
పిడుగు పడి రైతు మృతి
నల్లజర్ల: పిడుగు పడి రైతు మృతి చెందిన ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. అనంతపల్లి శివారు కృష్ణమ్మగూడెంలో వెలగాని సత్యనారాయణ (47) తన ఇంటి సమీపంలోని మామిడి చెట్టు వద్ద ఉన్న సిమెంట్ బెంచీపై కూర్చున్నాడు. ఈదురుగాలులతో వర్షం పడుతున్న ఆ సమయంలో పిడుగు పడడంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడు నబీపేట నుంచి వచ్చి ఇక్కడి ఎంపీపీ స్కూలు వద్ద ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నాడు.
వివాహిత మౌన దీక్ష
కిర్లంపూడి: తన కుమారుడికి రావాల్సిన ఆస్తిని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ రాజుపాలెంలోని తన అత్తారింటి వద్ద నాగ వెంకటలక్ష్మి అనే వివాహిత తన కుమారుడు, కుటుంబ సభ్యులతో మంగళవారం మౌన దీక్షకు దిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కాజులూరు మండలం పెనుమళ్ల గ్రామానికి చెందిన నాగ వెంకటలక్ష్మికి కొత్తపల్లి మండలం గోర్సకు చెందిన వీరబాబుతో పెద్దల సమక్షంలో వివాహమైంది. కొన్నేళ్ల తరువాత రాజుపాలెంలో వారు స్థిరపడ్డారు. అయితే వీరబాబు మానసిక స్థితి సరిగ్గా ఉండదు. కానీ ఈ విషయం చెప్పకుండానే వివాహం చేశారు. వారికి మగబిడ్డ పుట్టిన తర్వాత ఆమెను అత్తింటివారు దూరం పెట్టారు. కుమారుడికి రావాల్సిన ఆస్తిని వేరే వాళ్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నించడంతో పాటు ఇదేంటి అని అడిగితే ఇంట్లోకి కూడా రానివ్వకుండా బయటకు వెళ్లగొడుతున్నారు. దీంతో నాగ వెంకటలక్ష్మి తన కుమారుడితో కలిసి దీక్ష చేపట్టింది.