ధ్వంసరచన | Sakshi Guest Column On Donald Trump | Sakshi
Sakshi News home page

ధ్వంసరచన

Published Fri, Apr 11 2025 4:42 AM | Last Updated on Fri, Apr 11 2025 4:42 AM

Sakshi Guest Column On Donald Trump

విశ్లేషణ

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దూసిన వాణిజ్య సుంకాల కత్తి పోట్లకు ఇండియా సహా ప్రపంచ స్టాక్‌ మార్కెట్స్‌ నెత్తురోడాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అకస్మాత్తుగా అనిశ్చితి ఊబిలో కూరుకుపోయింది. చైనా, కెనడా వెంటవెంటనే తొలివిడత ప్రతీకార సుంకాలను ప్రకటించాయి. దీంతో ట్రేడ్‌ వార్‌ అనివార్యం అనిపిస్తోంది. 

ఈ యుద్ధరంగంలో దూకేందుకు తామూ సిద్ధమేనంటూ యూరోపియన్‌ యూనియన్‌ హెచ్చరిక జారీ చేసింది. ఇతర దేశాలు అమెరికా నూతన విధానం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి. ఈ వాణిజ్య ఉద్రిక్తతల తక్షణ ప్రభావంతో నాస్‌డాక్‌ ఇండెక్స్‌ కుప్పకూలింది. ఇతర ఏషియన్‌ సూచీలూ  పతనమయ్యాయి. చమురు ధర బ్యారెల్‌ 64 డాలర్లకు దిగివచ్చింది.

ఆభరణాలకు దెబ్బ – వస్త్రాలకు మేలు
ఇండియా ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. దీనిక్కారణం, ఇప్పటికే ద్వైపా క్షిక వాణిజ్య ఒప్పందం కోసం సంప్రదింపులు ప్రారంభమై ఉండటమే. గతంలో ప్రపంచ వాణిజ్యసంస్థ (డబ్ల్యూటీవో) వేదికపై ధనిక దేశాల ఒత్తి ళ్లను అధిగమించి ఇండియా వ్యవసాయ రంగం కోసం రాయితీలను సాధించింది. ఇప్పుడూ అమె రికాతో విజయవంతంగా ఒప్పందం కుదురుతుందని నిపుణుల అంచనా. 

అలాగే, ఇక్కడ తయారు కాని వస్తువులపై విధించే నిర్హేతుకమైన అధిక సుంకాలకు ఒప్పందంలో అంగీకరించవచ్చు. బదులుగా, ప్రాసెస్డ్‌ ఫుడ్స్, సాగర ఉత్పత్తుల ఎగు మతిపై నాన్‌–ట్యారిఫ్‌ ఆంక్షలు సరళీకరించాలని కోరుతుంది. స్థానిక సర్వర్లలో డేటా నిల్వ (డేటా లోకలైజేషన్‌), మేధాసంపత్తి హక్కులు వంటి అంశాలు అంత తేలిగ్గా పరిష్కారం కావు. రాజీ ఫార్ములాలే శరణ్యం అవుతాయి.  

ఇండియా వాణిజ్యపరంగా తన పరిశ్రమ లను, వ్యవసాయాన్ని కాపాడుకునేందుకు స్వీయ రక్షణ విధానాలను అవలంబిస్తోందని ట్రంప్‌ పదే పదే విమర్శిస్తున్నప్పటికీ, ఆయన హయాంలో ఉభయ దేశాల నడుమ వ్యూహాత్మక సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. రక్షణ బంధం బలపరచుకోడానికి రెండు దేశాలూ సిద్ధంగా ఉన్నాయి. 

ఏమైనప్పటికీ, కొత్త సుంకాలు కొన్ని భారతీయ పరిశ్రమలకు స్వల్ప కాలంలో అశని పాతంగా పరిణమిస్తాయి. వజ్రాలు – ఆభ రణాల పరిశ్రమనే తీసుకుందాం. ఇది 2023–24 ఆర్థిక సంవత్సరంలో 33 బిలియన్‌ డాలర్ల ఎగు మతులు చేయగా, అందులో మూడో వంతు ఒక్క అమెరికాకే సరఫరా అయ్యాయి. ఈ పరిశ్రమ ప్రధానంగా చిన్న, మధ్య తరహా సంస్థలతో కూడుకుని ఉంది. 

దాదాపు 50 లక్షల మంది (పూర్తి నైపుణ్యం ఉన్న, ఒకమాదిరి నైపుణ్యం ఉన్న) కార్మి కులు జీవనోపాధి కోసం వీటిపై ఆధారపడు తున్నారు. కోవిడ్‌–19 మహమ్మారి సృష్టించిన సంక్షోభ కాలంలో వీరు ఉపాధి కోల్పోయి గ్రామా లకు తరలి పోయారు. ఇప్పుడు మళ్ళీ అమెరికా ఆర్డర్లు తగ్గిపోయి అలాంటి దుఃస్థితి పునరావృతం అవుతుందన్న భయాలు వ్యాపిస్తున్నాయి.

అయితే, అమెరికా వాణిజ్య సుంకాల పెంపు వల్ల ఇండియాకు అంతా ప్రతికూలమే అనుకో నక్కర్లేదు. మారిన పరిస్థితుల్లో ఇండియా దుస్తుల ఎగుమతి ధరలు పోటీ దేశాల్లో కంటే తక్కువగా ఉంటాయని వస్త్ర ఉత్పత్తుల కేంద్రమైన తిరుప్పూరు (తమిళనాడు) నుంచి వార్తలు వస్తున్నాయి. దీంతో కొనుగోలు దారులు ఇప్పటికే ఇండియా మీద దృష్టి సారించారు. కాబట్టి, భారతీయ వస్త్ర ఉత్పత్తులకు ఆర్డర్లు భారీగా పెరిగే వీలుంది.  

అమెరికాకే నష్టం
సుంకాల పెంపు సంక్షోభం ఫలితంగా ఇతర ప్రపంచ దేశాల కంటే యూఎస్‌ ఆర్థిక వ్యవస్థే అధికంగా నష్టపోతుంది. అమెరికాలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలిన తీరు రానున్న దుర్భర స్థితికి సంకేతం. అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తుందని ఇంతకు ముందునుంచే అంటున్నారు. సుంకాల పెంపు వల్ల ఈ రిస్కు అనూహ్యంగా పెరుగుతుందని రేటింగ్‌ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. 

జేపీ మోర్గాన్‌ ప్రకారం, ‘అమెరికా విచ్ఛిన్నకర రాజకీయాల’ ఫలితంగా అక్కడ ఆర్థిక మాంద్యం రిస్కు 40 నుంచి 60 శాతానికి పెరిగింది. కొత్త సుంకాల వల్ల యూఎస్‌ ఆర్థిక వ్యవస్థపై 700 బిలియన్‌ డాలర్ల భారం పడుతుంది. ఇది ఇంకా ఎక్కువే ఉంటుంది. ఈ లెక్కలు చైనా 34 శాతం ప్రతీకార సుంకాలు విధించక ముందు వేసినవి! 

ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో కూరుకుపోతే అది ఇండియా సహా అన్ని దేశా లకూ దుర్వార్తే! దీంతో, దేశం గడచిన సంవత్సరాల్లో సాధించిన వృద్ధి తగ్గిపోతుంది. 2025–26కి ఇండియా వృద్ధిరేటు 6.3 నుంచి 6.1కి క్షీణిస్తుందని ‘గోల్డ్‌మన్‌ సాక్స్‌’ ఇప్పటికే అంచనాలు సవరించింది.

అంతర్జాతీయంగా వాణిజ్య సుంకాలను హేతుబద్ధీకరించడానికి రెండో ప్రపంచ యుద్ధం ముగిసి నప్పటి నుంచీ ప్రయత్నాలు మొదలై, దశాబ్దాల పాటు సంప్రతింపులు, చర్చలు జరిగి ఎట్టకేలకు ఒక బహుళ పక్ష వేదిక ఏర్పడింది. ఈ ప్రపంచ ఆర్థిక పాలనలో పేద దేశాల మాటకు విలువ కల్పించిన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఇప్పుడు విధ్వంసమైపోతోంది. 

ట్రేడ్‌ వార్‌ ప్రభావం ఇండియాపై అనుకున్న దానికంటే తీవ్రంగానే ఉంటుంది. మరి దీనికి పరి ష్కారం ఏమిటి? యూరోపియన్‌ యూనియన్‌ వంటి బడా వాణిజ్య భాగస్వాములతో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలి. 

అదే సమయంలో, ప్రతీకార సుంకాల నేపథ్యంలో ఏ దేశాలు ఎగుమతులకు అనువైనవో గుర్తించాలి. ఈ ప్రపంచ వాణిజ్య యుద్ధాల్లో అంతిమంగా ఇండియా నష్టపోతుందా, ప్రయోజనం పొందుతుందా అనేది ఇప్పుడప్పుడే తేలదు. రానున్న రోజుల్లో ఈ గొడవ సద్దుమణిగిన తర్వాతే వాస్తవిక అంచనా సాధ్యమవుతుంది.

సుష్మా రామచంద్రన్‌ 
వ్యాసకర్త సీనియర్‌ ఫైనాన్షియల్‌ జర్నలిస్ట్‌ ‘ (‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement