పాక్‌ పాచికల్ని పారనీయొద్దు! | Sakshi Editorial On Pakistan and India Issues about Terror attack | Sakshi
Sakshi News home page

పాక్‌ పాచికల్ని పారనీయొద్దు!

Published Tue, Apr 29 2025 12:48 AM | Last Updated on Tue, Apr 29 2025 8:21 AM

Sakshi Editorial On Pakistan and India Issues about Terror attack

పహల్గామ్‌లో 26 మంది నిండు ప్రాణాలను బలితీసుకున్న ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనన్న అభిప్రాయం రోజురోజుకూ దేశంలో బలపడుతుండగా పాకిస్తాన్‌ మరింత రెచ్చగొట్టేలా మాట్లాడుతోంది. మొదటి నాలుగు రోజులూ ఉలకని, పలకని ఆ దేశం అటుతర్వాత ‘తటస్థ దర్యాప్తు’ రాగం అందుకుంది. ఆ మర్నాడే అణు బెదిరింపులకు దిగింది. మరోపక్క భద్రతా మండలిలో చడీచప్పుడూ లేకుండా లాబీయింగ్‌ సాగించి తన పాచిక పారేలా చూసుకుంది. 

ఇక్కడే మన లోపం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని ‘తీవ్రంగా’ ఖండిస్తు న్నట్టు తీర్మానం చెబుతున్నా అందులో దాడికి కారణమైన ‘ద రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’ (టీఆర్‌ఎఫ్‌) సంస్థ పేరు ప్రస్తావనే లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. చైనా ఎప్పటిలాగే పాకిస్తాన్‌ వాదనతో శ్రుతి కలిపింది. కానీ మన కు చాలా సన్నిహితుడనుకున్న డోనాల్డ్‌ ట్రంప్‌ ఏలుబడి అమెరికాలో మొదలైనా పాక్‌తో ఆ దేశం అంటకాగుతున్న వైనం దిగ్భ్రాంతికరం కాదా? ఈమధ్యకాలంలో బలూచిస్తాన్‌లో రైలును దారిమళ్లించి అనేకుల్ని హతమార్చిన ఉదంతంలో భద్రతామండలి అందుకు కారణమైన బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) పేరు ప్రస్తావించింది. 

2019లో పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి ఉదంతంలో సైతం జైషే మొహమ్మద్‌ (జేఈఎం) ప్రమేయాన్ని మండలి తీర్మానం ఎత్తి చూపింది. కానీ ఇప్పుడేమైంది? ఇక్కడికొచ్చేసరికి ఈ నీళ్ల నములుడు దేనికి? అమెరికా రూపొందించిన తీర్మానంలో తొలుత ప్రస్తావనకొచ్చిన టీఆర్‌ఎఫ్‌ పేరు ఎందుకు ఎగిరిపోయింది? ఏ సంస్థనూ మాటమాత్రంగానైనా ఖండించటానికి ముందుకురాని తీర్మానం ‘అంతర్జాతీయ శాంతికీ, భద్రతకూ విఘాతం కలిగించే ఉగ్ర ఘాతుకాలపై అన్నివిధాలుగా పోరాడతాం’ అని బడాయి పోవటం చిత్రం కాదా! ఆ ఘనకార్యం మేమే చేశామని విర్రవీగిన సంస్థ పేరెత్తటానికి మండలికున్న అభ్యంతర మేమిటి? అఫ్గాన్‌లో సోవియెట్‌ సైన్యాన్ని ఎదుర్కొనటానికి అమెరికా ఆశీస్సులతో ఉగ్రవాద శిబిరాలు నడిపిన పాపిష్టి చరిత్ర తమకుందని ఈమధ్యే పాక్‌ రక్షణమంత్రి అంగీకరించాడు. తాజా పరిణామాల నేపథ్యంలో అలాంటి లాలూచీ ఇంకా కొన సాగుతున్నదనుకోవాలా? 

ప్రధాని నరేంద్ర మోదీ మొన్న బిహార్‌లో కావొచ్చు... తాజాగా ‘మన్‌ కీ బాత్‌’లో కావొచ్చు, పహల్గామ్‌ ఉదంతంలో బాధితులకు సరైన న్యాయం దక్కేలా చేస్తామని స్పష్టం చేశారు. పాత్ర ధారుల్ని, సూత్రధారుల్ని తీవ్రాతితీవ్రంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. మంచిదే. అయితే ఈ కృషి బహుముఖాలుగా వుండాలి. ఉగ్రవాదుల్ని పట్టి బంధించటానికి ప్రయత్నించటంతో పాటు అంతర్జా తీయంగా పాక్‌ను ఏకాకిని చేయటానికి కృషి చేయాలి. ఉగ్రసంస్థల్ని కిరాయి ముఠాలుగా వాడుకుంటున్న దాని నైజాన్ని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టాలి. పాకిస్తాన్‌ తెరవెనకుండి భద్రతామండలి తీర్మానంలో చేయించిన మార్పులు చిన్నవేమీ కాదు. 

ఉగ్ర సంస్థ టీఆర్‌ఎఫ్‌తో పాక్‌ సర్కారు ఎంతగా చెట్టపట్టాలు వేసుకున్నదో మండలిలో జరిగిన పరిణామాలే తేటతెల్లం చేస్తున్నాయి. తీర్మానంలో టీఆర్‌ఎఫ్‌ ప్రస్తావన లేకుండా చేసిన క్షణాల్లోనే ఆ ఉగ్ర సంస్థ తన పాత ప్రకటన ‘అధికారికమైనది’ కాదంటూ స్వరం మార్చటం గమనించదగ్గది. దాడి జరిగిన వెంటనే తామే అందుకు కారకులమని చెప్పిన ఆ సంస్థ మండలిలో పాక్‌ వాదనకు అనుగుణంగా ఆ ప్రకటన తమది కాదనటమే కాదు... నింద మోపటం కోసం భారత సైన్యం కావాలని చేసిన పనిగా ఆ ఉదంతాన్ని వక్రీకరించే ప్రయత్నం చేసింది. లష్కరే తోయిబా విషపుత్రిక అయిన టీఆర్‌ఎఫ్‌ 2020 నుంచీ జమ్మూకశ్మీర్‌లో అనేక దాడులకు పాల్పడుతోంది. ఆ సంస్థను మన దేశం నిషేధించింది కూడా! 

ఏదో విధంగా మన దేశాన్ని ఇబ్బందులపాలు చేయటం కోసం ఏళ్ల తరబడి స్వయంగా నిర్మించిన ఉగ్రవాద సాలెగూటిలో తానే చిక్కుకుని పాకిస్తాన్‌ తరచు విలవిలలాడుతోంది. 2015లో పెషా వర్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంలోని పాఠశాలపై ఉగ్రవాదులు ఒక్కుమ్మడిగా విరుచుకుపడి 140 మంది బాలబాలికల్ని కాల్చిచంపారు. ఆ మరుసటి ఏడాది క్వెట్టాలో పోలీసు శిక్షణ కేంద్రం ఆవరణలోకి ప్రవేశించి 60 మందిని హతమార్చారు. ఒక యూనివర్సిటీపై దాడికి దిగి ప్రొఫెసర్‌తోపాటు 20 మంది విద్యార్థుల ప్రాణాలు తీశారు. ఈ మాదిరి ఉదంతాలు ఎన్నెన్నో. అయినా పాకిస్తాన్‌ వైఖరిలో ఆవగింజంతైనా మార్పు లేదు. పశ్చాత్తాపం అసలే లేదు. పహల్గామ్‌ దాడిని ఖండించకుండా పర్యాటకులు ప్రాణాలు కోల్పోవటం విచారకరమంటూ ప్రకటన చేసి చేతులు దులుపుకుంది.

పాకిస్తాన్‌ తీరు మారదని ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ దబాయింపు చూస్తే తెలుస్తుంది. ఉగ్రదాడిపై ఆయనగారికి ‘తటస్థ, పారదర్శక, విశ్వసనీయ’ దర్యాప్తు కావాలట! అసలు తన ఎన్నికే సంశయాస్పదమైంది. పాక్‌ సైన్యం అండదండలతో అందలమెక్కిన చరిత్ర షెహబాజ్‌ది. 2016నాటి పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి తర్వాత జరిగిన ఇరు దేశాల సంయుక్త దర్యాప్తును నీరు గార్చిందెవరు? పాక్‌ ప్రతినిధులు మన దేశం వచ్చి దర్యాప్తులో పాల్గొని వెళ్లగా, మన ప్రతినిధి బృందాన్ని మాత్రం పాక్‌ గడ్డపైకి అనుమతించని వైనం, తాము సేకరించిన సాక్ష్యాలను భారత్‌తో పంచుకోని తీరు షెహబాజ్‌ మరిచారా? 2008 నాటి ముంబై పేలుళ్ల ఉదంతంలో ఇచ్చిన సాక్ష్యాధారాలకు ఏ గతి పట్టించారో గుర్తులేదా? అణ్వాయుధ దాడికి సిద్ధమంటూ బెదిరింపులకు దిగుతున్న పాక్‌ దుష్ట పన్నాగాలను ప్రపంచ దేశాలకు తెలియజెప్పాలి. అందుకు దౌత్యపరంగా మరింత కృషి చేయాలి.  దాంతోపాటు అన్నివిధాలా సంసిద్ధతలు పెంపొందించుకోవాలి. సామాజిక మీడియాలో కశ్మీరీలపై విద్వేషాన్ని కక్కే అవాంఛనీయ శక్తుల ఆటకట్టించాలి. ఇది కలసికట్టుగా నిలబడాల్సిన కాలమని చాటాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement