
భావనారాయణునికి శఠగోపమేనా !
కాకినాడ రూరల్: దేవుడి భూములు అన్యాక్రాంతమవ్వకుండా కాపాడవల్సిన బాధ్యత పాలకులు, అధికారులపై ఉంటుంది. ఆదాయం కోసమో, ఇతర అవసరాల కోసమో దేవుడికి చెందిన కోట్ల రూపాయల విలువైన భూములు అమ్మేయాలనుకుంటే భక్తుల మనోభావాలు దెబ్బతీసినట్టే అవుతుంది. ఇప్పటికే విలువైన భూములు చేతులు మారినా పట్టించుకోని దేవదాయ శాఖ అధికారులు ఉన్న భూములను కూడా కాపాడుకోలేని దుస్థితిలో ఉన్నారు. ఆదాయం లేదనే నెపంతో ఏ విధంగా ఇతరులకు అప్పగించాలా అని చూడడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ప్రసిద్ధి గాంచిన విష్ణు క్షేత్రమైన సర్పవరంలోని రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణ స్వామి ఆలయం భూములకు రక్షణ లేకుండా పోయింది. గ్రామంలో ఆలయం ఎదురుగా గోశాలను ఆనుకుని మాధవపట్నం రోడ్డును చేర్చి సుమారు 1.79 ఎకరాల భూమి ఖాళీగా ఉండడంతో దానిపై కొందరి కన్ను పడింది. దీనికి వంత పాడేలా 11 సంవత్సరాలు లీజు అనే అంశాన్ని దేవదాయ శాఖ అధికారులు తెరపైకి తీసుకురావడం అనుమానాలు రేకెత్తిస్తోంది. గోశాలలోని గోవులు ఈ ఖాళీ స్థలంలో పశు గ్రాసం తినేందుకు అనుకూలంగా ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జనసేన నేతలు చాలా గోవులను ధారాదత్తం చేశారు. ఇప్పుడు ఖాళీ స్థలంపై దృష్టి పడడంతో దానిని వాణిజ్య అవసరాల నిమిత్తం 11 సంవత్సరాల లీజుకు ఇచ్చేందుకు దేవదాయ శాఖ కమిషనర్ నుంచి ఉత్తర్వులు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ విలువైన స్థలం ప్రైవేట్ పరం చేసేలా టెండర్లు పిలవడంతో పాటు వేలం వేసేందుకు సర్పవరం ఆలయ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఒక్కసారి ప్రైవేట్ పరమైతే తరువాత న్యాయపరమైన లిటిగేషన్ల ద్వారా అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంటుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు సర్పవరం గ్రామంలోని భావనారాయణ స్వామి ఆలయానికి చెందిన సుమారు 18ఎకరాల భూమిని బుధవారం ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎండోమెంట్ డీసీ డీఎల్‌వీ రమేష్‌బాబును వెంటబెట్టుకుని పరిశీలించారు. కోట్ల రూపాయల విలువైన ఈ దేవుడిని భూమిని స్టేడియం నిర్మాణం కోసం ధారాదత్తం చేయాలని చూస్తున్నారు. ఈ విషయాన్ని ప్రకటించకుండా మాములుగా పరిశీలించేందుకు వచ్చినట్టు డీసీ చెప్పడం వెనుక రహస్యం ఏమిటని గ్రామస్తులు ఆరా తీస్తున్నారు. దీనిపై ఈఓ ఎం.లక్ష్మినారాయణను వివరణ కోరగా సర్పవరం భావనారాయణ స్వామి దేవస్థానానికి చెందిన భూమి ఎకరం 79 సెంట్లు ఖాళీగా ఉండడంతో వేలం పాట ద్వారా ఆదాయం పొందేందుకు దేవదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. త్వరలో 11 సంవత్సరాల లీజు గడువుతో వేలం నిర్వహిస్తామన్నారు. దేవస్థానానికి చెందిన 18ఎకరాలు భూములు డీసీ, ఎమ్మెల్యే పరిశీలన చేశారని, కారణం తనకు తెలియదన్నారు.
దేవుడి భూములపై కొందరి కన్ను
ఆదాయం కోసమని 1.79
ఎకరాల వేలానికి రంగం సిద్ధం
స్టేడియం కోసమని మరో 18 ఎకరాల
ధారాదత్తానికి ఎమ్మెల్యే పరిశీలన