నల్లజర్ల: కన్న కూతుర్ని తరుచూ ఇబ్బందులకు గురిచేస్తున్న అల్లుణ్ణి మామ, బావమరిది కత్తితో నరికి చంపారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రం నల్లజర్ల ముత్తరాసుపేటలో సోమవారం రాత్రి జరిగింది. ఇన్‌చార్జి ఎస్‌ఐ సతీష్ అందించిన వివరాల ప్రకారం నల్లజర్లకు ముత్తరాసుపేటకు చెందిన రేగుల వెంకన్న భారతిల కుమార్తె భానుకు అదే గ్రామానికి చెందిన పేరం శివతో నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం జరిగింది. వారికి మూడేళ్లు కుమార్తె ఉండగా భాను ఇపుడు గర్భవతి. పైళ్ళెన నాటి నుంచి తరుచూ భార్యాభర్తలు తగవులు పడుతున్నారు.
అదే క్రమంలో మూడు రోజుల కిందట భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. భాను పుట్టింటికి వెళ్లిపోయింది. సోమవారం ఉదయం శివ అత్తవారింటికి వెళ్లి భార్యను పంపమని అడిగాడు. అందుకు అత్తమామలు సమ్మతించలేదు. ఎలా పంపరో చూస్తానంటూ హెచ్చరించాడు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో శివ మామ వెంకన్న, అతని బావమరిది శ్రీరామ్ మరో ముగ్గురు బంధువులు శివ ఇంటికి వచ్చి అతని తల్లిదండ్రులతో గొడవ పడ్డారు. తర్వాత ఇంట్లో నుంచి వస్తున్న శివను కత్తితో మెడ మీద నరికారు. శివ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అల్లుణ్ణి కత్తితో నరికి చంపిన మామ, బావమరిది