
పరీక్ష కేంద్రాల్లో ‘నన్నయ’ వీసీ తనిఖీ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆదికవి నన్నయ యూనివర్సిటీ నిర్వహిస్తున్న డిగ్రీ, బీఈడీ, లా పరీక్ష కేంద్రాలను ఉప కులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని వీఎస్ లక్ష్మీ మహిళా కళాశాల, ప్రగతి డిగ్రీ కళాశాలను సందర్శించారు. పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 109 కేంద్రాల్లో 22 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. వేసవి నేపథ్యంలో ఎటువంటి అసౌకర్యం లేకుండా, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వీసీ ప్రసన్నశ్రీ సూచించారు.