‘ఉపాధి’ బకాయిలు వెంటనే చెల్లించాలి | - | Sakshi

‘ఉపాధి’ బకాయిలు వెంటనే చెల్లించాలి

Apr 2 2025 12:06 AM | Updated on Apr 2 2025 12:06 AM

‘ఉపాధి’ బకాయిలు  వెంటనే చెల్లించాలి

‘ఉపాధి’ బకాయిలు వెంటనే చెల్లించాలి

కాకినాడ సిటీ: ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు వెంటనే వేతన బకాయిలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. సంఘం అధ్యక్షుడు టేకుమూడి ఈశ్వరరావు అధ్యక్షతన స్థానిక సుందరయ్య భవన్‌లో మంగళవారం కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, ఏప్రిల్‌ మొదటి వారంలోనే ఉపాధి హామీ పనులు ప్రారంభించి, వేసవి మూడు నెలలూ పూర్తి స్థాయిలో పనులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం నత్తనడకన నడుస్తోందని, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు తగ్గించడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని విమర్శించారు. జిల్లాలో మూడు నెలలుగా ఉపాధి హామీ పనులు నామమాత్రంగా జరిగాయన్నారు. చేసిన పనులకు కూడా డబ్బులు విడుదల కాక, కూలీలు నానా అవస్థలూ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కూలి కేవలం రూ.7 పెంచి, కనీస వేతనం రూ.307గా నిర్ణయించారని తెలిపారు. ఇక నుంచి కూలీలకు కచ్చితంగా రూ.307 వేతనం అందేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ చట్టంలో ఉన్న సదుపాయాలన్నీ కూలీలకు కల్పించాలన్నారు. మేట్లకు పారితోషికం ఇవ్వాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి కేఎస్‌ శ్రీనివాస్‌, జిల్లా నాయకుడు కూరాకుల సింహాచలం, ఉపాధ్యక్షులు దుప్పి అదృష్టదీపుడు, చొల్లంగి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా

ముగిసిన టెన్త్‌ పరీక్షలు

సోషల్‌ పరీక్షకు 342 మంది గైర్హాజరు

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): గత నెల 17వ తేదీన ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. చివరి రోజు సోషల్‌ పరీక్ష నిర్వహించారు. దీనికి 27,407 మంది హాజరు కాగా 342 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు సక్రమంగా నిర్వహించేందుకు సహకరించిన రెవెన్యూ, పోలీస్‌, ట్రెజరీ అధికారులకు జిల్లా విద్యా శాఖాధికారి పిల్లి రమేష్‌ కృతజ్ఞతలు తెలిపారు.

మట్టి లారీలను

అడ్డుకుని ఆందోళన

పి.గన్నవరం: ఊడిమూడిలంక నుంచి వస్తున్న మట్టి లారీల వల్ల తమ వంతెన ధ్వంసం అవుతున్నదంటూ జి.పెదపూడి గ్రామస్తులు మంగళవారం ఆందోళన నిర్వహించారు. లంక నుంచి వస్తున్న మట్టి లారీలను వంతెన వద్ద అడ్డుకుని ఆందోళన చేపట్టారు. మట్టి లారీల రాకపోకల వల్ల వంతెన బలహీనపడుతోందని జి.పెదపూడి సర్పంచ్‌ దంగేటి అన్నవరంతో పాటు ఆందోళనకారులు వివరించారు. ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక ప్రజలకు ఈ వంతెన ఆధారమన్నారు. లారీల రాకపోకల వల్ల వంతెన మార్జిన్‌లో ఉన్న మంచినీటి పైపు లైన్లు ధ్వంసం అవుతున్నాయని వివరించారు. వేరే వంతెన మీదుగా మట్టి లారీలు తరలించుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో మరో వర్గానికి చెందిన కొందరు అక్కడికి రావడంతో వివాదం తలెత్తింది. కొన్నేళ్లుగా ఈ వంతెన మీదుగా మట్టి లారీలు వెళ్తున్నాయని, అప్పుడు ఎందుకు అడ్డగించలేదని వారు ఆందోళన కారులను నిలదీశారు. వీరికి మట్టి ర్యాంపు నిర్వాహకుడి అనుచరులు కూడా తోడవడంతో ఇరువర్గాల మధ్య వివాదం పెరిగింది. విషయం తెలుసుకున్న పి.గన్నవరం ఎస్సై బి.శివకృష్ణ అక్కడికి చేరుకుని, ఇరువర్గాలతో చర్చించారు. ఒకానొక దశలో వివాదం ముదరడంతో వారిని పోలీసులు చెదరగొట్టారు. తహసీల్దార్‌ సమక్షంలో అధికారులతో చర్చించి వంతెన సమస్యను పరిష్కరించుకోవాలని ఎస్సై సూచించారు. అనంతరం లారీలను పంపించి వేశారు.

4 నుంచి స్లాట్‌

బుకింగ్‌తో రిజిస్ట్రేషన్లు

అమలాపురం టౌన్‌: జిల్లాలోని 15 రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ నెల 4 నుంచి స్లాట్‌ బుకింగ్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు జిల్లా రిజిస్ట్రార్‌ సీహెచ్‌ నాగలింగేశ్వరరావు తెలిపారు. అమలాపురం రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్లాట్‌ బుకింగ్‌ విధానం అమలుపై కార్యాలయ సిబ్బందికి నాగ మల్లేశ్వరరావు అవగాహన కల్పించారు. భూముల రిజిస్ట్రేషన్లను కొనుగోలు, అమ్మకందార్లు తమకు నచ్చిన సమయంలో ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకుని ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Video

View all
Advertisement