న్యూఢిల్లీ: తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్దోషిగా తేలిన డీఎంకే నాయకుడిని తిరిగి మంత్రివర్గంలో చేర్చుకోవడానికి ఆర్‌ఎన్ రవి నిరాకరించడంపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. గవర్నర్ రాజ్యాంగాన్ని అనుసరించకపోతే.. ప్రభుత్వం ఏం చేస్తుందని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ మేరకు అటు కేంద్రం, ఇటు ఆర్‌ఎన్ రవిపై సుప్రీం మండిపడింది.
కాగా జైలు శిక్ష నిలుపుదలతో ఎమ్మెల్యే పదవిని మళ్లీ దక్కించుకున్న డీఎంకే సీనియర్ నేత కే పొన్ముడిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తిరిగి చేర్చుకోవడానికి గరవ్నర్ రవి నిరాకరించడంపై సీఎం స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆశ్రయించింది. గవర్నర్ చర్య రాజ్యాంగ నైతికతకు విరుద్దమని పేర్కొంది.
ఈ పిటిషన్‌పై సీజేఐ చంద్రచూడ్, జస్టిస్‌లు బీవీ పార్ధివాలా, మనోజ్‌కుమార్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. డీఎంకే నేత కే పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు గవర్నర్‌కు రేపటి వరకు(శుక్రవారం) ఒక రోజు సమయం ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం.
‘రేపు గవర్నర్ మా మాట వినకుంటే.. రాజ్యాంగం ప్రకారం వ్యవహరించాల్సిందిగా ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తాం. తమిళనాడు గవర్నర్ ప్రవర్తనపై మేము తీవ్ర ఆందోళన చెందుతున్నాము. గవర్నర్ అలా చేయకుండా ఉండాల్సింది. అతను. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అతిక్రమించాడు. మేము దీనిపై ఓ కన్నేసి ఉంచుతాం. రేపు (శుక్రవారం) నిర్ణయం తీసుకుంటాం ’ అంటూ సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: ఎన్నికల యుద్ధానికి సై.. ఈ రాష్ట్రాల్లో గెలుపెవరిది?
కాగా అక్రమాస్తుల కేసులో మద్రాస్ హైకోర్టు గత ఏడాది డిసెంబర్‌లో మూడేళ్లు జైలు శిక్ష విధించడంతో ఎమ్మెల్యే, మంత్రి పదవికి పొన్ముడి అనర్హుడైన విషయం తెలిసిందే. ఆయన ప్రతినిథ్యం వహించిన తిరుక్కోవిలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీగా ఉన్నట్టు గెజిట్‌లో కూడా ప్రకటించారు. ఈ పరిస్థితులలో జైలు శిక్షను నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు గత వారం తీర్పు వెలువరించింది. ఈ పరిణామాలతో పొన్ముడికి మళ్లీ ఎమ్మెల్యే పదవి దక్కింది.
అదే సమయంలో ఆయనకు మరోసారి మంత్రి పదవి అప్పగిస్తూ సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన సిఫారసును రాజ్‌భవన్‌కు పంపించారు. అయితే గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆమోదం తెలియజేయలేదు. ప్రమాణ స్వీకారం చేయించేందుకు నిరాకరించారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌లో పిటిషన్ దాఖలైంది. గవర్నర్ తీరును అందులో వివరించారు. కోర్టు ఉత్తర్వులను గవర్నర్ గౌరవించడం లేదని పేర్కొంటూ, పొన్ముడికి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని గవర్నర్‌ను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ గురువారం విచారణకు రాగా.. గరర్నర్ ప్రవర్తనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.
Comments
Please login to add a commentAdd a comment