
క్షయ రహిత జిల్లాకు కృషి
కాకినాడ సిటీ: జిల్లాను క్షయ రహితంగా మార్చేందుకు కలసికట్టుగా కృషి చేద్దామని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పిలుపునిచ్చారు. ప్రపంచ టీబీ దినం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టరేట్‌లో ఆయన ప్రారంభించారు. ఈ ర్యాలీ జెడ్పీ కార్యాలయం మీదుగా జ్యోతిబా ఫూలే విగ్రహం వరకూ కొనసాగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, క్షయ అంటువ్యాధి అని అన్నారు. రెండు వారాలకు మించిన దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, ఛాతిలో నొప్పి, కఫంలో రక్తపు జీరలు, రాత్రి పూట చెమట పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, మెడ వద్ద వాపు తదితర లక్షణాలుంటే టీబీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. టీబీ సోకేందుకు ఎక్కువగా అవకాశం ఉన్న 60 ఏళ్లు దాటిన వారిని గుర్తించి, బీసీజీ టీకాలు వేయిస్తామని జేసీ తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జె.నరసింహ నాయక్ మాట్లాడుతూ, వైద్యులు సూచించిన మేరకు మందులు వాడుతూ, తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరు నెలల్లో టీబీని నయం చేయవచ్చని అన్నారు. వ్యాధిగ్రస్తులకు పోషకాహారం, ఇతర సహాయ సహకారాలు అందించేందుకు నిక్షయ మిత్రలు కృషి చేయాలని కోరారు. వ్యాధిగ్రస్తులు ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ.700 ఇవ్వడం ద్వారా నిక్షయ మిత్రలుగా మారవచ్చన్నారు. ఎన్‌పీఐ కార్యక్రమంలో భాగంగా క్షయ రోగులకు ప్రభుత్వం రూ.1,000 చొప్పున అందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా టీబీ కంట్రోల్ అధికారి డాక్టర్ ఆర్.రమేష్, డాక్టర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.