సంఘ కార్యదర్శిపై రైతుల ఆరోపణ
ఐ.పోలవరం: టి.కొత్తపల్లి వ్యవసాయ సహకార సంఘంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. రైతులకు చెందాల్సిన వడ్డీ రాయితీ సహా, ఇతరత్రా నిధులను సంఘ కార్యదర్సి కె.తిరుమలకుమార్ స్వాహా చేసినట్టు రైతులు ఆరోపించారు. ఇతనిపై చర్యలు తీసుకోవాలంటూ డీసీసీబీ ఉన్నతాధికారులకు, స్థానిక ఎమ్మెల్యేకు లిఖితపూర్వకంగా రైతులు ఫిర్యాదు చేశారు. తమ పేర్లతో కూడా పెద్దఎత్తున రుణాలు తీసుకున్నట్టు వారు అనుమానం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే, టి.కొత్తపల్లి వ్యవసాయ సహకార సంఘంలో కార్యదర్శి తిరుమలకుమార్ ఎనిమిదేళ్లుగా అక్రమాలకు పాల్పడుతూ, తమకు చెందాల్సిన రాయితీలను దారి మళ్లించినట్టు రైతులు ఆరోపించారు. ఇటీవల సంఘానికి మంజూరైన రూ.24 లక్షలను కాజేశాడని, మూడు శాతం రావాల్సి న వడ్డీ రాయితీని రైతులకు ఎగనామం పెట్టాడని చెప్పారు. ఏడేళ్లుగా భవన కార్యాలయంలో నివాసం ఉంటూ, నిబంధనలకు విరుద్ధంగా హెచ్‌ఆర్‌ఏ కింద ఇప్పటివరకు సుమారు రూ.10 లక్షలు దండుకున్నాడని రైతులు ఆ ఫిర్యాదులో ఆరోపించారు. ధాన్యం విక్రయాల్లో రైతులకు చెందాల్సిన హమాలీ చార్జీలు కూడా కై ంకర్యం చేసినట్టు వివరించారు. కార్యాలయ ఖర్చులు, రైతు రుణాలను తిరిగి చెల్లించే ప్రక్రియలో భారీఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు రైతులు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకు మొరపెట్టుకున్నారు. దీనిపై మురమళ్ల డీసీసీబీ బ్రాంచ్ మేనేజర్ జీబీ మోహన్‌ను వివరణ కోరగా, టి.కొత్తపల్లి రైతుల నుంచి ఫిర్యాదు అందిందని, తక్షణమే సూపర్‌వైజర్ ఎస్‌వీ శ్రీరామ్‌కుమార్‌ను విచారణ చేపట్టాలని ఆదేశించామన్నారు. నివేదిక రాగానే ఉన్నతాధికారులకు నివేదించి, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.