
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అంటే గుర్తొచ్చేవి రాజ్యాంగ రచన, అంటరానితనం, కులనిర్మూలన పోరాటాలు, పోరాడి సాధించుకున్న స్వాతంత్య్ర ఫలాలు అందరికీ సమానంగా దక్కాలన్న భావన, సమాలోచనలు. అయితే అంబేడ్కర్ గొప్ప పాత్రికేయులనీ, పాత్రికేయ ప్రమాణాలు, నైతిక విలువలకు అత్యంత ప్రాధాన్యత నిచ్చేవారనీ, వాటిని కాపాడేందుకు స్వయంగా తానే పత్రికలు స్థాపించి అక్షర పోరాటం చేశారనీ చాలా తక్కువ మందికే తెలుసు.
ఆయన ‘మూక్ నాయక్’ (1920), ‘బహిష్కృత భారత్’ (1027), ‘సమత’ (1928), ‘జనత’ (1930) ‘ప్రబుద్ధ భారత్’ (1956) పత్రికలు స్థాపించి పత్రికా స్వేచ్ఛకు పట్టం కట్టారు. ప్రతి అక్షరాన్ని నిటారుగా నిలిపి, పాత్రికేయ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పారు. ఆయన ఏ పత్రిక ప్రారంభించినా, దానికి ఒక ప్రత్యేక అజెండా ఉండేది. ఆరంభ సంచికలోనే తానెందుకు, ఎవరి కోసం సదరు పత్రిక ప్రారంభించారో తెలియచేసేవారు.
దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న కులవివక్ష, అంటరానితనం తనని ఎక్కువగా ప్రభావితం చేశాయని ‘బహిష్కృత భారత్’ పత్రిక లక్ష్యాన్ని వివరిస్తూ తొలిసంచికలో ‘సంతకపు సంపాదకీయం’(సైన్డ్ ఎడిటోరియల్) రాశారు. చైతన్య పరచడం ద్వారానే ప్రజల్లో కదలిక తీసుకురావడం సాధ్యమవుతుందనీ, దాన్ని సాధించడం కోసం ‘ప్రబుద్ధ భారత్’ పత్రిక ప్రారంభించాననీ ఆరంభ సంచికలో సంపాదకీయం ద్వారా పత్రిక అజెండాను చెప్పారు.
అంబేడ్కర్ స్థాపించిన పత్రికల్లో అగ్రస్థానం ‘మూక్ నాయక్’దే! నూరేళ్ళ చరిత్రకు సాక్ష్యంగా నిలచి, ఈ మధ్యనే అక్షర సంబరాలు జరుపుకొన్న ఈ పత్రిక జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించిందనే చెప్పాలి. నిర్భీతిగా, నిజంవైపు నిలబడడం, పాత్రికేయ విలువలు తు.చ. తప్పక పాటించడం, రాతల్లో అపోహలకు, అసత్యాలకు తావివ్వక పోవడం; కుల రాజకీయాలకు, వివక్షకు దూరంగా రచనలు చెయ్యడం వంటి సూత్రాలను కడదాకా పాటించారాయన.
చాలా మటుకు భారతీయ పత్రికలు ఏకపక్షంగా రాస్తున్నాయనీ, కేవలం ఒక వర్గం తాలూకు అభీష్టానికి అనుగుణంగానే రాస్తున్నాయనీ, కొన్నిసార్లు ఊహాజనిత వార్తల్ని వండి వార్చుతున్నాయనీ దుయ్యబట్టారు. రాజ్యాంగ రూపశిల్పిగా, కేంద్ర మంత్రిగా, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పేరు పొందిన తనపైనే అవాకులు, చవాకులు పేలడం తనను కలచివేసిందని, అందు వల్లనే తానీ పత్రిక ప్రారంభించడానికి సంకల్పించినట్లు తన సంపాదకీయంలో పేర్కొన్నారు. పెద్దలకు అనుకూలంగాను, పేదలు బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగానూ పత్రికలు కొనసాగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పెను ప్రమాదమని హెచ్చ రించారు.
వెనుకబాటు తనానికి ఆర్థిక అంశాలు ద్వితీయ స్థానంలో ఉండగా, సామాజికాంశాలే ప్రథమ స్థానంలో ఉన్నా యనేది అంబేడ్కర్ నిశ్చితాభిప్రాయం. తద నుగుణంగానే రాజ్యాంగ రూపకల్పనలో సామాజిక రిజర్వేషన్లకు ప్రాధాన్యమిచ్చినట్లు తన రచనల్లో స్పష్టం చేశారు. పేదరికం, నిస్సహాయత, ఆత్మ న్యూనత, వెనుక బాటుతనం దాడి చేస్తుండడం వల్లనే అణగారిన వర్గాలు అభివృద్ధి ఫలాలను అందుకోలేక పోతున్నాయని, ఈ రుగ్మతల నుంచి మెజారిటీ జనాలను ‘విముక్తుల్ని’ చేయడమే తన ముందున్న లక్ష్య మని తన పత్రికల్లో పదే పదే ప్రస్తావించారు.
మిగతా వృత్తుల కంటే జర్నలిజం ‘పవిత్ర’మై నదని, జనజాగృతికి, దిశానిర్దేశం చేయడానికి దీన్ని మించిన ‘వజ్రాయుధం’ మరోటి లేదన్నది అంబే డ్కర్ దృఢమైన అభిప్రాయం. సంచలనాల కోసం, తానెప్పుడూ తప్పుడు రాతలు రాయబోనని ప్రతిన బూనారు. పాత్రికేయునికి నైతికబాధ్యత ఆయుధమై ఉండాలన్నారు. జర్నలిజం వృత్తిని గౌరవించేవారు కనీసం ఆయన ప్రమాణాల్లో కొన్ని పాటించినా ఆ మహనీయునికి ఘననివాళి అర్పించినట్లే!
ప్రొ‘‘ పీటా బాబీ వర్ధన్
వ్యాసకర్త మీడియా విశ్లేషకులు
మొబైల్: 93931 00566