కాకినాడ క్రైం: సమాజ హితానికి, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను సుసాధ్యం చేసేలా ప్రజలకు పోలీసులు చేరువ కావాలని పలువురు ఉపాధ్యాయులు కోరారు. ‘చేరువ’ పేరుతో ఎస్పీ బిందుమాధవ్ అధ్యక్షతన జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం రాత్రి నిర్వహించిన సదస్సులో జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాల ఉపాధ్యాయులు 200 మంది పాల్గొన్నారు. పోలీసుల పనితీరు, రానున్న రోజుల్లో సమాజంలో మరింత మంచి మార్పు చోటు చేసుకోవడంలో పోలీసుల పాత్ర అనే అంశాలపై చర్చించారు. జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం ఎక్కువైందని అధ్యాపకులు అన్నారు. దురలవాట్లతో యువత పెడదోవ పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలు నిర్వీర్యం కాకుండా ఉండేందుకు పోలీసులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. మద్యం, మత్తులో జోగుతున్న వారి వ్యవహార శైలితో మహిళలు, బాలికలు, యువతులు నానా అగచాట్లూ పడుతున్నారన్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలతో రోడ్డు ప్రమాదాలకు కారకులవుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని ఎస్పీ బిందుమాధవ్ అన్నారు. శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లేలా, నిబంధనలు ఉల్లంఘించే వారి వివరాలు, ఫిర్యాదులను 94949 33233, 112 నంబర్ల ద్వారా తమకు తెలియజేయాలని కోరారు.
ఫ మత్తు, ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు
ఫ పోలీసులకు ఉపాధ్యాయుల సూచన