కష్టం వేరొకరిది! కాసులు ఏఐవి!! | Sakshi Guest Column On Artificial Intelligence | Sakshi
Sakshi News home page

కష్టం వేరొకరిది! కాసులు ఏఐవి!!

Published Wed, Apr 16 2025 5:37 AM | Last Updated on Wed, Apr 16 2025 5:38 AM

Sakshi Guest Column On Artificial Intelligence

గిబ్లీ ఇమేజ్‌: ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చేందుకు ఏ కంపెనీ కూడా గిబ్లీ స్టూడియో చిత్రాలను వాడుకునే హక్కులు తీసుకోలేదు.

విశ్లేషణ

డిజిటల్‌ ప్రపంచంలో మరో కొత్త అంశం చక్కర్లు కొడుతోంది. ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలు కాస్తా ప్రఖ్యాత జపనీస్‌ యానిమేటర్‌ హయావో మియజాకీ శైలిలో గీసిన ఫ్యామిలీ, వ్యక్తిగత చిత్రాలతో నిండిపోతున్నాయి. గిబ్లీ ఆర్ట్‌ పేరు పెట్టుకున్న ఈ చిత్రాల ధోరణి నాలుగు దశాబ్దాల పాటు యానిమేషన్‌ రంగంలో ఎన్నో ప్రఖ్యాత క్యారెక్టర్లను సృష్టించిన గిబ్లీ స్టూడియో నకలు అన్నది మీకు తెలిసే ఉంటుంది. 

తేలిక పాటి పేస్టల్‌ షేడ్స్‌లో క్యారెక్టర్ల చిత్రీకరణ దీని హైలైట్‌. ప్రస్తుతానికి ఈ గిబ్లీ ఆర్ట్‌ అన్నది ఏఐ ప్లాట్‌ఫామ్స్‌ కొన్నింటిలో ఉచితంగా లభి స్తోంది. కొన్ని క్లిక్‌ల సాయంతో ఏ చిత్రాన్నైనా గిబ్లీ ఆర్ట్‌గా మార్చేయ వచ్చు. సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ఫ్యాషన్‌ , స్పోర్ట్స్‌ ఇన్‌ఫ్లుయెన్స ర్లతో పాటు కొన్ని కోట్ల మంది ఇప్పటికే ఈ గిబ్లీ ఆర్ట్‌ను వాడేశారు.

సరదాగా కనబడుతున్నా...
కంటెంట్‌ను సృష్టించేందుకు ఉపయోగించే జనరేటివ్‌ ఏఐ టూల్స్‌ అందుబాటులోకి వచ్చి కొంత కాలం అయినప్పటికీ, ‘ఓపెన్‌  ఏఐ’ అభివృద్ధి చేసిన సరికొత్త ఏఐ టూల్‌ ఈ గిబ్లీ ఆర్ట్‌ ట్రెండ్‌కు కారణమైంది. ఛాట్‌జీపీటీ వంటి లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడళ్లు మనం అందించే సమాచారం (టెక్ట్స్) ఆధారంగా మనకు కావాల్సిన సమ చారాన్ని వివిధ రూపాల్లో (ఆర్టికల్స్, సోషల్‌ మీడియా పోస్టులు వంటివి) తయారు చేస్తాయి. 

అదే గిబ్లీ ఆర్ట్‌ వంటివి మల్టీమీడియా జనరేటివ్‌ ఏఐ టూల్స్‌! టెక్ట్స్తో పాటు వీడియోలు, వాయిస్, ఫొటోలు, మ్యూజిక్‌ వంటి వాటినన్నింటినీ అది తీసుకోగలదు. ‘మిడ్‌ జర్నీ’, ‘స్టేబుల్‌ డిఫ్యూషన్‌ ’, ‘డాల్‌–ఈ’ వంటివి టెక్ట్స్ను తీసుకుని ఇమేజెస్‌ ఇవ్వగలవన్నది తెలిసిందే. డాల్‌–ఈతో ఢిల్లీ వీధుల చిత్రాలను ఎం.ఎఫ్‌.హుస్సేన్‌  లేదా జామినీ రాయ్‌ శైలిలో కొన్ని సెకన్ల సమయంలోనే తయారు చేయవచ్చు. ఇక ‘లెన్సా’ వంటివి ఇచ్చిన ఇమేజ్‌కు ప్రత్యామ్నాయాలను సృష్టిస్తాయి. 

వీటితో పోలిస్తే గిబ్లీ ఆర్ట్‌కు ఎక్కువ ఆదరణ ఎందుకు లభించిందంటే... ఇవి ముద్దుగా, హాస్యస్ఫోరకంగా ఉండటమని చెప్పాలి. చూసేందుకు హాస్యస్ఫోరకంగానే ఉండవచ్చు కానీ, దీని వెనుక ఒక సీరియస్‌ సమస్య ఉంది. ఏదైనా ఏఐ వ్యవస్థ వాస్తవ ప్రపంచం నుంచి వచ్చే సమాచారం ఆధారంగానే పనిచేస్తుంది. ఈ సమాచారం ద్వారా ఏఐ వ్యవస్థలకు శిక్షణ అందుతుంది. రకరకాల మార్గాల ద్వారా ఏఐ వ్యవస్థలకు డేటా (టెక్ట్స్, ఇమేజెస్, సంగీతం) అందు తూంటుంది. 

రస్కిన్‌  బాండ్‌ లేదా అమితవ్‌ ఘోష్‌ శైలిలో ఒక చిన్న కథ రాయమని మనం ఏదైనా లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ను అడిగా మనుకోండి... వీరిద్దరి రచనల తాలూకూ సమాచారం మొత్తాన్ని వెతికేస్తుంది ఏఐ! చివరకు కాపీరైట్‌ హక్కులున్న సమాచారం కూడా. కానీ ఏఐ కంపెనీలు ఈ కాపీరైట్‌ హక్కులు పొందకపోవడం గమ నార్హం. గిబ్లీ ఆర్ట్‌ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చేందుకు ఏ కంపెనీ కూడా గిబ్లీ స్టూడియో తాలూకూ చిత్రా లను వాడుకునే హక్కులు తీసుకోలేదు. 

బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్నే తాము వాడుకుంటున్నట్లు ఏఐ కంపెనీలు చెబుతున్నా... రచయితలు, కళా కారుల స్పందన వేరుగా ఉంది. కాపీరైట్‌ చట్టాల్లోని ‘ఫెయిర్‌ యూజ్‌’ సిద్ధాంతం గురించి ఏఐ కంపెనీలు చదివితే మేలని వీరు అంటు న్నారు. అప్పుడే అమెరికా, యూరప్‌లలో న్యాయపోరాటాలైతే మొద లయ్యాయి. 

సృజనకారులకు దక్కేదేమిటి?
గిబ్లీ ఆర్ట్‌ వంటి ఏఐ టూల్స్‌ అసలు సృజనాత్మకత అన్న అంశంపైనే సవాళ్లను లేవనెత్తుతున్నాయి. ఓ అందమైన పెయింటింగ్, కార్టూన్‌ క్యారెక్టర్, సంగీతం... ఇవన్నీ మనిషి సృజనకు మచ్చుతున కలు. ఇవన్నీ ఆ యా వ్యక్తుల సొంత అనుభవాలు, సందర్భాల నుంచి పుట్టుకొచ్చినవి. గిబ్లీ ఆర్ట్‌నే ఉదాహరణకు తీసుకుందాం. జపాన్‌ సమాజం, సంస్కృతులకు అది అద్దం పడుతుంది, అమెరికన్‌  సంస్కృతికి వాల్ట్‌ డిస్నీ స్టూడియో అద్దం పట్టినట్లు!

ఇలాంటి సృజనాత్మక కళాకృతులను యంత్ర సృష్టిగా మార్చడం లేదా ఒక ఏఐ సిస్టమ్‌ మానవ సృజనాత్మకత, అభినివేశాలకు విరు ద్ధంగా వెళ్లడం మేలైన ఆలోచనైతే కాదు. ఒక పెయింటింగ్‌ను పూర్తి చేసేందుకు కళాకారుడికి కొన్ని నెలల సమయం పట్టవచ్చు. అలాగే పుస్తకం రాయడానికి ఏళ్లు పడుతుంది. ఒక కార్టూన్‌  లేదా యానిమేషన్‌  స్ట్రిప్‌ తయారు చేసేందుకు ఆర్టిస్టులు వందల గంటలు కష్టపడాల్సి రావచ్చు. వీటన్నింటి ఆధారంగా పనిచేసే ఏఐ సృష్టించే ఆర్ట్‌కు పేరు, డబ్బు... రెండూ అసలు కళాకారులకే దక్కాలి. 

అందుకే ఏఐ కంపె నీలు డేటా లాండరింగ్‌కు పాల్పడుతున్నాయనీ, కళాకారులకు దక్కా ల్సిన డబ్బు, క్రెడిట్‌ రెండింటినీ ఎగ్గొడుతున్నాయనీ విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. కొన్ని లక్షల మంది కళాకారులపై ఆధారపడి అభివృద్ధి అవుతున్న ప్రతి ఏఐ జనరేటివ్‌ మోడల్‌ కంపెనీ విలువ వందల కోట్ల డాలర్లుగా ఉండటం ప్రస్తావనార్హం. ఇవి వినియోగ దారుల నుంచి వేల డాలర్ల రుసుము వసూలు చేస్తూంటాయి. అయితే, అసలు కళాకారులకు ఇందులోంచి ఏమీ దక్కడం లేదు. 

ఇమేజ్‌ జనరేటర్లు కళాకారులు కాదు కానీ... కళాకారులకు సవాలు విసురుతున్నాయి. జనరేటివ్‌ ఏఐ మోడళ్లు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సృజనాత్మకత కలిగిన వారి జీవనోపాధిని దెబ్బ తీస్తున్నాయి. యానిమేషన్‌  రంగంలోని కళాకారులు, ఇల్లస్ట్రేటర్లు, డిజైనర్లపై ప్రభావం ఎక్కువే ఉంది. పైగా మానవ కళాకారులతో పోలిస్తే ఏఐ తయారు చేసే బొమ్మల్లో డెప్త్, భావ ప్రకటన తక్కువ. ఏఐ ఆకృతులు ఓ మోస్తరువి మాత్రమే! 

ఒప్పందాలు మేలా?
ఇప్పుడు డిజిటల్‌ ప్రపంచం మొత్తం గిబ్లీ వంటి ఉచిత ఏఐ టూల్స్‌ ఉత్పత్తులతో నిండిపోయింది. సినిమా స్టుడియోలు, నెట్‌ వర్క్‌లు ఇప్పటికే ఈ ఏఐ టూల్స్‌ను శ్రమ, ఖర్చులు రెండూ తగ్గించేవిగా చూస్తున్నాయి. పదుల కొలదీ యానిమేటర్ల బృందాలను నియమించుకునే బదులు, కొందరు ఏఐ టెక్నికల్‌ డైరెక్టర్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ ధోరణి మనదేశంలో ఆందోళనకు కారణం అవుతోంది. వేల మంది భారతీయ టెకీలు హాలీవుడ్‌ స్టూడియోలు ఔట్‌సోర్స్‌ చేసే యానిమేషన్‌  వర్క్‌పై ఆధారపడి ఉన్నారు. వాళ్లు కంప్యూటర్‌ గ్రాఫిక్స్, ఇతర టూల్స్‌ను వాడుతున్నారు. కానీ ఏఐ టూల్స్‌తో ఆటోమేషన్‌  మరో స్థాయికి వెళ్తుంది.

ఈ సమస్యకు సులభ పరిష్కారం లేదు. కాపీరైట్ల విషయంలో న్యాయ స్థానాలకు వెళ్లడం ఒక మార్గం. డేటా ప్రొటెక్షన్‌  చట్టాలు, ఏఐ నియంత్రణలు ఇప్పుడిప్పుడే ఏఐ టూల్స్‌ తాలూకూ సైడ్‌ ఎఫెక్ట్స్్‌పై దృష్టి పెడుతున్నాయి. కొంతమంది పబ్లిషర్లు, పుస్తక, సంగీత కంపె నీలు ఆదాయాన్ని పంచుకునే విషయంలో ఏఐ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. తద్వారా తమ పుస్తకాలు, సంగీతం లేదా ఇతర కళలను ఏఐల శిక్షణకు ఉపయోగించుకునే వీలు ఏర్పడుతోంది. 

డేటా ట్రెయినింగ్‌ కోసం ఎటూ టెక్‌ కంపెనీలు తమ కళను వాడుకుంటున్నట్లు వీరు భావిస్తున్నారు. బదులుగా ఒప్పందం కుదుర్చుకో వడం మేలని వీరి ఆలోచన. అనుమతులు తీసుకుని కళలు, సమా చారాన్ని ఏఐ ట్రెయినింగ్‌ కోసం వాడుకోవడం ఇంకొక మార్గం. సోషల్‌ మీడియా వేదికలు కూడా ఏఐ ఆధారిత ఇమేజెస్, వీడి యోలు, యానిమేషన్లను అనుమతించే విషయంలో ఆచితూచి వ్యవ హరించాలి. ప్రస్తుత గిబ్లీ ఆర్ట్‌ ట్రెండ్‌ ముప్పు లేదని అనిపించవచ్చు. కానీ... వాస్తవానికి ఇది మనకు  మేలుకొలుపు లాంటిది!

దినేశ్‌ సి. శర్మ 
వ్యాసకర్త సైన్స్‌ వ్యవహారాల వ్యాఖ్యాత
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement