తమిళనాడు సర్కారుకూ, ఆ రాష్ట్ర గవర్నర్‌కూ పొసగడం లేదన్నది కొన్నేళ్ళుగా జగమెరిగిన సత్యమే. ఆ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. నూతన సంవత్సరంలో తమిళనాడు శాసనసభ తొలిసారి సమావేశమైనప్పుడు సభను ఉద్దేశించి గవర్నర్ చేయాల్సిన ప్రారంభ ప్రసంగం వరుసగా మూడో ఏడాది సైతం రచ్చ రాజేసింది. శాసనసభలో ప్రసంగించకుండానే గవర్నర్ ఆర్.ఎన్. రవి నిష్క్రమించడం వివాదాస్పదమైంది. రాష్ట్రాల యూనియనైన భారత సమాఖ్య వ్యవస్థలో గవర్నర్ల పాత్రపై ఇది మళ్ళీ చర్చకు తావిచ్చింది.
అత్యంత గౌరవాస్పదమైనదైన గవర్నర్ పదవి, ఇటీవల గవర్నర్లు కొందరు వ్యవహరిస్తున్న తీరు దురదృష్టవశాత్తూ చర్చనీయాంశమవుతోంది. రాజ్యాంగబద్ధ పదవిని చేపట్టాక రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాల్సిన వ్యక్తులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలతో కయ్యానికి కాలుదువ్వుతూ, రాజ్యాంగ పరిధిని మించి ప్రవర్తిస్తున్నారన్నదీ నిష్ఠురసత్యమే.
గవర్నర్ హోదా దుర్వినియోగం కావడం కొత్త ఏమీ కాదు. అదో సుదీర్ఘ చరిత్ర. ఒకప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పిన రోజుల్లో గవర్నర్లు వట్టి రబ్బరు స్టాంపులనే పేరుండేది. కేంద్రం పనుపున రాష్ట్రాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలను ఒక్క కలం పోటుతో బర్తరఫ్ చేశారనే దుష్కీర్తికీ కొదవ లేదు. ఢిల్లీ గద్దెపై పార్టీ జెండా మారినా... ఇప్పుడూ అదే రకమైన దుర్వినియోగం వేరొక పద్ధతిలో కొనసాగుతోందని వాపోవాల్సి వస్తోంది.
గతంలో కాంగ్రెస్ పాలకులు చేశారు కాబట్టి ఇప్పుడు మేమూ ఆ రకంగానే ప్రవర్తిస్తామని ప్రస్తుత పాలకులనుకుంటే అది సమర్థనీయం కాదు. రాజ్యాంగ విధినిర్వాహక పదవుల దుర్వినియోగం వ్యక్తులకే కాక, వ్యవస్థకూ మాయని మచ్చవుతుంది. ‘టీమ్ ఇండియా’ అంటూ కేంద్ర పాలకులు తరచూ ఆదర్శాలు పైకి వల్లె వేస్తున్నా, ఆచరణలో జరుగుతున్నది వేరు. బీజేపీయేతర ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకొని, రాజ్‌భవన్‌ను రాజకీయ అస్త్రంగా వాడుతున్నారనే ఆరోపణ... కొన్నేళ్ళుగా కేరళ నుంచి కశ్మీర్ దాకా అనేకచోట్ల వినిపిస్తున్నది.
తమిళనాట డీఎంకే సర్కారుతో గవర్నర్ రవికి మొదటి నుంచీ ఉప్పూ నిప్పే! ఏళ్ళ తరబడి పాటిస్తూ వస్తున్న వ్యవస్థీకృత సభా సంప్రదాయాలను తోసిరాజనడమే కాదు... లౌకికవాదం సహా పలు అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. సాక్షాత్తూ రాజ్యాంగమే లౌకికవాదాన్ని ఔదలదాల్చిన దేశంలో... రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నరే... అది వట్టి యూరోపియన్ సిద్ధాంతమనీ, భారతదేశంలో దానికి చోటులేదనీ వ్యాఖ్యానించారు. అది తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
ఆ మధ్య ప్రసారభారతి కార్యక్రమంలో, ఇప్పుడు చట్టసభలో జాతీయ గీతాలాపనపై ఆయన రగడ చేశారు. నిజానికి, తమిళనాట అధికారిక కార్యక్రమాలన్నిటా ‘తమిళతల్లి స్తుతి’ (తమిళ్‌తాయ్ వాళ్తు)ని ప్రార్థనా గీతంగా పాడడం 1970 నుంచి ఉన్నదే. 2021 డిసెంబర్‌లో దాన్ని రాష్ట్ర గీతంగానూ ప్రకటించారు.
తమిళ ప్రభుత్వ కార్యక్రమాలన్నిటినీ తమిళ్‌తాయ్ వాళ్తుతో ఆరంభించి, జాతీయ గీతాలాపనతో ముగించడం దశాబ్దాల సంప్రదాయం. ఆ సంగతే ముందుగానే ప్రభుత్వం చెప్పినప్పటికీ, దాన్ని గౌరవించాల్సిన గవర్నర్ పదేపదే విభేదించడం, అంతటితో ఆగక ‘ద్రావిడనాడు’ భావనపైనే అభ్యంతరాలు చెప్పడం, ఒక కార్యక్రమంలో అధికారిక గీతం నుంచి ద్రావిడనాడు ప్రస్తావన అనుమానాస్పద రీతిలో తొలగింపునకు గురికావడం... అన్నీ వివాదాలే.
సభాసమావేశాల ప్రారంభ ప్రసంగంలో ప్రభుత్వ విధానప్రకటనను సభ్యుల ముంగిట ప్రతిపాదించడం గవర్నర్ రాజ్యాంగ విధి. కానీ, 2023లోనూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రసంగ పాఠంలో ‘ద్రావిడ నమూనా పాలన’ సహా కొన్ని అంశాలను రవి ఉద్దేశపూర్వకంగానే వదిలేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయన్నదీ చదవలేదు.
అదేమంటే, ప్రసంగపాఠంలో కొన్ని అంశాలు తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ తీవ్రమైన వ్యాఖ్యే చేశారు. పెరియార్ రామసామి, కామరాజ్, అణ్ణాదురై, కరుణానిధి, అంబేడ్కర్ లాంటి పేర్లను చదవడానికి నిరాకరించడం, ‘తమిళనాడు’ బదులు ‘తమిళగం’ అనాలనడం రవిపై గతంలోనే విమర్శల వేడి పెంచాయి. ఇలా రాజ్యాంగ పరిధిని పదేపదే ఉల్లంఘించి, వివాదాలకు కేంద్రమవడం సరికాదు.
ఆ మాటకొస్తే ప్రజలెన్నుకున్న ప్రభుత్వంతో కేంద్ర పాలకులు కూర్చోబెట్టిన గవర్నర్లు తలపడడం, ప్రభుత్వ అధికారిక బిల్లుల్ని ఆమోదించకుండా తాత్సారం చేయడం, వైస్ ఛాన్సలర్ల నియామకానికి మోకాలడ్డడం, బాహాటంగా పాలనను విమర్శించడం... ఇవన్నీ పశ్చిమ బెంగాల్, పంజాబ్, కర్ణాటక సహా పలుచోట్ల కొద్దికాలంగా చూస్తున్నదే. రాజ్‌భవన్లు రాజకీయ కేంద్రాలవుతున్నాయన్న విమర్శకు ఇలాంటివే కారణం.
ప్రాథమిక హక్కుల్లో భాగంగా వ్యక్తిగత హోదాలో ఎవరికి ఎలాంటి అభిప్రాయాలున్నా తప్పు లేదు. భావప్రకటన స్వేచ్ఛను తప్పుపట్టనూ లేము. కానీ, రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న వ్యక్తుల నుంచి ఆశించేది వేరు. సదరు హోదా తాలూకు గౌరవానికి భిన్నమైన అభిప్రాయాల్ని వ్యక్తీకరించినా, ప్రజా ప్రభుత్వ పాలనకు రాజ్యాంగహోదాతో అభ్యంతరం చెప్పినా అది హర్షణీయం కాదు. ఒక విధంగా అది రాజ్యాంగ విధులకే ఉల్లంఘన.
రాష్ట్ర మంత్రిమండలి సలహా సూచనల మేరకే గవర్నర్ వ్యవహరించాలంటూ 1974లోనే ఏడుగురు సభ్యుల సుప్రీమ్ కోర్ట్ ధర్మాసనం చెప్పిన మాట శిరోధార్యం కావాలి. కేంద్రంలో రాష్ట్రపతి లాగా, రాష్ట్రంలో ప్రభుత్వ ఆలోచనకు అద్దం పట్టాల్సిన గవర్నర్లు ఆ రాజ్యాంగ విధిని విస్మరించ లేరు. వన్నె తగ్గించే పనుల్ని మానుకుంటేనే ప్రజాస్వామ్య స్ఫూర్తి గెలుస్తుంది. రాజ్యాంగ రూపకర్తల సదాశయం నిలుస్తుంది.
గౌరవం నిలపాలి!
Published Thu, Jan 9 2025 1:46 AM | Last Updated on Thu, Jan 9 2025 1:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment