
కట్టలు కట్టేందుకే 12 గంటలు
●
● ఉదయం 8 గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికల
కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం
● రాత్రి 8.30 గంటల వరకూ కట్టలతోనే సరి
● రాత్రి 9 గంటలకు ప్రారంభమైన
చెల్లిన, చెల్లని ఓట్ల లెక్కింపు
● తొలిసారి ఏలూరు జిల్లాలో
కౌంటింగ్ తంతు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రహసనంలా మారింది. పోలయిన ఓట్లను కట్టలు కట్టడానికే 12 గంటలకు పైగా సమయం పట్టింది. మూడు షిఫ్టుల్లో 700 మంది సిబ్బందిని నియమించినా కౌంటింగ్ ప్రక్రియ వేగంగా సాగడం లేదు.
2.18 లక్షల ఓట్లు
గత నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ జరిగింది. ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. కౌంటింగ్ ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమును ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేశారు. మొత్తం ఆరు జిల్లాల్లోని 456 పోలింగ్ కేంద్రాల్లో 3,14,984 మందికి గాను 2,18,997 మంది ఓటు వేశారు. సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. ఉదయం 6.30 గంటలకే దాదాపు 250 మంది సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. మొత్తం 1,368 బ్యాలెట్ బాక్సులను 17 రౌండ్లుగా విభజించి కట్టలు కట్టే ప్రక్రియ ప్రారంభించారు. ఈ ప్రక్రియ రాత్రి 8.30 గంటల వరకూ సాగింది. 28 టేబుళ్లు ఏర్పాటు చేసి, 17 రౌండ్లుగా విభజించి, కట్టలు కట్టి, ఓట్ల లెక్కింపునకు సిద్ధం చేశారు. రాత్రి 9 గంటల నుంచి చెల్లిన, చెల్లని ఓట్లను వేరు చేసి, లెక్కింపు మొదలు పెట్టారు. ఈ ప్రక్రియకు సుమారు 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో రాత్రి సుమారు 11 గంటల తర్వాత కానీ మొదటి రౌండ్ లెక్కింపు ప్రారంభం కాలేదు. 28 టేబుళ్లకు సగటున 10 వేల నుంచి 15 వేల ఓట్లు కేటాయించి, చెల్లిన, చెల్లని ఓట్లు, మొదటి ప్రాధాన్యతా క్రమంలో ఓట్లను వేరు చేసి లెక్కింపు ప్రారంభించారు. మొదటి రౌండ్‌లో 10,783, రెండో రౌండ్‌లో 13,929, మూడో రౌండ్ 11,870, నాలుగో రౌండ్ 13,777, ఐదో రౌండ్ 13,168, ఆరో రౌండ్ 14,783, ఏడో రౌండ్ 12,841, ఎనిమిదో రౌండ్ 14,296, తొమ్మిదో రౌండ్‌లో 14,162, పదో రౌండ్ 11,654, పదకొండో రౌండ్ 13,674, పన్నెండో రౌండ్ 12,296, పదమూడో రౌండ్ 12,523, పధ్నాలుగో రౌండ్‌లో 13,876, పదిహేనో రౌండ్ 14,668, పదహారో రౌండ్ 15,823, పదిహేడో రౌండ్‌లో 4,879 చొప్పున ఓట్లను లెక్కించనున్నారు.
ఆరు జిల్లాల అధికారులున్నా..
ఆరు జిల్లాల్లో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించిన డీఆర్వోలు, ఇతర జిల్లా స్థాయి అధికారులతో పాటు తహసీల్దార్లు, వివిధ విభాగాల అధికారులు కౌంటింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్నా ఓట్ల లెక్కింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఉదయం 6 గంటలకు విధుల్లోకి వచ్చిన సిబ్బంది మధ్యాహ్నం 2 గంటలకు వెళ్లిపోతారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకూ, రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకూ మూడు షిఫ్టుల్లో లెక్కింపు జరుగుతోంది. కృష్ణా – గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గుంటూరులో జరుగుతూండగా, అక్కడి సిబ్బంది రాత్రి 8.30 గంటలకే మూడో రౌండ్ లెక్కింపు పూర్తి చేశారు. గతంలో నాలుగుసార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ గుంటూరులో నిర్వహించడం తదితర కారణాలతో అక్కడ ఓట్ల లెక్కింపు వేగంగా సాగుతోంది. ఏలూరు జిల్లాకు తొలిసారి కావడం, అధికారులకు అనుభవం తక్కువగా ఉండటం వంటి కారణాలతో ఇక్కడ మాత్రం జాప్యం జరుగుతోంది. కౌంటింగ్ సిబ్బంది మొత్తానికి భోజనాలతో సహా అన్ని ఏర్పాట్లూ కౌంటింగ్ కేంద్రం వద్దే చేశారు. ఉదయం 8 గంటల నుంచే ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లు మొదటి రౌండ్ కౌంటింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. కూటమి పార్టీల మద్దతుతో టీడీపీ నేత పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులుతో పాటు మరో 33 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో నిలిచి విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment