
విశ్వావసంతానికి నాంది
కాలం పరమాత్మ స్వరూపం
‘కాలాత్మక పరమేశ్వర రామ’ అనే కీర్తన కాలం పరమేశ్వర స్వరూపమని చెబుతోంది. విశ్వావసు అనే శబ్దానికి ‘విశ్వమంతా వ్యాపించే కాంతి కిరణాలు గలది’ అనే అర్థాన్ని గ్రహించవచ్చు. వసు అంటే సంపద అని కూడా అర్థం ఉంది. నూతన తెలుగు సంవత్సరం అందరి జీవితాల్లో సిరిసంపదలు, సుఖసంతోషాలు నింపుతుందని ఆశిద్దాం.
– శలాక రఘునాథశర్మ,
మహామహోపాధ్యాయ, రాష్ట్రపతి పురస్కార గ్రహీత
● సంస్కృతి సాంప్రదాయ భక్తి సమ్మేళనమే ఉగాది ● నేటి నుంచి శ్రీవిశ్వావసు సంవత్సరం ప్రారంభం
● మనలోని కోపాన్ని, ద్వేషాన్ని, జయించి, ప్రేమ సహనంతో ముందుకు సాగాలి ● ఉగాది పచ్చడిలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు
శ్రీవిశ్వావసు అంటే..
ఈ సంవత్సరానికి రాజు సూర్యుడు. విశ్వావసు అంటే అన్నీ సమృద్ధిగా లభించేది అని అర్థం. ఈ సంవత్సరం ఉగాది ఆదివారం కావడంతో సూర్యునికి నవనాయక ఆధిపత్యం లభించింది. రాజు రవి, మంత్రి చంద్రుడు, సేనాధిపతి కుజుడు. మన దేశం అభివృద్ధి పథంలో కొనసాగుతుంది. సేనాధిపతి కుజుడు కావడం వలన సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనపడుతుంది. అకాల వర్షాలు, వర్షాకాలంలో తీవ్ర ఉష్ణోగ్రతలు, మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తుపానుల వంటి విపత్తులు కనిపిస్తాయి. తృణధాన్యాలకు గిరాకీ పెరుగుతుంది. బంగారం ధరలకు రెక్కలు వస్తాయి.
– చిలకమర్తి ప్రభాకర చక్రవర్తిశర్మ,
తెలుగు, ఆంగ్ల పంచాంగకర్త, రాజమహేంద్రవరం
ఉగాది పచ్చడిలో ఆరోగ్య రహస్యం
ఉగాది రోజున అందరూ స్వీకరించే ఉగాది పచ్చడి మన జీవితంలోని సుఖదుఃఖాలకు సూచిక. ఒక్కో రుచికి ఒక్కో అర్థం. జీవితంలో ఆనందం, రుచికి సంకేతంగా ఉప్పును పరిగణిస్తారు. తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితులను పులుపు తెలియజేస్తుంది. బాధను దిగమింగాలని లేదా భరించాలని వేప పువ్వులోని చేదు సూచిస్తుంది. సంతోషానికి ప్రతీకగా బెల్లాన్ని భావిస్తారు. సహనం కోల్పోవడాన్ని కారం సూచిస్తుంది. పచ్చి మామిడి ముక్కల్లో తగిలే వగరు రుచి కొత్త సవాళ్లను ఎదుర్కోవడం గురించి తెలియజేస్తుంది.
– డాక్టర్ పీవీబీ సంజీవరావు, తెలుగు శాఖాధిపతి, ఎస్‌కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల,
రాజమహేంద్రవరం

విశ్వావసంతానికి నాంది

విశ్వావసంతానికి నాంది