● రత్నగిరిపై పంచాంగ పఠనం
● ఇద్దరు పండితులకు ఉగాది సత్కారం
అన్నవరం : శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సత్యదేవుని ఖ్యాతి విశ్వవ్యాప్తమవుతుందని, భక్తుల కోసం దేవస్థానంలో నూతన నిర్మాణాలకు అత్యధిక నిధులు ఖర్చు చేస్తారని దేవస్థానం వేదపండితుడు బ్రహ్మశ్రీ గొల్లపల్లి వేంకట్రామ సుబ్రహ్మణ్య ఘనాపాఠీ తెలిపారు. రత్నగిరిపై సత్యదేవుని అనివేటి మండపంలో ఆదివారం నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పంచాంగ పఠనం చేశారు. ఉదయం తొమ్మిది గంటలకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సత్యదేవుని ఆలయం నుంచి ఊరేగింపుగా అనివేటి మండపం వద్దకు తీసుకువచ్చి అక్కడ మండపంలో ఉంచారు. అనంతరం నూతన సంవత్సర పంచాంగ ప్రతులను స్వామి, అమ్మవార్ల చెంత ఉంచి పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు స్వామి, అమ్మవార్లకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీ విశ్వావసు పంచాంగ ప్రతులను ఆవిష్కరించారు. అనంతరం వేద పండితులు శ్రీ గొల్లపల్లి వేంకట్రామ సుబ్రహ్మణ్య ఘనపాఠీ నూతన సంవత్సర పంచాంగ ఫలితాలను వివరించారు. శ్రీ సత్యదేవునిది శ్రీ మఖ శ్రీ నక్షత్రం, సింహ రాశి అయినందున ఈ ఏడాది ఆదాయం 11, వ్యయం 11 గా ఉందన్నారు. ఈ సంవత్సరం కొన్ని రాశుల వారికి ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ ఉన్నప్పటికీ అది ప్రతికూల ఫలితాలుగా భావించరాదన్నారు. ఆస్తులు, వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసినా వ్యయంగానే భావించాలని తెలిపారు.
ఇద్దరు పండితులకు సత్కారం
ఉగాది వేడుకల్లో భాగంగా ప్రముఖ వేదపండితులు రాజమహేంద్రవరానికి చెందిన ఉప్పులూరి సత్యనారాయణ అవధాని, పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరానికి చెందిన గుల్లపల్లి వేంకట నాగ శ్రీరామ అవధాని లకు రూ.5,116 నగదు పారితోషికంతో చైర్మన్ రోహిత్, ఈఓ సుబ్బారావు సత్కరించారు. గోచార ఫలితాలను వివరించిన గొల్లపల్లి వేంకట్రామ సుబ్రహ్మణ్య ఘనపాఠీని సత్కరించారు. ఉగాది వేడుకల్లో భాగంగా ఆలయ ప్రాకారంలో స్వామివారిని వెండి రథంపై ఊరేగించారు.
శ్రీ విశ్వావసులో సత్యదేవుని ఖ్యాతి విశ్వవ్యాప్తం
శ్రీ విశ్వావసులో సత్యదేవుని ఖ్యాతి విశ్వవ్యాప్తం