
వెంకన్న కల్యాణోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
కొత్తపేట: వాడపల్లి వేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవాలకు తరలివచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేసి, ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని కోనసీమ జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ దేవదాయ శాఖ అధికారులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు సూచించారు. ఈ నెల 7 నుంచి 13 వరకు కళ్యాణోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై గురువారం ఆలయ ఆవరణలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్ మహేష్‌కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏడు రోజుల పాటు జరిగే అన్ని కార్యక్రమాలు ప్రధానంగా 8వ తేదీన జరిగే రథోత్సవం, రాత్రి జరిగే కల్యాణోత్సవం తిలకించడానికి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ ఆలయం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నత శాఖల అధికారులతో చర్చించి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ బందోబస్తుకు అవసరమైన సిబ్బంది జాబితా సిద్ధం చేయాలని సబ్ డివిజన్ అధికారులకు సూచించారు. జాయింట్ కలెక్టర్ నిషాంతి, ఆర్డీఓ పి.శ్రీకర్, డీఎస్పీ సుంకర మురళీమోహన్ మాట్లాడుతూ తమ పరిధిలో తీసుకునే ఏర్పాట్లను, ముందస్తు చర్యలను వివరించారు. తహసీల్దార్ టి.రాజరాజేశ్వరరావు, ఎంపీడీవో బీకేఎస్‌ఎస్‌వీ రామన్, రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్, ఎస్సై ఎస్.రాము, ఆర్ అండ్ బీ శాఖ డీఈఈ రాజేంద్ర, ఏఈ మణికుమార్, ఎలక్ట్రికల్ ఇంజినీర్ అశోక్, వాడపల్లి ఉప సర్పంచ్ పోచిరాజు బాబురావు, లొల్ల సర్పంచ్ కాయల జగన్నాథం, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.