
రూ.171.33 కోట్లతో అన్నవరం దేవస్థానం బడ్జెట్
అన్నవరం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి రూ.171.33 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆమోదిస్తూ రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఇందులో నిర్వహణ వ్యయం కింద రూ.46.25 కోట్లు, వివిధ కొనుగోళ్లకు రూ.31.20 కోట్లు, సీజీఎఫ్, ఆడిట్ ఫీజు ఇతర చెల్లింపులకు రూ.23 కోట్లు, భక్తుల సదుపాయాలకు రూ.7.64 కోట్లు, స్వామివారి కల్యాణ, ఇతర ఉత్సవాలకు రూ.1.5 కోట్ల చొప్పున కేటాయించారు.
కేటాయింపులు ఇలా..
● సిబ్బంది జీతాలకు రూ.18 కోట్లు, అర్చకులు, వేద పండితుల జీతాలకు రూ.6 కోట్లు, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లకు రూ.13.50 కోట్లు, కాంట్రాక్ట్, కన్సాలిడేటెడ్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలకు రూ.9 కోట్లు.
● ప్రసాదం తయారీలో వాడే నెయ్యి, పంచదార, గోధుమ నూక, వంట గ్యాస్ తదితర కొనుగోళ్లకు రూ.25 కోట్లు, వ్రతాలు, ఇతర ఆర్జిత సేవలకు అవసరమయ్యే సరకుల కొనుగోళ్లకు రూ.5 కోట్లు, ఇతర పూజా సామగ్రి కొనుగోళ్లకు రూ.1.15 కోట్లు.
● వ్రత పురోహితులకు చెల్లించే పారితోషికాలకు రూ.16 కోట్లు, ప్రసాదం ప్యాకర్లకు రూ.2.10 కోట్లు, నాయీబ్రాహ్మణులకు రూ.1.60 కోట్లు.
● దేవస్థానంలో శానిటేషన్‌కు రూ.7.50 కోట్లు, షామియానా, పందిళ్లకు రూ.14 లక్షలు.
● ఎలక్ట్రికల్ వర్క్స్, వాటర్ సప్‌లై తదితర వాటికి రూ.1.55 కోట్లు, సోలార్ ప్లాంట్ నిర్వహణకు రూ.10 లక్షలు.
● దేవస్థానం నిర్వహిస్తున్న విద్యాసంస్థలకు రూ.3.75 కోట్లు, దత్తత ఆలయాల నిర్వహణకు రూ.90 లక్షలు, ఆగమ పాఠశాలకు రూ.30 లక్షలు, దేవస్థానం ఆసుపత్రి నిర్వహణ, మందుల కొనుగోలుకు రూ.8 లక్షలు.
● స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్‌కు రూ.2.25 కోట్లు, సెక్యూరిటీ గార్డులకు రూ.2 కోట్లు, హోం గార్డులకు రూ.1.10 కోట్లు.
● సీజీఎఫ్ తదితర చెల్లింపులకు రూ.7.20 కోట్లు, సెక్షన్–65 ఈఏఎఫ్ కింద రూ.10 కోట్లు, ఆడిట్ ఫీజు రూ.1.20 కోట్లు, అర్చక సంక్షేమ నిధికి రూ.2.4 కోట్లు, ప్రభుత్వ ట్యాక్స్‌లకు రూ.2.5 కోట్లు.
● ఇంజినీరింగ్ పనులకు రూ.4 కోట్లు, ఎలక్ట్రికల్ సామగ్రి కొనుగోళ్లకు రూ.కోటి, కొత్త వాహనాల కొనుగోలుకు రూ.కోటి.
● సిబ్బందికి వివిధ అడ్వాన్స్‌లు, రుణాలకు రూ.70 లక్షలు.
● కొత్త డిపాజిట్లు రూ.3 కోట్లు. మెచ్యూర్ అయిన డిపాజిట్లు తిరిగి జమ చేయడానికి రూ.కోటి, ఈఎండీ చెల్లింపులు రూ.కోటి.
● దేవస్థానం ట్రాన్స్‌పోర్టు నిర్వహణకు రూ.1.16 కోట్లు.
● సత్యదేవుని నిత్యాన్నదాన ట్రస్ట్‌లో భక్తులకు భోజనాలు పెట్టేందుకుగాను వివిధ దినుసుల కొనుగోలుకు రూ.3.30 కోట్లు, కూరగాయల కొనుగోలుకు రూ.కోటి, పాలకు రూ.60 లక్షలు, గ్యాస్‌కు రూ.55 లక్షలు, జీతాలకు రూ.కోటి, ఇతర ఖర్చులకు రూ.11.70 లక్షలు.
● గో సంరక్షణ ట్రస్ట్‌లో ఆవుల మేత, దాణాలకు రూ.20 లక్షలు, వైద్య ఖర్చులకు రూ.లక్ష, సిబ్బంది జీతాలకు రూ.31 లక్షలు.