ఫలిస్తున్న ప్రజాభాగస్వామ్య పోరాటం | Sakshi Guest Column On Indian Govt Fight Against Tuberculosis | Sakshi
Sakshi News home page

ఫలిస్తున్న ప్రజాభాగస్వామ్య పోరాటం

Published Tue, Mar 25 2025 5:00 AM | Last Updated on Tue, Mar 25 2025 5:00 AM

Sakshi Guest Column On Indian Govt Fight Against Tuberculosis

విశ్లేషణ

క్షయవ్యాధి (టీబీ)పై పోరులో భారత్‌ స్పష్టమైన వైఖరితో ముందుకు సాగుతోంది. ఇటీవల విస్తృత స్థాయిలో 100 రోజులపాటు నిర్వహించిన ‘టీబీ–ముక్త్‌ భారత్‌ అభి యాన్‌’... వినూత్న విధానాలను ప్రవేశ పెట్ట డమే కాక, జన బాహుళ్యాన్ని మమేకం చేయడం కూడా అంతే కీలకమని స్పష్టం చేస్తోంది. టీబీ కేసులను గుర్తించడాన్ని వేగవంతం చేయడం, మరణాలను తగ్గించడం, కొత్త కేసులను నివారించడం వంటి లక్ష్యాలతో 2024 డిసెంబర్‌ 7న ఈ ప్రచారం ప్రారంభమైంది.

ఈ ప్రచారం ద్వారా టీబీ లక్షణాలు లేనివారే కాదు, ఆ లక్షణాలు గుర్తించని వారిని సైతం తొలిదశలోనే పసిగట్టి చికిత్స అందించింది. డయాబెటిస్‌ ఉన్నవారు, ధూమపానం చేసేవారు, మద్యపానం సేవించేవారు, హెచ్‌ఐవీ రోగులు, వృద్ధులు, తక్కువ ‘బీఎమ్‌ఐ’ ఉన్నవారు, టీబీ రోగులతో మసిలే కుటుంబ సభ్యులు... ఇలా అధిక రిస్కున్న వ్యక్తుల చెంతకు పోర్టబుల్‌ ఎక్స్‌–రే యంత్రాలను నేరుగా తీసుకెళ్ళి చికిత్స అందించడం జరిగింది. 

కృత్రిమ మేధ సాయంతో పనిచేసే ఎక్స్‌–రేల ద్వారా అక్కడికక్కడే అనుమానిత టీబీ కేసులను గుర్తించారు. ప్రామాణికమైన ‘న్యూక్లియిక్‌ యాసిడ్‌ యాంప్లిఫికేషన్‌ టెస్ట్‌’ (ఎన్‌ఏఏటీ) ఉపయోగించి రోగ నిర్ధారణ కూడా జరిగింది. ఈ ప్రయత్నాలు అంటువ్యాధులను గుర్తించి త్వరగా చికిత్స చేయడానికీ, అవి వ్యాప్తి చెందకుండా అరికట్టడానికీ, ప్రాణాలను కాపాడటానికీ దోహదపడ్డాయి. దేశం నలుమూలలా చేపట్టిన ఈ ప్రచార కార్య క్రమంతో టీబీ బారిన పడటానికి అవకాశమున్న దాదాపు 12.97 కోట్ల మందికి పరీక్షలు జరిగాయి. తద్వారా సుమారు 7.19 లక్షల టీబీ రోగులను గుర్తించారు. ఇది కేవలం ఒక మైలురాయి అంటే సరిపోదు, ఒక మలుపు అనే చెప్పాలి.

భాగస్వామ్య ఉద్యమం
చెప్పాలంటే... నిజమైన గేమ్‌ ఛేంజర్‌ కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు– జనాలను సమీకరించడం (కమ్యూనిటీల సమీకరణ). టీబీ నిర్మూలన అనేది ఇప్పుడు ‘జన్‌ భాగీదారీ’ (ప్రజల భాగస్వామ్యం) ద్వారా నడిచే ఒక ప్రజా ఉద్యమంగా మారింది. దేశమంతటా 13.46 లక్షలకు పైగా ‘ని–క్షయ్‌’ శిబిరాలు జరిగాయి. ఇందులో గౌరవ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీఆర్లు, యూఎల్బీల ప్రతినిధులతో సహా 30,000 మందికి పైగా ఎన్నికైన ప్రతినిధులు  ‘టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌’కు మద్దతు అందించారు. కార్పొరేట్‌ భాగస్వాములు, సాధారణ పౌరులు సైతం ఈ ప్రచారంలో పాల్గొన్నారు. టీబీ నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, సామూహిక లక్ష్యం అనే ఆలోచనను వీరు బలోపేతం చేశారు. ఈ మిషన్లో అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రజల భాగ స్వామ్యం ఉండటం విశేషం. 

టీబీపై అవగాహన, న్యూట్రిషన్‌ కిట్‌ పంపిణీ, టీబీ రహిత భారత్‌ కోసం ప్రతిజ్ఞ చేయడం వంటి 35,000కి పైగా కార్య కలాపాలను 22 వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు చేపట్టాయి. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు, వాణిజ్య సంఘాలు, వ్యాపార సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు 21,000కి పైగా కార్యకలాపాలను చేపట్టగా... 78,000 విద్యా సంస్థలలో 7.7 లక్షలకు పైగా విద్యార్థులు క్షయవ్యాధి అవగాహన కార్యకలాపాలలో పాల్గొన్నారు. జైళ్లు, గనులు, తేయాకు తోటలు, నిర్మాణ ప్రదేశాలు, పని ప్రదేశాల వంటి సామూహిక ప్రాంతాల్లో టీబీ బారిన పడటానికి అవకాశమున్న 4.17 లక్షలకు పైగా జనాలకు పరీక్షలు నిర్వహించారు. 

‘జన్‌ భాగీదారీ’కి పునాది వేసిన మన ప్రధాని దార్శనికత సమాజంపై విస్తృత ప్రభావాన్ని చూపింది. ఫలితంగా రోగులకు తగిన పోషకాహారాన్ని అందించడం కోసమే కాక, వారి మానసిక – సామాజిక స్థితిగతుల్లో తోడ్పాటుకు ఎంతోమంది ముందుకొచ్చారు. టీబీ రోగుల బాగోగులు ఇప్పుడు ఆసుపత్రులకు మాత్రమే పరి మితం కాలేదు. ఇది ఇంటింటికీ, గ్రామ గ్రామానికీ, పని ప్రదే శాలకూ వ్యాపించాయి. 

‘నిక్షయ్‌ మిత్ర’ ద్వారా వ్యక్తులు, సంస్థలు ఇప్పటికే వేలాది ఆహార బుట్టలను పంపిణీ చేసి, టీబీ బాధిత కుటుంబాలకు పోషక సహాయాన్ని అందిస్తున్నాయి. కేవలం 100 రోజుల కార్యక్రమంలో 1,05,181 కొత్త నిక్షయ్‌ మిత్రులు నమోదయ్యారు. పోషకాహారం అందించడం, క్షయవ్యాధి నుంచి రోగులు కోలుకునేలా చేయడం మధ్య కీలక సంబంధాన్ని గుర్తిస్తూ... ప్రభుత్వం ‘నిక్షయ్‌ పోషణ్‌ యోజన’ కింద ఆర్థిక సహాయాన్ని నెలకు 800 నుంచి 1,000 రూపాయలకు పెంచింది. తద్వారా ఏ క్షయవ్యాధి రోగీ ఒంటరి పోరాటం చేయకుండా చూడటమే ప్రభుత్వ ఉద్దేశం.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కూడా విభిన్న రీతిలో టీబీ కేర్‌ ప్రోగ్రాం కింద రోగులకు అవసరమైన చర్యలు తీసుకోవడమే కాదు, రోగిని బట్టి శ్రద్ధ తీసుంటూ చికిత్సను అంది స్తోంది. ఉదాహరణకు, ఒక టీబీ రోగి తక్కువ బరువుతో ఉన్నట్లు తేలితే (18.5 కంటే తక్కువ బీఎమ్‌ఐ), వారి ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు తగిన పోషకాహారం, చికిత్స ప్రణాళికను రూపొందిస్తారు. చికిత్స సమయంలో నెల నెలా వారి పురోగతిని పర్యవేక్షిస్తారు.

100 రోజుల పురోగతి
క్షయ వ్యాధి పై అవగాహన కల్పించడం, రోజువారీ జీవితంలో సేవలను అందించే విషయంలో 22 మంత్రిత్వ శాఖలు చేతులు కలిపి ముందుకు సాగాయి. గోవా కార్నివాల్‌ పరేడ్‌లలో టీబీపై అవగాహన ఒక ప్రధానాంశంగా నిలిచింది. తమ కార్యాలయాలను సందర్శించే వేలాది మందికి ఉచిత టీబీ స్క్రీనింగ్‌లను చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఈ విభిన్న చర్యలు అపోహలను తొలగించే ప్రయత్నాలు చేశాయి. క్షయ నిర్మూలనలో ప్రజా చైతన్యానికి బాటలు పరిచాయి.

100 రోజుల ప్రచారం అనేది కేవలం ప్రారంభం మాత్రమే!
ప్రతి పౌరుడు... వారు ఎక్కడ నివసిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా ఆధునిక పద్ధతుల్లో రోగనిర్ధారణ, నాణ్యమైన చికిత్స అందించడం, అన్ని వర్గాల వారినీ భాగస్వాములను చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ఈ ప్రయత్నాలను వేగవంతం చేయడానికి భారత్‌ సిద్ధంగా ఉంది. కోవిడ్‌–19 పరీక్షల విషయంలో ప్రభుత్వం ఎంత చురుగ్గా స్పందించిందో... అదే మాదిరి మరింత వేగవంతమైన, కచ్చితమైన అత్యాధునిక టీబీ పరీక్షలను అన్ని ప్రాంతాలకూ, అన్ని వర్గాలకూ అందుబాటులోకి తేవడానికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది.

స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కావొచ్చు, పోలియో నిర్మూలన కార్య క్రమాలు కావొచ్చు... యావత్‌ సమాజం కదలి వస్తే ఎటువంటి ప్రయోజనాలు ఒనగూరుతాయో స్పష్టంగా రుజువు చేశాయి. ‘టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌’ కూడా ఇప్పుడు ప్రజల నేతృత్వంలో మరో ఉద్యమంగా మారుతోంది. భారత్‌ ఇప్పుడు కేవలం క్షయవ్యాధితో పోరాడటం మాత్రమే కాదు– దాన్ని ఓడిస్తోంది కూడా!


జేపీ నడ్డా 
వ్యాసకర్త కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి
(మార్చి 24న ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement