చైనాలో ఏం జరిగినా ఇప్పుడు ప్రపంచానికి వార్తే. అది కోవిడ్ గురించైనా, కుంగ్ ఫూ గురించైనా! అగ్రరాజ్యమైన అమెరికాను ఎదిరించగల స్థితిలో ఉన్న ఏకైక దేశం చైనా. అటువంటి దేశంలో కీలకమైన రాజకీయ–ఆర్థిక పరిణామాలు చోటుచేసుకుంటున్న వేళ అంతర్జాతీయ సమాజం ఓ కన్నేయకుండా, ఓ చెవి పారేయ కుండా ఎలా ఉంటుంది? ఇండియా మాత్రం అస్సలు ఉండ లేదు.
ఆక్రమించుకున్న టిబెట్ పీఠభూమి పుణ్యమా అని చైనాకు భారతదేశంతో మూడున్నర వేల కిలోమీటర్ల సరిహద్దు ఏర్ప డింది. ఈ సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు కూడా పుట్టుకొచ్చాయి. ఫలితంగా ఒక పెద్ద యుద్ధం జరిగింది. భారత్‌కు భారీ నష్టం జరిగింది. చాలాసార్లు ఘర్షణలు జరిగాయి. ఆ వైపునా, ఈ వైపునా ఎక్కుపెట్టిన తుపాకులు, వాటి ట్రిగ్గర్ల మీద జవాన్ల వేళ్లూ దివారాత్రములు ‘సావధాన్’గానే ఉంటున్నాయి. అందు వల్ల చైనా పరిణామాలపై భారత్ ఆసక్తి ఒక సహజ పరిణామం.
భారతదేశానికి ప్రపంచ దేశాల్లో ఏది సమవుజ్జీ అంటే చైనా పేరే చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే జనాభాలో చైనాది ఫస్ట్ ర్యాంక్, మనది సెకండ్ ర్యాంక్. చరిత్ర, సంస్కృతి, నాగరికతల్లో కూడా రెండూ సమవుజ్జీలే. అవిచ్ఛిన్నతలో భారత్ కన్నా చైనా చరిత్ర ఎక్కువ అందుబాటులో ఉన్నప్పటికీ, బౌద్ధం మన దేశాన్ని గురుపీఠంపై కూర్చోబెట్టింది. పారిశ్రామిక విప్లవానికి పూర్వం ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో చైనాది ఒకటో స్థానం. భారత్‌ది రెండో స్థానం. ప్రస్తుత ఆర్థిక పరిస్థి తుల్లో మాత్రం చైనా కొంచెం ఎక్కువ సమవుజ్జీ. మనం బాగా తక్కువ సమవుజ్జీ. అయినా సరే, చైనా ఎలక్ట్రానిక్ పరికరాలు మన ఇళ్లను ముంచెత్తుతున్నప్పుడు, వారి టెలికామ్ విడి భాగాలు మన హస్త భూషణాలుగా మారినప్పుడు, వారి కంప్యూ టర్ హార్డ్‌వేర్ మన ఆఫీసుల్ని ఆక్రమించినప్పుడు, వారి ప్లాస్టిక్ టాయ్స్, క్రాకర్స్ మన మార్కెట్లను పరిపాలిస్తున్నప్పుడు చైనా వార్తలు మన వార్తలు ఎందుకు కాకుండా పోవు?
ఇంతకూ చైనాలో ఏం జరుగుతున్నది? షీ జిన్‌పింగ్ మరో ఐదేళ్లు ఆ దేశాధ్యక్షుడిగా కొనసాగడానికి రంగం సిద్ధమయింది. చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర ప్లీనరీ సమావేశం ఈ వారం జరిగింది. ఆ పార్టీ ఆవిర్భవించి ఇప్పటికి సరిగ్గా వందేళ్లు. ఈ సందర్భంగా వందేళ్ల పార్టీ చరిత్రలోని కీలక సందర్భాలపై పార్టీ ప్లీనరీ ఒక తీర్మానం చేసింది. ఈ తీర్మానంలో చైనా కమ్యూనిస్టు పార్టీ శిఖరాగ్రాలయిన మావో, డెంగ్‌ల సరసన షీని నిలబెట్టారు. చరిత్రను మలుపుతిప్పిన వారిలో మావో, డెంగ్‌ల తర్వాత జిన్‌పింగ్‌దీ అంతటి ప్రధాన పాత్రగా తీర్మానం ప్రస్తుతించింది. వచ్చే సంవత్సరం జరగనున్న పార్టీ జాతీయ మహాసభల్లో మూడోసారి వరుసగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా షీ జిన్‌పింగ్ ఎన్నికయ్యేందుకు ఈ తీర్మానం రంగం సిద్ధం చేసిందని పరిశీల కుల అభిప్రాయం. ఫలితంగా మూడోసారి దేశాధ్యక్షుడిగా, పీపుల్స్ ఆర్మీ సర్వసేనానిగా ఆయనే కొనసాగనున్నారు. వచ్చే సంవత్సరం మొదలయ్యే మూడో దఫా పదవీకాలం 2027తో ముగుస్తుంది. కానీ ఆయన తనను తాను జీవితకాలపు నేతగా మలుచుకునే ప్రయత్నాల్లో ఉన్నారని విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.
షీ జిన్‌పింగ్‌కు మరో దఫా అధికారం దక్కినందువల్ల, ఆయన జీవిత కాలపు అధ్యక్షుడైనందువల్ల ప్రపంచానికి ఏమిటి సంబంధం? రష్యాలో పుతిన్ కూడా అదే వరుసలో ముందే ఉన్నాడు కదా! కానీ, జిన్‌పింగ్ భవిష్యత్తు ఇన్నింగ్స్‌కు చాలా ప్రాధాన్యం ఉన్నది. గత నలభయ్యేళ్లుగా చైనాను ఒక బలీయ మైన ఆర్థిక వ్యవస్థగా మార్చిన విధానాలను ఆయన సవరిస్తు న్నారు. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన కార్పొరేట్ కుబేరులపై కొరడా ఝళిపిస్తున్నారు. జాక్ మా తలపెట్టిన 37 బిలియన్ డాలర్ల (రూపాయల్లో 2 లక్షల 60 వేల కోట్లు) అతిపెద్ద పబ్లిక్ ఇష్యూను అడ్డుకున్నారు. అలీబాబా వంటి టెక్ కంపెనీల దూకుడుకు కళ్లెం వేసే కొత్త చట్టాలను తీసుకొచ్చారు. ప్రైవేట్ రంగంపై ఆంక్షలు విధిస్తూ పబ్లిక్ రంగానికి ప్రోత్సాహకాలు కల్పిస్తున్నారు.
నలభయ్యేళ్ల సంస్కరణల ఫలితంగా దేశంలో పెద్ద సంఖ్యలో మధ్యతరగతి వర్గం ఆవిర్భవించినప్పటికీ కొంత మంది మాత్రం అపర కుబేరులుగా అవతరించారనీ, ఈ అసమాన పంపిణీ కమ్యూనిస్టు మూలసూత్రాలకు విరుద్ధమని షీ భావిస్తున్నారట. కనుక ‘ఉమ్మడి సౌభాగ్యం’ అనే కొత్త నినాదంతో సంపద పంపిణీలో అసమానతల్ని తగ్గించాలని ఆయన ఆలోచిస్తున్నారు. అంతర్జాతీయంగా ఆయన దూకు డుగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్‌ఐ), సూపర్‌పవర్‌గా ఎదగాలన్న ‘చైనా డ్రీమ్’ సాఫల్యానికి చేస్తున్న ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి.
భారత్–చైనా దేశాల మధ్య చరిత్ర, జనాభా వంటి విషయాల్లోనే కాదు... ప్రస్తుత రెండు దేశాల అధినేతల మధ్య కూడా పలు సారూప్యతలున్నాయనే అభిప్రాయం ఉన్నది. చైనా చరిత్రను మలుపుతిప్పిన ముగ్గురిలో ఒకడిగా షీ జిన్‌పింగ్‌ను చైనా కమ్యూనిస్టు పార్టీ అధికారికంగా గుర్తించింది. ఎటువంటి అధికారిక గుర్తింపులేకపోయినా భారతదేశ పాల కుల్లో నెహ్రూ, ఇందిర తర్వాత అంతటి బలమైన ముద్రవేసిన ప్రధానిగా మోదీని పరిగణించవచ్చు. ఆయన పరిపాలనా ఫలి తాలపై భిన్నాభిప్రాయాలుండవచ్చు గానీ, టాప్ త్రీ పాపులర్ ప్రధానుల్లో ఒకరని అంగీకరించడానికి ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు.
షీ, మోదీల బాల్యం కూడా కష్టాలతో కూడుకున్నదే. తన బాల్యం ఛాయ్‌వాలాగా గడిచిందని సాక్షాత్తూ మోదీయే పలు మార్లు చెప్పుకున్నారు. సాంస్కృతిక విప్లవ కాలంలో షీ జిన్ పింగ్ తండ్రి మీద కమ్యూనిస్టు పార్టీ ద్రోహి అనే ముద్రను వేసింది. జైల్లో పెట్టింది. పదిహేనేళ్ల వయసున్న షీని గ్రామాలకు తరలించారు. బలవంతంగా వ్యవసాయ పనుల్లో పెట్టారు. ఒక కొండగుహలో తలదాచుకునేవాడు. ఇద్దరూ కార్యకర్తల బలంతో పనిచేసే సంస్థల్లోనే రాజకీయ శిక్షణ పొందారు. మోదీ ఆరె స్సెస్‌లో, షీ కమ్యూనిస్టు పార్టీలో జీవితాన్ని ఆరంభించారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం మోదీ జాతీయనేతగా అవతరించడానికి ఉపకరించింది. గుజరాత్ మోడల్ అభివృద్ధి అనే ప్రచారం బీజేపికి ఉపకరించింది. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలోనే జిజీంగ్ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా షీ పనిచేశారు. అవినీతిపై ఆయన చేసిన యుద్ధానికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. అవినీతి మరకలేని మిస్టర్ క్లీన్‌గా షీ పేరు తెచ్చుకున్నాడు.
ఇద్దరు నేతలకూ జాతీయవాదం ఒక స్ఫూర్తి. మోదీ ఆరెస్సెస్ ప్రచారకర్తగా పనిచేసినప్పుడు సాంస్కృతిక జాతీయ వాదంతో మమేకమయ్యాడు. అడ్వాణీ రథయాత్ర నిర్వాహ కుడిగా వెన్నంటి ఉన్నప్పుడు మతపరమైన జాతీయవాదం ఆయన్ను నడిపించింది. వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్న సమ యంలో ఆయన ఆర్థిక జాతీయవాదాన్ని పార్టీ కార్యదర్శి హోదాలో మోదీ ప్రచారం చేసేవారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా తన ఇన్నింగ్స్‌ను మత జాతీయవాదంతో ప్రారంభించి ఆర్థిక జాతీయవాదంతో ముగించారు.
చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టిన వెంటనే షీ ‘చైనా డ్రీమ్’ అనే పదబంధాన్ని ప్రయో గించారు. చైనా ప్రజలకు తమది చాలా గొప్ప దేశమని, తమ జాతి (హన్‌జాతి) చాలా గొప్పదనీ వందలయేళ్ల నుంచి ఒక గట్టి నమ్మకం. ఐరోపా వలస పాలకులు ఈ నమ్మకం మీద గట్టిదెబ్బ తీశారు. అవమానభారంతో చైనా ప్రజలు రగిలిపోయారు. వారిలో దెబ్బతిన్న జాతీయవాదాన్ని రగిలించడం ద్వారానే మావో జెడాంగ్ చైనా కమ్యూనిస్టు విప్లవాన్ని విజయ తీరాలకు చేర్చగలిగాడు. డెంగ్ ఆర్థిక సంస్కరణల తర్వాత మూలనపడ్డ కమ్యూనిస్టు మూలసూత్రాల శూన్యాన్ని జాతీయ వాద భావజాలమే భర్తీచేసింది. అదే జాతీయవాద భావ జాలాన్ని, ‘చైనా డ్రీమ్’ అనే పదబంధంతో ఒక శక్తిమంతమైన క్షిపణిగా షీ తయారుచేశాడు.
దేశీయ ఆర్థికాభివృద్ధి వ్యూహంలో మాత్రం పూర్తి భిన్న ధ్రువాలుగా ఇద్దరూ వ్యవహరిస్తున్నారు. తనకు రాజకీయ అక్షరాభ్యాసం చేయించిన ఆరెస్సెస్ ఆర్థిక విధానాలను కూడా పట్టించుకోకుండా ప్రైవేటీకరణ వైపు మోదీ పరుగు తీస్తున్నారు. తన తండ్రి మద్దతు ఇచ్చిన డెంగ్ సంస్కరణలను షీ తిరగ దోడుతున్నారు. ప్రైవేట్ పెట్టుబడి విషయంలో మోదీ ఎంచు కున్నవి ఎక్కే మెట్లు, షీ ఎంచుకున్నవి దిగే మెట్లు.
పబ్లిక్ సెక్టార్ కంపెనీలను ప్రైవేటీకరించే కార్యక్రమం మోదీ హయాంలో వేగం పుంజుకున్నది. బిజినెస్ చేయడమనేది ప్రభుత్వ బిజినెస్ కాదని ప్రధాని స్పష్టంగా చెప్పారు. ఈ ఫిబ్ర వరిలో జరిగిన ఒక సెమినార్‌లో మాట్లాడుతూ సుమారు వంద పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్‌ను ప్రైవేటీకరించి రెండున్నర లక్షల కోట్లను సమీకరించదలిచామని ప్రధాని తెలిపారు. ఎల్‌ఐసీ, విశాఖ ఉక్కు తదితరాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఎయిర్ ఇండియా ఇప్పటికే టాటాల గూటికి చేరిపోయింది. ‘మేక్ ఇన్ ఇండియా’ కోసం కార్మిక చట్టాలను సరళతరం చేశారు. వ్యవ సాయ రంగం నుంచి పెద్ద సంఖ్యలో రైతులను బయటకు మళ్లించడం ద్వారా పెట్టుబడిదారులకు చౌకగా శ్రమశక్తి లభిస్తుం దనీ, అందుకోసమే వ్యవసాయ చట్టాలను ముందుకు తెచ్చారనీ ఒక అభిప్రాయం ఏర్పడింది. జిన్‌పింగ్ మాత్రం బ్యాక్ టు సోష లిజమ్ అంటున్నారు.
షీ మూడో దఫా పగ్గాలు చేపట్టడం ఖాయమైంది. మోదీ హ్యాట్రిక్ ఇంకో రెండున్నరేళ్లకు తేలుతుంది. ఇప్పటివరకైతే మోదీని సవాల్ చేసే ప్రత్యామ్నాయ నాయకుడు ఇంతవరకూ వెలుగు చూడలేదు. మోదీ కూడా మూడోసారి గెలిస్తే రెండు దేశాల మధ్య, రెండు వ్యవస్థల మధ్య అసలైన యుద్ధం మొదలవుతుంది. చైనాను ఒక బలమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దిన డెంగ్ బాట నుంచి పక్కకు జరగడం దుష్పరిణామాలకు దారి తీస్తుందా? అలా జరిగితే పెట్టుబడే జగద్విజేత అనుకోవాలి. ఆ పెట్టుబడి భారత్‌లో కూడా అద్భుతాలు చేయబోతున్నదని ఆశించాలి. షీ జిన్‌పింగ్ విజయం సాధిస్తే సోషలిజం అజేయ మనే కమ్యూనిస్టుల నమ్మకం సజీవంగా ఉంటుంది. భారత దేశానికి ఓ గుణపాఠం లభిస్తుంది.
-వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
మోదీ జీ – కామ్రేడ్ షీ
Published Sun, Nov 14 2021 1:10 AM | Last Updated on Sun, Nov 14 2021 1:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment