహీనపరచడానికి ఉపయోగి స్తున్న వైనం కనబడుతూనే ఉన్నది. ఆర్టికల్‌ 370 రద్దు, సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, హిజాబ్‌ నిషేధం వంటి పరిణామాల వెనుక హిందూత్వ ఎజెండా కనిపిస్తూనే ఉన్నది. గోహత్యా పాతకులుగా ముద్రవేయడం ద్వారా ఒక మతా వలంబుల్ని సమాజానికి దూరంగా నెట్టే ప్రయత్నమూ కట్టెదుటే ఉన్నది. కనుక హిందూత్వ ఎజెండా ఇప్పటికీ ఉన్నది. ఇంకా బలంగా ఉండబోతున్నది.

మనదేశంలో తొంబయ్యవ దశకం ప్రారంభంలో మొదలైన ఆర్థిక సంస్కరణలు కేవలం ఆర్థిక వ్యవస్థనే మార్చలేదు. సామాజిక, రాజకీయ వ్యవస్థలను కూడా ఆసాంతం మార్చి వేశాయి. ఎనభయ్యో దశకం తర్వాత పుట్టిన వాళ్లను ‘మిలీనియల్స్‌’ అంటున్నారు. ఈ మిలీనియల్స్, పోస్ట్‌ మిలీనియల్స్‌ తరాల్లో చరిత్ర, సమాజ పరిణామ శాస్త్రాల అధ్యయనం మృగ్యమైంది. అందువల్ల భావోద్వేగపూరితమైన, మతపరమైన, కులపరమైన అంశాలకు సులభంగా ప్రభావిత మవుతున్నారు. ఈ పరిణామం కూడా బీజేపీ ఎదుగుదలకు బాగా ఉపయోగపడింది. సోషల్‌ మీడియాపై ఆ పార్టీకి ఉన్న పట్టు కారణంగా ఇకముందు కూడా ఉపయోగపడుతుంది. కనుక హిందూత్వ ఎజెండా ఇకముందు కూడా బలంగా ఉండబోతున్నది.

కేవలం హిందూత్వ కార్డుతోనే ఎన్నికలకు వెళ్లడం కుదరదు కాబట్టి అందులో జాతీయవాదాన్ని మిక్స్‌ చేసి, ఆర్థికాభివృద్ధితో గార్నిష్‌ చేసుకుని ఎజెండాను వడ్డించవచ్చు. సరిహద్దుల్లో బలవంతుడైన చైనావాడితో ఢీ అంటే ఢీ అనడం, ఆక్రమిత కశ్మీర్‌ను హస్తగతం చేసుకుంటామని ప్రకటనలు చేయడం జాతీయ భావాలను ప్రేరేపితం చేసే కార్యక్రమాలే! అంతర్జా తీయ యవనికపై ప్రముఖపాత్రను పోషించడానికి మోదీ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. ఆర్థికాభివృద్ధిని గురించి ఉటం కించడానికైతే గణాంకాలు అందుబాటులోనే ఉన్నాయి. 2014లో రెండు ట్రిలియన్‌ డాలర్లుగా ఉన్న జీడీపీ 2022 నాటికి మూడున్నర ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. తలసరి ఆదాయం లక్ష రూపాయల నుంచి రెండు లక్షలకు పెరిగింది. భారత ఆర్థిక వ్యవస్థ బ్రిటన్‌ను దాటేసి ఐదో స్థానంలోకి చేరింది.

అయితే మానవ అభివృద్ధి సూచికలో మాత్రం దేశం 130వ స్థానం నుంచి 132కు దిగజారింది. మరి బలపడిన ఆర్థిక వ్యవస్థ మానవ అభివృద్ధికి ఎందుకు ఉపకరించలేదు? సృష్టించిన సంపద అంతా ఎక్కడికి వెళ్లింది? ఆక్స్‌ఫామ్‌ ఇండియా రిపోర్టులో సమాధానం దొరుకుతుంది. సంపద అంతా పిడికెడు మంది చేతిలో కేంద్రీకృతమై ఉన్నది. 80 శాతం సంపద 10 శాతం శ్రీమంతుల చేతిలో ఉన్నది. అందులోనూ ఒక్కశాతం కుబేరుల చేతుల్లో 55 శాతం సంపద కేంద్రీకృతమై ఉన్నది. అయినప్పటికీ జీడీపీలోనూ, తలసరి ఆదాయంలోనూ పెరుగు దల కనిపిస్తున్నది కదా? అంబానీ ఆదాయం లక్షకోట్లు, అప్పారావు ఆదాయం లక్ష రూపాయలు అనుకుందాం.

ఇద్దరి తలసరి ఆదాయం యాభైవేల కోట్ల యాభైవేల రూపాయలు అవుతుంది కదా! ఈ సంగతి తెలిస్తే అప్పారావు మూర్ఛపోతే పోవచ్చు గాక! లెక్క లెక్కే కదా! ఈ లెక్క ప్రకారం ఇండియా ఈజ్‌ షైనింగ్‌. ఈ నినాదంతో ఎన్నికలకు వెళ్లిన వాజపేయి ప్రభుత్వం గతంలో దెబ్బతిన్నది. కనుక ఈ షైనింగ్‌లో ఈసారి హిందూత్వ మెరుపులు, జాతీయ తళుకులూ ఉండవచ్చు. ఇదొక సంభావ్యత మాత్రమే! కొత్త జాతీయ పార్టీగా ప్రకటించుకున్న బీఆర్‌ఎస్‌ రైతు రాజ్యాన్ని ఎజెండాగా ప్రకటించుకున్నది. కొత్తగా జాతీయ పార్టీ హోదా సాధించిన ‘ఆప్‌’కు ‘అవినీతి’ బాణం ఉండనే ఉన్నది. కాంగ్రెస్‌ సంగతేమిటో ఆ పార్టీలోనే ఇంకా ఎవరికీ తెలియదు. మూడు నాలుగు పాయలుగా చీలిన ప్రతి పక్షం మురిపిస్తుండగా బీజేపీ మెరిపించబోయే ఎజెండా కోసం దేశం ఎదురుచూస్తున్నది.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement