అన్నవరం దేవస్థానం ఆదాయం తగ్గడానికి కారణమేంటి?
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం కన్నా రూ.ఆరు కోట్లు అధికంగా ఖర్చు అయిన వైనంపై సంబంధిత అధికారులపై రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయశాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘లక్ష్మీ..రావేం మా కొండకి ?’ వార్తా కథనంపై దేవదాయశాఖా మంత్రి స్పందించారు. గతేడాది అన్నవరం దేవస్థానం ఆదాయం రూ.135 కోట్లు కాగా, వ్యయం రూ.141 కోట్లుగా నమోదైంది. 2023–24 సంవత్సరంలో మిగిలిన రూ.7.5 కోట్లు నిధుల నుంచి రూ. ఆరు కోట్లు మళ్లించి చెల్లింపులు చేశారు. ఒకప్పుడు ఆర్థికంగా రాష్ట్రంలోనే మంచి స్థానంలో ఉన్న అన్నవరం దేవస్థానానికి ఇటువంటి పరిస్థితి ఏర్పడడానికి కారణాలేమిటనే దానిపై వెంటనే నివేదిక ఇవ్వాలని రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్‌ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. తన ఆదేశాలతో బాటు ఆయన ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనం క్లిప్పింగ్‌ను కూడా జత చేసి పంపించారు. దీంతో బాటు గత మూడేళ్లు ఆదాయ వ్యయాల వివరాలను కూడా పంపించాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలను అన్నవరం దేవన్థానం అధికారులకు పంపించిన కమిషనర్ మంగళవారం సాయంత్రంలోగా నివేదిక పంపించాలని ఆదేశించారు. దాంతో దేవస్థానం అధికారులు నివేదిక తయారు చేశారు. 2022–23, 23–24 సంవత్సరాలలో దేవస్థానం వ్యయం కన్నా ఆదాయమే అధికంగా ఉంది. ఇదే విషయాన్ని ఆ నివేదికలో పొందుపరిచారు.
ప్రదక్షిణ దర్శనం కొనసాగించి ఉంటే
రూ.పది కోట్లు పైగా ఆదాయం
2023 అక్టోబర్‌లో దేవస్థానంలో రూ.300 టిక్కెట్‌తో సత్యదేవుని ప్రదక్షిణ దర్శనాన్ని అప్పటి ఈఓ చంద్రశేఖర్ అజాద్ ప్రారంభించారు. ఈ ప్రదక్షిణ దర్శనం కోసం దాత సహకారంతో ఆలయంలో నాలుగు మూలలా బంగారు గంధం గిన్నె, బంగారు హుండీ, బంగారు కామధేనువు, బంగారు కల్పవృక్షం ఏర్పాటు చేశారు. భక్తులు వాటిని దర్శిస్తూ స్వామి, అమ్మవారి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ చేసేవారు. రూ.300 టిక్కెట్ అయినా ఆ దర్శనానికే భక్తులు మొగ్గు చూపేవారు. దీంతో ఆ ఒక్క నెలలోనే రూ.50 లక్షల ఆదాయం వచ్చింది. అయితే ఈఓ చంద్రశేఖర్ అజాద్ బదిలీ తరువాత ఆ దర్శనం నిలిపివేసి రూ.200 టిక్కెట్ మీద అంతరాలయం దర్శనం మాత్రమే చేసుకునే వీలు కల్పించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.200 టిక్కెట్‌తో అంతరాలయం దర్శనం ద్వారా రూ.5.49 కోట్ల ఆదాయం వచ్చింది. అదే రూ.300 టిక్కెట్ తో ప్రదక్షిణ దర్శనం ఏర్పాటు చేసి ఉంటే రూ.ఎనిమిది కోట్లకు పైగా ఆదాయం వచ్చేది.
‘సాక్షి’ కథనంపై స్పందించిన
దేవదాయశాఖ మంత్రి ఆనం
వెంటనే నివేదిక పంపించాలని
కమిషనర్‌కు ఆదేశాలు
అన్నవరం దేవస్థానం ఆదాయం తగ్గడానికి కారణమేంటి?
అన్నవరం దేవస్థానం ఆదాయం తగ్గడానికి కారణమేంటి?


