విద్యార్థులే.. ఉపాధ్యాయులై..
●
● స్వీట్లు పెట్టి.. పాఠాలు చెప్పి..
● ప్రభుత్వ పాఠశాలలోనే
చేరాలని ప్రచారం
● పి.దొంతమూరు హైస్కూల్ విద్యార్థుల వినూత్న ప్రయత్నం
పిఠాపురం: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు ఎంతటి ఉత్తమ ఫలితాలను ఇచ్చాయో పిఠాపురం మండలం పి.దొంతమూరు ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులను చూస్తే అర్థమవుతోంది. నాడు–నేడుతో పాఠశాలల రూపురేఖలను కార్పొరేట్‌కు దీటుగా మార్చడంతో పాటు, ఆంగ్ల మాధ్యమం, విద్యా కానుక, బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు, ఇంగ్లిష్ మీడియం వంటి వినూత్న కార్యక్రమాలను నాటి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేసింది. దీనిని అందిపుచ్చుకున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాఠాలు వినే స్థాయి నుంచి.. ఏకంగా ఉపాధ్యాయులుగా మారి పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగారు. అది కూడా ఆంగ్లంలో. ఈ పాఠశాల విద్యార్థులు కర్నీడి సత్యకృష్ణ, దొడ్డి సిరి, అడపా జీవమణి, ఎలుగుబంటి నందిని, ఎస్.రేవతి తదితరులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరాలంటూ ఇటీవల వినూత్న ప్రచారం నిర్వహించారు. తమ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లారు. గడచిన ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలలు ఏవిధంగా మారాయో స్వయంగా వివరించారు. కొంతసేపు ఆ పిల్లలకు పాఠాలు చెప్పారు. వారికి స్వీట్లు పంచి, వచ్చే ఏడాది తమ స్కూల్లోనే చేరాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన ఏవిధంగా ఉందో ఇంగ్లిషులో అనర్గళంగా మాట్లాడి, ఆ చిన్నారులకు అవగాహన కల్పించారు. ఇలా ప్రతి వారం ఆయా పాఠశాలలకు వెళ్లి, ఈ ప్రచారాన్ని కొనసాగించనున్నారు.
ఆశ్చర్యం కలిగింది
ఇంకా పదో తరగతిలోకి కూడా రాని విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు చెప్పడం, ఇంగ్లిషులో అనర్గళంగా మాట్లాడటం చూసి ఆశ్చర్యం కలిగింది. వీరు బెండపూడి విద్యార్థులనే మించిపోయారు. చాలా బాగా చదువుతున్నారు. ఇతర పాఠశాలలకు వెళ్లి విద్యా బోధన చేయడం, వారితో ముచ్చటించడం వంటివి చేస్తే, పది మందిలో మర్యాదగా మాట్లాడటం అలవాటవుతుంది. పి.దొంతమూరు హైస్కూలు విద్యార్థులు ఇప్పుడదే చేస్తున్నారు. వారితో మాట్లాడి అభినందించా.
– నాగమణి, రీజినల్ జాయింట్ డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ
విద్యార్థులే.. ఉపాధ్యాయులై..
Comments
Please login to add a commentAdd a comment