
స్వచ్ఛ ఓటర్ల జాబితాకు సహకరించాలి
కాకినాడ సిటీ: జిల్లాలో స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షణ్మోహన్ కోరారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలోనే కాకుండా ముందుగానే ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ, మార్పులు, చేర్పులు, ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనల వంటి అంశాలపై చర్యలకు భారత ఎన్నికల సంఘం ఆదేశించిందని తెలిపారు. ఈ మేరకు సూచనలు, సలహాలు అందించాలని కోరారు. రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ బూత్ స్థాయి అధికారులను (బీఎల్‌వో) నియమించి, ఏప్రిల్ 15 నాటికి అందరికీ శిక్షణ పూర్తి చేస్తామని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకర్గాల్లోని 1,640 పోలింగ్ కేంద్రాల్లో 16,36,916 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ప్రతి వెయ్యి నుంచి 12 వందల మంది ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలను గుర్తించి విభజించనున్నామన్నారు.
పోలింగ్ కేంద్రం ఓటర్లకు రెండు కిలోమీటర్లకు మించి దూరంగా ఉండకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. సమావేశంలో డీఆర్వో వెంకటరావు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారి ఎం.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.