8 నుంచి ఇండో – అమెరికా సైనిక విన్యాసాలు
కాకినాడ రూరల్: భారత్ – అమెరికా దేశాల సైనిక దళాల సంయుక్త విన్యాసాలకు కాకినాడ సాగర తీరం మరోసారి వేదిక కానున్నది. ఇరు దేశాల మధ్య సైనిక సహకారం, పరసర్ప నైపుణ్యం పెంపొందించుకునే లక్ష్యంతో టైగర్ ట్రయాంఫ్–2025 పేరిట 13 రోజుల పాటు ఈ విన్యాసాలు జరగనున్నాయి. ఈ నెల 1న విశాఖ సాగర తీరంలో ఈ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. దీనికి కొనసాగింపుగా ఈ నెల 8 నుంచి కాకినాడ తీరంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. విన్యాసాలు ఈ నెల 13న కాకినాడలో ముగియనున్నాయి. తూర్పు నౌకాదళంతో పాటు ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ బలగాలు, అమెరికా సైనిక దళాలు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. కాకినాడ సూర్యారావుపేటలోని నేవల్ ఎన్‌క్లేవ్ వద్ద ఇరు దేశాల ఉమ్మడి విన్యాసాల నిర్వహణకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే విశాఖ నుంచి వచ్చిన నావికా దళాలు గుడారాలు ఏర్పాటు చేసుకుని తమ పనిలో నిమగ్నమయ్యాయి. ప్రస్తుతం తూర్పు నౌకాదళ పరిధిలోని విశాఖ, కాకినాడ తీర ప్రాంతంలోని సముద్ర జలాల్లో ఐఎన్‌ఎస్ జలాశ్వ, యూఎస్‌ఎస్ కామ్‌స్టాక్ ద్వారా ఇండో, అమెరికా నావికా దళాలు విన్యాసాలు కొనసాగిస్తున్నాయి.


