TB disease
-
క్షయ.. వ్యాధి నిర్మూలనకై ప్రభుత్వం పటిష్ట చర్యలు!
కాకినాడ: క్షయ.. నోటి తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణం మీదకు తెస్తుంది. ఈ వ్యాధికి కళ్లెం వేసేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రతి సీహెచ్‌సీలో టీబీ యూనిట్ ఏర్పాటు చేసింది. ఈవిధంగా జిల్లాలో మొత్తం 9 యూనిట్లు ఉన్నాయి. వీటిల్లో ఒక సీనియర్ టీబీ సూపర్వైజర్, ఒక సీనియర్ ల్యాబ్ సూపర్వైజర్ విధులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు 10 మంది సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. క్షయ కేసులను గుర్తించేందుకు ప్రతి సీహెచ్‌సీలో ఎక్స్‌రే యూనిట్లు ఏర్పాటు చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 10 మంది టీబీ హెల్త్ విజిటర్లు పని చేస్తున్నారు. క్షయ వ్యాధిని నిర్ధారించేందుకు కాకినాడ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో రెండు సీబీ నాట్ మెషీన్లు ఏర్పాటు చేశారు. దీంతోపాటు, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో 19 ట్రూనాట్ మెషీన్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఆరోగ్య కేంద్రాన్ని మైక్రోస్కోప్ సెంటర్‌గా మార్చి టీబీ లక్షణాలున్న వ్యక్తి నుంచి కళ్లె (ఉమ్ము) సేకరించి పరీక్షలు చేస్తున్నారు. ఆ శాంపిల్‌లో టీబీ క్రిములుంటే ఆ వ్యక్తికి డాట్ ప్రొవైడర్ ద్వారా మందులు ఇస్తూ వ్యాధిని తగ్గించేందుకు 6 నుంచి 8 నెలల పాటు చికిత్స అందిస్తున్నారు. ఉచితంగా మందులు.. టీబీ చికిత్సకు జిల్లాలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా మందులు అందజేస్తున్నారు. వ్యాధి వచ్చిన తర్వాత వైద్యులు సూచించిన విధంగా నిర్ణీత కాలం మందులు వాడకపోతే అది మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీగా మారుతుంది. దీనికి రెండేళ్ల పాటు మందులు వాడాల్సి ఉంటుంది. టీబీ నిర్మూలనకు రూ.2 లక్షల నుంచి రూ.18 లక్షల విలువ జేసే మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. మందులు మింగించిన పర్యవేక్షకులకు (డాట్ ప్రొవైడర్‌కు) రూ. వెయ్యి నుంచి రూ.5 వేల పారితోషికం అందిస్తున్నా రు. క్షయ వ్యాధిగ్రస్తులకు నెలవారీ వైద్య ఖర్చులకు నిక్షయ పోషణ యోజన ద్వారా రూ.500 చొప్పున అందజేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా క్షయతో బాధ పడుతున్న 1,743 మందికి గత ఏడాది ప్రతి నెలా రూ.500 చొప్పున రూ.4,19,7000 జమ చేశారు. ఆధునిక పరికరాలతో పరీక్షలు.. వ్యాధిని కచ్చితంగా నిర్ధారణ చేసే సీబీ నాట్ మెషీన్లు కాకినాడ జీజీహెచ్‌తో పాటు తాళ్లరేవు, పెద్దాపురం, పండూరుల్లోని ఆసుపత్రుల్లో ఏర్పాటు చేశారు. ఈ మెషీన్ హెచ్ఐవీ రోగులు, ఊపిరితిత్తుల వ్యాధులున్న వారు, చిన్న పిల్లలల్లో క్షయ, ఎండీఆర్ టీబీని గుర్తించడంలో కీలకంగా ఉంటుంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1,244 మంది క్షయ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. వీరికి నిక్షయ్ మిత్ర ద్వారా, దాతల సహకారంతో పోషకాహార కిట్లు అందజేసేలా చర్యలు చేపట్టారు. ఇందులో 673 మంది నమోదు చేసుకుని రోగులకు పౌష్టికాహారం అందజేస్తున్నారు. వీరిలో కొంతమంది కొందరు రోగులను దత్తత తీసుకుని, మరీ వారికి కావాల్సిన పౌష్టికాహార కిట్లు అందజేస్తూండటం విశేషం. క్షయ నిర్మూలనే లక్ష్యం జిల్లాను క్షయ రహితంగా చేయడ మే లక్ష్యంగా టీబీ రోగులకు చికిత్స అందిస్తున్నాం. అదే సమయంలో నివారణపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2030 నాటికి క్షయ ముక్త భారత్ లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ జె.నరసింహ నాయక్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, కాకినాడ. -
మాట్లాడుతూ.. పదాలతో తడబడుతున్నారా!? అయితే ఇలా చేయండి!
మాటలు ధారాళంగా మాట్లాడటం, పలకడం మనుషులకున్న గొప్ప వరం. ఈ పుడమిలో మరే జీవానికి ఈ అవకాశం లేదు. ఒకవేళ అవి గొంతు చీల్చుకుని అరిచినా, పదాలను మాత్రం పలకలేవు. కానీ మనం మాత్రం పలుకగలం. ఈ క్రమంలో కొందరు మాట్లాడటంలో, అక్షరాలు పలకడంలో ఎంతగానో తడబడుతుంటారు. నాలుక తిరగని పదాలతో లోలోనే సంకోచిస్తూంటారు. ఇకపై ఈ చిన్న ట్రిక్ వాడారో, ఇలాంటి సమస్యల నుంచి దూరం అవ్వడానికి అవకాశం ఉంది. మరదేంటో చూద్దాం! మాటలు సరిగ్గా రానివారి కోసం.. వసకొమ్ముని దంచి చూర్ణం చేసుకుని ఆ చూర్ణాన్ని ఒక పాత్రలో పోసి ఆ చూర్ణం నిండేవరకు ఉసిరికాయల రసం పోసి బాగా కలిపి రాత్రంతా నానబెట్టి తరువాత ఎండబెట్టాలి. బాగా ఎండిన తరువాత మళ్లీ దంచి మెత్తగా తయారు చేసుకుని ఆ చూర్ణాన్ని రోజూ పూటకు మూడు గ్రాముల మోతాదుగా ఒక చెంచా తేనె కలిపి రెండు పూటలా సేవిస్తూ ఉంటే మాటలు తడబడే వారికి, మాటలు ముద్దగా పలికేవారికి, ఆగి ఆగి మాట్లాడేవారికి ఆ సమస్యలు తొలగి మాటలు స్పష్టంగా వస్తాయి. • లేత మర్రి ఊడలు సాన పైన అరగదీసి ఆ గంధాన్ని నాలిక పైన రాస్తున్నా మాటలు త్వరగా వస్తాయి. క్షయరోగానికి.. క్షయ.. అదేనండీ.. టీబీతో ఇబ్బంది పడేవారు అశ్వగంధ పొడిని పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు బలం చేకూరటమే కాక శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. నిద్రలేమి కూడా తగ్గుతుంది. గొంతులో కఫం.. వామాకు, తులసాకు, తమలపాకుని రోజూ తింటూ ఉంటే గొంతులో కఫం తగ్గిపోతుంది. మెత్తగా దంచి జల్లించిన కరక్కాయ పొడిని తేనెలో రంగరించి రెండు పూటలా చప్పరించినా గొంతులో గరగర, శ్లేష్మం పడటం వంటి సమస్యలు తొలగిపోతాయి. ఇవి చదవండి: బచ్చలికూర ఎంత మేలో.. తెలిస్తే అస్సలు వదులుకోరు! -
క్షయ రోగులకు ‘అరబిందో’ సహాయం
సాక్షి, విశాఖపట్నం: క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా విశాఖ జిల్లా బాధితులకు సహాయం అందించేందుకు ప్రముఖ ఔషధ ఉత్పత్తుల సంస్థ అరబిందో ఫార్మా ఫౌండేషన్ ముందడుగు వేసింది. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 400 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు ఆరు నెలలపాటు పౌష్టికాహారం అందించేందుకు సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.16.80 లక్షలను విరాళంగా అందజేసింది. ఆరు నెలలపాటు 400 మంది రోగులకు ఫుడ్ బాస్కెట్లు అందజేసేందుకు జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, క్షయ నియంత్రణ విభాగానికి సంస్థ ఎండీ కె.నిత్యానందరెడ్డి తరఫున చెక్కును అరబిందో ఫార్మా ఫౌండేషన్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జునకు సోమవారం అందజేశారు. ఆరు నెలలపాటు ఒక్కో రోగికి పౌష్టికాహారం అందించేందుకు రూ.4,200 ఖర్చు చేసేందుకు వీలుగా ఈ సహాయం అందిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం అమలులో విశాఖపట్నం రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని కలెక్టర్ మల్లికార్జున వెల్లడించారు. -
రక్తం నోటితో పీల్చాలా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షు’ అన్న చందంగా మారింది.. ఆశ (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్–ఏఎస్హెచ్ఏ) కార్యకర్తల పరిస్థితి. చాలీచాలని వేతనాలతో గ్రామస్థాయిలో ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకుని, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారమందించే ఆరోగ్య వారధులు.. ఆశా కార్యకర్తలు. గర్భిణులకు మందులు అందించడం, ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవం అయ్యేలా చూడటం, పిల్లలకు టీకాలు వేయించడం తద్వారా మాతాశిశు మరణాలు తగ్గించడం వీరి ప్రధాన విధులు. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ ఆశ వర్కర్ల సంక్షేమంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. కరోనా వంటి ప్రాణాంతక వ్యాధుల గుర్తింపులోనూ వీరి సేవలు వినియోగించుకుంటున్న ప్రభుత్వం వారికి కనీస భద్రతా సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతోంది. ప్రస్తుతం హిమోగ్లోబిన్ పరీక్ష, క్షయ (టీబీ) వ్యాధిగ్రస్తుల నుంచి శాంపిల్స్ సేకరించే క్రమంలో తామెక్కడ వ్యాధుల బారిన పడతామోనని ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఇవి ల్యాబ్ టెక్నీషియన్ వంటి నిపుణులతో చేయించాలి్సన పనులను తూతూ మంత్రంగా శిక్షణ ఇప్పించి.. తమతో చేయించడం అన్యాయమని వాపోతున్నారు. 20 తెమడ శాంపిళ్లు మోసుకురావాలా? ఇదే క్రమంలో వీరికి అప్పగించిన మరో పని టీబీ నిర్ధారణ. గతంలో రెండువారాల పాటు రాత్రిళ్లు జ్వరంతో బాధపడుతూ.. నిర్విరామంగా దగ్గుతూ, బరువు తగ్గిన వారికి మాత్రమే ఉదయంపూట ఆశ కార్యకర్తలు తెమడ సేకరించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపేవారు. ► ఈ క్రమంలో వీరిలో నూటికి 99 శాతం పాజిటివ్ రేటు ఉండేది. కానీ, ప్రస్తుతం జిల్లా వైద్యాధికారులు టీబీ పరీక్షల శాంపిల్స్ సేకరణలో టార్గెట్ విధించారు. ప్రతీ సబ్సెంటర్కు ముగ్గురు లేదా నలుగురు (వెయ్యిమందికి ఒక ఆశ) కార్యకర్తలు ఉంటారు. ► వీరు తలా 20 తెమడ పరీక్షలు తేవాలని లక్ష్యం విధించారు. ఆ స్థాయిలో అనుమానిత కేసులు లేవని ఆశ కార్యకర్తలు నెత్తీనోరూ మొత్తుకుంటున్నా.. అధికారులు మాత్రం ససేమీరా అంటున్నారు. నెలనెలా నిర్వహించే రివ్యూ మీటింగుల్లో ఆశ కార్యకర్తలపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. ► ఈ క్రమంలో తెమడ శాంపిల్స్ ఉన్న డబ్బాలను తాము చేతులతో మోసుకుపోతున్నామని, వీటిని పట్టుకుని బస్సు, ఆటో ఏది ఎక్కినా.. భయంతో తోటి ప్రయాణికులు కిందకు దించేస్తున్నారని వాపోతున్నారు. ► వాస్తవానికి హిమోగ్లోబిన్, తెమడ పరీక్షలు రెండూ ఆశలకు కేటాయించిన విధులు కావు. వీటికి ప్రత్యేకంగా టీఏ, డీఏలు ఏమీ రావు. అయినా, వీరు తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఈ పనులు చేస్తున్నారు. ► క్షయ అంటువ్యాధి అని, సరైన రక్షణ లేకుండా రోగి వద్దకు వెళ్లినా, ఏమరుపాటుగా ఉన్నా.. తాము రోగాల బారిన పడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పనులతో భోజనం చేయలేకపోతున్నామని, తమతో కుటుంబ స భ్యులు ఏం వ్యాధులు సంక్రమిస్తాయో అని నిత్యం భయపడుతున్నారని అంటున్నారు. రక్తం నోటితో పీల్చాలా? ► ఫీవర్ సర్వే కోసం ఆశ కార్యకర్తలు ఇల్లిళ్లూ తిరిగి హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించాలి. ఇందుకోసం ప్రతీ ఆశకు వైద్యాధికారులు ఒక కిట్ ఇచ్చారు. దానిసాయంతో జ్వరంతో బాధపడుతున్న వారికి హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించాలి. ► కిట్‌లో డీఅయోనైజ్డ్ వాటర్, హైడ్రో క్లోరిక్ యాసిడ్ (హెచ్‌సీఎల్), పరీక్షనాళిక, హి మోగ్లోబినో మీటర్, పిప్పెట్, సూదులు, కాటన్ తదితరాలు ఉంటాయి. ఇందులో సూది సాయంతో రోగి వేలిపై పొడిచి ఆ రక్తాన్ని నేరుగా పిప్పిట్లోకి 20 మైక్రోలీటర్ మార్కు వచ్చేంత వరకు నోటితో పీల్చాలి. ► తరువాత ఈ రక్తాన్ని అంతే ఓపికతో హెచ్‌సీఎల్ కలిపిన ట్యూబ్‌లో నోటితో ఊదుతూ వదలాలి. దానికి డీ అయోనైజ్డ్ వాటర్ కలుపుతూ హిమోగ్లోబిన్ పరీక్ష నిర్వహిస్తారు. అయితే, ఇక్కడే ఆశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ► రోగి రక్తాన్ని పిప్పెట్లోకి ఎక్కించే క్రమంలో ఆ రక్తం నోటిలోకి వెళితే? అన్న ఆందోళన వీరిని వెంటాడుతోంది. ఎవరికి ఏ వ్యాధులు ఉన్నాయో? అవి తమకు ఎక్కడ సంక్రమిస్తాయో అని భయపడుతున్నారు. రెక్కాడితే గానీ, డొక్కాడని పేద బతుకులు తమవని, అలాంటి తమకు ఇలాంటి పనులు చెప్పడం తగదని అంటున్నారు. మా బతుకులకు రక్షణ ఏది వాస్తవానికి టీబీ, హిమోగ్లోబిన్ పరీక్షలు చేసే క్రమంలో ఎలాంటి రక్షణను వైద్యాధికారులు కల్పించడం లేదు. కనీసం అవసరాలైన మా స్కు, శానిటైజర్, గ్లోవ్స్, కళ్లద్దాలు లాంటి కనీస సదుపాయాలు లేవు. దీంతో ఎప్పుడు ఏ వ్యాధి బారిన పడతామోనని భయంభయంగా విధులు నిర్వహిస్తున్నాం. రక్తం నోట్లోకి వెళితే ఎలా? టీబీ అనుమానితుడి తెమడ ద్వారా వ్యాధి సంక్రమిస్తే ఎలా? అన్న భయంతో.. బిక్కుబిక్కుమంటూ విధులు ని ర్వహిస్తున్నాం. మా బతుకులకు రక్షణ లేదు. – మారెళ్ల శ్రీలత, ఆశా యూనియన్ కరీంనగర్ జిల్లా ప్రధానకార్యదర్శి -
టీబీ మహమ్మారిని తరిమి కొడదాం!
-
కరోనా సోకినవారు టీబీ పరీక్ష చేయించుకోండి
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా, టీబీ రోగులకు సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా సోకినవారు టీబీ పరీక్ష చేయించుకోవాలని సూచించింది. టీబీ రోగులంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలిపింది. కాగా, భారతీయ చిన్నారులు కీలకమైన కోవిడ్ టీకాను పొందలేకపోతున్నారనే వార్తలపై కేంద్ర ఆరోగ్యం శాఖ శనివారం స్పందించింది. అన్ని రాష్ట్రాలతో కోవిడ్ నెగిటివ్ ప్రభావాలను తగ్గించే చర్యలపై నిరంతరం చర్చిస్తున్నామని తెలిపింది. సార్వత్రిక టీకా కార్యక్రమంలో భాగంగా పిల్లలందరికీ టీకాలు అందిస్తామని భరోసా ఇచ్చింది. ప్రపంచంలో భారత్‌లోనే అత్యధికంగా టీకా పొందని పిల్లలున్నారని, వీరి సంఖ్య సుమారు 35 లక్షలని యూనిసెఫ్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం ఈ వివరణ ఇచ్చింది. కరోనా ఆరంభం నుంచి అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నామని వివరణ ఇచ్చింది. 2021 తొలి త్రైమాసికానికి దేశంలో 99 శాతం డీటీపీ3 కవరేజ్ చేశామని తెలిపింది. సార్వత్రిక టీకా ప్రోగ్రామ్‌లో భాగంగా అందరికీ టీకాలు తప్పక అందిస్తామని తెలిపింది. -
పెరుగుతున్న టీబీ కేసులు
ఆదిలాబాద్‌టౌన్: కేంద్ర ప్రభుత్వం 2025 నాటికి టీబీని నిర్మూలించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా వ్యాధిగ్రస్తులను నిర్ధారించేందుకు ప్రత్యేక సంచార వాహనంతో ఊరూరా తిరుగుతూ వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. జిల్లాలోని ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరిధిలో వారం రోజుల పాటు పరీక్షలు చేయగా వ్యాధిగ్రస్తులు బయటపడ్డారు. ఏడాదికి 1500 నుంచి 2వేల మందికి వ్యాధి సోకుతున్నట్లు వైద్యాశాఖాధికారులు చెబుతున్నారు. వ్యాధి సోకినవారు జనాలు హేలన చేస్తారనే భయంతో పరీక్షలు చేయించుకునేందుకు ముందుకురావడం లేదని తెలుస్తోంది. దీంతో టీబీ తగ్గుముఖం పట్టేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్య శాఖ వ్యాధిపై క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టకపోవడంతోనే పరీక్షలు చేయించుకునేందుకు ముందుకురావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 70 మందికి టీబీ నిర్ధారణ వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు హైదరాబాద్ నుంచి వచ్చిన సంచార వాహనం ద్వారా ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో టీబీ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 650 మంది పరీక్షలు చేయగా 70 మందికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. నార్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 5, దంతన్‌పల్లిలో 5, ఇంద్రవెల్లిలో 18, వాయిపేట్‌లో 15, తాంసిలో 7, భీంపూర్‌లో 5, సిరిచెల్మలో 10, ఆదిలాబాద్ పట్టణంలోని పుత్లీబౌళి, శాంతినగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 5గురు చొప్పున టీబీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కాగా జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, రెండు ఏరియా ఆస్పత్రులు, రిమ్స్ వైద్య కళాశాలలో సైతం టీబీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుమానితులు ఆయా పీహెచ్‌సీలకు వెళ్లి పరీక్షలు చేయించుకోకపోవడంతోనే వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. వ్యాధి నిర్ధారణ అయినవారికి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. అలాగే పౌష్టికాహారం కోసం నెలకు రూ.500 చొప్పున చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. విస్తరిస్తున్న వ్యాధి టీబీ (క్షయ) వ్యాధి విస్తరిస్తోంది. ఏటా దాదాపు 2వేల మంది వరకు వ్యాధి బారిన పడుతున్నారు. చికిత్స తీసుకోకుంటే మృత్యువాత పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. చాలా మంది అవగాహన లోపం, నిర్లక్ష్యం కారణంగా టీబీ టెస్టులు చేయించుకోవడానికి ముందుకు రావడంలేదు. టీబీ నిర్ధారణ అయిన తర్వాత క్రమం తప్పకుండా ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు మందులు వాడాల్సి ఉంటుంది. కొంతమంది నిర్లక్ష్యం చేసి మధ్యలో మందులు మానేయడంతో టీబీ ముదిరి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. సంవత్సరానికి 30 నుంచి 50 మంది వరకు మరణిస్తున్నారు. టీబీ వ్యాధి సోకిన వారికి వారానికి మించి దగ్గు తగ్గకపోవడం, రాత్రుల్లో జ్వరం ఉంటుంది. బరువు తగ్గడం, ఆకలి మందగిస్తుంది. ఇది అంటు వ్యాధి. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా టొబాకో, పొగాకు, అల్కాహాల్ తీసుకునే వారికి తీవ్రంగా సోకుతుంది. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి కావడంతో శ్వాసకోశ సంబంధిత సమస్య ఏర్పడుతుంది. దీంతో శరీరంలో వెంట్రుకలు, గోర్లు తప్పా అన్ని భాగాలకు విస్తరిస్తుంది. టీబీ సోకినవారు ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది. మందుల ద్వారా నయం అవుతుంది టీబీ అనేది ప్రాణాంతకమైన వ్యాధి కాదు. కాని కొంతమంది అపోహలతో పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావడంలేదు. వ్యాధి నిర్ధారణ అయితే మందుల ద్వారా నయం అవుతుంది. – ఈశ్వర్‌రాజ్, జిల్లా క్షయ నివారణ అధికారి -
మాయదారి మహమ్మారి
సాక్షి, హైదరాబాద్: కరోనా.. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న భయంకరమైన వైరస్.. దీని దెబ్బకు ప్రపంచమే చిగురుటాకులా వణుకుతోంది. రోజుకు 459 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రెండు నెలల్లోనే ప్రపంచంలోని టాప్ 10 భయంకర వ్యాధుల జాబితాలో కరోనా వైరస్ చేరిందంటే దీని ప్రతాపం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ ఆరో గ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాల ప్రకారం ఇప్పటివరకు క్షయ (టీబీ) అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. దీని దెబ్బకు రోజు భూమిపై 3014 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో హెపటైటిస్ (2430 మంది), న్యుమోనియా (2215 మంది), హెచ్ఐవీ (2110 మంది), మలేరియా (2002 మంది) నిలిచాయి. ఇందులో టీబీ, హెపటైటిస్, న్యుమోనియా లాంటి చాలా వ్యాధులు క్రీస్తు పూర్వం నుంచి ఉన్నవే. కానీ కరోనా (కోవిడ్–19) ఉనికి బయట పడిన రెండు నెలల్లోనే ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. ప్రస్తుతం ఈ వైరస్ ప్రపంచాని వణికిస్తున్న అతి భయంకరమైన వ్యాధుల్లో ఒకటిగా ఆవిర్భవించడం దీని తీవ్రతకు అద్దం పడుతోంది. వాటిని ఎప్పుడో దాటేసింది.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భయంకర వ్యాధుల్లో డెంగీ, ఆటలమ్మ, పొంగు, ఎబోలా, సార్స్, మెర్స్ వ్యాధులను కరోనా ఎప్పుడో దాటేసింది. వీటి వల్ల రోజుకు చనిపోతున్న వారి సంఖ్య రెండు నుంచి 50 మంది ఉండగా, కరోనా వల్ల రోజుకు ప్రపంచవ్యాప్తంగా సగటున 459 మంది మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 440 మందిని బలి తీసుకునే వూఫింగ్ కఫ్, 396 మందిని బలితీసుకున్న టైఫాయిడ్లను కూడా కరోనా దాటేయడం గమనార్హం. ఐరోపా, అమెరికా దేశాల్లో కరోనా జడలు విప్పింది. కానీ ఉష్ణ దేశాల్లో పరిస్థితి కాస్త ఆశాజనకంగానే ఉంది. మొదటి స్థానానికి ఎగబాకుతుందా..? జనవరి ఆఖరి వారంలో కరోనా వైరస్ కారణంగా మరణ మృదంగం మొదలైంది. రోజురోజుకు మరణాల సంఖ్య తీవ్రమవుతోంది. తొలివారంలో కేవలం 20 మరణాలు సంభవించాయి. ఈ వ్యాధి ప్రపంచదేశాలకు విస్తరించిన దరిమిలా కొన్ని దేశాల్లో రోజుకు 600 నుంచి 800 మందికి పైగా ప్రజల ప్రాణాలకు హరించేస్తోంది. ఇప్పటిదాకా ఈ కరోనా వైరస్ 35,349 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ కరోనా వైరస్ సాగిస్తున్న మరణ మృదంగం ఇలాగే కొనసాగితే త్వరలోనే అతి భయంకరమైన వ్యాధుల జాబితాలో మొదటి స్థానానికి ఎగబాకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ లోపు వ్యాధి నియంత్రణ, వ్యాక్సిన్ అందుబాటులోకివస్తే ఈ మరణాలకు అడ్డుకట్ట వేయొచ్చు. అందరం ఊపిరి పీల్చుకోవచ్చు. పలు వ్యాధుల వల్ల ప్రపంచవ్యాప్తంగా రోజువారీ మరణాలు.. -
ప్రేమ కోసమై పాక్‌ను వదిలి..
సాక్షి, హైదరాబాద్ : అతని పేరు షేక్ గుల్జార్ ఖాన్... పాకిస్తాన్‌కు చెందిన ఇతను దుబాయ్‌లో ఉండగా మిస్డ్‌కాల్ ద్వారా కర్నూలు జిల్లాకు చెందిన మహిళతో పరిచయం ఏర్పడింది. భర్తను కోల్పోయిన ఆమెతో గుల్జార్ ప్రేమలో పడ్డాడు. ఆమె కోసం సౌదీ మీదుగా నకిలీ గుర్తింపుతో భారత్‌కు వచ్చాడు. అనారోగ్యం పాలుకావడంతో మళ్లీ సొంత గడ్డపై మమకారం ఏర్పడటంతో కుటుంబంతో సహా అక్కడికి వెళ్లిపోవాలని భావించాడు. తన సోదరుడి సలహా మేరకు కర్తార్‌పూర్ కారిడార్ మార్గంలో వెళ్లాలని ప్రయతి్నంచాడు. హైదరాబాద్ చేరుకున్న అతడిని సీసీఎస్ అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గుల్జార్‌ను కోర్టు అనుమతితో పోలీసు కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 2004లో గడివేముల మహిళతో పరిచయం.. పాకిస్థాన్, పంజాబ్ ప్రావిన్స్‌లోని కుల్వాల్ ప్రాంతానికి చెందిన గుల్జార్ ఖాన్ ఆరి్థకంగా స్థితిమంతుడు. ఇతను 2004లో కొన్నాళ్ల పాటు దుబాయ్‌లో నివసించాడు. ఆ సమయంలో ఓ రోజు తనకు పొరపాటుగా వచి్చన మిస్డ్ కాల్‌కు స్పందించి కాల్ బ్యాక్ చేశాడు. ఈ కాల్‌ను కర్నూలు జిల్లా, గడివేములకు చెందిన దౌతల్‌బీ అందుకోవడంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. వివాహిత అయిన దౌతల్ భర్త అంతకు కొద్ది రోజుల ముందే అనారోగ్యంతో మృతి చెందాడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. దీంతో ఆమెను వివాహం చేసుకోవాలని భావించిన గుల్జార్ భారత్‌కు వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. సౌదీ వెళ్లి హజ్ పేరు చెప్పి.. పాకిస్థాన్ నుంచి నేరుగా భారత్ చేరుకోవడానికి ఇబ్బందులు ఉంటాయని భావించిన గుల్జార్ 2008లో సౌదీ వెళ్లాడు. అక్కడ తన పాకిస్తానీ గుర్తింపులను ధ్వంసం చేసిన అతను భారత ఎంబసీని ఆశ్రయించాడు. తాను హరిద్వార్ నుంచి హజ్ యాత్రకు వచ్చానని, పాస్‌పోర్ట్ సహా డాక్యుమెంట్లు పోయాయని ఫిర్యాదు చేశాడు. గుల్జార్‌కు ఎమర్జెన్సీ సర్టిఫికెట్ (ఈసీ) జారీ చేసిన అధికారులు విమానంలో ముంబైకి పంపారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన అతను దౌతల్‌బీని వెతుక్కుంటూ కర్నూలు మీదుగా గడివేముల చేరుకున్నాడు. ఆమెను వివాహం చేసుకున్న గుల్జార్ పెయింటర్‌గా అక్కడే స్థిరపడ్డాడు. తాను భారతీయుడినే అంటూ ఆధార్‌కార్డు, ఓటర్ ఐడీ తదితరాలను పొందాడు. ప్రస్తుతం గుల్జార్–దౌతల్ దంపతులకు నలుగురు సంతానం. అనారోగ్యానికి గురికావడంతో.. ఇన్నేళ్లు భార్యపిల్లలతో కలిసి గడివేములలో నివసించిన గుల్జార్‌కు ఇటీవల టీబీ వ్యాధి సోకింది. దీంతో పెయిటింగ్ పని చేయలేకపోతున్న అతను తన స్వదేశానికి వెళ్లిపోవాలని భావించాడు. ఈ నేపథ్యంలో తనతో పాటు భార్య, పిల్లలకు విజయవాడ పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి పాస్‌పోర్టులు తీసుకున్నాడు. పాక్‌తో పాటు దుబాయ్‌లో ఉన్న తన కుటుంబీకులతో సంప్రదింపులు జరిపాడు. భారత్ నుంచి పాస్‌పోర్ట్, వీసాతో పాకిస్తాన్‌కు వచ్చి ఉండిపోవడం కష్టమని, దీనికంటే పంజాబ్‌లో ఏర్పాటైన కర్తార్‌పూర్ కారిడార్ మీదుగా అడ్డదారిలో రావాలని సోదరుడు షాజీద్ సలహా ఇచ్చాడు. దీంతో ఢిల్లీ మీదుగా కర్తార్‌పూర్ వెళ్లేందుకు గత బుధవారం కర్నూలు నుంచి రైలులో హైదరాబాద్ చేరుకున్నాడు. అప్పటికే ఇతడి వ్యవహారాన్ని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. సికింద్రాబాద్‌లో పట్టుకున్న సిట్.. ఈ విషయంపై కేంద్ర నిఘా వర్గాలు హైదరాబాద్ సిట్ పోలీసులకు సమాచారం అందించడంతో అప్రమత్తమైన సిట్ ఏసీపీ బి.శ్రీనివాసరావు నేతృత్వంలో ఏఎస్సై ఎం.వెంకటేశ్వర్లు తదితరులతో కూడిన బృందం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద కాపుకాసింది. అల్ఫా హోటల్ వద్ద వీరిని అదుపులోకి తీసుకున్న అధికారులు కుటుంబాన్ని విడిచిపెట్టి గుల్జార్‌ను అరెస్టు చేశారు. అతడి నుంచి భారత్‌లో తీసుకుని గుర్తింపుకార్డులు, పాస్‌పోర్ట్ స్వాదీనం చేసుకున్నారు. నిందితుడిపై ఐపీసీతో పాటు పాస్‌పోర్ట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గుల్జార్ వ్యవహారాన్ని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని సిటీ పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. -
క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తిస్తే రూ.500 పారితోషికం
సాక్షి, నారాయణఖేడ్: కుష్టు, క్షయ(టీబీ) వ్యాధి మళ్లీ విజృంభిస్తోంది. గత ఏడాది పలువురిలో ఈ వ్యాధుల లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఈ రెండు వ్యాధులపై ఏకకాలంలో సర్వే నిర్వహించి నిర్మూలన చర్యలను చేపట్టాలని వైద్యశాఖ భావిస్తోంది. క్షయ, కుష్టు బాధితులు పెరుగుతుండడం ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఆ వ్యాధులకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించి నయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. క్షయ, కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించాలని కేంద్రం ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాచరణ ప్రారంభించింది. జిల్లా స్థాయిలో సూపర్వైజర్లు, పీహెచ్‌సీల స్థాయిలో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు వ్యాధిగ్రస్తుల గుర్తింపుపై శిక్షణ పొందారు. వారు ఈ నెల 26న ప్రారంభించిన సర్వే సెప్టెంబర్ 12 వరకు పల్లెలు, పట్టణాల్లో కొనసాగనుంది. కేంద్ర ప్రభుత్వం చొరవతో 2007 నుండి సర్వే కొనసాగిస్తున్నారు. తాజాగా మూడో విడత సర్వేపై వైద్యారోగ్య శాఖ సిబ్బంది దృష్టిసారించారు. కేసులు ఎక్కువగానే.. ప్రస్తుత కాలంలో కుష్టుతోపాటు క్షయ వ్యాధి రోగులు సైతం పెరుగుతున్నారు. వ్యాధి గాలిలోనే విస్తరించే అవకాశం ఉన్నందున బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ వ్యాధిపై నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు సైతం పోయే ప్రమాదం ఉంది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ వ్యాధి విస్తరించడంతో కుష్టు, క్షయ వ్యాధుల రోగుల సంఖ్యను పక్కాగా లెక్కించి చికిత్సలు అందించాలని వైద్యాధికారులు భావిస్తున్నారు. పరీక్షలు ఇలా.. వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బృందాలు ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను సేకరిస్తాయి. ఆశా కార్యకర్తలు మహిళలను, స్వచ్ఛంద పురుష కార్యకర్తలు పురుషులను పరీక్షిస్తారు. ఒకవేళ కుష్టు వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తే పీహెచ్‌సీకి పంపిస్తారు. క్షయవ్యాధి లక్షణాలపై ఆరా తీస్తారు. సాయంత్రం సమయంలో దగ్గు, జ్వరం వస్తుంటే వారి తెమడను తీసుకొని ఒక డబ్బాలో పొందుపరిచి క్షయ నియంత్రణ విభాగానికి పరీక్షల కోసం పంపిస్తారు. సీబీనాట్ పరికరంతో వ్యాధిని నిర్దారిస్తారు. జిల్లాలో 948 బృందాలు.. జిల్లాలో 948 బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో 15లక్షల మంది జనాభా ఉంది. 14లక్షల జనాభాకు అంటే 90శాతం మందిని సర్వే చేయాలనే లక్ష్యంగా వైద్యాధికారులు ఉన్నారు. రోజూ లక్ష మందిని పరిశీలించనున్నారు. సర్వే చేసేందుకు 948 మంది ఆశ కార్యకర్తలు, 243సబ్‌సెంటర్లకు సంబంధించి 243 ఏఎన్ఎంలు, 35మంది సూపర్వైజర్లు, 35మంది వైద్యాధికారులు సర్వేలో పాల్గొంటారు. నిత్యం పట్టణ ప్రాంతాల్లో 30 నివాసాలు, గ్రామీణ ప్రాంతాల్లో 26 ఇళ్లలో సర్వే చేస్తారు. రెండేళ్ల క్రితం సర్వే నిర్వహించి 45మంది కుష్టు రోగులను గుర్తించారు. గత ఏడాది 35మందిని గుర్తించగా ప్రస్తుతం కొనసాగుతున్న సర్వేలో ఇప్పటివరకు నలుగురు కుష్టు రోగులను గుర్తించారు. వ్యాధుల బారిన పడినవారిని గుర్తించి ప్రాథమిక దశలోనే చికిత్సలు అందజేస్తారు. క్షయబారిన పడిన రోగులకు 6 నెలలు, 12నెలల కోర్సుగా ఏడాది పొడవునా ఉచితంగా మందులను అందజేయనున్నారు. క్షయ వ్యాధిబారిన పడిన రోగులు వ్యాధి నయం అయ్యే వరకు మందులు వాడుతుంటే వారికి ప్రతీ నెలా రూ.500 చొప్పున పోషకహారం తీసుకునేందుకు పారితోషికం అందజేస్తాయనున్నట్లు జిల్లా లెప్రసీ ఉపగణాంక అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. కుష్టు లక్షణాలు ఇవీ.. చర్మ పాలిపోవడం, స్పర్శజ్ఞానం లేని మచ్చలు కాళ్లు, చేతులు, నరాల వాపు, నొప్పి, తిమ్మిర్లు ముఖంపై చెవి బయట నూనె పూసినట్లుగా ఉండడం కనుబొమ్మల వెంట్రుకలు రాలిపోతుండడం ముఖం, కాళ్లు, చేతులపై నొప్పి లేని బుడిపెలు కనురెప్పలు పూర్తిగా మూతపడకపోవడం చేతివేళ్లు స్పర్శ కోల్పోయి వంకర పోవడం క్షయ లక్షణాలు ఇవీ.. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం ఆకలి లేకపోవడం, పెరుగుదల లేకపోవడం మెడపై వాచి గ్రంథులు, గడ్డలు రావడం పరీక్షించి ఉచిత మందులు.. జిల్లాలో కుష్టు, క్షయ వ్యాధుల గుర్తింపు కార్యక్రమం కొనసాగుతోంది. 14రోజులపాటు ఈ సర్వే నిర్వహిస్తాం. రోగులను గుర్తించి పూర్తిస్థాయిలో చికిత్సలు అందజేస్తాం. లక్షణాలు ఉంటే పరీక్షించి ఉచితంగా మందులను అందజేస్తాం. క్షయవ్యాధి గ్రస్తులను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే వ్యాధిని వెంటనే నయం చేసుకునే వీలుంది. ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రైవేట్ వైద్యులు క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి ప్రభుత్వ ఆస్పత్రికి పంపిస్తే వారికి రూ.500 పారితోషికం అందజేస్తాం. ఆర్ఎంపీలు, విద్యావంతులు అవగాహన కల్పించి రోగులు చికిత్సలు పొందేలా చూడాలి. – డి.అరుణ, డీపీపీఎం జిల్లా కోఆర్డినేటర్ -
నేటినుంచి అసంక్రమిత వ్యాధులపై సర్వే
సాక్షి, పెద్దపల్లి: పూర్తిగా నిర్మూలించినట్లు భావిస్తున్న కుష్ఠు బయటపడుతోంది. నియంత్రిస్తున్నామనుకుంటున్న క్షయ విస్తరిస్తోంది. చికిత్సతో నయమయ్యే ఈ రెండు అంటువ్యాధులు పూర్తిగా నియంత్రించవచ్చు. నిర్మూళన కోసం ప్రత్యేక వ్యవస్థలు కృషి చేస్తున్నప్పటికీ.. కొత్త కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. ఏకకాలంలో ఈ రెండు వ్యాధులపై సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుంచి సెప్టెంబర్ 12వ తేదీ వరకు సర్వే చేపట్టడానికి శ్రీకారం చుడుతున్నారు. పక్షం రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తున్న ఈ ప్రక్రియకు కసరత్తు చేపట్టారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు పూర్తి ఆరోగ్యం తో ఉండాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతీ ఒక్కరి ఆరోగ్య వివరాలు నమోదు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా అసంక్రమిత వ్యాధులపై సర్వే నిర్వహించాలని నిర్ణయించిం ది. పెద్దపల్లి జిల్లాలో ఈనెల 26 నుంచి సర్వే ప్రారంభించనున్నారు. సెప్టెంబర్12వరకు కొనసాగనుంది. ప్రతీరోజు ఉదయం పూట 6.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ఏఎన్ఎంలు.. మగ వలంటీర్లు ఇంటింటా తిరిగి వివరాలు సేకరించనున్నారు. ఈ విషయమై ఇప్పటికే శిక్షణకూడా పూర్తి చేశారు. నెలకు 100కుపైగా క్షయ కేసులు ఇటీవల క్షయ కేసులు పెరుగుతున్నాయని వైద్యాధికారులు గుర్తించారు. జిల్లాలో ఇప్పటికే 1000కిపైగా క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. నెలకు 100కుపైగా కొత్తగా కేసులు నమోదవుతున్నాయి. గాలితోనే వచ్చే ఈ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. నిర్లక్ష్యం చేస్తే ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. కుష్ఠుతో పాటే క్షయ రోగుల సంఖ్య పక్కగా లెక్కతీస్తే చికిత్స అందించవచ్చన్నది వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ఆలోచన. జిల్లాలో 49 కుష్ఠు వ్యాధి కేసులు పెద్దపల్లి జిల్లాలో ప్రస్తుతం 49 కుష్ఠు వ్యాధి కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.ఇంకా అక్కడక్కడ కుష్ఠు వ్యాధి కేసులు ఉండచ్చేమోనని అధికారులు అనుమానిస్తున్నారు. శ్వాసతో వ్యాప్తిచెందడానికి ఆస్కారమున్న వ్యాధికి ప్రాథమికస్థాయిలో చికిత్స అందించకపోతే... శరీరంలో ముక్కు, కాలి, చేతి వేళ్లు కొరికేసినట్లు కరిగిపోతాయి. వైకల్యం ఏర్పడుతుంది. పుండ్లతో ఇబ్బందిగా మారుతుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకయ్యే వ్యాధిని నిలువరించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏకకాలంలో సర్వే చేపట్టాలని నిర్ణయించారు. సర్వేకు 1258 మంది.. కుష్ఠు, క్షయ రోగుల లెక్క తేల్చడానికి ఏకకాలంలో సర్వే చేపట్టడానికి ఒక ఆశా కార్యకర్త, మరో పురుషుడిని కార్యకర్తతో ఒక బృందంగా ఏర్పాటు చేశారు. ప్రతీ రోజూ వీరి పరిధిలోని 20నివాసాలు సందర్శించి, పిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు క్షుణ్ణంగా పరీక్షించి వివరాలు సేకరించాలి. జిల్లావ్యాప్తంగా సుమారు 8లక్షల జనాభా ఉండగా, ఇందులో 2లక్షల పైచిలుకు నివాసాలున్నాయి. రోజువారీగా పీహెచ్‌సీలకు అనుమానస్పద కేసుల వివరాల సమాచారాన్ని తెలియజేయాలి. జిల్లా వ్యాప్తంగా 514 మంది ఆశా కార్యకర్తలు ఉండగా, వారికి సహాయకులుగా మరో 514 మంది పురుషులను బృందాలుగా నియమించారు. వీ రిపై 230 ఏఎన్ఎంలు పర్యవేక్షణ చేపట్టనున్నా రు. సర్వే చేసే సిబ్బందికి ఒక్కోక్కరికి రూ.75 చొప్పున పారితోషికం అందించనున్నారు. ఇలా పరీక్షిస్తుంది బృందం సర్వే కోసం అధికారులు ఏర్పాటు చేసిన బృందం ఒక ఇంటికి వెళ్లాక కుటుంబ సభ్యుల వివరాలను సేకరిస్తారు.ఇప్పటికే కుటుంబసభ్యుల వివరాలు ఆరోగ్య కార్యకర్త వద్ద సిద్ధంగా ఉండడంతో వాటికి ఆధార్‌నంబర్లు జోడించాల్సిఉంది. ఆశా కార్యకర్త మహిళలను, స్వచ్ఛంద కార్యకర్త పురుషుల దేహంపై క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ఎక్కడన్నా మచ్చలున్నాయా అన్నది చూస్తారు. ఒకవేళ కుష్ఠి వ్యాధికి ప్రాథమిక లక్షణమైన తెల్లమచ్చలు వీపుపై ఉంటే తెలుసుకోవడం కష్టం. అందుకే నిశిత పరిశీలన చేస్తారు. మచ్చలు ఉన్నట్లు గుర్తిస్తే, వారి వివరాలను పీహెచ్‌సీకి అందజేస్తారు. వైద్యులు మరోసారి పరీక్షించిన తర్వాత నిర్ధారిస్తే చికిత్స ప్రారంభిస్తారు. ఇక ‘క్షయ’ వ్యాధి లక్షణాలపై ఆరా తీస్తారు. ఒకవేళ రెండు వారాలకు మించి దగ్గు, సాయంత్రం జ్వరంవంటి లక్షణాలు ఉంటే వారికి తెమడ తీయడానికి ఒక డబ్బా ఇస్తారు. ఆ డబ్బాలో సేకరించిన తెమడను క్షయ నియంత్రణ విభాగానికి చెందిన డీఎంసీల్లో పరీక్షలు చేపడుతారు.వ్యాధి నిర్ధారణ అయితే వైద్యుల సమక్షంలో చికిత్స ప్రారంభించే ప్రణాళిక రూపొందిస్తారు. సర్వేతో కొత్త కేసులు వెలుగులోకి వస్తాయి కుష్ఠు, క్షయ వ్యాధులపై ఏకకాలంలో సర్వే నిర్వహించడం ద్వారా కొత్త కేసులు వెలుగులోకి వస్తాయి. సోమవారం నుంచి సెప్టెంబర్ 12వ తేదీ వరకు సర్వే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సర్వే చేపట్టాల్సిన తీరుపై సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చాం. సర్వే బృందాలకు ప్రజలు సహకరించాలి. – డాక్టర్ ప్రమోద్‌కుమార్, డీఎంహెచ్ఓ, పెద్దపల్లి -
టీబీ @ టీనేజ్
సాక్షి, హైదరాబాద్ : టీనేజ్ యువతపై టీబీ పంజా విసురుతోంది. రాష్ట్రంలో ట్యూబరిక్లోసిస్(టీబీ) చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న హెచ్ఐవీ బాధితులు, చిన్నారుల్లోనే కాదు, టీనేజీ అమ్మాయిల్లోనూ ఇది వెలుగుచూస్తోంది. జనసమూహం ఎక్కువగా ఉన్న హాస్టళ్లలో ఉండటం, సరైన వ్యాయామం లేకపోవడం, పోటీ పరీక్షల పేరుతో పెరుగుతున్న ఒత్తిడికి తోడు ఆశించినస్థాయిలో పౌష్టికాహారం అందకపోవడంతో రోగ నిరోధకశక్తి తగ్గుతోంది. మరి కొంతమంది ఉదయం పూట ఏమీ తినకుండానే ఖాళీ కడుపుతో కాలేజీకి బయలుదేరి, మధ్యాహ్నం క్యాంటీన్లో రెడీమేడ్ ఫుడ్‌తో కడుపు నింపుకోవడం ద్వారా పౌష్టికాహారలోపం ఏర్పడుతోంది. దీంతో చాలామంది టీబీ బారిన పడుతున్నారు. బంధువర్గాల్లో తెలిస్తే వివాహ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని భావించి, గుట్టుగా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయిస్తున్నారు. రోగుల వివరాల నమోదుకు ప్రైవేటు ఆసుపత్రులు సహకరించడంలేదు. క్షయవ్యాధి బారిన పడ్డవారు ఒకట్రెండు నెలలపాటు మందులు వాడి ఆ తరవాత వైద్యఖర్చులకు భయపడి మందులు వాడ కుండా మానేస్తున్నారు. వ్యాధి మరింత ముదిరిపోయి, ఇతరులకు సులభంగా వ్యాపిస్తోంది. నగరంలోని ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రికి ఇటీవల ఈ తరహా కేసులు ఎక్కువగా వస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రేటర్లో విస్తరిస్తున్న వైనం నగరాన్ని ఓవైపు స్వైన్‌ఫ్లూ, డెంగీ, మలేరియా వంటి వ్యాధులు వణికిస్తుండగా ఇప్పుడు ఆ స్థానాన్ని ట్యూబరిక్లోసిస్(టీబీ) ఆక్రమించింది. టీబీ సంబంధ సమస్యతో బాధపడుతూ ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రికి చేరుకుంటున్న రోగులసంఖ్య గత మూడేళ్లతో పోలిస్తే మూడింతలు పెరిగింది. 2015లో ఆస్పత్రికి చికిత్స కోసం 80 వేలమంది రాగా, 2018లో 1.72 లక్షల మంది చేరుకోవడమే ఇందుకు నిదర్శనం. వీరిలో 20 శాతానికి మించి టీనేజీ యువత ఉన్నారు. దేశంలో ఏటా మూడు లక్షల మంది ప్రజలు టీబీతో చనిపోతున్నారు. ప్రతిరోగి తను చనిపోయే ముందు మరో 15 మందికి వ్యాపింపజేస్తున్నాడు. టీబీ సోకిన వ్యక్తి మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు బ్యాక్టీరియా వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఇలా ఒకసారి బయటికి వచ్చిన బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తుంది. గోర్లు, వెంట్రుకలకు మినహా శరీరంలోని అన్ని అవయవాలకు టీబీ సోకుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లక్షణాలు గుర్తించవచ్చు ఇలా.. సాయంత్రం, రాత్రిపూట తరచూ జ్వరం రావడం, రాత్రిపూట చెమటలు పట్టడం. ఆకలి, బరువు తగ్గడం, నీరసంగా, ఆయాసం, ఛాతీలో నొప్పి ఉంటుంది. తెమడ పరీక్ష ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారు. ఆరు నుంచి తొమ్మిది మాసాలపాటు మందులు వాడాలి. బహిరంగ ప్రదేశాల్లో తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతి రుమాలు వాడాలి. బలవర్థకమైన ప్రొటీన్ల(గుడ్లు, పప్పు, పాలు)తో కూడిన ఆహారం తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత, సాంఘిక స్పృహ కలిగి ఉండాలి. పౌష్టికాహారం, వ్యాయామం అవసరం సాధారణంగా ప్రతి మనిషిలోనూ టీబీ లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో త్వరగా బయటపడుతుంటాయి. అబ్బాయిలతో పోలిస్తే టీనేజీ అమ్మాయిల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. పౌష్టికాహారం తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రతను మెరుగుపర్చుకోవడం, వ్యామాయం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగు పర్చుకుని వ్యాధిభారినపడకుండా చూసుకోవచ్చు. - డాక్టర్ రఫీ, ఫల్మొనాలజిస్ట్, కేర్ హాస్పిటల్ -
ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో దారుణం
-
‘ఎమ్‌డీఆర్ టీబీ’ అంటే ఏమిటి?
మా నాన్నగారు ఎక్కువగా పొగతాగుతుంటారు. ఆయనకు ఊపిరితిత్తుల క్షయ వచ్చింది. అయితే చికిత్స విషయంలో కాస్తంత నిర్లక్ష్యం వహించారు. కొంతకాలం మందులు తీసుకోవడం, ఆ తర్వాత ఆపేయడం.... ఇలా చేశారు. ఇప్పుడు ఆయనకు మళ్లీ టీబీ వచ్చింది. డాక్టర్లు చూసి దాన్ని ‘ఎమ్‌డీఆర్ టీబీ’ అంటున్నారు. అంటే ఏమిటి? ఇప్పుడు మేమేం చేయాలి. మాకు తగిన సలహా ఇవ్వగలరు. మన శరీరంలో టీబీ వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా (ట్యూబర్క్యులోసిస్ బాసిల్లస్) ప్రవేశించినప్పుడు కొన్ని అత్యంత సూక్ష్మజీవులను నిర్మూలించే శక్తిమంతమైన మందులైన ఐసోనియాజైడ్, రిఫాంపిసిన్ వంటి వాటితో చికిత్స చేస్తుంటాం. ఇలా ఆర్నెల్ల పాటు డాక్టర్ల ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా ఈ మందుల పూర్తి కోర్సును తీసుకుంటేనే టీబీ పూర్తిగా తగ్గుతుంది. అంతేగాని ఒకవేళ ఈ మందులను నిర్లక్ష్యంగా వాడినా లేదా తగిన మోతాదులో వాడకపోయినా, లేదా కొంతకాలం వాడాక లక్షణాలు తగ్గగానే మళ్లీ ఆపేసినా, లేదా మందులను సరిగా నిల్వ చేయకపోయినా... వ్యాధిని కలిగించే సూక్ష్మక్రిములు ఆ మందులకు లొంగని విధంగా తయారవుతాయి. అత్యంత శక్తిమంతమైన ఆ టీబీ మందుల పట్ల తమ నిరోధకత స్థాయిని పెంచుకుంటాయి. దాంతో అవి తమ శక్తిని పెంచుకోవడమే కాదు... ఇతర ఆరోగ్యవంతులైన వ్యక్తులకూ వ్యాపించే విధంగా తయారవుతాయి.ఒక వ్యక్తిలోని టీబీ వ్యాధి మందులకు లొంగని విధంగా తయారయ్యిందా అని నిర్ధారణ చేయడానికి కొన్ని ల్యాబరేటరీ పరీక్షలు అవసరమవుతాయి. ఆ పరీక్షల ద్వారా మందులకు లొంగని విధంగా వ్యాధి తయారయ్యింది. ఈ పరీక్షల్లో మాలెక్యులార్ బేస్డ్ అనీ, కల్చర్ బేస్డ్ అనీ రకాలున్నాయి. మాలెక్యులార్ బెస్డ్ పరీక్షల ద్వారా కేవలం కొద్ది గంటల్లోనే ఫలితాలు వెల్లడవుతాయి. ఇలా ఒక టీబీ వ్యాధి సాధారణ స్థాయి నుంచి మందులకు లొంగని విధంగా నిరోధకత పెంచుకుందని తెలియగానే, రెండోశ్రేణి మందులను (సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్) వాడటం మందుపెట్టాలి. ఇందులో నాలుగు లేదా అంతకుమంచి మందులుంటాయి. వాటిని కనీసం ఆర్నెల్ల పాటు క్రమం తప్పకుండా వాడాలి. ఒక్కోసారి రిఫాంపిన్ మందుకు సూక్ష్మక్రిమి నిరోధకత పెంచుకుందని తెలిసినప్పుడు ఈ చికిత్సా కాలాన్ని 18 – 24 నెలలకూ పొడిగించాల్సి రావచ్చుకూడా. ఈ రెండో శ్రేణి మందులు కాస్త ఖరీదైనవి, విషపూరితమైనవి కాబట్టి... మొదటిసారే పూర్తిగా తగ్గేలా జాగ్రత్త తీసుకోవడం అన్నివిధాలా మంచిది. ఇక రెండో శ్రేణి మందులు వాడే చికిత్సలో వ్యాధి పూర్తిగా తగ్గే పాళ్లు 70 శాతం వరకు ఉంటాయి. సిలికోసిస్‌కు చికిత్స ఏమిటి? నా వయసు 57 ఏళ్లు. నేను గత 30 ఏళ్లకు పైబడి నిర్మాణరంగం (కన్స్ట్రక్షన్ ఫీల్డ్)లో పనిచేశాను. గత మూడేళ్లుగా విపరీతమైన పొడి దగ్గు వస్తోంది. ఊపిరితీసుకోవడం కూడా కష్టంగా ఉంది. డాక్టర్లను సంప్రదిస్తే నేను ‘సిలికోసిస్’ సమస్యతో బాధపడుతున్నానని అన్నారు. ‘సిలికోసిస్’ అంటే ఏమిటి? దీనికి చికిత్స ఏమిటో వివరించగలరు. మీ శ్వాసక్రియ సాగుతున్న క్రమంలో సుదీర్ఘకాలం పాటు సన్నటి ఇసుక మీ ఊపిరితిత్తుల్లో ప్రవేశించడం వల్ల కలిగే దుష్పరిణామాలకు సంబంధించిన వ్యాధి పేరే ‘సిలికోసిస్’. సాధారణంగా నిర్మాణరంగంలో పనిచేసేవారు లేదా ఇసుక, రాతిని పొడి చేయడం వంటి క్వారీ రంగం, క్వార్ట్జ్ వంటి ఖనిజాలను వెలికితీసే రంగంలో పనిచేసేవారిలో సన్నటి ఇసుకపొడి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. ఈ ఇసుక లేదా సన్నటి రాతిపొడి చాలాకాలం పాటు ఊపిరితిత్తులోకి పోవడం వల్ల అవి దెబ్బతిని శ్వాస తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది. సిలికోసిస్లో మూడు రకాలు ఉన్నాయి. అవి... క్రానిక్ సిలికోసిస్: ఇది సాధారణంగా నిర్మాణరంగం లేదా రాతిపొడికి ఎక్స్పోజ్ అయ్యేచోట పదేళ్లకు పైగా పనిచేయడం వల్ల కాస్త తక్కువ మోతాదులో ఇసుక స్ఫటికాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం వల్ల వచ్చే వ్యాధి ఇది. యాక్సిలరేటెడ్ సిలికోసిస్: సాధారణంగా 5 నుంచి 10 ఏళ్ల వ్యవధిలోనే ఎక్కువ మొత్తంలో ఇసుక స్ఫటికాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం వల్ల వచ్చే వ్యాధి ఇది. అక్యూట్ సిలికోసిస్: కేవలం కొన్ని వారాలు లేదా నెలల వ్యవధిలోనే పెద్దమొత్తంలో ఊపిరితిత్తుల్లోకి ఇసుక, దాని స్ఫటికాలు ప్రవేశించడం వల్ల లక్షణాలు బయటపడి, ఒక్కోసారి నెలల వ్యవధిలోనే ప్రాణాంతకంగా మారిపోయే కండిషన్ ఇది. నిర్మాణరంగాల్లోగానీ లేదా డ్రిల్లింగ్, మైనింగ్ వంటి రంగాల్లో పనిచేసేవారిలో ఊపిరి తీసుకోవడం కష్టం కావడం, తీవ్రమైన దగ్గు, నీరసం, జ్వరం, బరువుతగ్గడం, ఛాతీలో నొప్పి వంటి లక్షణాలతో సిలికోసిస్ బయటపడుతుంది. క్రమేపీ లక్షణాల తీవ్రత పెరుగుతుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన చికిత్స లేనప్పటికీ మీరు మీకు సమీపంలోని పల్మునాలజిస్ట్‌ను సంప్రదించి వారు సూచించిన బ్రాంకోడయలేటర్స్ లేదా ఆక్సిజన్ ఇవ్వడం ద్వారా లక్షణాలనుంచి సాంత్వన పొందవచ్చు. ఇక దీని కారణంగా వచ్చే శ్వాససంబంధమైన ఇన్ఫెక్షన్లకు డాక్టర్లు చికిత్స అందిస్తారు. మీకు పొగతాగే అలవాటు ఉంటే తక్షణం ఆపివేసి, శుభ్రమైన గాలి వచ్చే ప్రాంతంలోకి మారిపోయి, డాక్టర్ సూచనలు పాటిస్తూ వ్యాధి లక్షణాల నుంచి ఉపశమనం పొందండి. రుతు సమయంలో శ్వాస సరిగా ఆడటం లేదు... ఎందుకు? నా వయసు 36 ఏళ్లు. గృహిణిని. నాకు రుతుసమయంలో శ్వాస అందదు. ఆ సమయంలో దగ్గు, పిల్లికూతలు కూడా వస్తుంటాయి. ఇలా రావడానికి కారణాలు ఏమిటి? రుతుసమయం కూడా ఒక కీలకమైన దశ. ఆ సమయంలో మీ భౌతిక, మానసిక, ప్రవర్తనల్లో ఎన్నో మార్పులు కనిపించవచ్చు. రుతుక్రమం మహిళల ఆరోగ్యం విషయంలో కీలక భూమిక పోషిస్తుంటుంది. తద్వారా అటు శరీరక, ఇటు మానసిక సమస్యలకు అది దారితీయవచ్చు.కెటామెనియల్ ఆస్తమాను రుతుక్రమం ముందు వచ్చే ఆస్తమా (ప్రీమెనుస్ట్రువల్ ఆస్తమా)గా కూడా పరిగణించవచ్చు. ఈ సమయంలో మహిళల్లో ఆస్తమా లక్షణాలు తీవ్రమవుతాయి. రుతుక్రమానికి ముందుగా చాలామంది మహిళల్లో ఆస్తమా ఎక్కువ కావడం, ఆసుపత్రిలో చేరాల్సిరావడం వంటి సందర్భాలూ ఉన్నాయి.పీరియడ్స్‌కు ముందు శ్వాస అస్సలు అందకపోవడం వల్ల ఈ పరిణామాలు సంభవిస్తాయి. దీనికి నిర్దిష్టమైన కారణాలు తెలియకపోయినా సాధారణంగా ప్రోజెస్టెరాన్ లేదా ప్రోస్టాగ్లాండిన్స్ వంటి హార్మోన్లలోని మార్పులు ఇందుకు దారితీస్తాయని కొంతవరకు ఊహించవచ్చు.ఇక అండం రూపుదిద్దుకునే దశలో ప్రోజెస్టెరాజ్ పాళ్లు క్రమంగా పెరుగుతాయి. ఆ తర్వాత పీరియడ్స్‌కు ముందు ఇవే పాళ్లు గణనీయంగా పడిపోతాయి. మహిళల్లో కండరాలు రిలాక్స్ కావడానికి తోడ్పడే స్రావాలు సైతం ఊపిరితిత్తుల్లోని గాలి ప్రయాణించే పైప్‌లనూ ప్రభావితం చేస్తాయి. ప్రోజెస్టెరాన్ పెరగడం వల్ల కలిగే మార్పులు శ్వాస అందనివ్వకుండా చేసి, ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అలాగే రుతుక్రమానికి ముందుగా వ్యాధినిరోధకత విషయంలో వచ్చే మార్పులు కూడా ఆస్తమాను ప్రేరేపించవచ్చు. అందుకే... రుతుక్రమం సమయంలో ఆస్తమా కనిపిస్తే దానికి నిర్దిష్టమైన కారణమేమిటన్నది నిశితంగా నిర్ధారణ చేయడం చాలా అవసరం.ఇక మీకు ఏ అంశం ఆస్తమాను పేరేపిస్తుందో నిశితంగా తెలుసుకొని, దానికి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు ఒకసారి మీకు దగ్గర్లోని పల్మునాలజిస్ట్‌ను కలవండి. డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
చనిపోయాడా..? చంపేసిందా..?
అయ్యా.. గణేషా...! నువ్వంతట నువ్వే చనిపోయావా...? పెద్దాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం చంపేసిందా...? వీల్ చైర్లో బయల్దేరిన నువ్వు.. మధ్యలోనే విగతుడిగా పడిపోయావెందుకు..? నీ చైర్‌ను నెట్టుకుంటూ వచ్చినోళ్లే్లమయ్యారు..? ఈ ప్రశ్నలేవీ వినపడనంత దూర తీరానికి ఆ గణేషుడు శవమై వెళ్లిపోయాడు. మన పెద్దాసుపత్రిలో ఈ గణేషుడిలాగే మరో రాముడో.. రహీమో... దిక్కూమొక్కూ లేకుండా చావకూడదనుకుంటే... పై ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కావాల్సిందే...!!! ఖమ్మంవైద్యవిభాగం: నగరంలోని జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రిలో బుధవారం ఓ టీబీ వ్యాధిగ్రస్తుడు ఆకస్మికంగా మృతిచెందాడు. మృతదేహం ఎక్కడుందో తెలుసా...? ఆస్పత్రిలోని మాతాశిశు సంరక్షణ కేంద్రం ఎదురుగాగల ఖాళీ ప్రదేశంలో...! అతడి మృతదేహం అక్కడ ఎందుకుంది..? శవమే నడుచుకుంటూనో, ఎగురుకుంటూనో వెళ్లిందా..?! అసలేం జరిగిందో చూద్దాం. మంగళవారం రోజున... అది, నగరంలోని జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రి. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నగరంలోని రేవతి సెంటర్‌కు చెందిన ఎల్.గణేష్(45)ను ఆయన భార్య రమ, మంగళవారం ఈ ఆసుపత్రికి తీసుకొచ్చింది. క్యాజువాల్టీలో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అతడికి క్షయ (టీబీ) వ్యాధి సోకినట్టుగా గుర్తించారు. ఆ వెంటనే టీబీ వార్డుకు తరలించారు. అక్కడ వైద్య సేవలు సాగుతున్నాయి. బుధవారం రోజున... టీబీ డాక్టర్ వచ్చారు. గణేష్‌ను పరీక్షించారు. కొన్ని పరీక్షల కోసం క్యాజువాల్టీకి తీసుకెళ్లాలని అక్కడున్న సిబ్బందితో చెప్పారు. అతడిని వీల్ చైర్లో సిబ్బంది తీసుకెళ్లారు. కానీ, టీబీ వార్డుకు గణేష్ చేరుకోలేదు..! మార్గమధ్యలో ‘మాయమయ్యాడు’..!! తమ మనిషి అటు టీబీ వార్డులోనూ, ఇటు క్యాజువాల్టీలోనూ లేకపోవడంతో అతడి కుటుంబీకులు, బంధువులు కలవరపడ్డారు. అటూఇటూ చూస్తుండగానే.. టీబీ వార్డుకు, క్యాజువాల్టీకి మధ్యలోగల మాతాశిశు సంరక్షణ కేంద్రం ఎదురుగాగల ఖాళీ ప్రదేశంలో నిశ్చలంగా పడిపోయిన గణేష్ కనిపించాడు. అక్కడున్న, అటుగా తిరుగాడుతున్న రోగులు, సహాయకులు కూడా అప్పుడే గమనించారు. అందరూ ఒకేసారి గుమిగూడారు. ఆందోళన... ‘‘రోగిని ఇలా పడేస్తారా..?’’ అంటూ, వారంతా తీవ్రస్థాయిలో ఆగ్రహోదగ్రులయ్యారు. గణేష్ కుటుంబీకులతో కలిసి ఆందోళనకు దిగారు. అతడు ఇంకా బతికే ఉన్నాడని వారంతా అనుకున్నారు. కానీ, అప్పటికే అతడి ప్రాణాలు పోయాయని తెలుసుకున్న కుటుంబీకులు బిగ్గరగా రోదించారు. ఇక్కడికెలా వచ్చాడు...? ఈ ప్రశ్నకు ఆస్పత్రి అధికారుల నుంచిగానీ, సిబ్బంది నుంచిగానీ సూటిగా సమాధానం రావడం లేదు. వైద్య నారాయణులే ప్రాణ భిక్ష పెడతారన్న గంపెడాశతో ఇక్కడికొచ్చిన ఈ గణేషుడికి ఇంత దిక్కులేని చావు ఎందుకు దాపురించింది..? వీల్ చైర్లో బయల్దేరిన అతడు... ఉంటే, క్యాజువాల్టీలోనైనా ఉండాలి. లేదంటే, వీల్ చైర్లోనే ఉండాలి. అక్కడా, ఇక్కడా కాకుండా... ఈ ఖాళీ ప్రదేశంలో ఎందుకు ఉన్నట్టు..? తనంతట తానే వీల్ చైర్‌ను వదిలేసి, సిబ్బందిని కాదని ఇక్కడికి పరుగెత్తుకుంటూనో, నడుచుకుంటూనో వచ్చాడా..? వీల్ చైర్లో తీసుకెళ్లిందెవరు..? వాళ్లు ఏమయ్యారు..? వీల్ చైర్లో తీసుకెళ్లలేక ఇక్కడ పడేశారా...? ఇదిగో... ఆందోళనకారుల్లో ఇన్ని ప్రశ్నలు. వీటికి జవాబులేవి..? అప్పటికే పోయాడు... ఆ ఖాళీ ప్రదేశంలో ఆందోళన విషయం తెలుసుకున్న వెంటనే ఆర్ఎంఓ డాక్టర్ కృప ఉషశ్రీ,, ఔట్‌పోస్ట్ పోలీసులు వచ్చారు. ఆందోళనకారులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. అక్కడి నుంచి గణేష్‌ను వెంటనే క్యాజువాల్టీకి తీసుకెళ్లారు. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్టుగా వైద్యులు గుర్తించారు. టూటౌన్ పోలీసులు విచారణ జరిపారు. చర్యలు తీసుకుంటాం... ఈ మొత్తం వ్యవహారంపై ఆర్ఎంఓ డాక్టర్ కృప ఉషశ్రీ,ని ‘సాక్షి’ వివరణ కోరింది. ‘‘దీనిపై, పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. వైద్య సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిని ఉపేక్షించం’’ అన్నారు. ష్.. సైలెన్స్...! గణేష్ ఎలా చనిపోయాడు..? అతడంత అతడే చనిపోయాడా..? సిబ్బంది నిర్లక్ష్యం చంపేసిందా...? ష్.. సైలెన్స్..! -
2025 నాటికి టీబీ లేని ఇండియాగా మార్చండి
సాక్షి, హైదరాబాద్: దేశాన్ని 2025 నాటికి టీబీ లేని ఇండియాగా తీర్చిదిద్దాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పిలుపునిచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన టీబీ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ‘టీబీ సీల్ సేల్’ప్రచార కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షయ ఎంతో ప్రమాదకరమైన వ్యాధి అని న్నారు. టీబీ ఎందుకు వస్తుందో కచ్చితంగా చెప్పే పరిస్థితి లేదన్నారు. కాబట్టి దీనిపై విస్తృ్తతమైన పరిశోధనలు జరపాలని వైద్యులను కోరారు. ఒక్కోసారి సాధారణ ఎక్స్‌రేతో క్షయను గుర్తించలేమని, అందుకోసం ఎంఆర్ఐ కూడా చేయాల్సి వస్తుందన్నారు. క్షయ రోగి నిత్యం మందులు వాడాలని, బలవర్థకమైన పోషక పదార్థాలు తీసుకోవాలని సూచించారు. గ్రామా ల్లోనే కాకుండా పట్టణాల్లోనూ టీబీ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. గ్రామసభలు పెట్టి ప్రజ ల్లో చైతన్యం పెంచాలని కోరారు. పలువురికి అవార్డులు.. తెలుగు రాష్ట్రాల్లో టీబీ సీల్స్‌ను పెద్ద ఎత్తున విక్రయించిన సంస్థలు, వ్యక్తులకు గవర్నర్ అవార్డులు అందజేశారు. మొదటి ఉత్తమ బహుమతిని గుంటూ రు జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ అరుణ్‌కుమార్ క్రాంతి మహం తికి గవర్నర్ అందజేశారు. రెండో ఉత్తమ బహుమతి మహబూబ్‌నగర్ జిల్లా టీబీ అసోసియేషన్‌కు దక్కింది. ఈ బహుమతిని ఆ జిల్లాకు చెందిన ప్రతినిధికి అందజేశారు. విశాఖపట్నానికి చెందిన కేజియా మహంతికి కూడా అవార్డును ప్రదానం చేశారు. ప్రజాస్వామ్యంలో చర్చలే ప్రధానం ప్రజాస్వామ్యంలో వాదనలు, చర్చలు, నిర్ణయాలు ముఖ్యమైనవని గవర్నర్ నరసింహన్ అన్నారు. పార్లమెంటరీ వ్యవస్థపై శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన శ్రీలంక అధికారుల బృందం.. బుధవారం నియానాగే మామని జయవర్దనే నేతృత్వంలో గవర్నర్‌తో ప్రత్యేక భేటీ అయింది. వీరికి తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు స్వాగతం పలికారు. -
‘నా ఈ పరిస్థితికి కారణం సల్మాన్’
‘నాకు బట్టల దగ్గర నుంచి సబ్బుల వరకూ.. మందులు, ఆహారం అన్నింటిని సమకూర్చి.. నేను పూర్తి ఆరోగ్యంగా మారాడానికి అతని ఫౌండేషన్ ఎంతో సహకరించింది. ఈ రోజు నేను బతికి ఉన్నానంటే అందుకు కారణం ఆయనే’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు పూజా దద్వాల్. ఇది చదివాకా ఈ పేరు ఎక్కడో విన్నట్లు అనిపిస్తోంది కదా. అవును.. కొన్ని నెలల క్రితం ‘అనారోగ్యం పాలైన సల్మాన్ హీరోయిన్.. ఆదుకునే వారు లేరు’ అంటూ వార్తలు వచ్చింది ఈ నటి గురించే. టీబీతో బాధపడుతున్న పూజా దద్వాల్ తన అనారోగ్యం గురించి ఆర్ధిక పరిస్థితుల గురించి ఓ జాతీయా మీడియా సంస్థతో మాట్లాడుతూ, సల్మాన్ ఖాన్‌ను సాయం చేయాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న సల్లుభాయ్ ఆమెకు సాయం చేస్తానని మాట ఇవ్వడమే కాక.. తన ఫౌండేషన్ వారికి ఆమె గురించి చెప్పాడు. సల్మాన్ ఆదేశాలు మేరకు ఈ ఫౌండేషన్ పూజాకు అవసరమైన సాయం చేసి ఆమె తిరిగి కోలుకునేలా సహకరించారు. ఐదు నెలల తర్వాత ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అయ్యారు పూజా. ఈ సందర్భంగా పూజా ఒక ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నేను ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. ఈ వ్యాధి గురించి తెలిసినప్పుడు ఖచ్చితంగా నేను మరణిస్తాననే అనుకున్నాను. ఎందుకంటే నా ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా నన్ను దూరం పెట్టారు. చేతిలో చిల్లిగవ్వ లేదు. పట్టించుకునే వారు లేరు. ఆ సమయంలో నేను చాలా నిరాశకు గురయ్యాను. కానీ నేను దీన్ని ఇంతటితో ముగించాలని అనుకోలేదు. ఈ వ్యాధితో పోరాటం చేయాలనుకున్నాను. అందుకే ఆ సమయంలో సల్మాన్‌ని సాయం కోరాను. నా పరిస్థితి గురించి తెలుసుకుని ఆయన చాలా బాధపడ్డారు. తక్షణమే ఆయన ఫౌండేషన్‌కి చెప్పి నాకు కావాలసినవన్ని సమకూర్చారు. మందులు, ఆహారం, బట్టలు ప్రతీది. ఈ రోజు నేను బతికున్ననంటే అందుకు కారణం సల్మాన్. ఆయన చేసిన మేలును ఎన్నటికి మరవలేను’ అంటూ సల్లుభాయ్కి కృతజ్ఞతలు తెలిపారు. సల్మాన్ హీరోగా 90ల్లో వచ్చిన 'వీర్‌గాటి' చిత్రంలో నటించిన పూజా దద్వాల్ టీబీ వ్యాధి బారిన పడి వైద్యం చేయించుకోవడానికి డబ్బుల్లేని స్థితిలో ఉన్నానంటూ, సల్మాన్‌ను సాయం చేయాల్సిందిగా మీడియా ద్వారా వేడుకున్న విషయం తెలిసిందే. పూజా పరిస్థితి తెలుసుకున్న సల్మాన్ ఆమె కోలుకునేందుకు అవసరమైన సాయం చేశారు. -
వైద్యారోగ్యంలో పురోగమనం
సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్య రంగంలో తెలంగాణ పురోగమన పథంలో పయనిస్తోందని నీతి ఆయోగ్ కితాబిచ్చింది. జాతీయ స్థాయిలో రాష్ట్రం 12వ ర్యాంకు పొందినట్లు వెల్లడించింది. కేరళ, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు ఇప్పటికే విజయవంతంగా పురోగమించాయని, తెలంగాణ ఆ దిశగా అడుగులు వేస్తోందని పేర్కొంది. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలూ పురోగమన దిశలో ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం తెలంగాణ వైద్య ఆరోగ్యరంగం మెరుగైన స్థితిలో ఉందని వివరించింది. నీతి ఆయోగ్ మొదటిసారిగా నిర్వహించిన ‘బేస్‌లైన్ ర్యాంకింగ్ అండ్ రియల్ టైం’సర్వే వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు విశ్లేషించాయి. దేశంలో 101 జిల్లాల్లో నీతి ఆయోగ్ బేస్‌లైన్ సర్వే నిర్వహించింది. ఆరోగ్యం, పోషకాహారం, నవజాత శిశువుల ఆరోగ్యం, పిల్లల ఎదుగుదల, మౌలిక సదుపాయాల వంటి 13 అంశాలపై ఆయా జిల్లాల్లో సర్వే నిర్వహించింది. అందులో ఖమ్మం జిల్లా పదకొండో ర్యాంకు సాధించగా భూపాలపల్లి జిల్లా 20వ ర్యాంకు, ఆసిఫాబాద్ జిల్లా వందో ర్యాంకు సాధించాయి. తగ్గిన నవజాత శిశు మరణాల రేటు... నవజాత శిశువుల మరణాల రేటులో తెలంగాణ మెరుగుపడిందని నీతి ఆయోగ్ పేర్కొంది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది నవజాత శిశువుల్లో మరణాల సంఖ్య 23గా ఉంది. అలాగే ఐదేళ్లలోపు మరణించే వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. తక్కువ బరువుతో పుట్టే శిశువుల సంఖ్యలో మెరుగుదల కనిపిస్తుంది. అది గతంలో 6.11 శాతముంటే ఇప్పుడు 5.70 శాతానికి చేరింది. సంతాన సాఫల్య అవకాశం ఉన్న వారి రేటు 1.8 ఉంది. అయితే పురుషులు, స్త్రీల నిష్పత్తిలో మాత్రం పురోగతి లేకపోవడం గమనార్హం. ప్రతి వెయ్యి మంది బాలురకు 918 మంది బాలికలే ఉన్నారు. ఆస్పత్రుల్లో ప్రసవాల శాతం పూర్తిస్థాయిలో మెరుగుపడిందని నీతి ఆయోగ్ తెలిపింది. ఈ నివేదిక ప్రకారం 85.35% ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. అయితే వివిధ రకాల టీకాలు ఇప్పించడంలో రాష్ట్రం కాస్త వెనుకబడింది. కేవలం 89.09 శాతమే టీకాలు ఇస్తున్నారు. టీబీ వ్యాధిగ్రస్తుల గుర్తింపు మెరుగుపడింది. ప్రతి లక్ష మందిలో టీబీ రోగులు 123 మంది ఉంటున్నారు. అయితే టీబీ చికిత్సలు విజయవంతం చేయడంలో తెలంగాణ వెనుకబడిందని నివేదిక స్పష్టం చేసింది. పీహెచ్‌సీల్లో ఖాళీల భర్తీపై అసంతృప్తి... రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లలో మెడికల్ ఆఫీసర్ల కొరత తీవ్రంగా ఉందని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. గతంతో పోలిస్తే పరిస్థితి ఏమాత్రం మారలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. గతం నుంచీ ఇప్పటికీ పీహెచ్‌సీల్లో 22.31 % మెడికల్ ఆఫీసర్ల ఖాళీలు ఉన్నాయి. ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో మాత్రం స్పెషలిస్టుల కొరతను తీర్చడంలో మెరుగుదల ఉంది. ప్రస్తుతం వాటిల్లో స్పెషలిస్టుల ఖాళీలు 54.81% ఉన్నాయి. అదే తమిళనాడులో కేవలం 16.73% మాత్రమే స్పెషలిస్టుల ఖాళీలున్నాయి. ఏఎన్ఎంల కొరత లేకుండా చేయడంలో మెరుగుదల కనిపిస్తోంది. స్టాఫ్ నర్సుల ఖాళీలను నింపడంలో ఇప్పటికీ మార్పు కనిపించడంలేదు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో ఇప్పటికీ 12.79 % స్టాఫ్ నర్సుల ఖాళీలున్నాయి. ఇక 24 గంటలూ పనిచేసే పీహెచ్‌సీల్లో పూర్తిస్థాయి సేవలు అందించడంలో మార్పు రాలేదు. పీహెచ్‌సీల్లో 26.99 శాతమే 24 గంటలు సేవలందిస్తున్నాయి. అయితే తమిళనాడుతో పోలిస్తే మనం చాలా మెరుగ్గానే ఉన్నామని చెప్పొచ్చు. సామాజిక ఆరోగ్య కేంద్రాల (సీహెచ్‌సీ)ల గ్రేడింగ్ పరిశీలిస్తే గతం కంటే మెరుగుపడింది. అంతకుముందు వాటి గ్రేడింగ్ శూన్యమైతే ఇప్పుడు 11.63%తో మెరుగ్గా ఉంది. జిల్లా ఆస్పత్రుల్లో ఐసీయూల కొరత ఉంది. -
దీనస్థితిలో సల్మాన్ హీరోయిన్!
సాక్షి, ముంబై : సినిమా.. అదో రంగుల ప్రపంచం. స్టార్డమ్ ఉన్నంత వరకు ఆడిందే ఆటగా జీవితం సాగిపోతుంది. ఖరీదైన కార్లు, బంగ్లాలు ఇలా విలాసవంతమైన జీవితాన్ని గడిపేస్తారు. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. అదృష్టం ఉన్నంత వరకు జల్సాగా నడిచే జీవితం.. అది కాస్త తిరగబడితే బతుకు రోడ్డు మీద కొచ్చేస్తుంది. అవకాశాలు ఉన్నపుడు కోట్లు తీసుకున్న నటీనటులు అవకాశాలు లేక కూటికోసం అల్లాడిపోయిన సంఘటనలు కోకొల్లలు. బాలీవుడ్ హీరోయిన్ పూజా దాద్వల్ జీవితంలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. పరిస్థితులే కాదు అనారోగ్యం కూడా ఆమె పాలిట శాపంలా మారింది. టీబీ మహమ్మారి ఆమెకు బతుకు భారంగా మారింది. సరైన తిండి లేక, మందులు కొనడానికి డబ్బులు లేక దీనంగా జీవితాన్ని వెల్లదీస్తోంది. 1995లో వచ్చిన సల్మాన్ ఖాన్ బ్లాక్ బాస్టర్ ‘వీర్‌గాటి’ సినిమాలో నటించి మెప్పించింది పూజ. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఆమె ఇబ్బందులు ఎదుర్కుంటోంది. పూజ ముంబైలోని శివ్‌ది హాస్సిటల్లో చికిత్స పొందుతోంది. ‘‘ఆరు నెలల కిందట నాకు టీబీ ఉందని తెలిసింది. సల్మాన్ ఖాన్ని సహాయం అడగడానికి ప్రయత్నిస్తున్నా కుదరటం లేదు. 15 రోజుల కిందటే శివ్‌ది హాస్సిటల్లో చేరాను. ప్రస్తుతం నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. కనీసం టీ తాగడానికి కూడా ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని’ ఆమె తెలిపింది. పూజ దావల్కు టీబి ఉందని తెలుసుకున్న భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను ఒంటరిని చేసి వెళ్లిపోయారట. బాలీవుడ్ హిట్ చిత్రాలు హిందుస్తాన్, వీర్‌గాటి, సింధూర్ సౌగంథ్లో నటించిన విషయం తెలిసిందే. -
అవగాహనతోనే క్షయ దూరం
వేపాడ : ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పిస్తే క్షయ వ్యాధిని అంతమొందించవచ్చు. క్షయ వ్యాధి మూలాలు కనుగొని 136 సంవత్సరాలు అయింది. ప్రతి ఏటా మార్చి 24న వైద్య సిబ్బంది ప్రపంచ క్షయ దినోత్సం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అవగాహన ర్యాలీలు, సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యపరుస్తున్నారు. క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం వ్యాధి లక్షణాలు రెండు వారాలకు మించి జ్వరం, దగ్గు ఉన్నా.. అలాగే ఆకలి మందగించడం, బరువు తగ్గటం, దగ్గినప్పుడు కఫంతో పాటు రక్తపు జీరలు పడినా క్షయ వ్యాధి లక్షణాలుగా గుర్తించాలి. తక్షణమే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. ట్యూబర్ క్యులోసిస్ అనే సూక్ష్మ క్రిమి వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. క్షయ వ్యాధి సోకిన తర్వాత వెంటనే చికిత్స తీసుకోకపోతే అతడి నుంచి మరో 15 మంది వ్యాధి వ్యాపించే అవకాశం ఉంది. సాధారణ వ్యక్తులు కన్నా హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఈ వ్యాధి భారిన పడతారు. వ్యాధి సోకిన వెంటనే చికిత్స తీసుకోవాలన్న అవగాహన రోగుల్లో ఉంటే వ్యాధిని అంతమొందించవచ్చు. మొండి క్షయ .. సకాలంలో చికిత్స పొందని పక్షంలో సాధారణ క్షయ మందులకు లొంగని మొండి క్షయ వ్యాధిగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా 2016 నాటికి 4,90,000 మంది మొండి క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. నూతన డ్రగ్ పాలసి క్షయ వ్యాధిగ్రస్తుల బరువు ఆధారంగా ఆరు నుంచి ఎనిమిది నెలల వ్యవధిలో మందులు వేసుకునేలా నూతన డ్రగ్ పాలసీని వైద్య సిబ్బంది నిర్ణయించారు. వ్యాధి నిర్మూలనకు ఐ.ఎన్.హెచ్ 75 ఎంజీ, రిఫామ్పిసిన్ 150 ఎంజీ, పెరిజినామిడ్ 400 ఎంజీ, ఈతాంబుటాల్ 275 ఎంజీ, స్ట్రేప్టుమైసిన్ ఇంజిక్షన్ 0.75 ఎంజీలను వైద్యుల సూచనల మేరకు వాడాల్సి ఉంటుంది. చిన్న పిల్లలు వ్యాధి బారిన పడకుండా పుట్టిన బిడ్డ నుంచి ఏడాదిలోపు చిన్నారులకు బీసీజీ ఇంజిక్షన్ వేయించాలి. -
రోగం.. వేగం..
ఖమ్మంవైద్యవిభాగం: సరైన సమయంలో వైద్యం చేయించుకోకపోవడం.. మందులు సక్రమంగా వేసుకోకపోవడం.. మధ్యలోనే నిలిపివేయడం.. జబ్బును నిర్లక్ష్యం చేయడంతో టీబీ వ్యాధి జిల్లాలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. వయసుతో నిమిత్తం లేకుండా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే వ్యాధి ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ విభజన తర్వాత నివారణ చర్యలు చేపట్టినా తీవ్రత తగ్గడం లేదు. క్షయ బారినపడే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. జిల్లాలో ప్రతి నెల క్షయ కేసులు వందకు మించుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2018, జనవరిలో 126 కేసులు, 2017లో 1,563 కేసులు నమోదు కావడంతో వ్యాధి వ్యాప్తి జిల్లాలో ఎలా ఉందో అర్థమవుతోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా క్షయ కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. 2017లో ప్రైవేటు ఆస్పత్రుల్లో 1,774 కేసులు నమోదయ్యాయి. 2012లో టీబీని ప్రభుత్వం నోటిఫైబుల్ వ్యాధిగా ప్రకటించింది. ఈ మేరకు ప్రైవేటు ఆస్పత్రులు విధిగా తమ ఆస్పత్రిలో నమోదైన కేసుల వివరాలను టీబీ కంట్రోల్ అధికారులకు తెలియజేయాలి. ఇందుకోసం ఇద్దరు హెల్త్ విజిటర్స్ ఎప్పటికప్పుడు ఆస్పత్రుల నుంచి సమాచారం సేకరిస్తారు. ప్రస్తుతం 56 శాతం మాత్రమే ప్రైవేటులో కేసులు నమోదైన వివరాలు అందుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో మాత్రం 2017లో 56 టీబీ మరణాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక్క రోగి నుంచి 20 మంది వరకు.. టీబీ వ్యాధికి ప్రత్యేక వైద్యం ఉన్నప్పటికీ అవగాహన లేమితో వ్యాధి బారిన పడుతున్నారు. మందులు సరిగా వేసుకోకుండా వ్యాధిగ్రస్తులు మధ్యలోనే మానేస్తుండటంతో మళ్లీ తిరగబెడుతోంది. ఒక వ్యాధిగ్రస్తుడి ద్వారా 15 నుంచి 20 మందికి వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని టీబీ డాక్టర్లు చెబుతున్నారు. రోగి దగ్గితే సుమారు 40 వేల వరకు వ్యాధి కారక క్రిములు గాలిలో కలుస్తాయి. వ్యాధి ఊపిరితిత్తులకే కాకుండా గుండె, కాలేయం, పేగులు, మెదడు, ఎముకలు వంటి శరీర అవయవాలకు సోకే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కూడా టీబీ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దగ్గుతున్నప్పుడు నోటి నుంచి రక్తం రావటం, ఆకలి మందగించటం, బరువు తగ్గటం వంటివి క్షయ లక్షణాలుగా చొప్పొచ్చు. ఎండీఆర్ కేసులూ అధికమే.. జిల్లాలో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్(ఎండీఆర్) కేసులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. మందులు వాడుతూ మధ్య ఆపివేయటం, విచ్చలవిడిగా మందులు వాడటం వంటి వ్యాధిగ్రస్తులను ఎండీఆర్ కేసులుగా పిలుస్తారు. సాధారణంగా టీబీ సోకిన వారు 6 నెలలు మందులు వాడాల్సి ఉండగా, ఎండీఆర్ కేసులకు చెందిన వ్యాధిగ్రస్తులు 18 నెలలు మందులు వాడాల్సి ఉంటుంది. జిల్లాలో 2017లో 31 ఎండీఆర్ కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 2015లో 66 కేసులు, 2016లో 82 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో 22 పీహెచ్‌సీలు ఉండగా.. 18 డిజిగ్నేటెడ్ మైక్రోస్కోపిక్ సెంటర్(డీఎంసీ)ల ద్వారా టీబీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సబ్ సెంటర్లు, పీహెచ్‌సీల పరిధిలో రెండు వారాలకు మించి దగ్గు ఉండే రోగులను డీఎంసీకి పంపిస్తారు. ఇక్కడ వారికి పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే ఖమ్మం, సత్తుపల్లి, మధిర, తల్లాడ, నేలకొండపల్లి, మంచుకొండ, వైరాలో ట్యూబరో క్లోసిస్ యూనిట్లు ఉన్నాయి. అందులోని సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్లు రోగులు క్రమం తప్పకుండా మందులు వేసుకుంటున్నారా? లేదా? అనే విషయంపై పర్యవేక్షిస్తుంటారు. ఖమ్మంలోని జిల్లా టీబీ కంట్రోల్ కార్యాలయంలో డ్రగ్ రెసిస్టెంట్ టీబీ వార్డులో రోగులకు మందులు పంపిణీ చేస్తారు. రోజువారీ కోర్సు ఇస్తున్నాం.. గతంలో రోజు విడిచి రోజు మందులు ఇచ్చేవారు. ఫలితంగా కొందరు రోగులకు మాత్రలు పడేవి కావు. ప్రస్తుతం ఫిక్స్డ్ డైలీ కోర్సు ప్రవేశపెట్టి రోజూ మాత్రలు వేసుకునే విధానం వచ్చింది. నాలుగు రకాలకు చెందిన మందు ఒకే మాత్రలో ఉంటుంది. బరువునుబట్టి డోస్ ఇస్తున్నాం. జిల్లాలో టీబీని తగ్గించేందుకు శ్రమిస్తున్నాం. దగ్గు రెండు వారాలకు మించి ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. అలాగే రోగులు కోర్సు పూర్తయ్యే వరకు మందులు వాడితే మళ్లీ టీబీ వచ్చే అవకాశం ఉండదు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. టీబీపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. – వి.సుబ్బారావు, జిల్లా టీబీ కంట్రోల్ ఆఫీసర్ -
మూత్ర పరీక్షతో టీబీ నిర్ధారణ
సాక్షి, అమరావతి: క్షయ (టీబీ–ట్యూబర్క్యులోసిస్) వ్యాధిని నిర్ధారించేం దుకు సరికొత్త మార్గాన్ని అభివృద్ధి చేశారు. ఇన్నాళ్లూ ఛాతీని ఎక్స్‌రే తీయడం లేదా రక్తపరీక్ష ద్వారా క్షయను నిర్ధారించేవారు. ఈ విధానాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి. ఒక్కోసారి రక్తపరీక్షలతో వ్యాధి నిర్ధారణ జరిగేది కాదు. దీనివల్ల రోగులు వ్యాధి తీవ్రంగా నష్టపోయేవారు. ఇప్పుడా పరిస్థితికి చరమగీతం పాడనున్నారు. అమెరికాకు చెందిన జార్జ్ మాసన్ యూనివర్సిటీ వైద్యులు కొత్తగా మూత్ర పరీక్ష ద్వారా టీబీని నిర్ధారించే మార్గాన్ని కనుగొన్నారు. ఎక్స్‌రే, రక్త పరీక్షల కంటే 100 శాతం ఎక్కువ కచ్చితత్వంతో వ్యాధిని నిర్ధారించవచ్చని నిరూపించారు. ఈ వివరాలు సైన్స్ ట్రాన్స్లేషన్ మెడిసిన్ అనే జర్నల్‌లో ప్రచురించారు. 25 శాతం కేసులు భారత్‌లోనే... ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది టీబీ బారినపడి మరణిస్తున్నారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కొత్త నిర్ధారణ విధానం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. కఫం పరీక్ష కూడా టీబీ నిర్ధారణలో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే, ఇప్పటిదాకా పాటిస్తున్న విధానాలు చాలా జాప్యంతో కూడుకున్నవి. పైగా పెద్దమొత్తంలో ఖర్చు కావడంతో పేద దేశాల్లో చాలామంది రోగులు టీబీ పరీక్షలు చేయించుకోలేకపోతున్నారని ఆ సంస్థ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీబీ కేసుల్లో 25 శాతం కేసులు భారతదేశంలోనే నమోదవుతున్నట్లు సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకనామిక్స్ అండ్ పాలసీ(సీడీడీఈపీ) వెల్లడించడం గమనార్హం. త్వరలోనే అందుబాటులోకి... టీబీ నిర్ధారణ కోసం రూపొందించిన కొత్త విధానం త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. తాజా పరిశోధనల్లో ‘హైడ్రోజెల్ నానో కాజెస్’అనే విధానం ద్వారా మూత్ర పరీక్ష చేసి, దీంతో ట్యూబర్ క్యులోసిస్ బ్యాక్టీరియాను కొనుగొన్నారు. ఈ పరీక్ష ద్వారా బాక్టీరియా తీవ్రతతోపాటు మనిషిలోని ఇమ్యూనిటీ (వ్యాధి నిరోధక శక్తి)ని కూడా అంచనా వేయొచ్చు. దీనికోసం జెన్ ఎక్స్పర్ట్ మెషీన్లను ఉపయోగించారు. దాదాపు 8 ఏళ్లపాటు సాగించిన పరిశోధనలు ఫలించాయని, టీబీ నిర్ధారణలో ఇప్పటివరకూ ఉన్న పరీక్షలన్నింటి కంటే అత్యంత కచ్చితమైన ఫలితాలు వచ్చాయని కొత్త ఆవిష్కరణను ప్రచురించిన జర్నల్ ప్రకటించింది. ఇందులో అల్సెండ్రా లూసిని అనే సైంటిస్ట్ కీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలో విజృంభిస్తున్న క్షయ ఆంధ్రప్రదేశ్‌లో టీబీ కేసులు ఒకరి నుంచి ఒకరికి వేగంగా విస్తరిస్తున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఒక టీబీ రోగి నుంచి ఏడాదిలో కనీసం 12 మందికి ఈ వ్యాధి వ్యాపిస్తున్నట్టు తేలింది. అదే గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో వ్యాధిగ్రస్తుడి నుంచి నలుగురికి వ్యాపిస్తున్నట్టు వెల్లడైంది. రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాలో 130 మందికి కొత్తగా టీబీ వ్యాధి సోకుతున్నట్టు కుటుంబ సంక్షేమశాఖ అధికారులు గుర్తించారు. మన రాష్ట్రంలో ఏటా దాదాపు 10,000 మంది టీబీ బాధితులు బయటపడుతున్నారు. దేశంలోనే ఎక్కువ మంది హెచ్ఐవీ బాధితులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారు. హెచ్ఐవీ బాధితుల్లో 80 శాతం మందికి టీబీ సోకుతోంది. వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడడం, పోషకాహారం తీసుకోవడం వంటి వాటితో క్షయ రోగం నుంచి విముక్తి పొందవచ్చు. -
రోజూ మాత్ర
టీబీ వ్యాధికి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా క్షయ నివారణ శాఖ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు రోగులకు వారానికి మూడు రోజులపాటు (సోమ, బుధ, శుక్రవారాలు) మాత్రలు ఇచ్చేవారు. దీనికి స్వస్తిచెప్పి..ఇకనుంచి రోజూ మాత్రలు అందించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఏఎన్ఎంలు, ఫార్మసిస్టులు, సూపర్వైజర్లు, ఆశవర్కర్లకు శిక్షణ ఇచ్చారు. నల్లగొండ టౌన్ : టీబీ వ్యాధికి అడ్డుకట్ట వేయాలన్న సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫిక్సిడ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్‌టీసీ) మందుల కంపెనీ విధానంలో మార్పులు చేశాయి. గతంలో వారానికి మూడు రోజులే వ్యాధిగ్రస్తులకు మందులిస్తుండగా ఇక నుంచి వ్యాధిగ్రస్తుల బరువును బట్టి మందులను అందించే విధానికి శ్రీకారం చుట్టింది. ఈ విధా నం ఇప్పటికే జిల్లా క్షయనివారణ శాఖ అమల్లో పెట్టింది. నూతన విధానం అమల్లోకి రావడం పట్ల జిల్లాలోని 1327 మంది టీబీ వ్యాధిగ్రస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాత విధానంలో పలు లోపాలున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి నూతన విధానంపై అమలుకు మొగ్గు చూపింది. రోగి బరువును రోజుకు రెండు మాత్రల నుంచి 5మాత్రలు వేసుకునేలా అందజేస్తున్నారు. 70కిలోల బరువు కలిగిన రోగికి ఒకరోజు 5మాత్రలు, వారానికి 5మాత్రలు వేసుకోవాల్సి వుంటుందని, గతంలో ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో వాధిగ్రస్తులకు మాత్రలను ఇచ్చేవారు. లేకుంటే వైద్యారోగ్యశాఖ సిబ్బంది గుర్తించిన వ్యాధిగ్రస్తుల ఇళ్లకు వెళ్లి మాత్రలను సరఫరా చేసేవారు. మాత్రలను వేసుకోవడంలో ఏఒక్క రోజు మరిచిపోయిన మందుల కోర్సు ను మళ్లీ వేసుకోవాల్సి వుండేది. దీని కారణంగా వ్యాదిగ్రస్తుల సంఖ్య తగ్గకపోగా ఏటేటా కొత్త వ్యాధిగ్రస్తులను గుర్తించాల్సివచ్చేది. ప్రస్తుతం నూతన విధానం వలన వ్యాధిగ్రస్తులు మాత్రలను వేసుకోవడం మరిచిపోయే అవకాశం ఉండదు. నూతన విధానం వలన జిల్లాలో వ్యాధిగ్రస్తుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు. సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ టీబీ మందుల సరఫరా విధానంలో నూతనంగా అమలు చేస్తున్న పద్ధతిపై జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రా థమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఏ ఎన్ఎంలు, ఫార్మసిస్టులు, సూపర్వైజ ర్లు, ఆశవర్కర్లకు శిక్షణ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో వ్యాధిగ్రస్తులకు మందుల పంపిణీపై అవగాహన కల్పిం చడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మందుల పంపిణీ చేస్తున్నారు. వాధ్యిగ్రస్తులకు లాభం నూతన విధానం వలన వ్యాధిగ్రస్తులు మందులను వేసుకోవడం మరిచిపోయే అవకాశం ఉండదు. ఈ విధానం వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. మందులను అన్ని ప్రాథమిక కేంద్రాల్లో అందుబాటులో ఉంచడడం జరిగింది. అవకాశాన్ని రోగులు సద్వినియోగం చేసుకుని వ్యాధి నుంచి విముక్తులు కావాలి. – డాక్టర్ అరుంధతి, జిల్లా క్షయ నివారాణాధికారి -
జనరల్ ఆసుపత్రిగా ఛాతీ వైద్యశాల
- ఉస్మానియా నుంచి నాలుగు యూనిట్లు తరలించాలని నిర్ణయం - ఒకటి, రెండు నెలల్లో సాధారణ వైద్య సేవలు అందుబాటులోకి సాక్షి, హైదరాబాద్: ఎర్రగడ్డలోని ఛాతీ వైద్యశాలను జనరల్ ఆసుపత్రిగా తీర్చి దిద్దాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. తద్వారా కూకట్పల్లి, సనత్‌నగర్ తదితర ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావి స్తోంది. అందుకోసం ఉస్మానియా ఆసుపత్రి నుంచి రెండు మెడికల్, రెండు సర్జికల్ యూనిట్లను ఛాతీ ఆసుపత్రికి తరలించను న్నారు. ఒకట్రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తికానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఆమోదించారు. ప్రస్తుతం ఛాతీ ఆసుపత్రిలో 670 పడకలున్నాయి. అయితే టీబీ వ్యాధి రోగులు అంతగా లేకపోవడంతో అందులో నిత్యం 300 పడకల వరకు ఖాళీగానే ఉంటున్నాయి. దీంతో పడకలను ఖాళీగా ఉంచకుండా జనరల్ వైద్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు తగిన చర్యలు చేపట్టారు. ఇది అందుబాటులోకి వస్తే ఛాతీ ఆసుపత్రిలో అన్ని రకాల సాధారణ వైద్య సేవలు కూడా పేదలకు అందుతాయి. టీబీకి ప్రత్యేకం.. 1920లో టీబీ వ్యాధి విజృంభించినప్పుడు చికిత్స కోసం హైదరాబాద్ వాసులు వికారాబాద్ సమీపంలోని అనంతగిరి టీబీ కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. అంతదూరం వెళ్లి వైద్యం చేయించుకునే స్తోమత లేక చాలా మంది మృత్యువాతపడేవారు. దీన్ని గమనించిన ఏడో నిజాం 1937లో ఇర్రం నుమా ప్యాలెస్‌ను స్వాధీనం చేసుకుని, అందులో ఛాతీ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. సుమారు 150 ఏళ్ల క్రితం నిర్మిం చిన ఈ భవనం ప్రస్తుతం పూర్తిగా శిథిలా వస్థకు చేరుకుంది. ఇప్పటికే భవనం పైకప్పు పెచ్చులూడిపడుతోంది. గోడలు బీటలు వారి కూలేందుకు సిద్ధంగా ఉన్నా యి. అయితే ఎలాగోలా వైద్య సేవలు అందిస్తున్నారు. కాగా కూకట్పల్లి, సనత్ నగర్ తదితర ప్రాంతాల నుంచి రోగులు ప్రస్తుతం గాంధీ లేదా ఉస్మానియా ఆసు పత్రులకు వైద్యం కోసం వెళుతున్నారు. ఇక రానున్న రోజుల్లో సమీపంలోని ఛాతీ ఆసుపత్రిలోనే ఇతర వైద్య సేవలు పొందొచ్చని అధికారులు చెబుతున్నారు. -
ఓ తల్లి కథ..!
భర్త వైద్యం కోసం.. పసికందును అమ్మేసిన వైనం ఓదెల(పెద్దపల్లి): ఓ వైపు చచ్చుబడిన కాళ్లతో మంచాన పడ్డ భర్త.. మరోవైపు ఆకలితో అల మటిస్తున్న ముగ్గురు పిల్లలకు బువ్వ పెట్టలేని దైన్యం.. చివరకు భర్తకు వైద్యం చేయించేందుకు, ఆకలితో కడుపు మాడుతున్న పసి హృదయాల గోస చూడలేక పేగుబంధాన్ని మరిచి ఆరు నెలల పసిగుడ్డును అమ్మేసింది. పదిరోజుల తర్వాత కొడుకుపై మమ కారం చావక బాబును ఇప్పిం చాలని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది ఓ మాతృమూర్తి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం నాంసానిపల్లె తండాకు చెందిన గుగులోతు తేజ, కవిత దంపతులకు ముగ్గురు సంతానం. మహేశ్(5), కుమార్తె మహదేవి (3), బాబు (6 నెలలు) ఉన్నారు. రెక్కాడితేగాని డొక్కాడని గిరిజన కుటుంబం. చిన్న ఇల్లు తప్ప ఆస్తి పాస్తులు లేవు. భార్యాభర్తలిద్దరూ రోజూ కూలీలు. ఆరునెలల క్రితం తేజ వెన్నెముకకు టీబీ వ్యాధి సోకి రెండు కాళ్లు చచ్చుబడిపో యాయి. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వెన్నెముకకు ఆపరేషన్ చేయించినా ఫలితం లేకపోయింది. తేజ పూర్తిగా మంచానికే పరి మితమయ్యాడు.దీంతో రోజు కూలికి వెళ్లే కవిత భర్తకు సపర్యలు చేస్తూ ఇంటివద్దే ఉంటుండగా పూట గడవడం కష్టంగా మారింది. మరోవైపు పిల్లలను సాకలేని పరిస్థితి. కవిత తన భర్త కాళ్లను బాగు చేసుకుని కుటుంబాన్ని చక్కదిద్దు కోవాలనుకుంది. గత నెల 31న అదే గ్రామానికి చెందిన సంతానం లేని సింగరేణి కార్మికుడికి తన చిన్న కుమారున్ని మధ్యవర్తి ద్వారా లక్ష రూపాయలకు అమ్మేసింది. వారు గోదావరి ఖనిలో నివాసముంటున్నారు. స్థానికంగా దత్తత తీసుకున్నట్టు ప్రచారం చేశారు. కవిత బిడ్డను అమ్మగా వచ్చిన డబ్బుల్లోంచి రూ.60 వేలను కుమార్తె పేరిట డిపాజిట్ చేసింది. మిగతా రూ.40 వేలను భర్త కోసం, కుటుంబఖర్చుల కోసం వెచ్చించింది. వారం నుంచి చిన్న కుమారుడిపై మమకారం చావక ముభావంగా ఉంటోంది. కొడుకుపై ప్రేమను చంపుకోలేక బిడ్డను ఇప్పించాలంటూ మధ్య వర్తిని ఆశ్రయించింది. కాళ్లావేళ్లా పడి బతిమి లాడింది. చివరకు ఇచ్చిన రూ.లక్ష వాపసు తీసుకొచ్చి ఇస్తే బిడ్డను ఇచ్చేస్తామని వారు చెప్పారు. దీంతో చేతిలో చిల్లిగవ్వలేక మూడు రోజుల క్రితం ఇంటినుంచి బయటకు వెళ్లింది. పొత్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో శనివారం తన బాబును ఇప్పించాలని ఫిర్యాదు చేసింది. బాబును అమ్మించిన మధ్యవర్తిని పిలిపించి మాట్లాడుతున్నట్టు ఎస్సై రమేశ్ తెలిపారు. కాగా, భర్త వైద్యం కోసం కన్న కొడుకునే అమ్మడం స్థానికంగా చర్చనీయాంశమైంది.