
ముమ్మరంగా ఇంజినీరింగ్ పనులు
కాకినాడ సిటీ: వర్షాలు ప్రారంభమయ్యేలోపు రానున్న మూడు నెలల్లో జిల్లాలో చేపట్టిన ఇంజినీరింగ్ పనులను ముమ్మరంగా నిర్వహించాలని జిల్లా ప్రత్యేకాధికారి, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి.వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాలులో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో జిల్లా అభివృద్ధికి సంబంధించి వివిధ శాఖల ద్వారా తాను సమర్పించిన అంశాలను కలెక్టర్ షణ్మోహన్ ఆయనకు వివరించారు. అనంతరం వీరపాండ్యన్ మాట్లాడుతూ, రానున్న మూడు నెలల్లో కూలీలకు పెద్ద సంఖ్యలో ఉపాధి హామీ పనులు కల్పించాలని కోరారు. ఎండలను దృష్టిలో ఉంచుకుని ఉదయం 11 గంటలలోపు, మధ్యా హ్నం 4 గంటల తర్వాత పనులు చేయించాలని సూచించారు. వేసవిలో తాగునీటి సరఫరాపై, ముఖ్యంగా నీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. నీటి వనరులన్నింటినీ శుభప్రరచి, ఫ్లషింగ్ చేయించాలన్నారు. వడదెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో 4 నుంచి 6 పడకలతో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి ఏఎన్‌ఎం వద్ద 500, పీహెచ్‌సీల్లో వెయ్యి, సీహెచ్‌సీల్లో 5 వేలు, జిల్లా ఆసుపత్రిలో 10 వేలు చొప్పున ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. అన్ని అంబులెన్స్‌ల్లో ఎమర్జెన్సీ రెస్క్యూ మెకానిజం ఏర్పాటు చేయాలన్నారు. కాలువలు, చెరువులు, కుంటల్లో ఈతకు వెళ్లి ప్రమాదాలకు లోను కాకుండా చూడాలని, తల్లిదండ్రులను అప్రమత్తం చేయాలని వీరపాండ్యన్ సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన, డీఆర్‌ఓ వెంకటరావు, జెడ్పీ సీఈఓ వీవీవీఎస్ లక్ష్మణరావు, డ్వామా పీడీ ఎ.వెంకటల క్ష్మి, డీఈఓ పి.రమేష్, డీఎంహెచ్‌ఓ జె.నరసింహ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేకాధికారి వీరపాండ్యన్ ఆదేశం