ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలి

Published Tue, Apr 1 2025 12:33 PM | Last Updated on Tue, Apr 1 2025 2:33 PM

ప్రభుత్వ విద్యారంగాన్ని  కాపాడుకోవాలి

ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలి

కాకినాడ సిటీ: ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలని యూటీఎఫ్‌ కుటుంబ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఐ.ప్రసాదరావు అన్నారు. యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ సూరిబాబు అధ్యక్షతన కాకినాడలో సోమవారం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెంచే లక్ష్యంతో రూపొందించిన ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ కరపత్రాన్ని ప్రసాదరావు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, ఉన్న పోస్టులు కాపాడుకోవడానికి, డీఎస్సీ ద్వారా నూతన పోస్టులు భర్తీ చేసుకునేందుకు ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ చాలా కీలకమని అన్నారు. గ్రామాల్లోని అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మోడల్‌ స్కూల్‌ పేరుతో కొన్ని ఊరి బడులను మూయడం తగదని హితవు పలికారు. ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికీ విద్యారంగానికి అవసరమైనన్ని నిధులను ప్రభుత్వాలు మంజూరు చేయడం లేదన్నారు. రాజ్యాంగం ప్రకారం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య, నాణ్యమైన విద్య అందరికీ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, కానీ దీనికి విరుద్ధంగా ప్రభుత్వాలు ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులతో పాటు ప్రైవేటు స్కూళ్లలో చదివే ధనిక వర్గాల వారికి కూడా తల్లికి వందనం వంటి ఆర్థిక సహకారం ఇస్తే ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పడిపోతుందని చెప్పారు. ప్రైవేటు పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ విద్యార్థుల్లో ఆల్‌రౌండ్‌ ప్రతిభకు బదులు బట్టీ విధానం ద్వారా ర్యాంకులు, గ్రేడులకు ప్రాధాన్యం ఇస్తున్నాయని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత, నమోదు పెంచుకుంటూ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునేందుకు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు, ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. రూ.కోట్లు ఖర్చు చేసి యూనిఫాం, పాఠ్య, నోట్‌ పుస్తకాలు, బ్యాగ్‌లు, షూస్‌, మధ్యాహ్న భోజన పథకం వంటివి ఇస్తున్నా ప్రభుత్వ పాఠశాలల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంపై అందరూ దృష్టి సారించాలని ప్రసాదరావు పిలుపునిచ్చారు.

పోలిసెట్‌కు ఉచిత శిక్షణ

కాకినాడ సిటీ: పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పోలిసెట్‌కు యూటీఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యాన ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. జగ్గంపేటలోని యూటీఎఫ్‌ హోంలో ఏప్రిల్‌ 3 నుంచి 29వ తేదీ వరకూ ప్రతి రోజూ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ ఉచిత శిక్షణ ఇస్తామని యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి పీవీవీ సత్యనారాయణ తెలిపారు. ఉచిత పోలిసెట్‌ శిక్షణకు సంబంధించిన కరపత్రాన్ని యూటీఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు సాయిరాం, ప్రధాన కార్యదర్శి నగేష్‌ ఆవిష్కరించారు. జగ్గంపేట, ఏలేశ్వరం, గండేపల్లి, పెద్దాపురం, కిర్లంపూడి చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉచిత స్టడీ మెటీరియల్‌, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, డైలీ ప్రాక్టీస్‌ టెస్ట్‌లు నిర్వహించి, ఎక్కువ మంది అర్హత సాధించేలా తర్ఫీదు ఇస్తారని సత్యనారాయణ తెలిపారు.

నేటి నుంచి రేషన్‌

బియ్యం పంపిణీ

ఈ– కేవైసీ తప్పనిసరి

ఏప్రిల్‌ 30 వరకూ గడువు పొడిగింపు

కాకినాడ సిటీ: జిల్లా వ్యాప్తంగా 420 ఎండీయూ వాహనాల ద్వారా 6,43,161 మంది రేషన్‌కార్డుదారులకు ఫోర్టిఫైడ్‌ రైస్‌, ఇతర నిత్యావసర సరకులను మంగళవారం నుంచి యథావిధిగా పంపిణీ చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనా తెలిపారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రేషన్‌ బియ్యం అక్రమంగా రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారులపై జిల్లాలో 2023లో 70, 2024లో 85, 2025లో ఇప్పటి వరకూ 32 చొప్పున కేసులు నమోదు చేశామని వివరించారు. అత్యధికంగా మార్చి నెలలో 13 కేసులు నమోదయ్యాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 6,43,161 కార్డుల్లోని 18,31,681 మంది సభ్యులకు గాను ఇప్పటి వరకూ 16,52,981 మందికి ఈ–కేవైసీ పూర్తి చేశామని తెలిపారు. ఇంకా 1,78,700 మందికి ఈ–కేవైసీ చేయాల్సి ఉందన్నారు. కార్డుదారులకు ఈ–కేవైసీ తప్పనిసరని, గడువు ఏప్రిల్‌ 30వ తేదీ వరకూ పెంచారని తెలిపారు. పౌరసరఫరాలు, రెవెన్యూ సిబ్బంది, రేషన్‌ డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లతో ఈ–కేవైసీ చేయించుకోవచ్చని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement