చనిపోయాడా..? చంపేసిందా..? | Doctors Negligence Diabetic Died Khammam | Sakshi
Sakshi News home page

చనిపోయాడా..? చంపేసిందా..?

Published Thu, Jan 10 2019 6:46 AM | Last Updated on Thu, Jan 10 2019 6:46 AM

Doctors Negligence Diabetic Died Khammam - Sakshi

ఆసుపత్రి ఆవరణలోని ఖాళీ ప్రదేశంలో గణేష్‌

అయ్యా.. గణేషా...! నువ్వంతట నువ్వే చనిపోయావా...?  పెద్దాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం చంపేసిందా...?  వీల్‌ చైర్‌లో బయల్దేరిన నువ్వు.. మధ్యలోనే విగతుడిగా పడిపోయావెందుకు..? నీ చైర్‌ను నెట్టుకుంటూ వచ్చినోళ్లే్లమయ్యారు..? ఈ ప్రశ్నలేవీ వినపడనంత దూర తీరానికి ఆ గణేషుడు శవమై వెళ్లిపోయాడు. మన పెద్దాసుపత్రిలో ఈ గణేషుడిలాగే మరో రాముడో.. రహీమో... దిక్కూమొక్కూ లేకుండా చావకూడదనుకుంటే... పై ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కావాల్సిందే...!!! 

ఖమ్మంవైద్యవిభాగం: నగరంలోని జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రిలో బుధవారం ఓ టీబీ వ్యాధిగ్రస్తుడు ఆకస్మికంగా మృతిచెందాడు. మృతదేహం ఎక్కడుందో తెలుసా...? ఆస్పత్రిలోని మాతాశిశు సంరక్షణ కేంద్రం ఎదురుగాగల  ఖాళీ ప్రదేశంలో...! అతడి మృతదేహం అక్కడ ఎందుకుంది..? శవమే నడుచుకుంటూనో, ఎగురుకుంటూనో వెళ్లిందా..?! అసలేం జరిగిందో చూద్దాం.

మంగళవారం రోజున... 
అది, నగరంలోని జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రి. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నగరంలోని రేవతి సెంటర్‌కు చెందిన ఎల్‌.గణేష్‌(45)ను ఆయన భార్య రమ, మంగళవారం ఈ ఆసుపత్రికి తీసుకొచ్చింది. క్యాజువాల్టీలో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అతడికి క్షయ (టీబీ) వ్యాధి సోకినట్టుగా గుర్తించారు. ఆ వెంటనే టీబీ వార్డుకు తరలించారు. అక్కడ వైద్య సేవలు సాగుతున్నాయి.

బుధవారం రోజున... 
టీబీ డాక్టర్‌ వచ్చారు. గణేష్‌ను పరీక్షించారు. కొన్ని పరీక్షల కోసం క్యాజువాల్టీకి తీసుకెళ్లాలని అక్కడున్న సిబ్బందితో చెప్పారు. అతడిని వీల్‌ చైర్‌లో సిబ్బంది తీసుకెళ్లారు. కానీ, టీబీ వార్డుకు గణేష్‌ చేరుకోలేదు..! మార్గమధ్యలో ‘మాయమయ్యాడు’..!! తమ మనిషి అటు టీబీ వార్డులోనూ, ఇటు క్యాజువాల్టీలోనూ లేకపోవడంతో అతడి కుటుంబీకులు, బంధువులు కలవరపడ్డారు. అటూఇటూ చూస్తుండగానే.. టీబీ వార్డుకు, క్యాజువాల్టీకి మధ్యలోగల మాతాశిశు సంరక్షణ కేంద్రం ఎదురుగాగల ఖాళీ ప్రదేశంలో నిశ్చలంగా పడిపోయిన గణేష్‌ కనిపించాడు. అక్కడున్న, అటుగా తిరుగాడుతున్న రోగులు, సహాయకులు కూడా అప్పుడే గమనించారు. అందరూ ఒకేసారి గుమిగూడారు.

ఆందోళన... 
‘‘రోగిని ఇలా పడేస్తారా..?’’ అంటూ, వారంతా తీవ్రస్థాయిలో ఆగ్రహోదగ్రులయ్యారు. గణేష్‌ కుటుంబీకులతో కలిసి ఆందోళనకు దిగారు. అతడు ఇంకా బతికే ఉన్నాడని వారంతా అనుకున్నారు. కానీ, అప్పటికే అతడి ప్రాణాలు పోయాయని తెలుసుకున్న కుటుంబీకులు బిగ్గరగా రోదించారు.

ఇక్కడికెలా వచ్చాడు...? 
ఈ ప్రశ్నకు ఆస్పత్రి అధికారుల నుంచిగానీ, సిబ్బంది నుంచిగానీ సూటిగా సమాధానం రావడం లేదు. వైద్య నారాయణులే ప్రాణ భిక్ష పెడతారన్న గంపెడాశతో ఇక్కడికొచ్చిన ఈ గణేషుడికి ఇంత దిక్కులేని చావు ఎందుకు దాపురించింది..? వీల్‌ చైర్‌లో బయల్దేరిన అతడు... ఉంటే, క్యాజువాల్టీలోనైనా ఉండాలి. లేదంటే, వీల్‌ చైర్‌లోనే ఉండాలి. అక్కడా, ఇక్కడా కాకుండా... ఈ ఖాళీ ప్రదేశంలో ఎందుకు ఉన్నట్టు..? తనంతట తానే వీల్‌ చైర్‌ను వదిలేసి, సిబ్బందిని కాదని ఇక్కడికి పరుగెత్తుకుంటూనో, నడుచుకుంటూనో వచ్చాడా..? వీల్‌ చైర్‌లో తీసుకెళ్లిందెవరు..? వాళ్లు ఏమయ్యారు..? వీల్‌ చైర్‌లో తీసుకెళ్లలేక ఇక్కడ పడేశారా...? ఇదిగో... ఆందోళనకారుల్లో ఇన్ని ప్రశ్నలు. వీటికి జవాబులేవి..?
 
అప్పటికే పోయాడు... 
ఆ ఖాళీ ప్రదేశంలో ఆందోళన విషయం తెలుసుకున్న వెంటనే ఆర్‌ఎంఓ డాక్టర్‌ కృప ఉషశ్రీ,, ఔట్‌పోస్ట్‌ పోలీసులు వచ్చారు. ఆందోళనకారులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. అక్కడి నుంచి గణేష్‌ను వెంటనే క్యాజువాల్టీకి తీసుకెళ్లారు. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్టుగా వైద్యులు గుర్తించారు. టూటౌన్‌ పోలీసులు విచారణ జరిపారు.

చర్యలు తీసుకుంటాం... 
ఈ మొత్తం వ్యవహారంపై ఆర్‌ఎంఓ డాక్టర్‌ కృప ఉషశ్రీ,ని ‘సాక్షి’ వివరణ కోరింది. ‘‘దీనిపై, పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. వైద్య సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిని ఉపేక్షించం’’ అన్నారు.

ష్‌.. సైలెన్స్‌...!  
గణేష్‌ ఎలా చనిపోయాడు..? అతడంత అతడే చనిపోయాడా..? సిబ్బంది నిర్లక్ష్యం చంపేసిందా...? ష్‌.. సైలెన్స్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రోగులు, మృతుడి బంధువులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement