అక్టోబర్ 22–24 వరకు కజాన్(రష్యా)లో జరిగిన బ్రిక్స్ దేశాల 16వ శిఖరాగ్ర సమావేశం ఒక గొప్ప ఆరంభాన్ని వాగ్దానం చేసింది. బ్రిక్స్ దేశాలుతమ మధ్య ఆర్థిక వ్యవహారాలను తమ స్థానిక కరెన్సీలలో జరుపుకోవాలనీ, తమతో ఆర్థిక సంబంధాలు నెరపే ఇతర దేశాలతో సైతం ఇదే పద్ధతిలో వ్యవహరించేందుకు ప్రయత్నం జరగాలనీ ‘కజాన్ డిక్లరేషన్’ పేర్కొన్నది.
ప్రపంచాన్ని శాసిస్తున్న డాలర్ వ్యవస్థను వీలైనంత బలహీన పరచటం వర్ధమాన దేశాలన్నిటికి కీలకంగా మారింది. అధికారం, అభివృద్ధి, విధాన పరమైన నిర్ణయాలకు కొత్త కేంద్రాలు ఉనికిలోకి వచ్చినందున, అవి సమానత్వంతో కూడిన న్యాయబద్ధమైన, బహుళ ధ్రువ ప్రపంచానికి దారులు వేయగలవన్న ఆశాభావం డిక్లరేషన్‌లో కనబడింది.
కజాన్‌లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలకు రెండు రోజుల ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పిన మాటలు సంచలనమయ్యాయి. బ్రిక్స్ దేశాల మధ్య వ్యాపారాలకు, ఇతర అవసరాలకు చెల్లింపులు ఇక మీదటఆ యా దేశాల సొంత కరెన్సీలలోనే ఉండగలవని అన్నారు. అప్పటికి అది ఇంకా బ్రిక్స్ తీసుకున్న తుది నిర్ణయమో,చేసిన ఉమ్మడి ప్రకటనో కాదు. అయితే, ఈ అంశంపై బ్రిక్స్ దేశాల మధ్య కొంతకాలంగాసంప్రదింపులు సాగుతున్నాయి.
ఒక ఏకాభిప్రాయ ప్రకటన రాగల సూచనలు కూడా ఉన్నాయి. అందువల్లనే కూటమి దేశాలేవీ పుతిన్ ముందస్తు ప్రకటనకు అభ్యంతరపెట్టలేదు. అక్టోబర్ 23న విడుదలైన కజాన్ డిక్లరేషన్‌లోని 134 పేరాగ్రాఫ్‌ల సుదీర్ఘ సంయుక్త ప్రకటనను చదివినపుడు, అందులో అత్యధికం ఆర్థిక సంబంధమైన అంశాలే కనిపిస్తాయి. వాటిలో రెండు (63, 65) పుతిన్ పేర్కొన్న స్థానిక కరెన్సీ చెల్లింపులకు సంబంధించినవి.
134 పేరాలలో రెండు మాత్రమే ఇవా? అందుకోసం ఇంత ఆట్ట హాస ప్రకటన అవసరమా? అనుకుంటే పొరపాటు. మొత్తం ప్రపంచాన్ని శాసిస్తున్న డాలర్ వ్యవస్థను మటుమాయం చేయటం సాధ్యం కాకపోయినా, వీలైనంత బలహీన పరచటం బ్రిక్స్‌తో సహా మొత్తం వర్ధమాన దేశాలన్నిటికి కీలకంగా మారింది. డాలర్ ఆధిపత్యాన్నిఎంత దెబ్బ తీయగలిగితే, ప్రపంచంపై అమెరికా రాజకీయ, సైనిక ప్రాబల్యాన్ని, భౌగోళిక చాణక్యాన్ని అంతగా ఎదుర్కొనగలరు.
ఈ దేశాలకు ఇటువంటి అవకాశం లభించటం ప్రపంచ చరిత్ర లోనే ఇది మొదటిసారని చెప్పాలి. వలస పాలనలు 60–70 సంవ త్సరాల క్రితమే ముగిసి ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయసంస్థలు ఎన్ని ఏర్పడినా, ఒకటి రెండు అగ్ర దేశాలే ఏకధ్రువ,ద్విధ్రువ ప్రపంచాలను సాగించాయి. అంతర్జాతీయ చట్టాలను తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ రాగా, అమెరికన్ డాలర్, యూరోపియన్ దేశాల యూరో కరెన్సీలు అందుకు సాధనాలుగా మారాయి.
1947 స్వాతంత్య్ర సమయంలో ఒక డాలర్‌కు ఒక రూపా యిగా ఉండిన భారత కరెన్సీ ఈ రోజున 84 రూపాయలకు పడి పోయిందంటే అందుకు ఇవన్నీ కారణాలే. ఆ విలువ సహజ క్రమంలో తగ్గటం ఒకటైతే, అమెరికన్లు, ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ వారు ఒత్తిడి చేసి మరీ విలువను తగ్గింపజేసే సందర్భాలు వర్ధమాన దేశాలకు అనేకం. అంతర్జాతీయంగా ముడిసరకుల అమ్మకాలు, వాణిజ్య నిబంధనలు, డబ్ల్యూటీవో పనితీరు అన్నీ ధనిక దేశాలకు, డాలర్‌కు అనుకూలం.
ఈ విధమైన అనేకానేక సమస్యలన్నింటికి సమాధానాలు కజాన్ డిక్లరేషన్‌లో పొందు పరచటం గమనార్హం. ఇటువంటి ఆలోచనలకు, మార్పులకు ఒక గొప్ప ఆరంభం బ్రిక్స్ దేశాలు తమ మధ్య ఆర్థిక వ్యవహారాలు తమ స్థానిక కరెన్సీలలో జరుపుకోవటం. తమతో ఆర్థిక సంబంధాలు నెరపే ఇతర దేశాలతో సైతం ఇదే పద్ధతిలో వ్యవహరించేందుకు ప్రయత్నం జరగాలని కూడా ఆ డిక్లరేషన్ పేర్కొన్నది. ఆ డాక్యుమెంట్ శీర్షికను గమనిస్తేనే బ్రిక్స్ లక్ష్యం, అంతరార్థం, భవిష్యత్తు గురించిన దార్శనికత అర్థమైపోతుంది: న్యాయబద్ధమైన విధంగా ప్రపంచాభివృద్ధి కోసం, భద్రత కోసం బహుళత్వాన్ని శక్తిమంతం చేయటం.
ఈ మూడు క్లుప్తమైన మాటలను శోధిస్తూ పోతే అనేక విషయాలు అర్థమవుతాయి. వలసవాదం అంతమై, అంతర్జాతీయ సంస్థలు, నిబంధనలు ఎన్ని ఏర్పడినా పాశ్చాత్య రాజ్యాల ఏకధృవ ఆధిపత్యాన్ని తట్టుకోలేకపోయిన తక్కిన ప్రపంచానికి ఇపుడు బ్రిక్స్ రూపంలో ఒక బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడగల అవకాశాలు చరిత్రలో మునుపెన్నడూ లేనివి. వాస్తవానికి బహుళ ధృవ ప్రపంచ సృష్టి అనే మాట కొంతకాలంగా వినవస్తున్నదే.
కాలక్రమంలో ఇండియా, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాతో పాటు కొన్ని ఏషియన్, ఆఫ్రికన్, లాటిన్ అమెరికన్, అరబ్ దేశాలు కొంత అభివృద్ధి సాధించి మధ్యమస్థాయి దేశాలుగా పురోగమించినా, వాటికి కూడా వివిధ పరిస్థితులవల్ల స్థిరత్వం ఉండటం లేదు. బ్రిక్స్ ఏర్పడినాక ఇంతకు ముందు 15 శిఖరాగ్ర సమావేశాలు జరిగినా, వివిధ ఆర్థికపరమైన నిర్ణయాల మూలంగా కజాన్‌లో జరిగింది ఎంతో భిన్నమైనది!
డిక్లరేషన్‌లోని 134 పేరాలను 4 ఉప శీర్షికల కింద విభజించగా, అందులో 3 ఆర్థిక సంబంధమైనవే కావటం గమనించదగ్గది. అవన్నీ ఇక్కడ రాయటం వీలుకాదు గానీ, వాటి సారాంశాన్ని చెప్పుకోవాలంటే ఈ విధంగా ఉంటుంది: గ్లోబల్ సౌత్ అనబడే వర్ధమాన దేశాల కోసం పని చేయటం. అధికారం, అభివృద్ధికి, విధానపరమైన నిర్ణయా లకు కొత్త కేంద్రాలు ఉనికిలోకి వచ్చినందున, అవి సమానత్వంతో కూడిన న్యాయబద్ధమైన, బహుళ ధ్రువ ప్రపంచానికి దారులు వేయ గలవు. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి, భద్రతామండలి, డబ్ల్యూటీవో వంటి సంస్థలను సంస్కరించాలి.
అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రత్యేక అవకాశాలివ్వాలి. ముఖ్యంగా ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరీబి యన్ ప్రాంతాలకు వాణిజ్యంపై ఏకపక్ష నియంత్రణలు, ఆంక్షలుఉండరాదు. అంతర్జాతీయ రుణాల చెల్లింపు పద్ధతిలో మార్పులు రావాలి. బ్రిక్స్ దేశాల మధ్య చెల్లింపులు స్థానిక కరెన్సీలలో జరగాలి. బ్రిక్స్ పే కార్డును వినియోగానికి తేవాలి. అయితే ఈ విషయమై ఇంకా చర్చలు అవసరం. అట్లాగే ఇది స్వచ్ఛందమే తప్ప, తప్పనిసరి కాదు. బ్రిక్స్ దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, వనరుల వితరణ; విద్యా, సాంకే తిక, ఆరోగ్య, పారిశ్రామిక రంగాలలో సహకారం పెరగాలి.
కజాన్ డిక్లరేషన్ ఈ విధమైన స్వతంత్ర ప్రకటనలు చేస్తూనే, బ్రిక్స్ కూటమి పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకం కాదనీ, తమదొక స్వతంత్రమైన సంస్థ మాత్రమేననీ స్పష్టం చేసింది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కొద్దికాలం క్రితం, ‘‘వారు (పాశ్చాత్య దేశాలు) ఒక క్లబ్ పెట్టుకున్నారు. మమ్ములను అందులోకి రానివ్వలేదు. కనుక మా క్లబ్బు మేము పెట్టుకున్నా’’మని వ్యాఖ్యానించటం గమనించదగ్గది. మొదట బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలతో బ్రిక్‌గా ఏర్పడిన ఈసంస్థ దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్‌గా మారింది. వాటి ఉమ్మడి భూభాగం ప్రపంచంలో 33.9 శాతం, జనాభా 45.2 శాతం, పారిశ్రా మిక ఉత్పత్తి 39.3 శాతం, జీడీపీ 36.7 శాతం, ఎగుమతుల శాతం 24.5 శాతం కావటాన్ని బట్టి ప్రపంచంలో వాటి స్థానం ఎంతటిదో గ్రహించవచ్చు.
ఈ అయిదు దేశాలు కాక ఇప్పుడు కొత్తగా ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ చేరాయి. సౌదీ అరేబియా త్వరలో చేరనుంది. మరొక 30 చేరగోరుతున్నట్లు పుతిన్ ప్రకటించారు. బ్రిక్స్ విస్తరించేకొద్దీ పరిస్థితి గణనీయంగా మారుతుంది. ఈ సంస్థ దేశాల మధ్య ఏకాభిప్రాయంతో పరస్పర సహకారాలు తప్ప ఎవరి అంతర్గత వ్యవహారాలలోనూ జోక్యం చేసుకోవటం ఉండదని స్పష్టం చేయటం విశేషం. ఈ మాట, అటువంటి జోక్యాలు చేసుకునే పాశ్చాత్య దేశాలకు ఒక హెచ్చరిక అని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.
అదే సమయంలో కొన్ని రాజకీయ పరిస్థితులను బ్రిక్స్ ఉపేక్షించబోదని కూడా కజాన్ డిక్లరేషన్ వల్ల స్పష్టమవుతున్నది. గాజాపై ఇజ్రాయెల్ మారణకాండను, లెబనాన్‌పై దాడులను ఖండించారు. ఇరాన్‌పై దాడి ఆలోచనను విమర్శించారు. పాలస్తీనా స్వతంత్రతను బలపరిచారు. పశ్చిమాసియాలో అణ్వస్త్ర వ్యాప్తిని వ్యతిరేకించారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వివాదాలు ఏర్పడినా చర్చల ద్వారా మాత్రమే పరిష్కారాలు చేసుకోవాలన్నారు. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కజాన్‌లో సమావేశం కానుండగా, సరిహద్దు సమస్యపై ఒక చిన్న ముందడుగు వేయటం ఈ తీర్మానానికి అద్దం పడుతున్నది. మోదీ ముందస్తుగా మాట్లాడుతూ, భారత్–చైనా సత్సంబంధాలు ప్రపంచ శాంతి సుస్థిరతలకు అవసరమన్నారు.
- వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు
- టంకశాల అశోక్
Comments
Please login to add a commentAdd a comment