
రత్నగిరిపై ‘చెత్త’ వివాదం
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో ‘చెత్త’ వివాదం తలెత్తింది. వివరాలివీ.. అన్నవరం దేవస్థానంలో వ్రతాల్లో ఉపయోగించిన పత్రి, పువ్వులు, తమలపాకులు, ఆలయ ప్రాంగణంలో చెత్తను తరలించే పనిని గతంలో శానిటరీ కాంట్రాక్టర్ నిర్వహించేవారు. గత నెలాఖరు వరకూ ఈ కాంట్రాక్ట్‌ను కేఎల్‌టీఎస్ సంస్థ నిర్వహించింది. ఈ నెల 1 నుంచి ఆ సంస్థ ఆ కాంట్రాక్ట్ నుంచి వైదొలిగింది. దీంతో కొత్తగా శానిటరీ కాంట్రాక్ట్ ఖరారయ్యేంత వరకూ దేవస్థానంలో పారిశుధ్య పనులకు 349 మంది పని వారిని సమకూర్చే పనిని గుంటూరుకు చెందిన కనకదుర్గ సర్వీసెస్‌కు అప్పగించారు. ఇది కూడా టెండర్ పిలవకుండా అప్పగించడం వివాదాస్పదమైంది. కాగా, ఒక ట్రాక్టర్, రెండు ట్రక్కులు, ట్రాక్టర్‌కు అవసరమయ్యే డీజిల్, ఇతర నిర్వహణ ఖర్చులు భరిస్తూ.. దేవస్థానంలో చెత్త తరలించే పనిని నెలకు రూ.60 వేలతో అప్పగించారు. టీడీపీలోని ఒక ద్వితీయ శ్రేణి నాయకుడి సిఫారసుతో ఆ పార్టీ కార్యకర్తకు ఏకపక్షంగా ఈ పని అప్పగించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే గతంలో చెత్త ట్రాక్టర్‌ను యడ్ల కృష్ణ నిర్వహించేవారు. తాను రూ.43 వేలకే చెత్త తరలిస్తానని దేవస్థానం అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేశానని, అయితే, తన దరఖాస్తు కూడా తీసుకోలేదని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. ఈ నేపథ్యంలో తన దరఖాస్తును దేవదాయ శాఖ కమిషనర్‌కు, దేవస్థానం చైర్మన్, ఈఓలకు ఈ నెల 3న రిజిస్టర్డ్ పోస్టులో పంపించానని చెబుతున్నారు. దీనిపై దేవస్థానం అధికారులు స్పందించలేదని చెప్పారు. ఇదిలా ఉండగా, రూ.43 వేలతో చెత్త తరలిస్తామంటూ తన వద్దకు అసలు ఎటువంటి దరఖాస్తూ రాలేదని ఈఓ వీర్ల సుబ్బారావు ‘సాక్షి’కి చెప్పారు. తపాలా ద్వారా పంపించి ఉంటే తనకు ఎందుకు ఇవ్వలేదో సంబంధిత అధికారులను వివరణ కోరానన్నారు. దరఖాస్తుదారు తనను కలిసి, దరఖాస్తు అందిస్తే పరిశీలించి, తగు చర్యలు తీసుకుంటానని చెప్పారు.