
టోల్ ఎగ్గొట్టేందుకు అడ్డదారులు
కిర్లంపూడి: టోల్ ఫీజులు ఎగ్గొట్టేందుకు అడ్డదారుల్లో గ్రామాల మధ్యలోంచి వెళ్లేందుకు భారీ వాహనాల డ్రైవర్లు వెనుకాడడంలేదు. మండల పరిధి కృష్ణవరంలోని టోల్‌గేట్ వద్ద ఫీజు ఎగ్గొట్టేందుకు బూరుగుపూడి ఊరు శివారున పొలవరం కాలువ గట్టు మీదుగా కృష్ణవరం ఊరు మధ్యలో నుంచి సుమారు 60–65 టన్నుల ఇసుక లోడుతో నిత్యం వందల సంఖ్యలో భారీ వాహనాలు వెళుతున్నాయి. దీంతో కృష్ణవరంలోని గ్రామస్తులు గురువారం లారీలను అడ్డుకున్నారు. భారీ ఇసుక లారీలు గ్రామం మధ్యలో నుంచి వేగంగా వెళ్లడంతో ఏ సమయాన ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే మార్గంలో ఎంపీపీ ప్రభుత్వ పాఠశాల ఉండడంతో విద్యార్థులకు ఏ ముప్పు వాటిల్లుతుందోనని పలువురు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు సామర్థ్యాన్ని మించి ఇసుక లోడులు వెళ్లడం వల్ల సీసీ రోడ్డు పాడైపోతుందన్నారు. దీంతో పాటు ఇళ్లల్లోకి దుమ్ముధూళీ రావడంతో పాటు ఇళ్ల గోడలు బీటలు వారుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామాల్లోంచి లారీల రవాణాను ఆపకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.