మరో మహిళకు తీవ్ర గాయాలు
గండేపల్లి/జగ్గంపేట: గోకవరం–జగ్గంపేట ఆర్‌అండ్‌బీ రహదారిపై జగ్గంపేట వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై రఘునాథరావు వివరాల మేరకు, జగ్గంపేట మండలం గోవిందపురానికి చెందిన ఇళ్ల వరహాలు(48) మోటార్ సైకిల్‌పై జగ్గంపేట వైపు వస్తున్నాడు. అదే సమయంలో గోకవరం మండలం జగన్నాథపురానికి చెందిన బొందల నాగేశ్వరరావు అనే నాగు (28) తన సోదరి పితాని దుర్గతో కలిసి మోటార్ సైకిల్‌పై స్వగ్రామం వెళుతున్నారు. బి.కొత్తూరు గ్రామంలో వినాయకుడి ఆలయం వద్దకు వచ్చేసరికి రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో అదుపుతప్పి అటుగా వస్తున్న లారీ వెనుక చక్రాల కింద పడడంతో వరహాలు, నాగు తల భాగాలు నుజ్జయి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన గంగ అపస్మారక స్థితికి చేరుకుంది. సమాచారం అందుకున్న ఎస్సై రఘునాథరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్షతగాత్రురాలు దుర్గను జగ్గంపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలించారు. మృతుడు వరహాలుకు భార్య గంగ, కొడుకు, కుమార్తె ఉన్నారు.
జగన్నాథపురంలో విషాద ఛాయలు
గోకవరం మండలం జగన్నాథపురంలో బొందల నాగేశ్వరరావు(నాగు) మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నప్పుడే నాగు తండ్రి మృతి చెందగా, అతడి అన్నయ్య ఎనిమిదేళ్ల క్రితం విద్యుదాఘాతంతో మరణించాడు. దీంతో నాగు హైదరాబాద్‌లో కూలీ పనులు చేస్తూ, తల్లిని పోషిస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో నాగు మృతి చెందాడన్న విషయం తెలుసుకుని అతడి బంధువులు భోరున విలపించారు.
లారీ కింద పడి ఇద్దరి దుర్మరణం


