విద్యుత్‌కూ వేసవి తాపం! | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌కూ వేసవి తాపం!

Apr 1 2025 12:30 PM | Updated on Apr 1 2025 3:32 PM

విద్య

విద్యుత్‌కూ వేసవి తాపం!

ఆలమూరు: వేసవి వచ్చేసింది. ఎండలు అంతకంతకూ ముదురుతున్నాయి. ఉష్ణోగ్రతలు 35–40 డిగ్రీల వరకూ నమోదవుతున్నాయి. ఉక్కపోత నుంచి ఉపశమనానికి విద్యుత్‌ ఉపకరణాల వినియోగం మూడింతలవుతోంది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా విద్యుత్‌ వైర్ల సామర్థ్యంపైనే సందేహాలన్నీ. కన్‌సీల్డ్‌ వైరింగా.. గోడలపైనే గొట్టాల్లో ఏర్పాటు చేశారా.. సరైన ప్రమాణాలతో తగిన మందం ఉన్న వైర్లు వేశారా అనేది అందరూ గుర్తించాల్సిన అంశం. ఏదైనా లోపాలుంటే విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ అయ్యే ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని గుర్తెరగాలి. ఈ నెలాఖరు నాటికి ఉష్ట్రోగ్రతలు 40–45 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తలతో పాటు అప్రమత్తత ఎంతో అవసరం ఉంది.

ఇలా చేయవద్దు

● గృహంలో 15 యాంప్స్‌ విద్యుత్‌ ఉపయోగించే చోట 30 యాంప్స్‌ విద్యుత్‌ భారం పడే పరికరాలు వినియోగిస్తే తీగలు కాలిపోయే ప్రమాదముంది.

● ఒకే స్వీచ్‌ బోర్డుకు ఎక్కువ ప్లగ్‌లు ఉపయోగిస్తే ఒక్కసారిగా లోడ్‌ పెరిగి స్పార్క్‌ వచ్చి ప్రమాదాలకు అవకాశముంటుంది.

● ఎండలో విద్యుత్‌ తీగలు ఉంచితే భవిష్యత్‌తో తీగలపై ఉన్న రబ్బర్‌ మెత్తబడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.

● ఇంటిలో ఒకేసారి విద్యుత్‌ ఉపకరణాలన్నీ ఆన్‌ చేసి ఉంచవద్దు.

● కంప్యూటర్‌ పరికరాలు, టీవీల వద్ద విద్యుత్‌ తీగలను చిందర వందరగా ఉంచవద్దు.

● రక్షణ పరికరాలైన ఎంసీబీ (మైక్రో సర్క్యూట్‌ బ్రేకర్‌), ఎంసీసీబీ (కరెంట్‌ కట్రోలర్‌ బ్రేకర్‌) ఫ్యూజులను బైపాస్‌ చేయకూడదు.

తీసుకోవలసిన జాగ్రత్తలు

● వేసవికాలం ప్రారంభమయ్యే ముందు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఇళ్లు, కార్యాలయాలను తప్పనిసరిగా ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్లతో తీగల వ్యవస్థను తనిఖీ చేయించుకోవాలి.

● విద్యుత్‌ వైరింగ్‌ చేయించేటప్పుడు పూర్తిగా ఐఎస్‌ఐ, బీఐఎస్‌ మార్క్‌ కలిగిన ఎలక్ట్రికల్‌ సామగ్రిని మాత్రమే ఉపయోగించాలి.

● ఇంట్లో విద్యుత్‌ వినియోగం ఆధారంగా విద్యుత్‌శాఖ నుంచి లోడ్‌ను తీసుకోవాలి.

● అందుకు తగినట్లు వైరింగ్‌ ఏర్పాటు చేసుకున్న తరువాత ఏసీలు, కూలర్లు, వాటర్‌ హీటర్లు, మైక్రో ఓవెన్‌ ఇతర ఎలక్ట్రికల్‌ వస్తువులు వినియోగించుకోవాలి.

● ఎలక్ట్రానిక్‌ ఉపకరణాన్ని బట్టి దానికనుగుణంగా నాణ్యత కలిగిన విద్యుత్‌ తీగలను వినియోగించాలి.

● నాసిరకం విద్యుత్‌ పరికరాలతో విద్యుత్‌ వృథా కావడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వైరింగ్‌ మరింత పటిష్టంగా ఉండేలా చూసుకోవాలి.

● గృహాలు, వాణిజ్య సంస్థలు, కార్యాలయాల్లో తప్పనిసరిగా న్యూట్రల్‌ పరికరాల కోసం సరిపడినంత ఎర్త్‌ ఎలక్ట్రోడ్‌ ఏర్పాటు చేసుకోవాలి.

● ఎండాకాలంలో రక్షణ పరికరాలు సరిగ్గా పనిచేయాలంటే ఎర్తింగ్‌ సరైన పద్ధతిలో ఉంచేందుకు అవసరమైన ప్రదేశంలో నీరు, దొడ్డు ఉప్పు ఉపయోగించాలి.

● విద్యుత్‌ వాడేందుకు మూడు పిన్నుల ప్లగ్‌లు, సాకెట్లు మాత్రమే ఉపయోగించాలి.

● విద్యుత్‌ స్తంభాల నుంచి మీటర్‌ వరకు ఉండే సర్వీస్‌ వైర్లు అతుకులు లేకుండా ఉండేలా చూసుకోవాలి.

అధిక లోడుతో అనర్థమే

వేసవి కాలంలో విరివిగా విద్యుత్‌ ఉపకరణాల వినియోగం వల్ల ఒక్కొక్కసారి సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతుంటాయి. గృహాల్లో కాని, కార్యాలయాల్లో కాని వాడుతున్న విద్యుత్‌ వాడకాన్ని బట్టి లోడ్‌ను నిర్థారించుకుని ఆ మేరకు విద్యుత్‌శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. దీంతో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నుంచి వినియోగదారునికి అవసరమైన లోడ్‌ను ఆ ట్రాన్స్‌ఫార్మర్‌లో అందుబాటులో ఉంచుతుంది.

ఎవరైనా వినియోగదారుడు కేవలం 1 కేవీ లోడుకు మాత్రమే అనుమతి పొంది వేసవి తీవ్రత దృష్ట్యా అధికంగా విద్యుత్‌ను వినియోగిస్తే ఆ ప్రభావం సమీప ట్రాన్స్‌ఫార్మర్‌పై పడి తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి షార్ట్‌ సర్క్యూట్‌ సంబంధించి కాలిపోయే అవకాశం కూడా ఉంటుంది. వినియోగదారులందరకూ విద్యుత్‌శాఖకు సహకరించి వాడుతున్న లోడ్‌కు అనుగుణంగా అనుమతి పొందితే భవిష్యత్‌లో విద్యుత్‌ ప్రమాదాలు సంభవించే అవకాశం తక్కువగా ఉంటుందని విద్యుత్‌ రంగ నిపుణులు చెబుతున్నారు.

సింగిల్‌ ఫేజ్‌ సర్క్యూట్‌లో ఫేజ్‌, న్యూట్రల్‌, ఎర్త్‌ వైర్లు సమాన పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి.

ఏసీలు, ఫ్రిజ్‌లు, టీవీలు ఇతరత్రా విద్యుత్‌ ఉపకరణాలు వాడే సమయంలో కచ్చితంగా స్టెబిలైజర్లను వినియోగించాలి. విద్యుత్‌ సరఫరాలో హెచ్చుతగ్గులు వస్తుంటే సత్వరమే సంబంధిత విద్యుత్‌ సిబ్బందికి ఫిర్యాదు చేయాలి, లేకుంటే సమీప ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయే ప్రమాదముంది.

లోడు ఎక్కువైతే వైర్లు కాలిపోయే

అవకాశం

షార్ట్‌ సర్క్యూట్‌తో గృహోపకరణాలకు ముప్పు

వైరింగ్‌లో ప్రమాణాలతో ప్రమాదాలకు చెక్‌

సరఫరాలో లోపాలుంటే ఫిర్యాదు చేయాలి

అప్రమత్తంగా ఉండాలి

వేసవికాలంలో విద్యుత్‌ తీగలు వ్యాకోచం చెందే అవకాశం ఉన్నందున షార్ట్‌ సర్క్యూట్‌ జరగకుండా తగిన జాగత్తలు తీసుకోవాలి. గృహాల్లో వినియోగించే విద్యుత్‌ ఉపకరణాలకు అనుగుణంగా ప్రత్యేకంగా వైరింగ్‌ను చేయించుకోవాలి. విద్యుత్‌ సరఫరాల్లో లోపాలు ఉంటే సత్వరమే సమీప లైన్‌మెన్‌కు తెలియజేసి సమస్యను పరిష్కరించుకోవాలి.

– కె.రత్నాలరావు, ఏపీఈసీడీఎల్‌ ఈఈ, రామచంద్రపురం.

విద్యుత్‌కూ వేసవి తాపం!1
1/3

విద్యుత్‌కూ వేసవి తాపం!

విద్యుత్‌కూ వేసవి తాపం!2
2/3

విద్యుత్‌కూ వేసవి తాపం!

విద్యుత్‌కూ వేసవి తాపం!3
3/3

విద్యుత్‌కూ వేసవి తాపం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement