Kakinada District News
-
ఎయిర్‌పోర్టుకు భూములివ్వం
ఫ బెండపూడి సదస్సులో రైతుల స్పష్టీకరణ ఫ తహసీల్దార్‌కు 230 మంది వినతిపత్రాలు తొండంగి: పరిసర గ్రామాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి తమ భూములు ఇచ్చేది లేదని బెండపూడిలో శనివారం జరిగిన సదస్సులో రైతులు మరోమారు స్పష్టం చేశారు. ఈ మేరకు అన్నవరం, బెండపూడి, పీఈ చిన్నాయపాలెం గ్రామాల రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యాన దాదాపు 230 మంది రైతులు తహసీల్దార్ మురార్జీకి విడివిడిగా వినతిపత్రాలు సమర్పించారు. ఆ భూములను ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటూ, జీవనం సాగిస్తున్నామని, వాటిని ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఇవ్వబోమని పేర్కొన్నారు. ఈ భూములు తీసుకుంటే వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న తాము ఉపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు మద్దుకూరి వెంకట సుబ్బారావు చౌదరి, ప్రధాన కార్యదర్శి రాయవరపు ఆనంద్, రైతులు పాల్గొన్నారు. కాగా, ఈ సదస్సులో సర్వే కోసం 20, మ్యుటేషన్ల కోసం 27 చొప్పున దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్ మురార్జీ తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐ రాజారావు, వీఆర్ఓలు పాల్గొన్నారు. -
రత్నగిరికి భక్తుల తాకిడి
ఫ సత్యదేవుని దర్శించిన 40 వేల మంది ఫ దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం అన్నవరం: సత్యదేవుని ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున రత్నగిరిపై పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న నవదంపతులు కూడా వారి బంధుమిత్రులతో కలసి సత్యదేవుని ఆలయానికి వచ్చారు. వీరందరూ వ్రతమాచరించి సత్యదేవుని దర్శించుకున్నారు. వీరికి ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వ్రతాలు 1,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. ఘనంగా ప్రాకార సేవ ఆలయ ప్రాంగణంలో సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు తిరుచ్చి వాహనంపై సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేయించి, అర్చకులు పూజలు చేశారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి ప్రాకార సేవను ప్రారంభించారు. ఆలయ ప్రాకారంలో నాలుగు దిక్కులా కొబ్బరి కాయలు కొట్టి ప్రాకార సేవ కొనసాగించారు. తరువాత స్వామి, అమ్మవార్లకు నీరాజన మంత్రపుష్పాదులు సమర్పించి, తిరిగి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఆదివారం ఉదయం 10 గంటలకు సత్యదేవుడిని, అమ్మవారిని టేకు రథంపై ఆలయ ప్రాకారంలో ఘనంగా ఊరేగించనున్నట్లు అధికారులు తెలిపారు. -
ఉత్సాహంగా టీటీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ సురేష్ నగర్‌లోని శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్లో రెండు రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు శనివారం ఉత్సాహంగా జరిగాయి. 15, 17, 19 ఏళ్లలోపు బాలురు, బాలికల విభాగాల్లో పోటీలు జరిగాయి. శ్రీప్రకాష్ స్కూల్ డైరెక్టర్ విజయ్ ప్రకాష్, జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘ కార్యదర్శి మోహన్‌బాబు పోటీలను పర్యవేక్షించారు. 15 ఏళ్లలోపు బాలబాలికల విభాగంలో కాకినాడ జిల్లా జట్టు తూర్పు గోదావరి జట్టుపై విజయం సాధించింది. 17 ఏళ్ల లోపు బాలబాలికల సెమీఫైనల్స్‌లో శాంతి జ్యోతిపై హాసిని, పి.జ్ఞాపికపై శ్రీపావని, బాలుర విభాగంలో హార్దిక్ రామ్‌పై టి.సామవేద్, లోహిత్‌పై విజయధర్ విజయం సాధించారు. 19 ఏళ్లలోపు బాల బాలికల విభాగంలో గుణ సంయుక్తపై వైష్ణవి సూర్య, ఈశా సంజనపై పి.హాసిని, బాలుర విభాగంలో పవన్ సత్యపై మణికుమార్, ఎం.ప్రజ్ఞాన్‌పై పి.మహిధర్ వర్మ విజయం సాధించారు. -
శృంగార వల్లభుని సన్నిధికి పోటెత్తిన భక్తులు
పెద్దాపురం: తొలి తిరుపతి గ్రామంలో వెలసిన స్వయంభూ శృంగార వల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సుమారు 9 వేల మంది స్వామి వారిని దర్శించుకున్నారని, ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు పూలమాలలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవల టికెట్లు, అన్నదాన విరాళాల రూపంలో స్వామి వారికి రూ.1,74,675 ఆదాయం సమకూరిందని ఈఓ చెప్పారు. 2,500 మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. బాలిక వైద్యానికి రోటరీ సాయం బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): బాణసంచా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ బాలిక వైద్యానికి రోటరీ సెంట్రల్ క్లబ్ ఆర్థిక సహాయం అందజేసింది. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు గ్రామానికి చెందిన వాసంశెట్టి వీరబాబు కుమార్తె జాహ్నవి దీపావళి పండగ నాడు బాణసంచా కాలుస్తూండగా ప్రమాదానికి గురైంది. 70 శాతం కాలిన గాయాలతో కాకినాడలోని క్యాపిటల్ ఆసుపత్రిలో చేరింది. నిరుపేద అయిన వీరబాబుకు రోటరీ సెంట్రల్ క్లబ్ అండగా నిలిచింది. అతడి కుమార్తె వైద్యానికి ఎపెక్స్ కంపెనీ అధినేత కేఎస్ మూర్తి రూ.లక్ష, రోటరీ సెంట్రల్ ట్రస్ట్ నుంచి మరో రూ.2 లక్షలు విడుదల చేసింది. క్లబ్ అధ్యక్షుడు బంగారు కృష్ణమూర్తి ఈ విషయం తెలిపారు. మొత్తం రూ.3 లక్షల చెక్కును శనివారం వీరబాబుకు అందించారు. ఆసుపత్రి యాజమాన్యం ఉచితంగా వైద్యం అందించేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు. ఇప్పటి వరకూ జాహ్నవి వైద్యానికి రూ.6 లక్షలు ఖర్చయ్యిందని, మరో రెండు నెలలు పాటు వైద్యం చేయాల్సి ఉంటుందని, దాతలు సహకరించాలని ఆయన కోరారు. సహాయం చేయాలనుకునేవారు 98482 10897 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. హైస్కూల్ ప్లస్ కొనసాగించాలి బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఇంటర్మీడియెట్ విద్య అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్‌ను యథావిధిగా కొనసాగించాలని స్కూల్ టీచర్స్ అసోషియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వరావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించాలని, ప్లస్‌టూ పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలున్నందున ల్యాబ్ నిర్మాణాలకు నిధులు విడుదల చేయాలని, మండలానికో ప్లస్‌టూ కో ఎడ్యుకేషన్ పాఠశాల ఉండాలని, ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులు ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సంఖ్య తక్కువనే సాకుతో ఈ వ్యవస్థను రద్దు చేయడం సరి కాదని పేర్కొన్నారు. జీపీటీలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): స్థానిక ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ (జీపీటీ) కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి కొండలరావు శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సుకు ఇంటర్, డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణులై, 18 నుంచి 30 సంవత్సరాల లోపు వయస్సు వారు అర్హులన్నారు. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, డొమెస్టిక్ నాన్ వాయిస్ కోర్సుకు పదో తరగతి ఆపైన ఉత్తీర్ణులై, 18 నుంచి 40 సంవత్సరాల లోపు వారు అర్హులని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం ఉపాధి కల్పిస్తామని, వివరాలకు 90107 37998 నంబరులో సంప్రదించాలని కోరారు. -
జననేతకు జేజేలు
ఫ ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు ఫ సేవలతో అభిమాన నేతకు నీరాజనం ఫ ప్రజల గుండెల్లో చెక్కుచెదరని అభిమానం ఫ జిల్లావ్యాప్తంగా కేక్ కట్ చేసి, సంబరాలు చేసుకున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు సాక్షి ప్రతినిధి, కాకినాడ: అధికార పార్టీ, విపక్షం అనే వ్యత్యాసం చూపకుండా నిత్యం పేదల పక్షాన నిలిచిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రజల గుండెల్లో ఉన్న ఆదరాభిమానాలు ఏమాత్రం చెక్కుచెదరలేదు. ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు ఆయన చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. జిల్లావ్యాప్తంగా శనివారం జరిగిన ఆ జననేత పుట్టిన రోజు వేడుకలే దీనికి సాక్షిగా నిలిచాయి. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రజలు జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు గ్రామాల్లో పార్టీ నేతలు, అభిమానులు నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడం కనిపించింది. పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిన జగన్‌కు ప్రజలు నీరాజనం పలికారు. వైఎస్సార్ సీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ కో ఆర్డినేటర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎక్కడికక్కడ తమ అభిమాన నేత జగన్ పుట్టిన రోజును వేడుకగా నిర్వహించారు. పెద్ద ఎత్తున కేక్‌లు కట్ చేసి, అందరికీ పంచి, సంబరాలు చేసుకున్నారు. నిరుపేదలకు దుప్పట్లు, రోగులకు పండ్లు పంపిణీ చేసి, తమ ప్రియ నేతకు సేవా హారతి పట్టారు ● వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో.. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆధ్వర్యాన జగన్ పుట్టిన రోజు వేడుకలను పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలు కూడా అమలు చేసిన ఏకై క నాయకుడు దేశంలో ఒక్క జగన్మోహన్రెడ్డి మాత్రమేనని చెప్పారు. చెప్పిందే చేస్తా, చేయగలిగిందే చెప్తా అని ధైర్యంగా చెప్పే నాయకుడని కొనియాడారు. ఒక నాయకుడి వెనుక ఉన్నామంటే తల ఎత్తుకునే తిరిగేలా ఉండాలని, ఒక ధైర్యం వెనకాల ఉన్నామనే ఫీలింగ్ ఉండాలని, అవన్నీ ఒక్క జగన్మోహన్రెడ్డిలోనే ఉన్నాయని అన్నారు. ● పిఠాపురంలో.. మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ వంగా గీతా విశ్వనాథ్ ఆధ్వర్యాన గొల్లప్రోలు మార్కెట్ సెంటర్లో జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, అందరికీ పంచిపెట్టారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. పిఠాపురంలోని పార్టీ కార్యాలయంలో కూడా కేక్ కట్ చేసి, నాయకులు, కార్యకర్తలకు పంచారు. స్థానిక సౌజన్య దివ్యాంగుల ట్రస్ట్ ఆశ్రమంలో దివ్యాంగులకు వంగా గీత దుప్పట్లు పంపిణీ చేశారు. ● పెద్దాపురంలో.. కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యాన పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కార్యాలయంలో జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. సామర్లకోట ప్రసన్నాంజనేయ ఆలయం వద్ద దివగంత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి దవులూరి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. సిరి మానసిక కేంద్రంలోను, ఆస్పత్రిలోను రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. పెద్దాపురం మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసీ మంగతాయారు, రాష్ట్ర అయ్యెరక సంఘ చైర్మన్ ఆవాల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ● పులిమేరు శాంతివర్ధన విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబుతో పాటు కిర్లంపూడి మండల నాయకులు జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అలాగే, గిరిబాబు ఆధ్వర్యాన పార్టీ నేతలు కిర్లంపూడిలో కూడా జగన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో వైఎస్సార్ సీపీ నేత ముదునూరి మురళీకృష్ణంరాజు సుమారు 250 మంది మహిళలకు చీరలు, ఏలేశ్వరంలో చిరు వ్యాపారులకు, పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ● జగ్గంపేట, గోకవరం గ్రామాల్లో మాజీ మంత్రి, పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట నరసింహం కేక్ కట్ చేశారు. వంద మంది మహిళలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. జగ్గంపేటలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కేక్ కట్ చేసి, అభిమానులు, పార్టీ నాయకుల సమక్షంలో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ● కాకినాడ నగరంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, కాకినాడ నగరాభివృద్ధి సంస్థ మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి ఆధ్వర్యాన జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ అనుబంధ విభాగాల నాయకులు రావూరి వెంకటేశ్వరరావు, అల్లి రాజబాబు, మాజీ కార్పొరేటర్లు, అభిమానులు పాల్గొన్నారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యాన.. మాజీ మంత్రి, పార్టీ తుని నియోజకవర్గ కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యాన జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు సంబరంగా జరిగాయి. తుని రూరల్ మండలం ఎస్.అన్నవరంలో జరిగిన వేడుకల్లో రాజా కేక్ కట్ చేసి, అందరికీ పంచారు. తుని, కోటనందూరు, తొండంగి మండలాల నుంచి పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు జగన్‌పై అభిమానంతో పెద్ద ఎత్తున తరలివచ్చారు. -
సంక్షోభంలో సమతూకమా!
● సమీకరణాలతో డీసీ చైర్మన్ల నియామకం ● అనుభవాన్ని పట్టించుకోని కూటమి ప్రభుత్వం ● తూర్పు డెల్టా జనసేనకు.. మధ్య డెల్టా టీడీపీకి.. ● సాగునీటి యాజమాన్యంపై అన్నదాతల పెదవి విరుపు సాక్షి, అమలాపురం: గోదావరి డెల్టా సంక్షోభంలో ఉంది. మూడు పంటలు పండే ఈ ప్రాంతంలో ఖరీఫ్, రబీ వరిసాగు చేయలేని పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. పంట కాలువలు అధ్వానంగా.. మురుగునీటి కాలువలు పూడుకుపోయి నీటి యాజమాన్యం అస్తవ్యస్తంగా తయారైంది. సిబ్బంది అనుభవ లేమి, నిర్లక్ష్యంతో డెల్టా వ్యవస్థ ఇలా తయారైంది. కనీసం పూడిక తొలగింపునకు సైతం ప్రభుత్వం నిధులు ఇవ్వని దుస్థితి. ఈ సమయంలో ప్రాజెక్టు కమిటీ చైర్మన్లుగా అనుభవం ఉన్న వారిని, సమర్థులను ఎంపిక చేసి ఉంటే సరిపోయేది. కానీ, రాజకీయ పార్టీ.. సామాజిక వర్గాలు.. ప్రాంతాల ప్రాతిపదికన కొత్తవారిని ఎంపిక చేయడం, వారికి డెల్టా వ్యవస్థపై పెద్దగా అవగాహన లేకపోవడం రైతులను నిరుత్సాహానికి గురి చేస్తోంది. గోదావరి డెల్టా ప్రాజెక్టు కమిటీ ఎన్నికలు సాఫీగా సాగిపోయాయి. టీడీపీ అధిష్టానం.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయించిన వారిని చైర్మన్, వైస్ చైర్మన్లుగా డిస్ట్రిబ్యూటరీ కమిటీల (డీసీ) చైర్మన్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పదవుల పంపిణీలో అసంతృప్తులు తలెత్తకుండా గోదావరి డెల్టాను తూర్పు, మధ్య డెల్టాలుగా విభజించి, చైర్మన్, వైస్ చైర్మన్లు ఎన్నుకున్నారు. ఒక ప్రాజెక్టు కమిటీ పరిధిలో ఇద్దరు చైర్మన్ల అవసరం ఏమిటో.. వారి విధి విధానాలు, బాధ్యతలు ఏమిటో ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. మధ్య డెల్టా ప్రాజెక్టు కమిటీకి అమలాపురం, తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ కాకినాడ కలెక్టరేట్లలో శనివారం ఎన్నికలు నిర్వహించారు. గోదావరి మధ్య డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా పి.గన్నవరం డీసీ గుబ్బల శ్రీనివాస్‌ను ఎంపిక చేశారు. ఆయన నీటి సంఘాలకు పూర్తిగా కొత్త. తొలుత ఈ పదవికి కాట్రేనికోన డీసీ ఆకాశం శ్రీనివాస్ పేరు తెర పైకి వచ్చింది. గతంలో డీసీగా పనిచేసిన అనుభవం కూడా ఉండడంతో పాటు సామాజిక సమీకరణాల్లో కూడా ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. శుక్రవారం రాత్రి వరకూ శ్రీనివాస్ పేరు వినిపించగా, రాజోలు, పి.గన్నవరం జనసేన ఎమ్మెల్యేలు దేవ వరప్రసాద్, గిడ్డి సత్యనారాయణ పట్టుబట్టి పి.గన్నవరం డీసీ గబ్బుల శ్రీనివాస్‌ను ఎంపిక చేయించారు. రాజోలు నుంచి సొంత పార్టీకి చెందిన పినిశెట్టి బుజ్జి ఉన్నప్పటికీ సామాజిక సమీకరణల పేరుతో ఆయనను పక్కన పెట్టారు. ఆకాశం శ్రీనివాస్‌ను వైస్ చైర్మన్ పదవికి ఎంపిక చేసి పంపించారు. అయితే అమరావతి నుంచి వచ్చిన జాబితాలో శ్రీనివాస్ స్థానంలో కరుటూరి నర్శింహరావు పేరు రావడం గమనార్హం. ఈయన సైతం నీటి సంఘాలకు కొత్త. లోకేష్ ద్వారా చెప్పించుకుని తెర పైకి రావడంతో శ్రీనివాస్‌కు మొండిచేయే ఎదురైంది. గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా పిఠాపురం బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) డీసీ మురాలశెట్టి సునీల్ కుమార్ (జనసేన) ఎంపిక కాగా, వైస్ చైర్మన్‌గా అనపర్తి డీపీ తమలంపూడి సుధాకర్‌రెడ్డి (టీడీపీ) ఎన్నికయ్యారు. వీరిద్దరూ నీటి సంఘాలకు కొత్త కావడం విశేషం. ఈ ప్రాంతంలో కొమరిపాలెం, కోటిపల్లి, కూళ్ల డీసీలుగా ఎంపికైన కొవ్వూరి వేణుగోపాలరెడ్డి, దాట్ల వెంకట రాజగోపాలరాజు, మేకా శివ ప్రసాద్‌లకు గతంలో నీటి సంఘాల్లో పని చేసిన అనుభవం ఉంది. కొత్తగా ఎన్నికై నవారికి ఆ అనుభవం కూడా లేకపోవడం గమనార్హం. ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా బస్వా పెద్దాపురం: స్థానిక ఏలేరు ఇరిగేషన్ ప్రాజెక్టు కార్యాలయంలో శనివారం ఏలేరు ప్రాజెక్టు కమిటీ ఎన్నికలు నిర్వహించారు. కిర్లంపూడి మండలం ముక్కొల్లు గ్రామానికి చెందిన బస్వా వీర వెంకట నాగేంద్ర (టీడీపీ) చైర్మన్‌గా, పిఠాపురానికి చెందిన ఊటా ఆదివిష్ణు (జనసేన) వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కమిటీని పెద్దాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్యప్రభ, కాకినాడ నగరాభివృద్ధి సంస్థ (కౌడా) చైర్మన్ తుమ్మల రామస్వామి అభినందించారు. దాట్ల మాటకు దక్కని ప్రాధాన్యం తన పరిధిలో మధ్య డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పదవి వచ్చేలా ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఆకాశం శ్రీనివాస్‌కు చైర్మన్, వైస్ చైర్మన్ పదవి రాకపోవడంతో పాటు తన నియోజకవర్గం పరిధిలో తాళ్లరేవు డీసీ వేగేశ్న భాస్కరరాజుకు తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మప్ పదవికి పట్టుబట్టినా ఫలితం లేకపోయింది. -
ప్రజల మనిషి సుందరయ్య
సీపీఎం జిల్లా మహాసభల ప్రారంభోత్సవ సభలో వక్తలు పెద్దాపురం: కమ్యూనిస్టు దిగ్గజం పుచ్చలపల్లి సుందరయ్య ప్రజల మనిషి అని పలువురు వక్తలు కొనియాడారు. సీపీఎం జిల్లా మహాసభల సందర్భంగా స్థానిక వరహాలయ్యపేటలోని యాసలపు సూర్యారావు భవనంలో శుక్రవారం సుందరయ్య జీవిత విశేషాలతో ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. దీనిని సీపీఎం సీనియర్ నాయకుడు టీఎస్ ప్రకాష్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన, సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు బేబీరాణి మాట్లాడుతూ, నిత్యం ప్రజల కోసమే ఆలోచించిన వ్యక్తి సుందరయ్య అని అన్నారు. ఉద్యమమే ఊపిరిగా నిస్వార్థ నాయకుడిగా ఎదిగిన ఆయన ఆశయాలను, ఆలోచనలను ముందుకు తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. పార్లమెంట్‌కు సైకిల్‌పై వెళ్లి, కమ్యూనిస్టు గాంధీగా పేరొందారని, కమ్యూనిస్టులు ఎంత నిస్వార్థంగా పని చేస్తారో చెప్పడానికి సుందరయ్య జీవితమే ఉదాహరణని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కరణం ప్రసాదరావు, నాయకులు నీలపాల సూరిబాబు, గడిగట్ల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. 23న జాబ్‌మేళా కాకినాడ సిటీ: తమ కార్యాలయం ఆధ్వర్యాన ఈ నెల 23న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు వికాస ప్రాజెక్టు డైరెక్టర్ కె.లచ్చారావు శుక్రవారం తెలిపారు. టీమ్ లీజ్‌లో బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, మహీంద్ర ట్రాక్టర్స్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్, సూపర్వైజర్, మెకానిక్ హెల్పర్లు, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ అండ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్, ఒడిగోస్ కంపెనీలో అడ్మిషన్ల కో ఆర్డినేటర్, ఇండో ఎంఐఎం, హోండాయ్ మోబీస్, కేఐఎంఎల్ కంపెనీల్లో టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన 35 ఏళ్ల లోపు అభ్యర్థులు అర్హులన్నారు. వీరికి నెలకు రూ.12,800 నుంచి రూ.18 వేల వరకూ జీతం, ఆయా ఉద్యోగాలను బట్టి ఇన్సెంటివ్‌లు, భోజనం, వసతి, రవాణా సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు సోమవారం ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో కలెక్టరేట్లోని వికాస కార్యాలయానికి హాజరు కావాలని కోరారు. ఆసక్తి ఉన్న వారికి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన (డీడీయూజీకేవై) ద్వారా శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు కల్పిస్తామని లచ్చారావు తెలిపారు. నేటి నుంచి హెల్మెట్ తప్పనిసరి కాకినాడ క్రైం: జిల్లా పరిధిలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ శనివారం నుంచి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాల వల్ల చోటు చేసుకుంటున్న అధిక మరణాలకు హెల్మెట్ ధరించకపోవడమే కారణమని, ఈ నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ సూచనలతో తాజా ఆదేశాలు జారీ చేశామని వివరించారు. హెల్మెట్ ధరించకుండా నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానాలు విధిస్తామని ఎస్పీ తెలిపారు. -
చదువుకు ఇబ్బందిలేకుండా ఉండేది
నా కుమారుడు మధుబాబు తోట గోపాలకృష్ణ మున్సిపల్ హైస్కూల్లో ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు. కూలీనాలీ చేసుకునే మాకు చదివించడం ఇబ్బంది అనిపించేది. గత ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాలు అమ్మ ఒడి డబ్బులు నా ఖాతాలో జమయ్యేవి. మొదటి ఏడాది సంక్రాంతి పండగకు ముందు, తర్వాత ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో ఈ డబ్బులు అందించడంతో నా కుమారుడి చదువుకు ఇబ్బంది ఉండేది కాదు. – బండ లావణ్య, బలుసులపేట, సామర్లకోట పాఠశాలలో ఆహ్లాదకర వాతావరణం నాడు–నేడు కార్యక్రమం ద్వారా మా పాఠశాలలో కొత్త తరగతి గదులు నిర్మించి, రంగులు వేసి, సుందరంగా తయారు చేశారు. కొత్త టేబుళ్లు, ఫ్యాన్లు అమర్చారు. పాఠశాల ఆవరణలో పలు రకాలు మొక్కలు వేయడంతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. నాకు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న అనుభూతి కలుగుతోంది. – మళ్ల దుర్గా సాయి గణేష్, కొక్కొండ రామశేషగిరిరావు పంతులు ప్రభుత్వోన్నత పాఠశాల, కిర్లంపూడి -
పన్ను వసూళ్లలో పెద్దాపురం ఫస్ట్
పెద్దాపురం: రీజియన్ పరిధిలోని 31 మున్సిపాలిటీల్లో నూరు శాతం ఇంటి పన్నుల వసూళ్లతో పెద్దాపురం మొదటి స్థానంలో నిలిచిందని మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ సీహెచ్ నాగ నరసింహారావు తెలిపారు. జిల్లాలోని పట్టణాల అభివృద్ధిపై ఆయా పురపాలక సంఘాల అధికారులతో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. పిఠాపురం మున్సిపాలిటీలో పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణపై అశ్రద్ధ చూపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సచివాలయ సిబ్బంది ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ అందుబాటులో ఉండాలని చెప్పారు. సమావేశంలో పెద్దాపురం, తుని మున్సిపల్ కమిషనర్లు పద్మావతి, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా సత్యదేవుని జన్మనక్షత్ర పూజలు
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని జన్మనక్షత్ర పూజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సత్యదేవుని జన్మనక్షత్రం మఖను పురస్కరించుకుని, స్వామివారికి, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆయుష్య హోమం నిర్వహించారు. తెల్లవారుజామున 2 గంటలకు స్వామివారి ఆలయం తెరచి, స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సత్యదేవుడు, అమ్మవార్ల మూలవిరాట్లకు, శివలింగానికి పండితులు పంచామృతాలతో మహన్యాసపూర్వక అభి షేకం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను స్వర్ణాభరణాలతో అలంకరించి, సుగంధభరిత పుష్పాలతో పూజించారు. ఉదయం 6 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. దేవస్థానం ఈఓ వి.సుబ్బారావు ఈ కార్యక్రమంలో పాల్గొని, స్వామివారిని దర్శించారు. స్వామివారి యాగశాలలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు ఆయుష్య హోమం నిర్వహించారు. సత్యదేవుని దర్శించిన 25 వేల మంది సత్యదేవుని సుమారు 25 వేల మంది భక్తులు దర్శించారు. స్వామివారిని దర్శనానంతరం, భక్తులు గోశాలలో సప్తగోవులను దర్శించి, పూజలు చేశారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, ప్రదక్షిణ చేశారు. సత్యదేవుని వ్రతాలు వెయ్యి జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.20 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో 4 వేల మందికి భోజనం పెట్టారు. వనదుర్గ అమ్మవారికి చండీహోమం రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి పండితులు చండీహోమం నిర్వహించారు. ఉదయం 9 గంటలకు హోమం ప్రారంభించి 11 గంటలకు పూర్ణాహుతి నిర్వహించారు. సత్యదేవుని దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి, తొలి పావంచా వద్ద కొలువైన కనకదుర్గమ్మకు కుంకుమ పూజలు కూడా నిర్వహించారు. -
అన్నదాతకు వాయు‘గండం’
కాకినాడ సిటీ: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కొద్ది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు అన్నదాతలను కలవరపరుస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో ఇప్పటికే రెండుసార్లు ఏర్పడిన అల్పపీడనాలు రైతులను ఆందోళనకు గురి చేశాయి. గత నెల 29న అల్పపీడనం తుపానుగా మారి, దాని ప్రభావంతో నాలుగైదు రోజుల పాటు జోరుగా వర్షాలు కురడంతో రైతులు కొంత మేర నష్టపోయారు. ఈ నెల 8న ఏర్పడిన మరో అల్పపీడనం ప్రభావంతో ఐదారు రోజుల పాటు వానలు కురిశాయి. ఖరీఫ్‌లో ఆలస్యంగా నాట్లు వేసిన రైతులు కోతలకు సమాయత్తం కాగా.. నాటి వర్షాల కారణంగా ఎక్కడి పనులు అక్కడే నిలిపివేయాల్సి వచ్చింది. తాజాగా ఈ నెల 16న ఏర్పడిన అల్పపీడనం వాయుగండంగా మారనుందని, దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో సార్వా చివరి దశలో ఉన్న కొంత మంది రైతులు నాలుగు రోజులుగా వరి కోతలు నిలిపివేశారు. ఇలా నెల రోజులుగా సార్వా కోతలు కోయాలన్నా, మాసూళ్లు ప్రారంభించాలన్నా దినదినగండం అన్నట్టుగానే రైతుల పరిస్థితి మారింది. కొందరు ధైర్యం చేసి యంత్రాలతో కోతలు కోసినా, ధాన్యం సరిగ్గా ఆరక, తేమ శాతం తగ్గక తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోయారు. రోజుల తరబడి బరకాలు, పట్టాలు, టార్పాలిన్లు కప్పి ఉంచి ధాన్యం ఎండబెట్టుకోలేని దుస్థితిని ఎదుర్కొన్నారు. ఆదరాబాదరాగా.. జిల్లాలో 96 వేల హెక్లార్లలో ఖరీఫ్ వరి సాగు జరగగా.. ఇప్పటి వరకూ 73 వేల హెక్టార్లలో మాసూళ్లు పూర్తయ్యాయి. ఆలస్యంగా నాట్లు వేసిన రైతులు ఇప్పుడు కోతలకు ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో ప్రతికూల వాతావరణం వారిని కలవరపెడుతోంది. అల్పపీడనం ప్రభావంతో మంగళవారం నుంచే వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఆకాశం మేఘావృతమై బుధ, గురువారాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురవడంతో రైతులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండవచ్చనే ఆందోళనతో ధాన్యం రాశులను కాపాడుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. పట్టుబడి చేసిన ధాన్యం బస్తాలను ట్రాక్టర్లలో ఆదరాబాదరాగా సురక్షిత ప్రాంతాలకు, వీలైతే మిల్లులకు తరలిస్తున్నారు. కొంత మంది ధాన్యం రాశులపై రెండు మూడు పొరలు ప్లాస్టిక్ బరకాలు, దానిపై టార్పాలిన్లు కప్పారు. కూలీలకు డిమాండ్ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా కూలీలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ధాన్యం రాశులు పట్టడానికి, ఆరబెట్టిన ధాన్యం పోగు చేసి, బస్తాల్లో నింపడానికి, బస్తాలను సమీప రోడ్లు, పుంతలకు చేర్చడానికి, ఎండుగడ్డి ఒబ్బిడి చేయడానికి, గడ్డి మేటుగా వేయడానికి కూలీల అవసరం ఎక్కువగా ఏర్పడుతోంది. దీంతో రైతులకు కూలి ఖర్చులు రెట్టింపయ్యాయి. వాయుగుండం హెచ్చరికల నేపథ్యంలో నాలుగైదు రోజుల పాటు వరి కోతలు కోయరాదని, ఇప్పటికే నూర్చిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి, భద్రపరచుకోవాలని రైతులకు జిల్లా వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఫ నెల రోజుల్లో మూడోది ఫ వెంటాడుతున్న ప్రకృతి వైపరీత్యాలు ఫ బెంబేలెత్తుతున్న రైతులు ఫ చిరుజల్లులతో ఆందోళన భయపెడుతున్న ముప్పు వరి కోతలు కోసిన రైతులను వాయుగండం ముప్పు భయపెడుతోంది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఆకాశం ముసురేసింది. కొన్ని ప్రాంతాల్లో కోతలు కోసి, కళ్లాల్లో రాశులు పోసిన రైతులు, కుప్పలు వేసిన వారు ధాన్యాన్ని కాపాడుకునేందుకు అగచాట్లు పడుతున్నారు. ప్రకృతి విపత్తుతో రైతులు నష్టపోకుండా, పండించిన ప్రతి గింజను మద్దతు ధరకే కొనుగోలు చేసి, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – రావుల ప్రసాద్, మాజీ పీఎసీఎస్ అధ్యక్షుడు, కరప అప్రమత్తం చేశాం వాయుగుండం నేపథ్యంలో రైతులు తమ వద్ద ఉన్న ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునేందుకు టార్పాలిన్లు అందజేశాం. ప్రతి రైతు నుంచీ ధాన్యం కొనుగోలు చేస్తాం. వారు ఏవిధంగానూ నష్టపోకుండా చర్యలు తీసుకునేలా మండల వ్యవసాయాధికారులను, రైతు కేంద్రాల సిబ్బందిని అప్రమత్తం చేశాం. ఖరీఫ్ ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తున్నాం. ఇప్పటి వరకూ 99,078 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. – కె.విజయకుమార్, జిల్లా వ్యవసాయాధికారి, కాకినాడ -
టేబుల్ టెన్నిస్ పోటీలు ప్రారంభం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): క్రీడాస్ఫూర్తితో పోటీల్లో రాణించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరావు (నానాజీ) పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ సురేష్ నగరంలోని శ్రీప్రకాష్ స్కూల్లో రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీల ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర టేబుల్ టెన్నిస్ సంఘ అధ్యక్షుడు భాస్కర్రాం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడారు. టేబుల్ టెన్నిస్ జాతీయస్థాయి ఆటగాడు, కోచ్ భీష్మ పితామహా బిరుదు గ్రహీత ముక్కామల ఫొటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలకు 12 జిల్లాల నుంచి 230 మంది హాజరయ్యారు. అనంతరం అతిథిలు పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఏపీ టేబుల్ టెన్నిస్ సంఘ గౌరవ అధ్యక్షుడు రావు చిన్నారావు, కార్యదర్శి విశ్వనాఽథ, శ్రీప్రకాష్ విద్యాసంస్థల డైరెక్టర్ విజయప్రకాష్, బీవీ కృష్ణారావు, సీపోర్ట్సు సీఈఓ మురళీధర్, జిల్లా టేబుల్‌టెన్నిస్ సంఽఘ కార్యదర్శి మోహన్‌బాబు పాల్గొన్నారు. -
కట్న కానుకలకు మంగళం!
● సత్యదేవుని నిత్య కల్యాణంలో ఆగిపోయిన ఆచారం ● గతంలో ప్రతి నెలా రూ.లక్షకు పైగా ఆదాయం అన్నవరం: సత్యదేవుని నిత్యకల్యాణంలో పాల్గొన్న భక్తులు స్వామి, అమ్మవారికి కట్న కానుకలు సమర్పించే సంప్రదాయానికి పురోహితులు, అర్చకులు, సిబ్బంది మంగళం పలికారు. రత్నగిరిపై ప్రతీరోజు స్వామి, అమ్మవారికి కల్యాణం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కల్యాణంలో పాల్గొనే భక్తులు స్వామి, అమ్మవారికి నూతన వస్త్రాలు సమర్పించడం, కల్యాణం అనంతరం స్వామి, అమ్మవారికి కట్న కానుకలు సమర్పించే ఆచారం పూర్వం నుంచీ ఉంది. కొన్నేళ్లుగా ఈ ఆచారం పాటించకపోవడంతో 2023 సంవత్సరంలో అప్పటి ఈఓ చంద్రశేఖర్ అజాద్ ఆగస్టు 13వ తేదీ నుంచి భక్తులు కట్నకానుకలు సమర్పించే విధానాన్ని పునరుద్ధరించారు. దీంతో కల్యాణం చేయించే భక్తులునుద్దేశించి అర్చకస్వాములు, పురోహితులు స్వామి, అమ్మవార్లకు నూతన వస్త్రాలు సమర్పించవచ్చునని, కట్నకానుకలు చదివించాలని ప్రకటించడంతో ప్రతి రోజూ భక్తులు కట్నకానుకలు చదివించేవారు. నూతన పట్టు వస్త్రాలు దేవస్థానం వద్ద కొని వాటిని స్వామి, అమ్మవార్లకు సమర్పించేవారు. గతేడాది ఆగస్టు నుంచి ప్రతి నెలా సుమారు రూ.లక్ష కట్నకానుకల రూపంలో, రోజూ పదుల సంఖ్యలో నూతన వస్త్రాలు స్వామికి వచ్చాయి. రూ.500, అంతకన్నా ఎక్కువ మొత్తాలను రికార్డులో రాసి వారి గోత్రనామాలను పండితులు చదివి ఆశీర్వదించేవారు. అంతకు తక్కువ అయితే ఆ మొత్తాన్ని హుండీలో వేసేవారు. ఈ విధంగా 2023 సంవత్సరంలో దేవస్థానానికి సుమారు రూ.ఐదు లక్షల ఆదాయం సమకూరింది. ఆ తరువాత కట్న కానుకల చదివింపు కార్యక్రమాన్ని నిలుపుదల చేసి కేవలం పట్టు వస్త్రాల సమర్పణ మాత్రమే కొనసాగిస్తున్నారు. దీనిపై నిత్యకల్యాణం సిబ్బందిని ప్రశ్నిస్తే కట్న కానుకలు ఆపేశామని తెలిపారు. అధికారులు ఈ కట్న కానుకల చదివింపును పునరుద్ధరిస్తే దేవస్థానానికి ఆదాయంతో బాటు భక్తులు సంతృప్తి చెందుతారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. -
అధ్యాపకులు మరింత అభివృద్ధి చెందాలి
గండేపల్లి: అధ్యాపకులు మరింత అభివృద్ధి చెందాలని ప్రగతి ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ పి.కృష్ణారావు తెలియజేశారు. మండలంలోని సూరంపాలెం ప్రగతి ఇంజినీరింగ్ కళాశాలలో ఐదు రోజులపాటు నిర్వహించిన సేల్స్‌ఫోర్స్ ప్లాట్ఫార్మ్ డెవలపర్–1 అధ్యాపకుల అభివృద్ధి కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. కృష్ణారావు మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అధ్యాపకులు తమను తాము అప్‌గ్రేడ్ చేసుకుని విద్యార్థులకు శిక్షణ ఇస్తే వారు ఉద్యోగాలు పొందడం సులభమవుతుందన్నారు. రీసోర్స్ పర్సన్లుగా తమిళనాడు ఐసీటీ అకాడమీ సీనియర్ టెక్నికల్ ట్రైనర్ జె.ఆనంద్, ఫ్యాకల్టీ కో ఆర్డినేటర్ రుబియా తస్నీం వ్యవహరించి సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫార్మ్ బేసిక్స్, ట్రైల్‌హెడ్ ప్లేగ్రౌండ్, డేటా మోడలింగ్, సూత్రాలు, ధ్రువీకరణలు, లైట్నింగ్ ఆఫ్ బిల్డర్, డేటా భద్రత ఆమోద ప్రక్రియలతో రికార్డులను ఆమోదించడం, అపెక్స్ బేసిక్స్, డేటాబేస్, ట్రిగ్గర్స్ గురించి వివరించారు. డైరెక్టర్ ఎంవీ హరనాథబాబు, వైస్ ప్రెసిడెంట్ సతీష్, కె.సత్యనారాయణ, నాగేంద్ర, వివిధ కళాశాలలకు చెందిన 61 అధ్యాపకులు పాల్గొన్నారు. -
జ్యూయలరీ షాపులో చోరీకి విఫలయత్నం
అన్నవరం: స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డులోని జీవన జ్యూయలరీ షాపులో చోరీకి శుక్రవారం ఇద్దరు దుండగులు విఫలయత్నం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ...సాయంత్రం నాలుగు గంటలకు జీవన జ్యూయలరీ షాపులోకి హెల్మెట్ ధరించిన ఇద్దరు వచ్చారు. ఆ సమయంలో షాపులో యజమాని బంధువు మంగరాజు ఉన్నాడు. అతను కస్టమర్లు వచ్చారని యజమాని వరదా లక్ష్మణరావును పిలిచాడు. ఆ షాపు మేడపై ఉంటున్న యజమాని కిందకు దిగి వచ్చి వారిని హెల్మెట్ తీయమని అడిగాడు. దాంతో వారిలో ఒకడు సుత్తితో అతనిపై దాడి చేయగా మంగరాజు అడ్డుగా రావడంతో అతనిపై కూడా దాడి చేశాడు. దీంతో వారు గట్టిగా కేకలు వేయగా మేడ మీద నుంచి యజమాని భార్య రాజేశ్వరి కిందకు రాగా ఆమైపె కూడా దాడి చేశారు. అదే సమయంలో దుండగుల్లో ఒకరు ఆ షాపులోని బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు మూట కట్టాడు. అయితే ఆ జ్యుయలరీ షాపులో నుంచి అరుపులు వినిపిస్తుండడంతో స్థానికులు ఆ షాపు అద్దాల నుంచి లోపలకు చూడగా లోపల ఆ దుండగులు దాడి చేస్తున్న విషయం కనిపించింది. ఆ దుండగులు ఇద్దరు ఆ షాపులోనుంచి వెలుపలకు వచ్చి పారిపోయే ప్రయత్నం చేయగా స్థానికులు వారిని పట్టుకున్నారు. ఆ దుండగులు ఇద్దరు తొండంగి మండలం ఏ కొత్తపల్లి గ్రామానికి చెందినవారని, వారిలో ఒకరు సాఫ్ట్వేర్ ఇంజినీర్ రాజు, మరొకరు సర్వేయర్ అఖిల్‌గా గుర్తించారు. సమాచారం అందడంతో ఎస్ఐ శ్రీహరిబాబు అక్కడకు వచ్చి ఇద్దరు దుండగులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గాయపడిన షాపు యజమాని లక్ష్మణరావు, ఆయన భార్య రాజేశ్వరి, అతని బంధువు మంగరాజులను తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయని, ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారని ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
రాష్ట్ర రగ్బీ జట్టుకు గురజనాపల్లి విద్యార్థులు
24 నుంచి పాట్నాలో ఆల్ఇండియా స్కూల్‌గేమ్స్ పోటీలు కరప: రాష్ట్ర రగ్బీ జట్టుకు కరప మండలం గురజనాపల్లి పబ్బినీడి పాపారావు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు నలుగురు ఎంపికై నట్టు హెచ్ఎం ఎ.సాయిమోహన్ శుక్రవారం తెలిపారు. గత నెల 24, 25 తేదీలలో కాకినాడలోని డీఎస్ఏ క్రీడామైదానంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ అండర్–17 బాలికల విభాగంలో జరిగిన రగ్బీపోటీలలో పాఠశాల నుంచి ఎస్.వెంకటవినీల, ఎన్.చాందినిశ్రీ, ఎం.సాయిమౌనిక, పి.దివ్య, పి.మహాలక్ష్మి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జట్టు తరఫున పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచడంతో జిల్లా జట్టును ప్రథమ స్థానంలో నిలిపారు. ప్రతిభ కనబరచిన సుందర వెంకట వినీలను రాష్ట జట్టుకు ఎంపిక చేశారు. ఫస్ట్ స్టాండ్‌బైగా చాందినిశ్రీని ఎంపిక చేశారన్నారు. అండర్–19 బాలురు, బాలికల విభాగంలో కర్నూలులో జరిగిన రగ్బీపోటీలలో ప్రతిభ కనబరచిన గురజనాపల్లి విద్యార్థులు దడాల బేబీ, నిమ్మకాయల వెంకటేష్ రాష్ట్ర రగ్బీజట్టుకు ఎంపికయ్యారు. బిహార్ రాష్ట్రం పాట్నాలో ఈ నెల 24 నుంచి 30వ తేదీవరకు జరగనున్న ఆల్ ఇండియా స్కూల్‌గేమ్స్ రగ్బీ పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రజట్టు తరఫున పాల్గొంటారని పీడీ ఎన్.నాగమల్లేశ్వరరావు తెలిపారు. -
విశాఖకు ఓవరాల్ చాంపియన్ షిప్
వృద్ధురాలి సజీవ దహనం? సామర్లకోట: స్థానిక 27వ వార్డులో శుక్రవారం ఒక వృద్ధురాలు విక్రం అచ్చియ్యమ్మ (90) సజీవ దహనం అయినట్టు తెలిసింది. వృద్ధురాలి ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. మధ్యాహ్నం భోజనం చేశాక చుట్ట కాలుస్తూ మంచంపై నిద్రించడంతో సజీవ దహనం అయినట్టు కొందరు చెబుతున్నారు. టీ కాస్తుండగా అదుపు తప్పి పొయ్యిలో పడిపోవడంతో సజీవ దహనం అయిందని మరికొందరు అంటున్నారు. ఇంటిలో నుంచి పొగ రావడంతో స్థానికులు వెళ్లి చూడగా మంచం కింద వృద్ధురాలి మృతదేహం ఉన్నట్టు గుర్తించారు. విషయం తెలిసిన ఆమె బంధువులు వచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. దీనిపై కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. ముగిసిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు పిఠాపురం: రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో ఓవరాల్ చాంపియన్ షిప్ విశాఖపట్నం జిల్లా సాధించింది. ఈ నెల 19, 20 తేదీల్లో పిఠాపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి బాక్సింగ్ మెన్ బాక్సింగ్ పోటీలో విశాఖపట్నం మొదటి స్థానంలో, శ్రీకాకుళం జిల్లా రెండో స్థానంలో నిలిచాయి. ఈ పోటీల్లో 10 మంది బాక్సర్లు స్వర్ణ పథకాలు సాధించారు. ఈ బాక్సర్స్ జనవరి 6 నుంచి 14వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న జాతీయస్థాయి మెన్ బాక్సింగ్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొంటారని ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.లక్ష్మణరావు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ జిల్లా స్పోర్ట్సు డెవలప్మెంట్ ఆఫీసర్ బి.శ్రీనివాస్‌కుమార్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత డాక్టర్ ఐ వెంకటేశ్వరరావు, ఏపీ బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ బీఏ లక్ష్మణ్ దేవ్ విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. కౌన్సిలర్ రాయుడు శ్రీనివాసరావు, అలవరపు నగేష్, కేతవరపుకృష్ణ, ఆర్ఆర్బీ హెచ్ఆర్ హైస్కూల్ వైస్ చైర్మన్ సూర్యవతి పాల్గొన్నారు. -
అన్నదాతకు యంత్రలాభం
● స్ట్రా బేలర్‌తో సులువుగా ఎండుగడ్డి సేకరణ ● క్రమంగా తీరుతున్న పశుగ్రాసం కొరత ఆలమూరు: వ్యవసాయంలో వరి కోత యంత్రాల వాడడంతో పశుగ్రాసానికి ఉపయోగించే ఎండుగడ్డి నిరుపయోగంగా మారుతోంది. దీనివల్ల పాడిరైతులను ఎండి గడ్డి కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీనిని నివారించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విరివిగా స్ట్రా బేలర్ యంత్రాలను రాయితీపై అందించింది. అప్పటి వరకూ రైతులు ఇతర జిల్లాల నుంచి స్ట్రాబేలర్ యంత్రాలను తీసుకువచ్చి ఎండుగడ్డిని సేకరించేవారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాయితీ ఇవ్వడంతో స్థానికంగా లభ్యమయ్యే స్ట్రాబేలర్ యంత్రాల సాయంతో ఎండుగడ్డిని సేకరిస్తున్నారు. ట్రాక్టర్‌కు దమ్ము చక్రాలు అమర్చినట్టుగానే స్ట్రాబేలర్ యంత్రాన్ని వినియోగించి గడ్డి సేకరణ జరుపుతుండటం వల్ల ఇటు రైతులకు, అటు కొనుగోలుదారులకు లాభదాయకంగా ఉంటోంది. గతంలో స్థానికంగా ఉండే పాడి రైతులు ఒకవేళ గడ్డిని సేకరిద్దామనుకున్నా వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉండటం వల్ల యంత్రంతో కోసిన వరిగడ్డిని పొలంలోనే వదిలేసి నిప్పు పెట్టేవారు. దీంతో ఎండుగడ్డి కొరత ఎక్కువై ఏటా ధర పెరుగుతూ వస్తోంది. మరి కొంతమంది రైతులు పెట్టుబడి ఎక్కువైనా కూలీలతో కోయించి వరిగడ్డిని భద్రపరచుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో గోసంరక్షణ కేంద్రాలకు, డెయిరీఫాంలకు, పేపర్ మిల్లులకు ఎండుగడ్డి సేకరణ కష్టంగా మారింది. దీంతో వారంతా స్ట్రాబేలర్ యంత్రాలను తీసుకువచ్చి ట్రాక్టర్ సాయంతో పొలాల్లో వ్యర్థంగా పడి ఉన్న ఎండుగడ్డిని సేకరించి తీసుకువెళుతున్నారు. తమ పొలాల్లో లభ్యమయ్యే ఎండుగడ్డికి అధిక ధర లభ్యం కావడంతో అనేకమంది రైతులు సమీప పేపరుమిల్లులకు విక్రయాలు జరుపుతున్నారు, దీనివల్ల స్థానికంగా లభ్యమయ్యే ఎండుగడ్డికి విపరీతమైన డిమాండ్ ఏర్పడడంతో పాడి రైతులను తరచూ ఎండు గడ్డి కొరత వేధిస్తోంది. ఈ స్ట్రాబేలర్ యంత్రాల పనితీరును గుర్తించిన స్థానిక రైతులు రాయితీపై గతంలో మాదిరిగా ఇవ్వాలని వ్యవసాయశాఖకు విజ్ఞాపనలు చేస్తున్నారు. అందుబాటులోకి రావాలని ఆకాంక్ష డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 1.68 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా అందులో 3.38 లక్షల టన్నుల ఎండు గడ్డి లభించవలసి ఉంది. అయితే 90 శాతం మేర వరికోత యంత్రాల సాయంతోనే రైతులు మాసూళ్లు చేయడంతో కేవలం 2.5 లక్షల టన్నుల ఎండుగడ్డి మాత్రమే లభిస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. గతంలో మాదిరిగా పొలాల్లోని గడ్డిని తగులబెట్టకుండా కొంతమంది రైతులు మాత్రం స్ట్రాబేలర్ యంత్రాన్ని వినియోగించుకుని గడ్డిని సేకరించుకుంటున్నారు. స్ట్రాబేలర్ యంత్రంతో సేకరిస్తే ఎకరాకు దాదాపు రెండు టన్నుల గడ్డి లభిస్తుంది. స్ట్రాబేలర్ యంత్రం 20 కేజీల చొప్పున మూట కట్టిన గడ్డిమోపులను పొలంలోనే పడవేస్తుంది. ఎకరాకు సుమారు 90 నుంచి 105 వరకూ గడ్డి మోపులు లభిస్తున్నాయి. తమ పొలాల్లో సేకరించే ఎండుగడ్డిని మోపుల రూపంలో గడ్డిమేట్లు వేసుకుని పశువుల దాణాగా అందించే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. ఇతర పాడి రైతులు ఒక్కొక్క గడ్డిమోపునకు రూ.30 చొప్పున ధర రైతుకు చెల్లించి తీసుకువెళుతున్నారు. వరికోత యంత్రాల మాదిరిగానే స్ట్రాబేలర్ యంత్రాలు విరివిగా అందుబాటులోకి రావాలని పాడి రైతులు ఆకాంక్షిస్తున్నారు. -
అభివృద్ధా? ఆధి‘పైత్యమా’?
పిఠాపురం: టీడీపీ – జనసేన ఆధిపత్య పోరు పిఠాపురం ప్రభుత్వాస్పత్రి సాక్షిగా మరోసారి బయటపడింది. అభివృద్ధికి సంబంధించిన అసలు విషయాన్ని పక్కన పెట్టేసి.. ఎవరికి వారే తమ ఆధిపత్యం నిరూపించుకోడానికి చేసిన ప్రయత్నం రచ్చ రచ్చగా మారింది. దీనికి సంబంధించిన వివరాలివీ.. పిఠాపురంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)ను 100 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఇటీవల జీఓ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సీహెచ్‌సీకి కొత్తగా అభివృద్ధి కమిటీని నియమించారు. ఇందులో జనసేన నుంచి బొజ్జా సతీష్, టీడీపీ నుంచి వేణుం సురేష్లను నియమించారు. వీరి ప్రమాణ స్వీకారోత్సవం గురువారం సీహెచ్‌సీలో ఏర్పాటు చేశారు. దీని కోసం సిద్ధం చేసిన వేదికపై ఆస్పత్రి వర్గాలు ఏ రాజకీయ నాయకుడి ఫొటోలూ లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన నియోజకవర్గ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తమ తమ అనుచరులతో వచ్చారు. వేదికపై స్థానిక ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటో లేకుండా ఫ్లెక్సీ పెట్టడంపై జనసేన నేతలు ఆందోళనకు దిగారు. దీంతో, ఆస్పత్రి వైద్యాధికారులు వెంటనే పవన్ కల్యాణ్ ఫొటోతో పాటు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఫొటోలతో మరో ఫ్లెక్సీ తయారు చేయించి, స్టేజిపై ఏర్పాటు చేశారు. పక్కనే వర్మ, మర్రెడ్డి శ్రీనివాస్ ఫొటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. అయితే, అది అక్కడెందుకంటూ జనసేన కార్యకర్తలు ఆ ఫ్లెక్సీని తీసి పక్కన పడేశారు. దీనిపై వర్మ ఆగ్రహించారు. అయితే, తన ఫొటో ఉన్న ఫ్లెక్సీ పక్కన పడేశారనే విషయాన్ని ప్రస్తావించకుండా.. వేదికపై ఉన్న ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటో చిన్నదిగా వేశారంటూ నిలదీశారు. దీంతో ఈసారి టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. కావాలనే చంద్రబాబు ఫొటో చిన్నదిగా వేశారని ఆస్పత్రి వర్గాలతో వర్మ వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వారిని అదుపు చేయలేని పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో వర్మ తమ సభ్యుడు వేణుం సురేష్‌తో కలిసి సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. ఒక ముఖ్యమంత్రికి విలువ ఇవ్వడం ఆస్పత్రి అధికారులకు తెలియలేదని, 100 పడకల ఆస్పత్రిగా జీఓ ఇచ్చింది చంద్రబాబేనని, ఆయనను ఇలా కించపర్చడం, అవమానించడం పెద్ద తప్పుగా భావిస్తున్నామని ఆయనన్నారు. వర్మ వెళ్లిపోయాక ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లపల్లి శ్రీనివాస్, జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్‌లు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నేతగా బొజ్జా సతీష్‌తో ప్రమాణ స్వీకారం చేయించి, సమావేశాన్ని ముగించారు. ఇరు పార్టీల ఫ్లెక్సీల గొడవతో మధ్యాహ్నం జరగాల్సిన ఈ కార్యక్రమం సాయంత్రం వరకూ వివాదాలతో కొనసాగింది. సీఎం చంద్రబాబు ఫొటో చిన్నదిగా వేయడం వల్ల కాదని, ఫ్లెక్సీపై తన ఫొటో వేయనందువల్లే వివాదం సృష్టించి వర్మ వెళ్లిపోయారని జనసేన నేతలు వ్యాఖ్యానించడం కొసమెరుపు. నాయకుల అర్థం లేని ఆందోళనలతో ఏం చేయాలో తెలియక నివ్వెరపోవడం ఆస్పత్రి వైద్యాధికారుల వంతయ్యింది.ఫ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఫ్లెక్సీల రగడ ఫ పవన్ కల్యాణ్ ఫొటో లేదని జనసేన ఆందోళన ఫ పవన్ ఫొటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ఆస్పత్రి అధికారులు ఫ చంద్రబాబు ఫొటో చిన్నదిగా వేశారంటు సమావేశం బహిష్కరించిన టీడీపీ నేత వర్మ ఫ ఇదే రాజకీయమంటూ నివ్వెరపోయిన వైద్యాధికారులు -
ఏలేరులో 20.86 టీఎంసీల నీటి నిల్వలు
ఏలేశ్వరం: పరివాహక ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో తగ్గడంతో ఏలేరు జలాశయంలో నీటి నిల్వలు స్వల్పంగా తగ్గాయి. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా, గురువారం 84.93 మీటర్లుగా నమోదైంది. జలాశయం పూర్తి స్థాయి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా, 20.86 టీఎంసీల మేర నీటి నిల్వలున్నాయి. ఆయకట్టుకు 800, విశాఖకు 200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. పంపా, తిమ్మరాజు చెరువుకు నీటి విడుదలను నిలిపివేశారు. శ్రీపాద శ్రీవల్లభుని హుండీ ఆదాయం రూ 22 లక్షలు పిఆపురం: పట్టణంలోని ప్రముఖ దత్త క్షేత్రమైన శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానానికి హుండీల ద్వారా రూ 22,05,551 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఆర్.సౌజన్య తెలిపారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ తనిఖీదారు వి.ఫణీంద్ర కుమార్ ఆధ్వర్యాన గురువారం హుండీల లెక్కింపు నిర్వహించారు. గత జూన్ 29 నుంచి ఇప్పటి వరకూ ఈ ఆదాయం సమకూరిందని ఈఓ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. రత్నగిరిపై భక్తుల రద్దీ అన్నవరం: పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో రత్నగిరి సత్యదేవుని ఆలయ ప్రాంగణం గురువారం కిక్కిరిసిపోయింది. టూరిస్టు బస్సులు, వివిధ వాహనాల్లో శబరిమల వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో సత్యదేవుని దర్శించుకున్నారు. వీరికి ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయ ప్రాంగణంలో రద్దీ ఏర్పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆలయం ప్రాంగణం, వ్రత మండపాలు భక్త జనసందోహంతో నిండిపోయాయి. సుమారు 30 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించారని అధికారులు అంచనా వేశారు. స్వామివారిని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, శ్రీకృష్ణుడికి పూజలు చేశారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. సత్యదేవుని వ్రతాలు 1,200 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. సత్యదేవుని నిజరూప దర్శనం రత్నగిరి వాసుడు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, శంకరుడు భక్తులకు నిజరూపంలో దర్శనమిచ్చారు. ప్రతి రోజూ పట్టువస్త్రాలు, స్వర్ణ, వజ్రాభరణాలతో దర్శనమిచ్చే స్వామి, అమ్మవారు, శంకరుల మూలవిరాట్టులను పుష్పమాలలతో మాత్రమే అలంకరించారు. నేడు చండీహోమం రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం చండీహోమం నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ హోమం, అనంతరం పూర్ణాహుతి నిర్వహిస్తారు. రూ.750 టికెట్టుతో భక్తులు ఈ హోమంలో పాల్గొనవచ్చు. నేటి నుంచి ఆర్టీసీ కార్గో మాసోత్సవాలు కాకినాడ: ఏపీఎస్ ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాలు శుక్రవారం నుంచి జనవరి 19 వరకూ నిర్వహిస్తున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ కార్గోలో కేజీ నుంచి 50 కేజీల బరువు వరకూ బుక్ చేసిన వస్తువులను 10 కిలోమీటర్ల వరకూ డోర్ డెలివరీ చేస్తామన్నారు. ఆర్టీసీ కార్గో సేవలపై మరింత అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. -
వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాలకు కొత్త అధ్యక్షులు
కాకినాడ: వైఎస్సార్ సీపీ జిల్లా అనుబంధ విభాగాలకు నూతన అధ్యక్షుల నియామకం జరిగింది. ఈ మేరకు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదంతో పార్టీ కేంద్ర కార్యాలయం ఈ నియామకాలను ప్రకటించింది. వివిధ నియోజకవర్గాల్లో క్రియాశీలకంగా పని చేస్తున్న పలువురిని ఎంపిక చేసి, నూతన కమిటీలను ప్రకటించారు. జిల్లా బూత్ కమిటీ విభాగం అధ్యక్షుడిగా ఒమ్మి రఘురామ్ (జగ్గంపేట), వలంటీర్ల విభాగం అధ్యక్షుడిగా మేడిశెట్టి రమణ (బుజ్జి) (పెద్దాపురం), జిల్లా రైతు విభాగం అధ్యక్షుడిగా లంకా ప్రసాద్ (తుని) నియమితులయ్యారు. జిల్లా ఎస్టీ విభాగం అధ్యక్షునిగా చింతల రాజు (ప్రత్తిపాడు), క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షునిగా దడాల జాషువా (కాకినాడ రూరల్), విద్యార్థి విభాగం అధ్యక్షునిగా పూసల అనిల్ (కాకినాడ రూరల్), గ్రీవెన్స్ సెల్ విభాగం అధ్యక్షునిగా తోటకూర శ్రీనివాస్(కాకినాడ రూరల్)లను నియమించారు. కాకినాడ సిటీ నియోజకవర్గానికి చెందిన ఇల్లి రాజబాబు (బీసీ సెల్), ఎండీ బాషా (మైనార్టీ సెల్), బాదం మధుసూదనరావు(వాణిజ్య విభాగం), ఆదిత్య కుమార్ (లీగల్ సెల్), పేపకాయల కృష్ణప్రియ (సోషల్ మీడియా సెల్), డాక్టర్ మల్లిక్ (డాక్టర్ల సెల్) జిల్లా అధ్యక్షులుగా నియమితులయ్యారు. అలాగే మహిళా విభాగం అధ్యక్షురాలిగా వర్ధినీడి సుజాత(పిఠాపురం), దివ్యాంగుల విభాగం అధ్యక్షుడిగా వమ్మి గురవయ్య(పిఠాపురం)లను నియమించారు. -
ప్రసాద్ .. మరింత జాప్యం
అన్నవరం: దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పదేళ్ల క్రితం ప్రారంభించిన పిలిగ్రిమేజ్ రీజువినేషన్ అండ్ స్పిరిచ్యువల్ అగ్మెంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీము పనులు మరింత జాప్యం కానున్నాయి. వైఎస్సార్ సీపీకి చెందిన అప్పటి కాకినాడ ఎంపీ వంగా గీత, నాటి ప్రజాప్రతినిధుల చొరవతో అన్నవరం దేవస్థానం గతంలోనే ప్రసాద్ పథకానికి ఎంపికై ంది. ఈ పదేళ్లలో ఎన్నో అవాంతరాలు దాటుకుని, చివరకు సుమారు రూ.20 కోట్లతో రత్నగిరిపై వివిధ నిర్మాణాలు చేపట్టేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ‘ప్రసాద్’తో చేపట్టే పనులివీ.. ఫ ప్రసాద్ నిధులతో అన్నవరం దేవస్థానంలో పలు పనులు చేపట్టాలని గతంలోనే నిర్ణయించారు. ఆ మేరకు గత మార్చి ఏడో తేదీన ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుంచి ఈ పనులకు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఫ దేవస్థానంలోని పాత టీటీడీ భవనం స్థలంలో రూ.10 కోట్లతో రెండంతస్తుల్లో అన్నదాన భవనం నిర్మించాలని నిర్ణయించారు. ఫ అలాగే, ప్రస్తుత అన్నదాన భవనం పక్కనే రూ.6 కోట్లతో క్యూ కాంప్లెక్స్ నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఫ ప్రకాష్ సదన్ భవనం వెనుక ఉన్న ప్రస్తుత పార్కింగ్ స్థలంలో అటు సత్యగిరి, ఇటు రత్నగిరికి దగ్గరగా ఉండేలా రూ.3 కోట్లతో పురుషులు, మహిళలకు విడిగా టాయిలెట్ల బ్లాక్‌లు నిర్మించాలని నిర్ణయించారు. ఫ అదే విధంగా సత్రాల వద్ద నుంచి ఆలయానికి, వ్రత మండపాల మధ్య భక్తులు రాకపోకలు సాగించేందుకు వీలుగా రూ.కోటితో రెండు బ్యాటరీ కార్లు నడపాలని ప్రణాళిక రూపొందించారు. టెండర్ల రద్దు అందుకేనా! ఈ పనుల కోసం గత అక్టోబర్ 3న టెండర్లు పిలిచారు. అదే నెల 25న ఈ టెండర్లు తెరచి, ఖరారు చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకూ ఆ పని జరగలేదు. ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా జరిగిన ఈ టెండర్ల ప్రక్రియలో టెక్నికల్ బిడ్‌లో అర్హత సాధించి, ఫైనాన్షియల్ బిడ్‌లో లోయెష్ట్ కొటేషన్ దాఖలు చేసిన వారికే ఈ టెండర్లు ఖరారు చేయాలి. ఈ టెండర్లలో 12 ప్రముఖ నిర్మాణ సంస్థలు పాల్గొన్నాయి. వీటిల్లో ఒకటి రాష్ట్ర మంత్రికి చెందిన సంస్ధ అని, దానికి ఈ టెండర్లు కట్టబెట్టేందుకే రాష్ట్ర పర్యాటక అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని గతంలో విమర్శలు వచ్చాయి. అయితే, నిధులు విడుదల కాకపోవడమే టెండర్లు తెరవకపోవడానికి ప్రధాన కారణమని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. తాజాగా నిధులు విడుదలయ్యాయని, అయితే గత టెండర్లు కాలపరిమితి ముగిసినందున వాటిని రద్దు చేసి, మళ్లీ పిలవనున్నామని అంటున్నారు. మళ్లీ పిలుస్తాం అన్నవరం దేవస్థానంలో ప్రసాద్ స్కీమ్ టెండర్లకు సంబంధించి నిధులు విడుదల చేస్తూ, ఈ నెల 2న ఆదేశాలు జారీ అయ్యాయి. పాత టెండర్లు తెరవడానికి సమయం మించిపోయింది. అందువలన ఉన్నతాధికారులతో చర్చించి, పాతవి రద్దు చేసి, కొత్తగా మళ్లీ టెండర్లు పిలుస్తాం. – ఈశ్వరయ్య, ఇన్చార్జి సీఈ, పర్యాటక శాఖ ఫ రత్నగిరిపై నిర్మాణాల టెండర్లు రద్దు ఫ ఈ నెలలో మరోసారి పిలిచే అవకాశం ఫ గతంలో దాఖలు చేసిన 12 సంస్థలు ఫ ఇప్పటి వరకూ తెరవని పర్యాటక శాఖ ఫ కూటమి మంత్రి సన్నిహితునికి కట్టబెట్టేందుకే ఆలస్యమంటూ గతంలోనే విమర్శలు -
కుక్కుటేశ్వరా.. మన్నించు
పిఠాపురం: పవిత్ర పాదగయ క్షేత్రంలో వరుసగా అపచారాలు జరుగుతున్న పట్టించుకుంటున్న వారే లేకుండా పోయారు. సనాతన ధర్మానికి కేరాఫ్‌గా చెప్పుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇలాకా.. పిఠాపురంలోని సుప్రసిద్ధ కుక్కుటేశ్వరస్వామి క్షేత్రంలోనే.. వరుసగా చోటు చేసుకుంటున్న అపవిత్ర ఘటనలు భక్తులను కలవరపరుస్తున్నాయి. దేశంలోని మూడు గయా క్షేత్రాల్లో ఒకటి.. అష్టాదశ శక్తి పీఠాల్లో పదోది.. త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయ స్వామి అవతారంగా భక్తులు కొలిచే శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మస్థలంగా ప్రసిద్ధి చెందిన దివ్యభూమి పిఠాపురం. ఇంతటి ప్రసిద్ధి పొందిన ఈ పట్టణంలో కొలువైన పాదగయ క్షేత్రాన్ని దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు కొన్ని రోజులుగా కాసులు కురిపించే ఆలయంగా మాత్రమే చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలయ ప్రతిష్టను దెబ్బ తీసేలా వరుసగా అపచారాలు జరుగుతున్నా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదు. అపచారాల పరంపర ఫ ఇటీవల మహిళా అఘోరీని కుక్కుటేశ్వరస్వామి వారి గర్భగుడిలోకి అనుమతించారు. దీనిపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. నిబంధనలకు విరుద్ధగా వివస్త్రగా ఉన్న ఆమెను ఆలయంలోకి ఎలా అనుమతించారని ఆలయ అధికారులపై భక్తులు మండిపడ్డారు. ఫ ఇటీవలి కార్తిక మాసోత్సవాల సమయంలో అన్య మతస్తుడిని ఆలయంలో నియమించారు. ఆ వ్యక్తితో ఏకంగా మూలవిరాట్టుకు అభిషేకాలు చేసే పాలు అందజేసే పనులు చేయిస్తూండటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విశ్వ హిందూ పరిషత్ నాయకులు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ ఇటీవల పాదగయ క్షేత్రం దత్తాత్రేయ మండపంలోని యజ్ఞ వేదికలో ఆలయ రసీదు పుస్తకాలు వేసి, దహనం చేయడం తీవ్ర దుమారం రేపింది. పవిత్రమైన ఆలయ అగ్నిగుండంలో కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరీదేవి చిత్రాలు ఉన్న పుస్తకాలు వేసి, దహనం చేయడంపై భక్తులు తీవ్రంగా మండిపడ్డారు. ఫ తాజాగా స్వామి వారి పవిత్ర ప్రసాదంలో పురుగులు వచ్చాయి. దీనిపై భక్తుల ఫిర్యాదు మేరకు దేవదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్జేసీ) సుబ్బారావు, డిప్యూటీ కమిషనర్ రమేష్‌బాబు విచారణ నిర్వహించారు. అయితే, ఈ ఘటనకు బాధ్యత వహించాల్సిన ఈఓను పక్కన కూర్చోబెట్టుకుని విచారణ చేయడంపై భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ విచారణ సందర్భంగా జనసేన నేతలు పాదగయలో తిష్ట వేయడం పైనా విమర్శలు వచ్చాయి. ఫ భాద్రపద మాసంలో వచ్చే పితృపక్షంలో వేలాదిగా ప్రజలు తమ పితృదేవతాలకు పాదగయ క్షేత్రంలో పిండ ప్రదానాలు నిర్వహించారు. ఆ సందర్భంగా తమ విశ్వాసం ప్రకారం పిండాలను ఆలయ పుష్కరిణిలో కలిపేవారు. దీనిని ఎప్పటికప్పుడు శుభ్రపరచకపోవడంతో పుష్కరిణి జలాలు దుర్గంధభరితంగా మారాయి. పితృపక్షం ముగిసిన అనంతరం ఆశ్వయుజ మాసం ప్రారంభమై, శరన్నవరాత్ర ఉత్సవాలు మొదలయ్యాయి. ఆ సమయంలో పుష్కరిణి జలాలను తొలగించే పని చేపట్టారు. దీంతో శరన్నవరాత్ర ఉత్సవాల సందర్భంగా పాదగయ పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు చేసే అవకాశం లేకుండా పోయింది. ఫ ఆలయంలో ఇలా వరుస అపచారాలు జరుగుతున్నా దేవదాయ శాఖ ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. లోటుపాట్లు లేకుండా చర్యలు పాదగయ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తాం. ఇటీవల వరుసగా జరుగుతున్న ఘటనలపై పకడ్బందీగా విచారణలు జరిపి తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం. నేను కొత్తగా బాధ్యతలు తీసుకోవడం వల్ల కొన్ని విషయాలు ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. – కాట్న జగన్మోహన్ శ్రీనివాస్, ఈఓ, పాదగయ పారదర్శకంగా విచారణ విచారణ పారదర్శకంగానే నిర్వహించాం. భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – సుబ్బారావు, దేవదాయ శాఖ ఆర్జేసీ ఫ పాదగయ క్షేత్రంలో ఆగని అపచారాలు ఫ తాజాగా ప్రసాదంలో పురుగులు ఫ గతంలోనూ వరుస ఘటనలు ఫ విచారణలతోనే సరిపెడుతున్న అధికారులు ఫ మండిపడుతున్న భక్తులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలి కాశీ తరువాత అంతటి పుణ్యస్థలిగా భావించే పవిత్ర పుణ్యక్షేత్రం పాదగయలో ఇన్ని అపచారాలు, అధర్మాలు జరుగుతున్నా దేవదాయ శాఖ ఉన్నతాధికారులు విచారణల పేరుతో కాలక్షేపం చేయడం అనుమానించాల్సిన విషయం. ఆలయంలో ఎవరి వల్ల తప్పులు జరుగుతున్నా ఈఓ బాధ్యత వహించాల్సి ఉంటుంది. వరుస అపచారాలపై విచారణలు చేయడం తప్ప తగిన చర్యలు తీసుకున్న ఆనవాళ్లు లేవు. కింది స్థాయి సిబ్బందిని బలి చేయడం ఎంత వరకూ సమంజసమో ఉన్నతాధికారులే చెప్పాలి. ప్రసాదాన్ని ఎంత పవిత్రంగా చూడాలి? నిత్యం పరిశీలించి నాణ్యతను గుర్తించాల్సిన అధికారి సరిగ్గా పట్టిచుకోకపోతే ఇలాగే తప్పులు జరుగుతూంటాయి. ఉన్నతాధికారులు ఇప్పటికై నా కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేకుంటే భక్తులు ఉద్యమించే పరిస్థితి వస్తుంది. – కొండేపూడి శంకరరావు, సామాజిక కార్యకర్త, పిఠాపురం -
జనసేన ఇన్చార్జికి చేదు అనుభవం
కొత్తపల్లి: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఆయన ప్రతినిధిగా ఉన్న జనసేన పార్టీ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్‌కు చేదు అనుభవం ఎదురైంది. తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలపై ఆందోళన చేస్తున్నా.. ఏనాడైనా గ్రామంలోకి వచ్చారా అంటూ ఆయనను యు.కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామ శివారు కోనపాపపేటలో స్థానిక మత్స్యకారులు అడ్డుకున్నారు. దీంతో ఆయన కొంతసేపు కారులోనే ఉండిపోవాల్సి వచ్చింది. అల్పపీడనం ప్రభావంతో సముద్ర కోతకు గురైన కోనపాపపేట తీర ప్రాంతాన్ని పరిశీలించేందుకు గురువారం శ్రీనివాస్ ఆ గ్రామానికి వచ్చారు. తీరంలో ఏర్పాటు చేసిన పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్థాలను పైపులైన్ల ద్వారా సముద్రంలోకి విడుదల చేయడంతో మత్స్య సంపద అంతరించిపోతోందని, మత్స్యకారులు అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్య సంపద అంతరించిపోతే మత్స్యకారుల జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు. పరిశ్రమలకు వ్యతిరేకంగా తాము ఆందోళనలు చేస్తున్నా తమ గ్రామం వైపు ఏనాడైనా కన్నెత్తి చూశారా అని శ్రీనివాస్‌ను మత్స్యకారులు నిలదీశారు. ఓట్లు వేయడానికేనా మత్స్యకారులు అని నిలదీశారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే కోతకు గురవుతున్న తీర ప్రాంతానికి శాశ్వత రక్షణ చర్యలు చేపడతామన్న పవన్ కల్యాణ్ మాటలు ఏమయ్యాయని సూటిగా ప్రశ్నించారు ఈ విషయాలను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకు వెళ్తానని హామీ ఇవ్వడంతో శ్రీనివాస్‌ను మత్స్యకారులు విడిచిపెట్టారు. ఫ కోనపాపపేటలో అడ్డుకున్న మత్స్యకారులు ఫ సమస్యలపై ఆందోళనలు చేసే పట్టవా అని నిలదీత -
చినుకుతో కునుకు దూరం
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం రైతులకు నష్టం లేకుండా చర్యలు తీసుకున్నాం. సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో వ్యవసాయ అధికారులను అప్రమత్తం చేశాం. రైతులు వరి నూర్పిడులు చేస్తే వర్షానికి తడవకుండా పాలిథిన్ బరకాలను కప్పాలి. పనలపై ఉన్న వరిని త్వరగా కుప్పలుగా వేయాలి. కోతలు కోసే రైతులు వాయిదా వేసుకోవాలి. రైతులు నష్టపోకుండా అవగాహన కల్పిస్తున్నాం. – సుంకర బులిబాబు, ఏడీఈ, తుని తుని: ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అంది వచ్చే సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలు రైతులకు నిద్ర పట్టనివ్వడం లేదు. రైతులపై ప్రకృతి కన్నెర్ర జేసిందా అన్నట్టు దూసుకొస్తున్న వరుస తుపానులతో వ్యవసాయం సంక్షోభంలో పడుతోంది. జిల్లాలో గోదావరి డెల్టాలో ఇప్పటికే కోతలు, నూర్పిళ్లు, ధాన్యం అమ్మకాలు జరిగాయి. మెట్ట ప్రాంతంలోని తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల పరిధిలో వర్షాలు ఆలస్యం కావడంతో వరి నాట్లు సకాలంలో వేయలేదు. దీంతో పంట పక్వానికి రావడానికి ఎక్కువ సమయం పట్టింది. ప్రస్తుతం వరి కోతలు జరుగుతున్నాయి. ఎక్కువ శాతం పంట పనలపై ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షం కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏడాది పాటు కష్టపడి పండించిన పంట వర్షానికి తడిస్తే కోనే నాథుడు లేక పెట్టుబడి రాదని, ప్రయివేటు వ్యాపారుల నుంచి తెచ్చిన అప్పును చెల్లించలేమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ పరిస్థితి తుని వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో ఐదు మండలాల్లో ఖరీఫ్ సీజన్లో 14,266 హైక్టార్లలో వరి సాగు చేశారు. 6,437 హెక్టార్లలో కోతలు జరగగా, ఓపెన్ మార్కెట్లో 8,019 మెట్రిక్ టన్నుల విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం తుని, తొండంగి, కోటనందూరు, రౌతులపూడి, శంఖవరం మండలాల పరిధిలో 1,478 హైక్టార్లలో పంట పనలపై ఉంది. కుప్పల రూపంలో 13,252 మెట్రిక్ టన్నులు, కళ్లాలపై 573 మెట్రిక్ టన్నులు ఉంది. ప్రస్తుతం కురుస్తున్న స్వల్పపాటి వర్షాలతో ఇబ్బంది ఉండదని, భారీ వర్షాలు పడితే రైతులకు నష్టం తప్పదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం రైతులను నిలువునా ముంచింది. గత ప్రభుత్వం రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులను అందించింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తామని చెప్పి మోసం చేసింది. రైతులను పట్టించుకొనకపోగా ప్రస్తుతం తడిసిన ధాన్యాన్ని కోనుగోలు చేయడం లేదు. మెట్టలో వరి ఒకే పంట పండుతుంది. అది కూడా వరుణుడు పుణ్యమాని తడిస్తే రైతులు నష్టపోతారు. వ్యవసాయ శాఖ అధికారులు సబ్ డివిజన్ పరిధిలోని మండలాలు, గ్రాామాల్లో పర్యటించి రైతులకు సూచనలు అందిస్తున్నారు. ˘ ధాన్యం తడిస్తే ధర తగ్గుతుంది నాకున్న నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాను. తాండవ నీరు, వర్షాల వల్ల పంట బాగా పండింది. పంట పక్వానికి రావడంతో ఇటీవల కోత కోశాను. ఇందులో ఎకరం పంటను కుప్ప వేశాను. మరో మూడు ఎకరాలు పనలపై ఉంది. ప్రస్తుతం అల్పపీడనం ప్రభావంతో చినుకులు పడుతున్నాయి. ధాన్యం తడిస్తే ధర తగ్గిపోతుంది. నాలుగు ఎకరాలకు రూ.1.20 లక్షలు పెట్టుబడి పెట్టాను. గత ప్రభుత్వంలో రైతు భరోసా వచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు. –ఎల్లపు రామసూరి సత్యనారాయణ, రైతు, బొద్దవరం మెట్ట రైతుకు అల్పపీడనం కష్టాలు పనలపై వరి పంట ఒబ్బిడి చేసుకునే ప్రయత్నంలో అన్నదాతలు తుని సబ్ డివిజన్లో పరిధిలో.. మండలం వరి సాగు (హైక్టార్లలో) కోతలు అమ్మినది పనలపై కుప్పలుగా కళ్లాల్లో (మెట్రిక్ టన్నుల్లో) తుని 2,939 776 26 55 4,600 0 తొండంగి 4,900 3,232 1,735 360 5,890 60 కోటనందూరు 3,907 1,127 135 800 1,658 455 రౌతులపూడి 1,855 795 73 205 453 58 శంఖవరం 665 507 50 58 651 0 మొత్తం 14,266 6,437 8,019 1,478 13,252 573