
మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
తుని రూరల్: హంసవరంలోని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ విద్యాలయంలో (ఏపీ మోడల్ స్కూల్) 2025–26 విద్యా సంవత్సరం ఆరో తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ పుల్లా పద్మజ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31వ తేదీ లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ జరిగే ప్రవేశ పరీక్షకు హాజరు కావాలని తెలిపారు. ప్రతిభవంతులైన విద్యార్థులను ఎంపిక చేసి, జాబితా 27న ప్రకటిస్తామన్నారు. ఏప్రిల్ 30 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన, కౌన్సెలింగ్ జరుగుతాయన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.cse.ap.gov.in లేదా www.apms.apcfss.in వెబ్‌సైట్లలో దరఖాస్తు చేసుకోవాలని పద్మజ సూచించారు.
ధర్మ పరిరక్షణలో
భాగస్వాములు కావాలి
తుని: జీవాత్మకు పరమాత్మను అనుసంధానం చేసేదే ధర్మమని, ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య, ఆధ్మాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని కహెన్ షా వలీ దర్గాలో సోమవారం జరిగిన 28వ వార్షిక సర్వధర్మ సమ్మేళన సభకు ఆయన అధ్యక్షత వహించారు. సికింద్రాబాద్ యోగాలయ నిర్వహకుడు డాక్టర్ వాసిలి వసంత్ కుమార్, హిందూ ధర్మ ప్రతినిధి స్వామి విజయానంద, ఇస్లాం ప్రతినిధి సూఫీ షేక్ అహ్మద్ జానీ, క్రైస్తవ ప్రతినిధి ఎస్.బాలశౌరి, బౌద్ధం ప్రతినిధి పూజ్య భంతే, సిక్కు మత ప్రతినిధి గురుచరణ్ సింగ్‌తో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి, సమ్మేళనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సమాజంలో శాంతి, మానవత్వం విలువలను తెలియజేయడానికి సర్వధర్మ సమ్మేళన సభలు నిర్వహిస్తున్నామని అన్నారు. మానవ జన్మను సార్థకం చేసుకునేందుకు ఆధ్యాత్మికతను అలవరచుకోవాలని సూచించారు. మానవత్వమే మతమని గ్రహించాలని, ఈశ్వర తత్వాన్ని పాటించాలని అన్నారు. ఉమర్ ఆలీషా రూరల్ ట్రస్ట్ ఆధ్వర్యాన పక్షుల ఆహారానికి ధాన్యం వరి కుచ్చులు, మహిళలకు కుట్టు మెషీన్లు, విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేశారు. ఉమర్ ఆలీషాను తుని కమిటీ ఆధ్వర్యంలో సత్కరించారు. కార్యక్రమంలో జి.సత్యనారాయణ, ప్రసాదవర్మ, పింగళి ఆనందకుమార్, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా ఫైరింగ్ ప్రాక్టీస్
పెద్దాపురం: స్థానిక ఫైరింగ్ రేంజ్‌లో జిల్లా సాయిధ దళాల వార్షిక మొబలైజేషన్ ఫైరింగ్ ప్రాక్టీస్ సోమవారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ బింధుమాధవ్ పాల్గొని, ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. పోలీసులు ఉపయోగింగే అత్యాధునిక ఏకే–47, ఎస్‌ఎల్‌ఆర్, ఎం–5 తదితర ఆయుధాలతో లాంగ్‌రేంజ్, 9 ఎంఎం పిస్టల్స్‌తో షార్ట్ రేంజ్‌లో ప్రాక్టీస్ చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ సెకండియర్
పరీక్షలు ప్రారంభం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్‌మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తెలుగు, హిందీ, సంస్కృతం పరీక్షలకు 17,748 మంది విద్యార్థులు హాజరు కాగా 461 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,493 మంది పరీక్ష రాయగా, 52 మంది హాజరు కాలేదని జిల్లా ఇంటర్‌మీడియెట్ విద్యాశాఖాధికారి నూకరాజు తెలిపారు. పరక్షలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు.
నేడు మద్యం అమ్మకాల నిషేధం
కాకినాడ సిటీ: ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా మంగళవారం మద్యం అమ్మకాలను నిషేధిస్తూ కలెక్టర్ షణ్మోహన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. లిక్కర్ షాపులతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్‌లలో కూడా మద్యం అమ్మరాదని స్పష్టం చేశారు.

మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Comments
Please login to add a commentAdd a comment