పుష్కలంగా నీరు.. రైతుకు తప్పని కన్నీరు | - | Sakshi
Sakshi News home page

పుష్కలంగా నీరు.. రైతుకు తప్పని కన్నీరు

Published Fri, Mar 28 2025 12:29 AM | Last Updated on Fri, Mar 28 2025 12:29 AM

పుష్క

పుష్కలంగా నీరు.. రైతుకు తప్పని కన్నీరు

సాక్షి, అమలాపురం: ‘గోదావరి డెల్టాలో ఈ ఏడాది రబీ సాగుకు నీటి ఎద్దడి తలెత్తే ప్రశ్నే లేదు. డెల్టాలో రబీ సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు కలిపి 90 టీఎంసీల నీరు అందిస్తే సరిపోతుంది. ఈ ఏడాది గోదావరిలో ఇన్‌ఫ్లో ఆశాజనకంగా ఉండటంతో పాటు పోలవరం వద్ద నిల్వ చేసిన నీరు.. సీలేరు పవర్‌ జనరేషన్‌ ద్వారా వచ్చే నీరు కలిపి రబీకి సమృద్ధిగా సాగు నీరు అందిస్తాం’ అని కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పింది. కానీ, ఆచరణలోకి వచ్చేసరికి ఇందుకు విరుద్ధమైన పరిస్థితి క్షేత్ర స్థాయిలో కనిపిస్తోంది. గతంలో సాగు మధ్యలో ఉన్న సమయంలో అంటే ఫిబ్రవరి తరువాత నుంచి నీటి ఎద్దడి మొదలయ్యేది. కానీ ఈసారి సాగు ఆరంభం నుంచే.. అంటే రైతులు నాట్లు వేసిన నాటి నుంచి ఇప్పటి వరకూ పలు దఫాలుగా వరి చేలు నీటి ఎద్దడి బారిన పడటం.. రైతులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేయడం సర్వసాధారణంగా మారింది.

అధికంగా నీరు ఇచ్చినా..

గోదావరి డెల్టాలో డిసెంబర్‌ 1 నుంచి మార్చి 31 వరకూ రబీ షెడ్యూలు ఉంటుంది. అయితే, వాస్తవానికి ఏప్రిల్‌ 15 నుంచి 20వ తేదీ వరకూ పంట కాలువలకు నీరు సరఫరా చేస్తూంటారు. గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాల పరిధిలోని సుమారు 8.86 లక్షల ఎకరాల్లో వరి, ఇతర పంటల సాగుకు, తాగు, పారిశ్రామిక అవసరాలకు కలిపి మొత్తం 90 టీఎంసీల నీరు సరిపోతుంది. రబీ షెడ్యూల్‌ గత ఏడాది డిసెంబర్‌ 7న ప్రారంభమైంది. మూడు డెల్టాల పరిధిలోని ప్రధాన పంట కాలువలకు ఇప్పటి వరకూ 96.326 టీఎంసీల నీటిని అందించారు. ఇప్పటికీ పంట కాలువలకు అధికంగానే నీరు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గురువారం తూర్పు డెల్టాకు 3,200, మధ్య డెల్టాకు 2 వేలు, పశ్చిమ డెల్టాకు 5,500 క్యూసెక్కులు కలిపి మొత్తం 10,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అయినప్పటికీ శివార్లలో నీరందడం లేదంటూ రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.

డెల్టాలోని పంట పొలాలకు ఇంచుమించు ఏప్రిల్‌ 20వ తేదీ తేదీ వరకూ సాగునీరు ఇవ్వాల్సి ఉంది. ఈ మేరకు మరో 15 నుంచి 20 టీఎంసీల వరకూ నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో నీరు విడుదల చేసినా కూడా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా తూర్పు, మధ్య డెల్టాలతో పాటు పిఠాపురం బ్రాంచ్‌ కెనాల్‌ (పీబీసీ) పరిధిలోని శివారు, మెరక ప్రాంతాల్లో వరి చేలకు నీరందని దుస్థితి ఏర్పడింది. వరి పొలాలు నెర్రెలు విచ్చుతున్నాయి. నీటి యాజమాన్యం విషయంలో జలవనరుల శాఖ అధికారులు వైఫల్యమే దీనికి ప్రధాన కారణమనే విమర్శలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి.

మోటార్ల నీరు అదనం

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని తూర్పు, మధ్య డెల్టాల్లో 4.80 లక్షల ఎకరాల్లో వరి ఆయకట్టు ఉంది. దీనిలో సుమారు 4.20 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగు జరిగిందని అంచనా. పంట కాలువలకు విడుదల చేసిన నీటితో పాటు డెల్టాలో పలుచోట్ల వ్యవసాయ విద్యుత్‌ మోటార్లతో చేలకు నీరు అందిస్తారు. కోనసీమ జిల్లా పరిధిలో రామచంద్రపురం, మండపేట; తూర్పు గోదావరి జిల్లా పరిధిలో రాజమహేంద్రవరం రూరల్‌, అనపర్తి; కాకినాడ జిల్లాలో కరప, సామర్లకోట తదితర ప్రాంతాల్లో మోటార్లతో చేలకు నీటిని అందిస్తారు. ఇలా కనీసం ఒక టీఎంసీ నీరు వినియోగిస్తారు.

మురుగునీటి కాలువలపై క్రాస్‌బండ్లు వేయడం ద్వారా కూడా నీటిని చేలకు మళ్లించినట్టు జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. శివారు, మెరక ప్రాంతాల్లో రైతులు మురుగు నీటి కాలువల నుంచి మోటార్ల ద్వారా నీటిని పంట పొలాలకు మళ్లిస్తున్నారు. ఈ పద్ధతిలో కనీసం 7 టీఎంసీల నీటిని సేకరిస్తామని అధికారులు చెబుతున్నారు. అంటే ఇప్పటి వరకూ ఇచ్చిన 96.326 టీఎంసీలకు ఇది అదనం. ఏవిధంగా చూసినా ఇప్పటి వరకు 103 టీఎంసీల నీటిని వినియోగించినట్టు అంచనా. అయినప్పటికీ తూర్పు, మధ్య డెల్టాల్లో ఏకంగా 10 శివారు మండలాల్లో నీటి ఎద్దడి ఏర్పడటానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని రైతులు చెబుతున్నారు.

నారుమడి నుంచీ నీటి పాట్లే..

దాళ్వా సాగు మొదలుపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకూ పలు సందర్భాల్లో నీటి ఎద్దడి ఏర్పడింది. కీలకమైన సమయంలో నీరు అందకపోవడంతో దిగుబడులు కూడా తగ్గిపోతాయనే భయం వేస్తోంది.

– చిక్కం సీతారామ ప్రసాద్‌, ఉప్పలగుప్తం

బోర్లు అక్కరకు వచ్చాయి

ఏటా రబీలో నీటి ఎద్దడి తప్పడం లేదు. ఖరీఫ్‌లో కొంత వరకూ నీరు వస్తోంది. కానీ, రబీలో అస్సలు రావడం లేదు. గతంలో మా పొలం వద్ద వేసిన బోర్ల వల్ల కీలక సమయంలో పంట కాలువల ద్వారా నీరందకున్నా మోటార్ల ద్వారా తడి అందిస్తున్నాం. దీనివల్లే రబీని గట్టెక్కించుకుంటున్నాం.

– సూరంపూడి రవి, గొల్లల చెరువు,

రామచంద్రపురం మండలం

ఎద్దడికి కారణాలివీ..

రబీలో గోదావరి డెల్టాలకు ఇప్పటి వరకూ

నీటి విడుదల ఇలా (టీఎంసీలలో)

తూర్పు డెల్టా 29.719

మధ్య డెల్టా 18.146

పశ్చిమ డెల్టా 48.461

మొత్తం డెల్టా సాగుకు

అవసరమైన నీరు : 90 టీఎంసీలు

ఇప్పటి వరకూ

సరఫరా చేసింది : 96.326 టీఎంసీలు

ఇంకా అవసరమైన నీరు : 15 నుంచి

20 టీఎంసీలు

ఎప్పటి వరకూ అవసరం : ఏప్రిల్‌ 20 వరకూ

ఫ కాటన్‌ బ్యారేజీ వద్ద నీటి లభ్యత

ఫ అయినా సాగు

ఆరంభం నుంచీ కష్టాలే..

ఫ క్రాస్‌బండ్లు,

విద్యుత్‌ మోటార్ల ద్వారా సేకరణ

ఫ అయినప్పటికీ శివారు..

మెరక ప్రాంతాలకు ఎద్దడి

ఫ ప్రభుత్వ వైఫల్యంతోనే

డెల్టాలో ఈ దుస్థితి

ఫ డెల్టాలోని పంట కాలువలు, చానల్స్‌ అధ్వానంగా ఉన్నాయి. ఈ ఏడాది రబీ సాగు ఆరంభంలో షార్ట్‌ క్లోజర్‌ పనులు చేస్తామని చెప్పారు. కానీ పూడికతీత, గుర్రపుడెక్క తొలగింపు పనులు చేయలేదు.

ఫ దీనికితోడు పంట కాలువల ద్వారా వస్తున్న నీటిని ఆక్వా రైతులు అడ్డదారిలో మోటార్లతో తోడుతున్నారు. దీంతో శివారుకు సాగునీరండం లేదు.

ఫ అధికారులు వంతుల వారీ విధానం అమలు చేస్తున్నా రైతులకు సమాచారం అందించడం లేదు. దీనివల్ల కూడా చేలు ఎండిపోయే పరిస్థితి దాపురించింది. పంట ఎండకున్నా దిగుబడి గణనీయంగా పడిపోయే ప్రమాదం ఏర్పడింది.

ఫ పైగా మోటార్లతో నీటిని సేకరించాల్సి రావడం వల్ల రైతులకు ఎకరాకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకూ పెట్టుబడి పెరిగింది.

పుష్కలంగా నీరు.. రైతుకు తప్పని కన్నీరు1
1/3

పుష్కలంగా నీరు.. రైతుకు తప్పని కన్నీరు

పుష్కలంగా నీరు.. రైతుకు తప్పని కన్నీరు2
2/3

పుష్కలంగా నీరు.. రైతుకు తప్పని కన్నీరు

పుష్కలంగా నీరు.. రైతుకు తప్పని కన్నీరు3
3/3

పుష్కలంగా నీరు.. రైతుకు తప్పని కన్నీరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement