
ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం
● కాకినాడ పోర్టు నుంచి
ఎగుమతులకు శ్రీకారం
● తొలివిడతగా 12,500 మెట్రిక్
టన్నుల రవాణా
● జెండా ఊపి ప్రారంభించిన
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్పీన్స్ దేశానికి నౌక ద్వారా ఎంటీయూ–1010 రకం బియ్యం రవాణాను తెలంగాణ జలవనరులు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. ఆయన హైదరాబాద్ నుంచి కాకినాడ పోర్టుకు హెలికాప్టర్‌లో వచ్చారు. హైదరాబాద్‌లో ఇటీవల ఇంటర్నేషనల్ ఎక్స్‌పో జరిగింది. ఆ సందర్భంగా హైదరాబాద్‌లోని ఫిలిప్పీన్స్ ఎంబసీ ద్వారా జరిగిన ఒప్పందం మేరకు తొలి విడతగా రూ.45 కోట్ల విలువైన 12,500 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 280 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి జరుగుతోందన్నారు. రాష్ట్ర అవసరాలు తీరగా మిగిలిన బియ్యాన్ని తెలంగాణ వరి రైతులకు మేలు జరిగేలా ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాలకు ఎగుమతి చేస్తామని చెప్పారు. తెలంగాణలో పోర్టు లేని నేపథ్యంలో డ్రై పోర్టులు నిర్మించాలని అప్పటి తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు ప్రయత్నించినా కార్యరూపం దాల్చలేదని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవతో ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చిందన్నారు. ఈ మేరకు ఫిలిప్పీన్స్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. కాకినాడ పోర్టు నుంచి నౌక ద్వారా 8 లక్షల టన్నుల బియ్యం ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుందని, తొలి విడతగా 12,500 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేశామని వివరించారు. ఫిలిప్పీన్స్ ప్రభుత్వం తరఫున ఆదిత్య బిర్లా గ్లోబల్ ట్రేడింగ్ (సింగపూర్) పీటీఈ లిమిటెడ్ ఈ రవాణా చేయనుంది. వియత్నాంకు చెందిన ఎంవీ ట్రోన్గ్–ఎన్ షిప్ ద్వారా ఈ ఎగుమతి జరిగింది. తొలిసారిగా జరిగిన ఈ అరుదైన కార్యక్రమాన్ని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం