
‘అమెరికా విముక్తి దినం’గా ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన రోజు రానేవచ్చింది. ఇన్నాళ్లూ ‘అన్యాయమైన సుంకాల’తో ‘అధ్వాన్నమైపోయిన’ అమెరికాకు ఏప్రిల్ 2 (బుధవారం) నుంచి విముక్తి లభించి, లక్షల కోట్ల డాలర్లు ఆర్జించి పెట్టగల ప్రతి సుంకాల మోత మోగబోతున్నదని దేశ ప్రజలను ఆయన ఊరిస్తున్నారు. విలక్షణమైన ప్రకటనలతో ఏకకాలంలో తన భక్త గణాన్నీ, ప్రత్యర్థులనూ రంజింపజేయటం ట్రంప్ ప్రత్యేకత.
అయితే ఆయన విధించబోయే సుంకాల రంగు, రుచి, వాసన ఆ రెండు వర్గాలకూ అంతుబట్టడం మాట అటుంచి... కొమ్ములు తిరిగిన ఆర్థికవేత్తల అవగాహనకే అందటం లేదు. ట్రంప్ చర్య వల్ల ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుందని మాత్రం ఆర్థికవేత్తలు జోస్యం చెబుతున్నారు. ఆడం స్మిత్, డేవిడ్ రికార్డో వంటి 18, 19 శతాబ్దాల నాటి స్వేచ్ఛా మార్కెట్ ఆర్థికవేత్తల ఆలోచనల్నించి బయటికొస్తేనే ట్రంప్ అర్థమవుతారని ఆర్థిక నిపుణులు కొందరి వాదన.
ట్రంప్ ఒక మాట మీదవుంటే కాస్తయినా అర్థమయ్యే వారు. కానీ ఆయన రోజుకో మాట మాట్లాడుతున్నారు. ఒకసారి మిత్ర దేశాలకైనా, వేరే దేశాలకైనా ఒకటే నిబంధన అంటారు. మరోసారి తద్విరుద్ధంగా మిత్ర దేశాలతో చర్చించి పరిష్కరించుకుంటామంటారు. ఆ మాటెలావున్నా తొలిసారి అధ్యక్షుడైనప్పుడు 2018–19 మధ్య ట్రంప్ చైనాపై విధించిన ప్రతి సుంకాల ప్రభావం ద్రవ్యోల్బణంపై పెద్దగా లేదుగనుక, ఇప్పుడూ ఉండకపోవచ్చని కొందరి మాట.
ట్రంప్ ప్రకటించబోయే ప్రతి సుంకాల తీరుతెన్నులెలావుంటాయో ఆయన సన్నిహిత సలహా దారులకు సైతం ఇంతవరకూ తెలియదు. ప్రతి సుంకాలు మధ్యస్థంగా, పరస్పరం చర్చించి పరిష్క రించుకునే విధంగా ఉంటాయని అమెరికా ఆర్థికమంత్రి స్కాట్ బిసెంట్ గత నెలలో తెలిపారు. కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలతో విడివిడిగా చర్చించి ఒప్పందానికొస్తామని అన్నారు.
మన వంతుగా ఎలాంటి చర్యలుంటాయో ప్రభుత్వం ఇంతవరకూ వెల్లడించలేదు. కానీ భారత్ తరఫున ట్రంప్ ఇప్పటికే ఒకటి రెండు ప్రకటనలు చేశారు. అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించటానికి భారత్ అంగీకరించిందని ట్రంప్ పక్షం రోజులనాడు చెబితే దానిపై విపక్షాలు పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీశాయి.
ఇంతవరకూ ఆ విషయంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని, అమెరికాకు చెప్పింది కూడా లేదని ప్రభుత్వం వివరించింది. మంగళవారం మరోసారి ఆయన అదే తరహాలో మాట్లాడారు. భారత్ గణనీయంగా సుంకాలు తగ్గించబోతున్నట్టు ‘కొద్దిసేపటి క్రితమే’ తనకు సమాచారం అందిందన్నారు. దీనిపై మన ప్రభుత్వం స్పందించలేదు. కానీ యూరప్ నుంచి అమెరికాకు పెను సవాల్ ఎదురుకాబోతున్నదని యూరోపియన్ యూనియన్ (ఈయూ) చేసిన ప్రకటన సూచిస్తోంది.
‘అమెరికా ప్రతి సుంకాలు ఏ స్థాయిలోవున్నాయో తెలిసిన వెంటనే ఏం చేయాలన్న అంశంలో పకడ్బందీ ప్రణాళిక సిద్ధమైంద’ని ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్ తెలియజేశారు. యూరప్ నుంచి వచ్చే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై 2,800 కోట్ల డాలర్ల మేర సుంకాలు విధించినట్టు గత నెలలో ట్రంప్ ప్రకటించిన వెంటనే, ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే మోటార్ సైకిళ్లు, బోట్లు, మద్యం వగైరాలపై ఈయూ సైతం భారీ సుంకాలు విధించింది. అయితే అదే సమయంలో అమెరికా నుంచి వచ్చే కార్లపై 2.5 శాతం మేర సుంకాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అమెరికా– ఈయూల మధ్య వార్షిక వాణిజ్యం లక్షన్నర కోట్ల డాలర్లు. యూరప్‌తో సాగుతున్న వాణిజ్యంపై అమెరికాలో 10 లక్షల ఉద్యోగాలు ఆధారపడివున్నాయి.
ఈ ‘విముక్తి’ సుంకాల రగడ పర్యవసానంగా మనతోపాటు అమెరికా, యూరప్, లండన్, జపాన్, హాంకాంగ్ తదితర ప్రపంచమార్కెట్లన్నీ పల్టీలు కొడుతున్నాయి. అన్నిచోట్లా అమెరికా షేర్లు పతనమవుతున్నాయి. చాలామంది ఈ సుంకాలెలా ఉండబోతున్నాయో తెలిసేవరకూ వేచి చూసే ధోరణిలో ఉండబట్టి కొంత నిలకడ కనబడుతోంది. కానీ ట్రంప్ అన్నంతపనీ చేస్తే ప్రపంచ మార్కె ట్లకు బుధవారం శాపగ్రస్త దినం కావడం ఖాయం. సుంకాలు పెంచటంవల్ల అమెరికాకు దిగుమ తయ్యే సరుకుల ధరలు ఆకాశాన్నంటుతాయి.
ఏటా అమెరికా 3 లక్షల కోట్ల డాలర్ల సరుకును దిగు మతి చేసుకుంటుంది. సరుకుతో నిమిత్తం లేకుండా అన్నిటిపైనా 20 శాతం అదనంగా సుంకం విధి స్తామని ట్రంప్ చెబుతున్నారు. ఈ లెక్కన ఏటా 60,000 కోట్ల డాలర్ల ఆదాయం లభిస్తుంది. కానీ ఈ భారాన్ని చివరకు దేశ పౌరులే మోయాల్సివుంటుందని, అది భారమవుతుందని ట్రంప్ గ్రహించటం లేదు. ఇప్పటికే జీవనవ్యయం పెరిగి, బ్యాంకుఖాతాలు ఖాళీ అవుతూ, ఉద్యోగాలు కోల్పోయే స్థితి వుండగా, ప్రతి సుంకాలతో ఇది మరింత విషమిస్తుంది. మాంద్యం ముంచుకొస్తుంది.
అమెరికా ఆర్థిక వ్యవస్థను సుస్థిరపరుస్తానని, ఉద్యోగాల విషయంలో శ్వేతజాతి అమెరికన్ కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దుతానని ట్రంప్ ఇచ్చిన హామీని నమ్మి జనం ఆయన్ను భారీ మెజారిటీతో గెలిపించారు. కానీ అందుకు విరుద్ధంగా అమలులో ఉన్న అంతర్జాతీయ అమరి కను ధ్వంసం చేసే పనిలో ట్రంప్ బిజీగా ఉన్నారు.
ఆయన చర్యలు దేశాన్ని 1930నాటి ఆర్థిక మాంద్యం రోజులకు తీసుకెళ్లినా ఆశ్చర్యం లేదని పలువురి మాట. 1930 జూలైలో నాటి అధ్యక్షుడు హెర్బర్ట్ హూవర్ స్మూట్–హాలీ ట్యారిఫ్ చట్టాన్ని తీసుకురావటంతో అమెరికా దిగుమతులు 67 శాతం పడిపోయి ఆ దేశ ఆర్థికవ్యవస్థ కళ్లు తేలేసింది. ఇప్పుడు ట్రంప్ అలాంటి దుస్సాహసానికి దిగబోతున్నారు. పర్యవసానాలెలావుంటాయో చూడటం తప్ప ప్రపంచంలో దీన్ని నివారించగల వారెవరూ లేరు.