
నేడు ప్రపంచ టీబీ నిర్మూలన దినోత్సవం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు(సోమవారం) టీబీ నిర్మూలనకు విశేషంగా కృషి చేసిన రాష్ట్రాలకు ప్రత్యేక గౌరవం అందించనుంది. భారతదేశ 100 రోజుల టీబీ నిర్మూలన ప్రచారం విజయవంతం అయిన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ టీబీ వ్యతిరేక పోరాటాన్ని 300 రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయించింది.
ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం(World Tuberculosis Day) సందర్భంగా సోమవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. దేశంలోని 50 వేల గ్రామాలు టీబీ నుండి విముక్తి పొందినందున ఆయా గ్రామాలకు ధ్రువీకరణ పత్రాలను అందజేయనున్నారు. గత రెండేళ్లలో ఈ గ్రామాల్లో ఒక్క టీబీ కేసు కూడా నమోదు కాలేదు. టీబీ ఇన్ఫెక్షన్‌కు సంబంధించి మెరుగైన పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం సత్కరించనుంది. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్, మేఘాలయలు అగ్రస్థానంలో ఉన్నాయి. టీబీ చికిత్సలో ఔషధాలతో పాటు పోషకాహారం పాత్ర ఎంతో ముఖ్యమైనది. టీబీ బాధితులకు పోషకాహారం అందించడంపై మేఘాలయ ప్రత్యేక చొరవ తీసుకుంది. బాధితులను ఆరోగ్య కేంద్రాలకు తీసుకు వచ్చేందుకు గ్రామీణ మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ కూడా టీబీ నిర్మూలన విషయంలో విశేష కృషి చేసింది.
క్షయ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ బాక్టీరియా(Tuberculosis bacteria) వల్ల కలిగే అంటు వ్యాధి. ఇది సాధారణంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, నవ్వినప్పుడు లేదా అరచినప్పుడు కూడా ఈ వ్యాధి ఇతరులకు వ్యాపిస్తుంది. 2024లో దేశంలో 26.19 లక్షల మంది టీబీ రోగులను గుర్తించారు. ఇది నిర్దేశించిన లక్ష్యంలో 94 శాతం. భారతదేశం 2025 నాటికి టీబీని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా జిల్లా, గ్రామ పంచాయతీ స్థాయిలో ఈ వ్యాధి నిర్మూలనకు విరివిగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా 50 వేలకు పైగా గ్రామాలు టీబీ రహితంగా మారాయి.
ఇది కూడా చదవండి: New Delhi: తృటిలో తప్పిన తొక్కిసలాట