
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ర్యాపిడో వెహికల్‌ను ఢీకొట్టిన కారు
రాజమహేంద్రవరం రూరల్: ర్యాపిడో వెహికల్‌పై వెళుతున్న ఇద్దరిని కారు అతివేగంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శనివారం అర్ధరాత్రి కొంతమూరు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం హుకుంపేట వరలక్ష్మీనగర్‌కు చెందిన ఈర్లు నాగబాబు(43) జీవనాధారం కోసం ర్యాపిడో వెహికల్ నిర్వహిస్తున్నాడు. కొంతమూరు కళ్యాణ్‌నగర్ చెందిన ఒంటెద్దు వెంకటేష్(28) డిగ్రీ చదివి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వెంకటేష్ శనివారం సాయంత్రం స్నేహితులను కలిసేందుకు వచ్చాడు. సోమాలమ్మ జాతర చూసి పక్కనే ఉన్న అప్సర థియేటర్‌లో సెకండ్‌షో సినిమా చూశాడు. సినిమా అయిపోయిన తరువాత ఇంటికి వెళ్లేందుకు ర్యాపిడో బుక్ చేసుకున్నాడు. వెంటనే ఈర్లు నాగబాబు అప్సర థియేటర్ వద్దకు వచ్చి వెంకటేష్‌ను తీసుకుని కొంతమూరు కళ్యాణ్‌నగర్‌కు బయలుదేరాడు. కొంతమూరు మనీషా ఫంక్షన్ హాలు వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి కారు అతివేగంగా వచ్చి ర్యాపిడో వెహికల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒంటెద్దు వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న ఈర్లు నాగబాబును అంబులెన్స్‌లో తీసుకువెళుతుండగా మార్గ మధ్యలో చనిపోయాడు. ఘటనా స్థలాన్ని రాజానగరం పోలీసులు పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. వెంకటేష్ తండ్రి ఒంటెద్దు వీరభద్రరావు ఫిర్యాదు మేరకు రాజానగరం ఎస్సై మనోహర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఈర్లు నాగబాబు, ఒంటెద్దు వెంకటేష్ కుటుంబ సభ్యులను డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ పరామర్శించారు. ఈర్లు నాగబాబు కుటుంబానికి చందన నాగేశ్వర్ రూ.10 వేలు ఆర్థిక సాయం అందించారు.
ఉపాధి కోసం ర్యాపిడో ఎంచుకుంటే...
ఆర్థికంగా కుటుంబానికి ఆసరాగా ఉంటుందని రాత్రి సమాయల్లో ర్యాపిడో వెహికల్‌ను నిర్వహిస్తున్న ఈర్లు నాగబాబును అదే మృత్యుఒడికి చేర్చింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు మగపిల్లలు ఇతనిపై ఆధారపడిి ఉన్నారు. దీంతో కుటుంబానికి ఆసరాగా నిలవాలన్న ఉద్దేశంతో నాగబాబు ర్యాపిడో ద్వారా పగలు,రాత్రి అని తేడా లేకుండా పని చేస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో నాగబాబు మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులు బేబి, ఆదినారాయణ, అనారోగ్యంతో బాధపడుతున్న భార్య శ్రీలత, ఇద్దరు పిల్లలకు దిక్కెవరంటూ వారి రోదిస్తున్న తీరు చూపరులను కలిచి వేసింది.
ఉగాది పండగకు వచ్చి...
బెంగళూరులో ఉద్యోగం చేస్తూ తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండగను కుటుంబ సభ్యులతో జరుపుకుని ఆనందంగా గడుపుదామని రెండు రోజుల క్రితం ఒంటెద్దు వెంకటేష్ ఇంటికి వచ్చాడు. అతను ఇలా మృతిచెందడం కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. వెంకటేష్ తండ్రి ఒంటెద్దు వీరభద్రరావు పండ్ల వ్యాపారం నిర్వహిస్తుంటారు. ఆయనకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు వివాహం చేయగా, కుమారుడు వెంకటేష్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. పండగకు వచ్చి ఇలా మృత్యువాత పడతావని అనుకోలేదని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి