
అభిప్రాయం
సుప్రీంకోర్టు తమిళనాడు గవర్నర్‌కు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు గాడి తప్పిన గవర్నర్లకు పెద్ద గుణపాఠం. రాజ్యాంగ నిపుణులైన న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, ఆర్. మహ దేవన్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం తమిళనాడు ప్రభుత్వం తమ గవర్నర్ బాధ్యతా రాహిత్యంపై దాఖలు చేసిన పిటిషనన్‌పై చిర కాలం నిలిచిపోయే తీర్పు ఇచ్చింది. తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఏ నిర్ణయమూ తీసుకోకుండా తన దగ్గరే ఉంచుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court) తలుపు తట్టింది. బిల్లులను తొక్కిపట్టడం రాజ్యాంగ నేరం అని దూషించకపోయినా, అది రాజ్యాంగ పరమైన నైతిక చర్య కాదని పెద్ద పదాలు వాడుతూ తమిళనాడు గవర్నర్ రవిపై ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు.
ఒక్క తమిళనాడు గవర్నర్ (Tamil Nadu Governor) మాత్రమే కాదు. కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒక్కటేమిటి... చాలా రాష్ట్రాల గవర్నర్లు రాజ్యాంగాన్ని అనేకసార్లు అతిక్రమించారు. కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా గవర్నర్ల రాజ్యాంగ అతిక్రమణ మాత్రం కొనసాగుతూనే ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200... ‘వీలైనంత తొందరగా’ (యాజ్ సూన్ యాజ్ పాజిబుల్) తన దగ్గరకు వచ్చిన శాసనసభ (Assembly) ఆమోదించిన బిల్లులపై సంతకం పెట్టాలని పేర్కొంటోంది. కానీ తమిళ నాడు గవర్నర్ రవి తన దగ్గరకు వచ్చిన బిల్లులపై నెలల తరబడి అసలు ఏ నిర్ణయమూ తీసుకోకుండా తొక్కిపట్టారు. ప్రతిదానికీ కాలపరిమితనేది ఒకటి ఉంటుంది. రాజ్యాంగంలో అక్షరబద్ధం కాలేదనే వంకతో ఇష్టమొచ్చినంత కాలం బిల్లులకు ఆమోదం తెలపకపోతే పాలన ఎలా జరుగుతుంది?
ఆర్టికల్ 200 ప్రకారం పనిచేయాల్సిన బాధ్యత గవర్నర్లపై ఉంది. ఒక బిల్లుపై సమ్మతిని ఆపాలన్నా, లేదా అభ్యంతరాలు ఉండి రాష్ట్రపతికి నివేదించాలన్నా నెల రోజుల్లోగా గవర్నర్లు ఏదో ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంటుందనే కనీస విజ్ఞత ఉండదా? పది బిల్లులను ఏ నిర్ణయం తీసుకోకుండా ఎలా ఆపుతారు? అందుకే ఈ తీర్పులో ‘బిల్లుపై తమ అభ్యంతరాలను తెలియచేస్తూ గవర్నర్లు 3 నెలల్లోగా అసెంబ్లీకి వాపసు చేయాల్సి ఉంటుంది. బిల్లుపై తన అభ్యంతరాలను రాష్ట్రపతికి తెలియచేయాలనుకుంటే గరిష్ఠంగా మూడు నెలల్లో ఆ పని చేయాల్సిఉంటుంది. అసెంబ్లీలో రెండోసారి ఆమోదం పొంది వచ్చిన బిల్లుకు నెల రోజుల్లోగా గవర్నర్లు తమ సమ్మతిని తెలియచేయాల్సి ఉంటుంది.
గవర్నర్లు సత్వరంగా చర్యలు తీసుకోవాలని రాజ్యాంగం ఆశిస్తున్నది. నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయడం ప్రజాస్వామ్య పాలన స్ఫూర్తిని ఉల్లంఘించడమే’ అని స్పష్టంగా చెప్పవలసి వచ్చింది. రాజ్యాంగ పరంగా అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి చర్యల కారణంగా ఏర్పడిన సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు ఈ మార్గదర్శకాలు అవసరమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు మిగతా గవర్నర్లకూ మార్గదర్శకాలు అవుతాయి. బిల్లులపై సమ్మతి తెలియజేయకుండా శాశ్వతంగా పెండింగ్‌లో ఉంచే అధికారం గవర్నర్లకు లేదని ఉన్నత న్యాయస్థానం మరీ మరీ చెప్పింది. గవర్నర్లకు మూడు అవకాశాలు మాత్రమే ఉంటాయని, ఒకటి బిల్లుకు సమ్మతి తెలియచేయడం, రెండు అభ్యంతరాలతో అసెంబ్లీకి బిల్లును తిప్పి పంపడం, మూడు రాష్ట్రపతికి నివేదించడమని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా వివరించింది.
వాటిలో ముఖ్యమైన మార్గదర్శకం ఇది: ‘ఏదైనా బిల్లును పునఃపరిశీలనకు పంపాక అసెంబ్లీ మళ్లీ దాన్ని ఆమోదించి రెండవసారి గవర్నర్‌కు పంపించిన పక్షంలో అటువంటి బిల్లును గవర్నర్ రాష్ట్రపతికి నివేదించడానికి వీల్లేదు. అలా చేయడం చట్టవిరుద్ధం. ఒకవేళ రాష్ట్రపతికి నివేదించదలిస్తే నెలరోజుల్లోగా దానిపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రపతికి నివేదించాల్సిన అవసరం లేదని భావించిన పక్షంలో మూడు నెలల్లోగా బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి’.
చదవండి: కాలంతో కాలు కదిపితేనే.. కాంగ్రెస్‌కు మళ్లీ పాత రోజులు
జవహర్‌లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) కాలంలోనే కాదు, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రధానుల కాలంలోనూ దారుణంగా గవర్నర్లు ప్రజాస్వామ్యంతో ఆట లాడుకున్నారు. గతంలో కర్ణాటక, బిహార్, ఆంధ్రప్రదేశ్, కేరళల్లో గవర్నర్లు హద్దులు మీరారు. ఎన్టీఆర్ (NTR) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నర్ రామ్‌లాల్ ఆయన ప్రభుత్వాన్ని చట్టవిరుద్ధంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇదే దారిలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలున్న కాలంలోనూ గవర్నర్లు వ్యవహరించారు, వ్యవహరిస్తున్నారు. ఆ మధ్య కాలంలో పశ్చిమబెంగాల్ గవర్నర్ వ్యవహారశైలి కూడా వార్తలకెక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు గవర్నర్ వ్యవహారంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చాలా సరైన తీర్పు ఇచ్చిందనే భావించాలి.
- మాడభూషి శ్రీధర్
మహేంద్ర యూనివర్సిటీ ‘స్కూల్ ఆఫ్ లా’ ప్రొఫెసర్