
గాంధీ వేషంలో ఒడిశాకు..
తప్పిపోయిన సామర్లకోట బాలుడు
కాకినాడ క్రైం: తల్లిదండ్రులు లేని 12 ఏళ్ల బాలుడు గాంధీ వేషధారణలో భిక్షాటన చేస్తూ తప్పిపోయి ఒడిశా రాష్ట్రానికి వెళ్లిపోయాడు. సదరు బాలుడిని నుప్పద రైల్వేస్టేషన్‌లో ఆర్పీఎఫ్ సిబ్బంది గుర్తించి ఒడిశా బాలల సంక్షేమ శాఖ విభాగానికి అప్పగించారు. అక్కడ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) బాలుడి నుంచి వివరాలు సేకరించి అతడిది కాకినాడగా గుర్తించారు. శనివారం సాయంత్రం కాకినాడలోని జిల్లా బాలల పరిరక్షణ విభాగ అధికారులకు వీడియో కాల్‌లో బాలుడ్ని చూపించి అతడి కుటుంబ సభ్యులు వస్తే నిబంధనల మేరకు బాలుడిని అప్పగిస్తామని ఫొటో పంపారు. తనది కాకినాడ సమీపంలోని సామర్లకోట అని, తన పేరు సాయి అని, తల్లిదండ్రులు సురేష్, దుర్గ చనిపోతే నాయినమ్మ కొండమ్మ పెంచుతోందని అతడు చెప్పినట్టు సమాచారం. అతడి చిరునామా చెప్పలేకపోవడంతో కాకినాడ జిల్లా సీడబ్ల్యూసీ అధికారులు అప్రమత్తమై స్థానిక పోలీసులు, సచివాలయాల సిబ్బంది ద్వారా బాలుడు నివాస ప్రాంతంతో పాటు బాలుడి నాయినమ్మ కొండమ్మ చిరుమానా తెలుసుకునే పనిలో పడ్డారు.
1న టెన్త్ సోషల్ పరీక్ష
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రంజాన్ సెలవు కావడంతో సోమవారం నిర్వహించాల్సిన టెన్త్ సోషల్ పరీక్షను ఏప్రిల్ 1న నిర్వహిస్తున్నట్లు జిల్లా పాఠశాల విద్యా శాఖాధికారి కంది వాసుదేవరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష ఆ రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ జరుగుతుందన్నారు. ఈ మార్పును పరీక్షా సిబ్బంది గమనించాలన్నారు. అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పరీక్ష నిర్వహణ బాధ్యులు ఈ విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు.