క్షయ.. వ్యాధి నిర్మూలనకై ప్రభుత్వం పటిష్ట చర్యలు! | The Government Is Taking Strong Measures To Eradicate The TB Disease | Sakshi
Sakshi News home page

క్షయ.. వ్యాధి నిర్మూలనకై ప్రభుత్వం పటిష్ట చర్యలు!

Published Tue, Mar 12 2024 11:03 AM | Last Updated on Tue, Mar 12 2024 7:31 PM

The Government Is Taking Strong Measures To Eradicate The TB Disease - Sakshi

 ఈ వ్యాధి నోటి తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంది

కాకినాడ: క్షయ.. నోటి తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణం మీదకు తెస్తుంది. ఈ వ్యాధికి కళ్లెం వేసేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రతి సీహెచ్‌సీలో టీబీ యూనిట్‌ ఏర్పాటు చేసింది. ఈవిధంగా జిల్లాలో మొత్తం 9 యూనిట్లు ఉన్నాయి. వీటిల్లో ఒక సీనియర్‌ టీబీ సూపర్‌వైజర్‌, ఒక సీనియర్‌ ల్యాబ్‌ సూపర్‌వైజర్‌ విధులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు 10 మంది సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. క్షయ కేసులను గుర్తించేందుకు ప్రతి సీహెచ్‌సీలో ఎక్స్‌రే యూనిట్లు ఏర్పాటు చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 10 మంది టీబీ హెల్త్‌ విజిటర్లు పని చేస్తున్నారు.

క్షయ వ్యాధిని నిర్ధారించేందుకు కాకినాడ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్‌)లో రెండు సీబీ నాట్‌ మెషీన్లు ఏర్పాటు చేశారు. దీంతోపాటు, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో 19 ట్రూనాట్‌ మెషీన్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఆరోగ్య కేంద్రాన్ని మైక్రోస్కోప్‌ సెంటర్‌గా మార్చి టీబీ లక్షణాలున్న వ్యక్తి నుంచి కళ్లె (ఉమ్ము) సేకరించి పరీక్షలు చేస్తున్నారు. ఆ శాంపిల్‌లో టీబీ క్రిములుంటే ఆ వ్యక్తికి డాట్‌ ప్రొవైడర్‌ ద్వారా మందులు ఇస్తూ వ్యాధిని తగ్గించేందుకు 6 నుంచి 8 నెలల పాటు చికిత్స అందిస్తున్నారు.

ఉచితంగా మందులు..
టీబీ చికిత్సకు జిల్లాలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా మందులు అందజేస్తున్నారు. వ్యాధి వచ్చిన తర్వాత వైద్యులు సూచించిన విధంగా నిర్ణీత కాలం మందులు వాడకపోతే అది మల్టీ డ్రగ్‌ రెసిస్టెంట్‌ టీబీగా మారుతుంది. దీనికి రెండేళ్ల పాటు మందులు వాడాల్సి ఉంటుంది.

టీబీ నిర్మూలనకు రూ.2 లక్షల నుంచి రూ.18 లక్షల విలువ జేసే మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. మందులు మింగించిన పర్యవేక్షకులకు (డాట్‌ ప్రొవైడర్‌కు) రూ. వెయ్యి నుంచి రూ.5 వేల పారితోషికం అందిస్తున్నా రు. క్షయ వ్యాధిగ్రస్తులకు నెలవారీ వైద్య ఖర్చులకు నిక్షయ పోషణ యోజన ద్వారా రూ.500 చొప్పున అందజేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా క్షయతో బాధ పడుతున్న 1,743 మందికి గత ఏడాది ప్రతి నెలా రూ.500 చొప్పున రూ.4,19,7000 జమ చేశారు.

ఆధునిక పరికరాలతో పరీక్షలు..
వ్యాధిని కచ్చితంగా నిర్ధారణ చేసే సీబీ నాట్‌ మెషీన్లు కాకినాడ జీజీహెచ్‌తో పాటు తాళ్లరేవు, పెద్దాపురం, పండూరుల్లోని ఆసుపత్రుల్లో ఏర్పాటు చేశారు. ఈ మెషీన్‌ హెచ్‌ఐవీ రోగులు, ఊపిరితిత్తుల వ్యాధులున్న వారు, చిన్న పిల్లలల్లో క్షయ, ఎండీఆర్‌ టీబీని గుర్తించడంలో కీలకంగా ఉంటుంది.

ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1,244 మంది క్షయ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. వీరికి నిక్షయ్‌ మిత్ర ద్వారా, దాతల సహకారంతో పోషకాహార కిట్లు అందజేసేలా చర్యలు చేపట్టారు. ఇందులో 673 మంది నమోదు చేసుకుని రోగులకు పౌష్టికాహారం అందజేస్తున్నారు. వీరిలో కొంతమంది కొందరు రోగులను దత్తత తీసుకుని, మరీ వారికి కావాల్సిన పౌష్టికాహార కిట్లు అందజేస్తూండటం విశేషం.

క్షయ నిర్మూలనే లక్ష్యం
జిల్లాను క్షయ రహితంగా చేయడ మే లక్ష్యంగా టీబీ రోగులకు చికిత్స అందిస్తున్నాం. అదే సమయంలో నివారణపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2030 నాటికి క్షయ ముక్త భారత్‌ లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్‌ జె.నరసింహ నాయక్‌, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, కాకినాడ.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement