భావనారాయణ స్వామి భూములను పరిశీలించిన కలెక్టర్‌ | - | Sakshi

భావనారాయణ స్వామి భూములను పరిశీలించిన కలెక్టర్‌

Apr 4 2025 12:08 AM | Updated on Apr 4 2025 12:08 AM

భావనా

భావనారాయణ స్వామి భూములను పరిశీలించిన కలెక్టర్‌

కాకినాడ రూరల్‌: సర్పవరం గ్రామంలోని భావనారాయణ స్వామి దేవస్థానానికి చెందిన విలువైన భూములను జిల్లా కలెక్టర్‌ షణ్మోహన్‌ గురువారం పరిశీలించారు. ఇదే భూములను క్రికెట్‌ స్టేడియం నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ బుధవారం పరిశీలించగా.. మరుసటి రోజే కలెక్టర్‌ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రెవెన్యూ, సర్వే విభాగాల అధికారులు, ఎమ్మెల్యే నానాజీతో కలిసి దేవస్థానానికి చెందిన సుమారు 18 ఎకరాల భూములను కలెక్టర్‌ పరిశీలించారు. భూముల హద్దులను చూసి ఎన్ని ఎకరాలుందో నివేదిక ఇవ్వాలని సర్వే అధికారులను ఆదేశించారు. సర్పవరంలో క్రికెట్‌ స్టేడియం ప్రతిపాదన రావడంతో విలువైన దేవుడి భూములు 18 ఎకరాలతో పాటు దీనిని ఆనుకుని ఉన్న రైతులకు చెందిన మరో 12 ఎకరాలు కూడా సేకరించేందుకు పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. భూములు ఎందుకు పరిశీలించారనే విషయాన్ని కలెక్టర్‌ వెల్లడించలేదు. ఎమ్మెల్యే నానాజీ మాత్రం క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రతిపాదన మేరకు భూములు పరిశీలించినట్లు చెప్పారు. కలెక్టర్‌ వెంట జిల్లా సర్వే అధికారి సుబ్బారావు, తహసీల్దార్‌ కుమారి, ఆలయ ఈఓ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

శ్యామలకు కలెక్టర్‌

అభినందనలు

కాకినాడ సిటీ: పెద్దాపురానికి చెందిన గోలి శ్యామల గత జనవరిలో విశాఖపట్నం నుంచి సముద్రంలో ఈదుకుంటూ కాకినాడ ఎన్టీఆర్‌ బీచ్‌కు విజయవంతంగా చేరుకున్నారు. ఆమె సాహసాన్ని అభినందిస్తూ వరల్డ్‌ ఓపెన్‌ వాటర్‌ అసోసియేషన్‌ ప్రశంసాపత్రం అందజేసింది. ఈ నేపథ్యంలో శ్యామల జిల్లా కలెక్టర్‌ షణ్మోహన్‌ను కలెక్టరేట్‌లో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. సముద్రంలో 150 కిలోమీటర్లు ఈదుతూ గమ్యాన్ని చేరుకోవడం గొప్ప విశేషమని ఆమెను కలెక్టర్‌ అభినందించారు.

వక్ఫ్‌ సవరణ బిల్లు..

రాజ్యాంగంపై దాడి

కాకినాడ రూరల్‌: వక్ఫ్‌ సవరణ బిల్లును రాజ్యాంగంపై దాడిగా జిల్లా వక్ఫ్‌బోర్డు మాజీ కార్యదర్శి, వైఎస్సార్‌ సీపీ కాకినాడ రూరల్‌ నియోజకవర్గ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు ఎస్‌ఏ కరీం బాషా అన్నారు. గురువారం తన నివాసంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ ప్రధాన అజెండా అని ఆరోపించారు. పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్‌ బోర్డు సవరణ చట్టం ముస్లింల షరియత్‌కు పూర్తి విరుద్ధమన్నారు. అన్యాక్రాంతమైన లక్షలాది ఎకరాల భూములను తిరిగి స్వాధీనం చేసుకునే విధంగా చట్టంలో ఎలాంటి మార్పూ చేయలేదని, ఇది కేవలం బడాబాబులకు దోచిపెట్టడానికేనని విమర్శించారు. సీఎం చంద్రబాబు ముస్లింలకు చేస్తున్న అన్యాయాన్ని టీడీపీలోని ముస్లిం నాయకులు, కార్యకర్తలు గ్రహించాలని బాషా కోరారు. సమావేశంలో మైనార్టీ సెల్‌ రూరల్‌ అధ్యక్షుడు కేజీఎన్‌ వలి, నాయకులు షేక్‌ సంధాని, చాంద్‌ బాషా, అన్సారీ బేగ్‌ పాల్గొన్నారు.

ఔను.. బర్డ్‌ఫ్లూతోనే

కోళ్ల మరణాలు

పిఠాపురం: గత ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకూ పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లోని మూడు కోళ్లఫామ్‌లలో పెద్ద సంఖ్యలో కోళ్లు బర్డ్‌ఫ్లూ వల్లనే మృతి చెందాయని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం సమాచారం వచ్చింది. ఈ విషయాన్ని గెజిట్‌లో ప్రచురించి, కోళ్లు చనిపోయిన ఫామ్‌లపై ఆంక్షలు విధించారు. కోళ్లు చనిపోయిన ఫామ్‌ల నుంచి కిలోమీటరు పరిధిని ఇన్‌ఫెక్టెడ్‌ జోన్‌గా, 10 కిలోమీటర్ల పరిధిని సర్వైలెన్స్‌ జోన్‌గా ప్రకటించి, ఆంక్షలు అమలు చేయాలని స్థానిక అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రాంతాల నుంచి కోళ్లను అమ్మడం, కొనడం, ఇతర ప్రాంతాలకు సరఫరా చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ జీఓ 122 జారీ చేశారు. అప్పట్లో పిఠాపురం, మండలంలోని కుమారపురం, చిత్రాడ, నర్సింగపురం, గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామాల్లోని ఫామ్‌లలో ఒక్కసారిగా వందలాది కోళ్లు మృతి చెందాయి. సంబంధిత కోళ్ల కంపెనీ సిబ్బంది వచ్చి, చనిపోయిన కోళ్ల శాంపిల్స్‌ తీసుకెళ్లారు. పశు సంవర్ధక శాఖ అధికారులు హుటాహుటిన ఆయా ఫామ్‌లను పరిశీలించారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్‌ను భోపాల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డిసీజెస్‌కు పంపించారు. అక్కడ వివిధ పరీక్షల అనంతరం ఆ కోళ్లు బర్డ్‌ఫ్లూ వల్లనే మరణించినట్లు నిర్ధారించారు.

భావనారాయణ స్వామి  భూములను పరిశీలించిన కలెక్టర్‌ 1
1/1

భావనారాయణ స్వామి భూములను పరిశీలించిన కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement