సఖినేటిపల్లి: మండల పరిధిలోని గొంది గ్రామానికి చెందిన చింతా సాగర్(34) ఈ నెల 18వ తేదీన గుండె పోటుతో కువైట్‌లో మృతి చెందారు. 19వ తేదీన ఆ దేశం నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. సాగర్‌కు భార్య, ఒక బాబు ఉన్నారు. సేఠ్ వద్ద కారు డ్రైవర్‌గా మొదటిగా 2022లో గల్ఫ్ వెళ్లారు. రెండేళ్లు అనంతరం స్వగ్రామం వచ్చిన సాగర్, గత జూలైలో తిరిగి రెండో దఫా గల్ఫ్ వెళ్లారు. ఎన్నో ఆశలతో బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లి ఎప్పటి మాదిరిగానే మళ్లీ తిరిగి వచ్చి తమను కలుస్తారు అనుకుంటున్న కుటుంబ సభ్యులు జరిగిన ఘటనతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చిన్న వయసులోనే తమకు అందనంత దూరాలకు వెళ్లిపోవడం జీర్ణించుకోలేక పోతున్నామని రోదిస్తున్నారు. మృతదేహం శనివారం నాటికి స్వగ్రామానికి రానున్నట్టు స్థానికులు తెలిపారు.
వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
నిడదవోలు రూరల్: మండలంలోని పురుషోత్తపల్లి గ్రామంలో వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు సమిశ్రగూడెం ఎస్సై కె.వీరబాబు గురువారం తెలిపారు. పురుషోత్తపల్లికి చెందిన యడ్ల మధుసాగర్ ఈ నెల 15వ తేదీన శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని భార్య షేక్ చాందిని ఇచ్చిన ఫిర్యాదుపై మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.