![Supreme Court Questions Tamil Nadu Governor R N Ravi For With holding Bills](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/sc-ran.jpg.webp?itok=FhqMHqmK)
తమిళనాడు ప్రభుత్వం పిటిషన్‌పై సుప్రీం
న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తొక్కిపెట్టడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి సందర్భాల్లో ప్రతిష్టంభన ఎలా తొలుగుతుందని ప్రశ్నించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై ఆమోద ముద్ర వేయడంలో గవర్నర్ ఆర్‌ఎన్ రవి జాప్యం చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది.
‘ఏదైనా బిల్లు కేంద్ర చట్టానికి విఘాతం కలిగిస్తుందని మీరు భావిస్తే, ఆ మేరకు మీరు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి. ఆ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపుతున్నట్లు గవర్నర్ చెప్పాలి. లేకపోతే ప్రతిష్టంభన తలెత్తుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టంభనను ఎలా అధిగమిస్తుందని మీరు భావిస్తున్నారు? ఇటువంటి ప్రతిష్టంభనను మీరే తొలగించాలి. ఈ విషయం గమనించండి’అని గవర్నర్ తరఫున వాదించిన అటార్నీ జనరల్ వెంకటరమణికి సూచించింది. అటార్నీ జనరల్ వినతి మేరకు తదుపరి విచారణను 10వ తేదీకి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment