ఉగాది అందరికీ శుభాలు ఇవ్వాలి
పరిపూర్ణానంద స్వామి
కాకినాడ రూరల్: విశ్వావసు నూతన సంవత్సరం ఉగాది అందరికీ శుభాలు ఇవ్వాలని పరిపూర్ణానంద స్వామి ఆకాంక్షించారు. స్థానిక రమణయ్యపేట పీఠంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన పంచాంగ శ్రవణం చేశారు. తెలుగు నూతన సంవత్సరంలో సుందరేశ్వర సమేత ఐశ్వర్యాంబిక అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరూ భక్తిభావంతో ముందుకు సాగాలన్నారు. భమిడి చారిటబుల్ ట్రస్ట్ ప్రచురించిన పంచాంగం ప్రతులను పరిపూర్ణానంద స్వామి ఆవిష్కరించారు. కార్యక్రమంలో భమిడి ట్రస్ట్ చైర్మన్ శివమూర్తి రమాదేవి, న్యాయవాది కొమ్మూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, కవి డాక్టర్ వేదుల శిరీష పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో వృద్ధులకు నూతన వస్త్రాలు అందజేశారు.
కారు ఢీకొని
వ్యక్తి మృతి
రాజమహేంద్రవరం రూరల్: కారు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన దివాన్‌చెరువు జాతీయరహదారిపై ఆదివారం తెల్లవారు జామున జరిగింది. పోలీసులు కథనం ప్రకారం దివాన్‌చెరువు కంకరగట్టు ప్రాంతానికి చెందిన సుంకర బాబూరావు (64) అదే గ్రామంలో శ్రీరామపురం రోడ్డులో కోల్డ్ స్టోరేజ్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజాము 4.30 గంటల సమయంలో జాతీయరహదారిపై ఉన్న టీటైమ్‌కు వెళ్లి టీతాగి శ్రీరామపురం రోడ్డులోకి వెళ్లేందుకు జాతీయ రహదారి దాటుతున్నాడు. ఈ లోగా అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో పైకి ఎగిరి కిందపడడంతో తలకు బలమైన గాయమై బాబూరావు మృతిచెందాడు. బాబూరావు సోదరుడు సుంకర త్రిమూర్తులు ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీస్‌స్టేషన్ ఎస్సై సీహెచ్‌వీ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


