పట్టు వదిలేస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

పట్టు వదిలేస్తున్నారు

Apr 16 2025 12:15 AM | Updated on Apr 16 2025 12:15 AM

పట్టు

పట్టు వదిలేస్తున్నారు

రైతులతో మాట్లాడుతున్నాం

పట్టు సాగులో నష్టాలు వస్తున్నాయంటూ రైతులు మల్బరీ తోటలను దున్నేస్తున్న వైనంపై ఆరా తీస్తున్నాం. వారితో మాట్లాడి, నష్టాల నివారణకు చర్యలు తీసుకుంటాం. పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పంట సాగు ఆపకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో చర్చిస్తాం.

– మోసయ్య, పట్టు పరిశ్రమ శాఖాధికారి, చేబ్రోలు

పిఠాపురం: ‘పట్టు’కుంటే బంగారం.. ఇది ఒకప్పటి మాట. ‘ముట్టుకుంటే మట్టే’.. ఇది ఇప్పటి మాట. రైతులను అపర కుబేరులుగా చేసిన పట్టు సాగు ఇప్పుడు రైతులను నట్టేట ముంచుతోంది. స్వదేశీ సిల్క్‌ ఉత్పత్తిలో రాష్ట్రంలో కీలక పాత్ర వహించిన గొల్లప్రోలు మండలంలో పట్టు పంటకు గడ్డుకాలం మొదలైంది. ప్రభుత్వ ప్రోత్సాహం కరువవడంతో సరైన ధర రాక, పంట కొనే వారు లేక, పెట్టుబడి దక్కక, కనీసం కౌలుకు తీసుకునే వారు కూడా ఉత్సాహం చూపకపోవడంతో పట్టు రైతులు పంటకు విరామం ప్రకటిస్తున్నారు. దీనిలో భాగంగా గొల్లప్రోలు మండలంలో మల్బరీ తోటలను కొన్ని రోజులుగా దున్నేస్తున్నారు. ఒక్క గొల్లప్రోలు మండలంలోనే సుమారు 400 ఎకరాల్లో మల్బరీ సాగు జరుగుతూండగా.. ప్రస్తుతం వందల ఎకరాల్లో రైతులు పంటను దున్నేసి, వేరే పంటలు వేసే పనిలో నిమగ్నమయ్యారు. ‘మీకు అండగా ఉంటా. పట్టు పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తా. సిల్క్‌ సిటీ నిర్మిస్తా’ అంటు వాగ్దానాలు ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి ఇలాకా పిఠాపురం నియోజకవర్గంలోనే రాష్ట్రానికే వన్నె తెచ్చిన పట్టు పరిశ్రమ మూత పడే పరిస్థితులు ఎదురయ్యాయని రైతులు వాపోతున్నారు.

కానరాని ప్రభుత్వ తోడ్పాటు

రాష్ట్రంలో పలమనేరు, హిందుపురంతో పాటు జిల్లాలోని గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పట్టుగూళ్ల కొనుగోలు కేంద్రాలున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 5, జిల్లాలోని పెద్దాపురం డివిజన్‌లో 12, కాకినాడ డివిజన్‌లోని 2 మండలాల్లో 4,500 ఎకరాల విస్తీర్ణంలో 1,150 మంది రైతులు మల్బరీ సాగు చేస్తున్నారు. ఎకరం విస్తీర్ణంలో మల్బరీ సాగుకు రూ.లక్ష పెట్టుబడి అవుతోంది. అలాగే, పట్టు పురుగుల పెంపకానికి 50 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పున షెడ్‌ నిర్మాణానికి రూ.15 లక్షల వరకూ ఖర్చవుతోంది. దీని నిర్వహణకు రూ.50 వేల వరకూ పెట్టుబడి అవుతోంది. గతంలో ఇక్కడ పండించిన పట్టుగూళ్లకు కేజీకి రూ.550 వరకూ ధర వచ్చేది. ప్రస్తుతం రూ.250కి కూడా కొనేవారు లేకపోవడంతో తీవ్ర నష్టాల పాలవుతున్నామని రైతులు వాపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం మల్బరీ రైతులకు ఇన్సెంటివ్‌లు ఇవ్వాల్సి ఉండగా రూ.లక్షల్లో బకాయి పెట్టింది. పైగా షెడ్ల నిర్మాణానికి ఇచ్చే ప్రోత్సాహకాలు సైతం ఇవ్వడం లేదు. ఫలితంగా కొత్తగా పట్టు సాగు చేయడానికి ఏ ఒక్క రైతూ ముందుకు రావడం లేదు.

తెగుళ్ల దాడి

ప్రభుత్వ ప్రోత్సాహం కరువవ్వడంతో పాటు ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న తెగుళ్లు మల్బరీ పంటను తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయని రైతులు వాపోతున్నారు. గత ఏడాది ఊజీ ఈగ దాడితో పాటు వివిధ రకాల తెగుళ్లతో పట్టు పురుగులు గూళ్లు కట్టలేదు. ఫలితంగా పట్టు సాగు తీవ్రంగా దెబ్బ తింది. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేయగా శాస్త్రవేత్తలు పంటలను పరిశీలించారు. మల్బరీ తోటలకు పక్కన ఉన్న పంటలకు పురుగు మందులు వాడటం వలన పట్టు పురుగులు చనిపోతున్నాయని చెప్పి చేతులు దులిపేసుకున్నారని రైతులు విమర్శిస్తున్నారు. పంట నష్టాలకు కారణమైన అసలు తెగులును గుర్తించి, నివారణ చర్యలను అధికారులు ఇప్పటికీ చెప్పలేకపోయారని అంటున్నారు. ఫలితంగా పంట నష్టాల పాలై, సాగు మానేసే పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు.

వైఎస్సార్‌ సీపీ హయాంలో ప్రోత్సాహం

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో పట్టు సాగుకు ప్రోత్సాహం ఇచ్చేవారు. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న బకాయిలు రూ.3 కోట్ల వరకూ విడుదల చేసి, రైతులకు పంపిణీ చేశారు. నాటి ప్రభుత్వం ప్రోత్సాహం పెంచడంతో రైతులు మల్బరీ సాగుపై ఆసక్తి చూపారు. గతంలో మల్బరీ సాగుకు, షెడ్ల నిర్మాణానికి యూనిట్‌ విలువ రూ.7 లక్షల వరకూ ఉండగా నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం యూనిట్‌ విలువను రూ.10 లక్షలకు పెంచింది. దీనిలో పట్టు పరిశ్రమ ద్వారా రూ.3 లక్షలు, రైతు వాటా రూ.లక్ష, ఉపాధి హామీ పథకం ద్వారా రూ.6 లక్షల మేర ఆర్థిక సహాయం అందజేశారు. అంటే రైతు కేవలం రూ.లక్ష పెట్టుబడి పెడితే ప్రభుత్వం రూ.9 లక్షలు ఇచ్చేది. బయోల్టిన్‌ (తెలుపు) రకం పట్టు గూళ్లు కేజీకి రూ.50, సీబీ(ఎల్లో కలర్‌)కి రూ.20 చొప్పున ప్రభుత్వం ఇన్సెంటివ్‌ ఇచ్చేది. పలమనేరు, హిందూపురం, హనుమాన్‌ జంక్షన్‌ వంటి ప్రాంతాలకు కాకుండా, చేబ్రోలు మార్కెట్‌లోనే కొనుగోళ్లు జరిపేవారు. గత ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహించడంతో అప్పట్లో కేజీ పట్టు గూళ్లు రూ.900 వరకూ అమ్ముడైన సందర్భాలున్నాయి.

జిల్లాలో పట్టు సాగు వివరాలు

సాగు చేస్తున్న మండలాలు 19

పట్టు సాగు జరుగుతున్న గ్రామాలు 155

రైతులు 1,150

సాగు విస్తీర్ణం 4,500 ఎకరాలు

రోజుకు పట్టుగూళ్ల దిగుబడి 5 టన్నులు

·˘ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువు

·˘ నష్టాల బాటలో పరిశ్రమ

·˘ పవన్‌ ఇలాకాలో పంటకు విరామం

·˘ పట్టు పరిశ్రమ చరిత్రలోనే తొలిసారి..

·˘ సిల్క్‌ సిటీ కట్టాక

పంట వేస్తామంటున్న రైతులు

ఆదుకుంటానన్న పవన్‌.. పట్టించుకోవడం లేదు

ఎన్నికల్లో మా గ్రామం వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మాకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. పదవి వచ్చాక మాకు అండగా ఉంటానన్నారు. సిల్క్‌ సిటీ కడతానన్నారు. కానీ, పెద్దగా ఏమీ పట్టించుకున్నది లేదు. నేను రెండెకరాల్లో పంట సాగు చేశాను. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేదు. రావాల్సిన ఇన్సెంటివ్‌లూ రావడం లేదు. మరోపక్క తెగుళ్లు తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయి. షెడ్‌ నిర్వహణ భారంగా మారింది. పెట్టుబడులు పెరిగిపోయాయి. దిగుబడీ లేదు. ధర దారుణంగా పడిపోయింది. ఎవరూ కొనేవారు లేరు. రూ.లక్షల్లో నష్టం వచ్చే పరిస్థితి ఉండటంతో పంట తీసేస్తున్నాం. మల్బరీ సాగు ఆపేసి వేరే పంటలు వేసేందుకు నాతో పాటు చాలా మంది రైతులు సిద్ధమవుతున్నారు.

– ఓరుగంటి శ్రీను, పట్టు రైతు, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం

అందుకే తోట తొలగిస్తున్నా..

పట్టు పురుగుల పెంపకం 15 సంవత్సరాలుగా చేపడుతున్నాను. ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం చాలా ఒడుదొడుకులు, నష్టాలు చవి చూశాం. చేతికందే దశలో ఉన్న పంటలు అంతు చిక్కని తెగుళ్లతో దెబ్బ తిన్నాయి. పండిన కొద్దిపాటి పంటకు ధర లేక, రాబడి కూలి ఖర్చులకు కూడా సరిపోలేదు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఇన్సెంటివ్‌ ఇస్తానని హామీ ఇచ్చారు. నేటి వరకూ పట్టించుకోలేదు. అప్పుల పాలై పట్టు పురుగుల పెంపకం విరమించుకోవాలనుకుంటున్నాను. అందుకే మూడెకరాల్లో మల్బరీ తోటను తొలగిస్తున్నాను.

– ఓరుగంటి గణపతి, పట్టు రైతు, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం

పట్టు వదిలేస్తున్నారు1
1/3

పట్టు వదిలేస్తున్నారు

పట్టు వదిలేస్తున్నారు2
2/3

పట్టు వదిలేస్తున్నారు

పట్టు వదిలేస్తున్నారు3
3/3

పట్టు వదిలేస్తున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement